Fasts
-
ఫిత్రా... ఉపవాసులకే పరిమితం కాదు!
రమజాన్ కాంతులు పవిత్రమైన ఈ రంజాన్ మాసంలో త్రికరణ శుద్ధితో వ్రతం పాటించే వారి అంతర్గతంతోపాటు, బాహ్య శరీరంలోకూడా పవిత్రాత్మ నిత్యం జాగృతమై ఉంటుంది. అనుక్షణం వారు అప్రమత్తంగా ఉంటూ అన్ని రకాల దోషాలనుండి పవిత్రంగా, పరిశుద్ధంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. అయినప్పటికీ మానవ సహజ బలహీనత వల్ల ఏదో ఒక పొరపాటు దొర్లిపోతూనే ఉంటుంది. ఇలాంటి చిన్నా చితకా పొరపాట్ల నుండి ఉపవాసాన్ని దోషరహితంగా, లోపరహితంగా తీర్చిదిద్దడానికి ముహమ్మద్ ప్రవక్త (సం) ఒక దానాన్ని ఉపదేశించారు. ఈ ప్రత్యేక దానాన్ని షరి అత్ పరిభాషలో ‘సద్ ఖా ఫిత్ర్’అంటారు. ఫిత్రాదానం చెల్లించనంత వరకూ రమజాన్ ఉపవాసాలు భూమ్యాకాశాల మధ్య వేలాడుతూ ఉంటాయి. దైవసన్నిధికి చేరవు. అందుకని ఉపవాసాలు దేవుని స్వీకార భాగ్యానికి నోచుకోవాలంటే ఫిత్రాదానం పట్ల నిర్లక్ష్యం వహించకూడదు. దీంతోపాటు ఫిత్రాదానం వల్ల మరో గొప్ప సామాజిక ప్రయోజనం కూడా ఉంది. దీనివల్ల సమాజంలోని పేదసాదలకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది. అందుకే ముహమ్మద్ప్రవక్త (సం) ఫిత్రాదానాన్ని, ‘దీనులు, నిరుపేదల భృతి’అన్నారు. ఈ కారణంగానే ఫిత్రాదానాన్ని కేవలం ఉపవాసులకు మాత్రమే పరిమితం చేయకుండా అందరికీ విస్తరించారు. దీనిని ప్రతి ఒక్కరూ పాటించాలి. -
మన గొప్పలు కాదు... అల్లాహ్ గొప్పలు చెప్పుకోవాలి!
రమజాన్ కాంతులు రమజాన్ ఉపవాసాల విషయంలో కృపాసాగరుడైన అల్లాహ్ పురుషుల కంటె స్త్రీలకే ఎక్కువ రాయితీలు ఇచ్చాడు. స్త్రీలు కష్టాలకు గురి కాకుండా ఉండేందుకు అల్లాహ్ చేసిన మేలు ఇది. అలాగని స్త్రీలు కానీ, పురుషులు కానీ ఉపవాసాలు ఉండడం ద్వారా తామేదో ఘనకార్యం చేశానన్న భ్రాంతి నుంచి బయటపడాలి. ఈ సద్బుద్ధిని, అటువంటి సదవకాశాన్ని అనుగ్రహించిన అల్లాహ్‌కు వేనవేల కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఉపవాసం ఉండి మీరు అల్లాహ్కేదో గొప్ప మేలు చేయలేదు. వాస్తవంగా విశ్వాస భాగ్యంతోపాటు ఉపవాసం పాటించుకునే వెసులుబాటును ఇచ్చి అల్లాహ్ మీకు మేలు చేశాడని గుర్తుంచుకోవాలి. రేపు ప్రళయదినాన మీరు చేసిన నిర్వాకాలకు బదులుగా మీ సత్కర్మలన్నీ బాధితులకు పంచబడతాయి. అప్పుడు మీ వద్ద ఒక్క ఉపవాసం మాత్రమే ఉండిపోతుంది. మీ నిర్వాకం బారిన పడిన బాధితులు ఇంకా ఎంతోమంది ఉన్నా, ఒక్క ఉపవాస పుణ్యం కారణంగా వారందరి బాధ్యతను అల్లాహ్ తీసుకుని మిమ్మల్ని రయ్యాన్ అనే తలుపు గుండా సగౌరవంగా స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు. కాబట్టి మీకు మీరు గొప్పలు చెప్పుకోవడం మాని అల్లాహ్ గొప్పలు చెప్పుకోండి. ఆయన ఘనతా ఔన్నత్యాలను వేనోళ్ల కొనియాడండి అంటుంది దివ్యఖురాన్. – సయ్యద్ అబ్దుస్సలామ్ ఉమరీ -
మాటల్లో మృదుత్వం... ఉపవాసి గొప్పతనం!
రమజాన్ కాంతులు పరలోకంలో స్వర్గద్వారాల్లో మనకు నచ్చిన ద్వారం గుండా ప్రవేశించే అర్హత పొందటానికి అతి సులభమైన మార్గం రమజాన్ ఉపవాసాలు. అందుకే రమజాన్ ఒక మహత్తరమైన మాసం. దీనిలోని ప్రతి నిమిషాన్నీ సద్వినియోగం చేసుకోవాలి. ఒక నియమానుసారంగా రేయింబవళ్లు గడిపేలా ప్రణాళిక వేసుకోవాలి. అందుకోసం రోజువారీ పనులను బేరీజు వేసుకుని ఏ పని ఏ సమయంలో చేయాలో నిర్ణయించుకుని సాధ్యమైనంత వరకు దాని ప్రకారమే నడచుకోవాలి. చాలామంది మహిళలు తమకు పెద్ద పెద్ద సూరాలు కంఠతా రావని తరావీహ్ నమాజులను అజ్ఞానంతో విడిచిపెడుతుంటారు. అది చాలా తప్పు. కంఠతా వచ్చిన చిన్న చిన్న సూరాలనైనా చదువుకోవచ్చు. నిలబడి చదవలేకపోతే కూర్చొని కూడా చదువుకునే వెసులుబాటు ఉందని గ్రహించుకోవాలి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, నోటిని అదుపులో ఉంచుకోవాలి. చాడీలు, నోటి దురుసుతనం, కాఠిన్యం, దుర్భాషలకు దూరంగా ఉండాలి. ఉపవాసి గొప్పతనం వారి మాటల మృదుత్వం ద్వారా ఉట్టిపడుతూ ఉండాలి. ఇదే దైవవిశ్వాసానికి చిహ్నం. ఈ సంవత్సరపు రమజాన్ మాసంలో పగలు అధికంగానూ, రేయి తక్కువగానూ ఉంటుంది. అందువల్ల మగ్రిబ్, ఇషా, ఫజ్ర్లు తొందరగా వచ్చేస్తున్నట్లు అనిపిస్తుంది. అయితే ఉపవాస వ్రతంలో ఎదురయ్యే బాధలను ఓర్పుతో సహించగలిగితేనే అనంత కరుణామయుడైన అల్లాహ్ ప్రేమామృతాన్ని పొందే అదృష్టం కలుగుతుంది. – తస్నీమ్ జహాన్ -
కలెక్టర్, కమిషనర్‌కు నోటీసులు
రాంగోపాల్‌పేట్: జైన మత ఆచారాల పేరుతో 68 రోజుల పాటు ఉపవాస దీక్ష చేపట్టి మరణించిన ఆరాధన మృతిపై పూర్తి వివరాలతో నివేదిక అందజేయాలని కోరుతూ జాతీయ బాలల హక్కుల కమిషన్ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా, పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డికి నోటీసులు జారీ చేసింది. పాట్ మార్కెట్‌కు చెందిన లక్షి్మచంద్ సమ్దారియ, మనీషా సమ్‌దారియా దంపతుల కుమార్తె ఆరాధన (13) తల్లిదండ్రులు, మత పెద్దల ప్రోద్భలంతో ఉపవాస దీక్ష కారణంగా అస్వస్థతకు గురై ఈ నెల 3న మరణించిన సంగతి విదితమే. దీనిపై బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అనురాధరావు ఆరాధన తల్లిదండ్రులపై హత్యానేరం నమోదు చేయాలని కోరుతూ నగర పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయగా, మార్కెట్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇదే విషయాన్ని బాలల హక్కుల సంఘం జాతీయ బాలల హక్కుల కమిషన్ దృష్టికి తీసుకుని వెళ్లడంతో వారు స్పంధించారు. ఈ ఘటన పూర్తి వివరాలతో 10 రోజుల్లో నివేధిక అందించాలని జాతీయ కమిషన్ వారికి నోటీసుల్లో పేర్కొంది. కాగా ఆరాధన కేసు విషయంలో నవంబర్ 29లోగా దర్యాప్తు పూర్తి చేయాలని లోకాయుక్త ఉత్తర మండలం డీసీపీని ఆదేశింది. -
నెలవంక కనిపించె.. పండుగ తీసుకొచ్చె..
ముగిసిన రంజాన్ ఉపవాస దీక్షలు ఈదుల్ ఫితర్ నేడే ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు వేడుకలకు సిద్ధమైన ముస్లింలు నెలరోజుల పాటు ఉపవాస దీక్షలు పాటించిన ముస్లింలు రంజాన్ పండుగను గురువారం ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమయ్యూరు. బుధవారం రాత్రి నెలవంక (చాంద్) దర్శనమివ్వడంతో వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సమాయత్తమయ్యారు. ఈ మేరకు గురువారం ఈదుల్ ఫితర్(రంజాన్) పండుగను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా మసీదులను ముస్తాబు చేశారు. ఈద్ నమాజ్ కోసం ఈద్గాల వద్ద ఏర్పాట్లు పూర్తి చేశారు. -పోచమ్మమైదాన్/ కాజీపేట ఆద్యంతం.. ఆధ్యాత్మికం అరబిక్ క్యాలెండర్ ప్రకారం వరుస క్రమంలో రంజాన్ తొమ్మిదో మాసం. ఈ నెలలో ముస్లింలు ఉపవాస దీక్ష(రోజా) చేస్తుంటారు. ఈ సమయంలో అన్నపానీ యాలు, శారరీక వాంఛలకు దూరంగా ఉంటారు. రోజం తా ప్రార్థనల్లో గడుపుతూ విరివిగా దానధర్మాలు చేస్తారు. ముస్లిం పేదలు కూడా పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకునేలా ‘ఫిత్రా’ దానం చేస్తారు. తమ వద్ద ఉండే నిల్వ సొమ్ముపై ‘జకాత్’ చెల్లిస్తారు. చెడుకు దూరంగా ఉంటూనే దైనందిన చర్యలనూ నిర్లక్ష్యం చేయరు. మహిళలు రోజువారీగా ఇంటి పనులు చేస్తూ, పిల్లలు పాఠశాలకు వెళ్తూనే రోజా పాటిస్తారు. ఇలా నెల రోజుల పాటు కఠిన నియమాలతో ఉపవాసం చేసిన ముస్లింలు బుధవారం రాత్రి షాబాన్ నెలవంక దర్శనమివ్వగానే దీక్షలను విరమించారు. రంజాన్ ఫలాలు దక్కాలంటే... రంజాన్ నెలలో ఉపవాసాలు పాటిస్తూ తరావీ నమాజ్‌తో పాటు అన్ని రకాల చెడును వదలాలి. ప్రతీ వ్యక్తి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దైవభీతి ఈ నెలలోనే కాదూ ఎప్పటికీ కనిపించాలి. ముస్తాబైన మసీదులు రంజాన్ సందర్భంగా జిల్లావ్యాప్తంగా మసీదులను విద్యుద్దీపాలతో అలంకరించారు. ఈ మేరకు వరంగల్, హన్మకొండ, కాజీపేట ప్రాంతాల్లోని మసీదుల ఆవరణలను కార్పొరేషన్ సిబ్బంది శుభ్రం చేశారు. వరంగల్ జెమినీ థియేటర్ సమీపంలోని ఈద్గా, ఖిలా వరంగల్ పెట్రోల్ పంప్ సమీపంలో ఈద్గాతోపాటు హన్మకొండలోని బొక్కలగడ్డ, కాజీపేటలోని ఏఆర్ఆర్ సమీపంలోని ఈద్గాలను ప్రార్థనల కోసం ముస్తాబు చేశారు. ఏతెకాఫ్.. రంజాన్ నెల చివరి పదిరోజుల్లో తొమ్మిదిరోజులపాటు మసీదులో ఉండటాన్ని ఏతెకాఫ్ అంటారు. ప్రాపంచిక వ్యవహారాలను పక్కన బెట్టి కేవలం దైవస్మరణతో మసీదులో గడుపుతారు. రాత్రిళ్లు ఇతోధికంగా జాగరణ చేసి మహా శుభరాత్రిగా భావించే ‘లైలతుల్ ఖద్’్రను పొందేందుకు ఏతెకాఫ్ పాటిస్తారు. రంజాన్‌లోనే దివ్య ఖురాన్ అవతరణ దివ్య ఖురాన్ రంజాన్ మాసంలోనే అవతరించింది. సర్వమానవాళికి ఇది మార్గదర్శకం. 23 ఏళ్ల పాటు దశల వారీగా అల్లాహ్ దీన్ని మహ్మద్ ప్రవక్త (సల్లల్లాహు అలైహివ సల్లమ్) ద్వారా అవతరింపజేశారు. దైవాజ్ఞను పాటిస్తూ దైనందిన చర్యల్లో నిమగ్నమయ్యే వారికి ఇహ, పరలోక సాఫల్యం ప్రాప్తిస్తుందని ఇస్లాం బోధిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే రంజాన్ దీక్షలు మానవులను చెడు నుంచి దూరంగా ఉంచేందుకు శిక్షణ వంటివి. మానవ పరివర్తనకు మంచి మార్గం. దైవాజ్ఞ ప్రకారం ఎవరికి వారే నియమాలు పాటిస్తూ ఈ శిక్షణ పూర్తి చేసుకుంటారు. -
చక్కని పండు..రుచిలో మెండు
♦ ఔషధ గుణాల ఖర్జూరాలు ♦ ఉపవాస దీక్ష విరమణలో ప్రథమ స్థానం ♦ రంజాన్ మాసంలో విరివిగా విక్రయాలు నిగనిగలాడే రంగు.. చూడచక్కని రూపం.. దూరం నుంచే నోరూరించే నైజం.. నోట్లో వేసుకుంటే కరిగిపోయి.. తక్షణం శక్తినిచ్చే లక్షణం ఖర్జూర పండు సొంతం. అంతేనా.. ఎన్నో ఔషధ గుణాలూ ఉన్నాయండోయ్. రంజాన్ అనగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది రోజా. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు అన్న పానీయాలను త్యజించి రోజాను పాటిస్తారు. వీరికి ఇఫ్తార్ సమయానికి తప్పక గుర్తుకొచ్చేది ఖర్జూరం. దీన్ని తీసుకోవడం వల్లశరీరానికి తక్షణ శక్తితో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఉపవాస దీక్షను ఖర్జూరతోనే విరమించడాన్ని సున్నత్‌గా పేర్కొంటారు. - సాక్షి, రంగారెడ్డి జిల్లా ఇఫ్తార్‌కు ఈ పండు తప్పనిసరి ఉపవాస దీక్ష ముగిసాక ఇఫ్తార్ సమయంలో ఖర్జూరం పండ్లనే అధిక శాతం తీసుకుంటారు. ప్రస్తుతం వీటి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. భారత్‌లో పండే ఖర్జూరాలతో పాటు సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, జోర్డాన్ వంటి దేశాలకు చెందిన దాదాపు 65 రకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కల్మీ, సుక్రీ, క్లాస్, సుగా ఈ-వార్డ్, అజ్వా, మెడ్‌జాల్ కింగ్, మరియమ్, జఫ్రాన్ రకాలు ముఖ్యమైనవి. రకాన్ని బట్టి కిలో రూ.80 నుంచి రూ. 4000 ధర పలుకుతున్నాయి. కొనేటప్పుడు జాగ్రత్త.. మార్కెట్లో చాలా రకాల ఖర్జూరాలు దొరుకుతున్నాయి. కొంద రు వ్యాపారులు నాసిరకం విక్రయిస్తుంటారు. అందుకే చెల్లించే డబ్బుకు తగినట్టుగా నాణ్యమైన ఖర్జూరాలను తీసుకునేందుకు చిన్నపాటి జాగ్రత్తలు పాటించాలి. ఖర్జూరాన్ని చేతిలోకి తీసుకున్నప్పుడు ఎలాంటి జిగురు అంటకూడదు. అలా ఉంటే నిగనిగలాడేందుకు ఎలాంటి రసాయనాలు వాడలేదని అర్థం. ఖర్జూరాల పైపొర పల్చగా ఉండి, గుజ్జు తాజాగా ఉండాలి. నాణ్యమైన ఖర్జూరాలు ఆరు నెలల వరకు నిల్వ ఉంటాయి. వారెవ్వా.. అజ్వా ఖజూర్ రకాలన్నింటిలోకీ చాలా ఖరీదైన రకం అజ్వా. సౌదీ అరేబియాలో పండే ఈ రకం ఖజూర్ ప్రపంచంలోకెల్లా అత్యంత తియ్యనైన పండుగా గుర్తింపు పొందింది. నల్లటి రంగులో ఉండే అజ్వా ఖజూర్లోని గింజలను తొలగించి, వీటిలో పూర్తిగా బాదం, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్‌ను స్టఫ్ చేసి వాటిని తేనెలో వాటిపై కుంకుమపువ్వును వేసుకుని నోట్లో వేసుకుంటే.. ఆ రుచి ఇక మరిచిపోలేం. అందుకూ ఈ పండు ధర కూడా అధికమే. కిలో ధర రూ.2వేలకు పైనే ఉంటుంది. ఖజూర్ కింగ్ ‘మెడ్‌జాల్’ ఖర్జూరాల్లో మెడ్‌జాల్ ‘కింగ్’ లాంటిది. ఖజూర్లన్నీ డ్రై ఫ్రూట్స్ స్టఫింగ్తో అంతటి రుచిని పొందితే..ఎటువంటి స్టఫింగ్ లేకుండా అమోఘమైన రుచిని సొంతం చేసుకుంది మెడ్జాల్కింగ్ రకం. ఇజ్రాయిల్ దేశ సరిహద్దు ప్రాంతమైన జోర్డన్‌లో ఇది పండుతుంది అత్యంత బరువైన ఖజూర్గా కూడా దీన్ని చెబుతారు. రెం డు మెడ్‌జాల్ పండ్లు తింటే చాలు ఇక భోజనం చెయ్యాల్సిన అవసరమే లేదని ఖజూర్ప్రియులు చెబుతారు. కిలో ధర రూ.1,800. నోరూరించే ‘సగాయి’.. అజ్వా తరువాత తియ్యదనంలో మేటిగా చెప్పబడే రకం సగాయి. దుబాయ్‌లో ఈ రకం ఖర్జూరం అధికంగా పండుతుంది. ప్రపంచ మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉన్న ఖజూర్ ఇది. ఇవి కూడా కేవలం ఖజూర్గానే కాక వీటిలో డ్రై ఫ్రూట్స్ స్టఫ్ చేసి వాటికి వైట్ హనీని జతచేసి కుంకుమ పువ్వుతో కలిపి విక్రయిస్తారు. కిలో ధర రూ.4వేల వరకు ఉంటుంది. -
ఫస్ట్ డే..పస్తులే..!
గుంటూరు ఎడ్యుకేషన్ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కడుపు నింపేందుకు ఉద్దేశించిన మధ్యాహ్న భోజన పథకం విద్యాసంవత్సరం మొదటి రోజే విద్యార్థుల కడుపులు మాడ్చింది. డ్వాక్రా మహిళలు, ఏజెన్సీల స్థానంలో మధ్యాహ్న భోజన పథక నిర్వహణ (ఎండీఎం)ను ఆర్భాటంగా ప్రభుత్వం కట్టబెట్టిన ప్రైవేటు సంస్థ పాఠశాలలు తెరిచిన రోజునే విద్యార్థులకు ఆహారం అందించకుండా చేతులెత్తేసింది. ఫలితంగా తొలి రోజు ఉదయం ఎంతో ఆనందంగా పాఠశాలకు వచ్చిన విద్యార్థులు సాయంత్రం వరకూ ఖాళీ కడుపులతో గడిపారు. ఆ మూడు మండలాల్లో.. ప్రభుత్వ పాఠశాలల్లో ఎండీఎం నిర్వహణను సంవత్సరాల తరబడి డ్వాక్రా మహిళలు, ఆర్థికంగా వెనుకబడిన పలువురు మహిళలు నిర్వహిస్తున్నారు. రాజధాని పరిధిలోని మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరు మండలాల పరిధిలోని పాఠశాలలను ప్రైవేటు సంస్థకు కట్టబెడుతూ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. అయితే సోమవారం మధ్యాహ్నం ఆయా మండలాల్లోని పాఠశాలల విద్యార్థులకు ఆహారం సరఫరా చేయలేదు. దీంతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. మళ్లీ ఇటువంటి పరిస్థితి తలెత్తకుండా చూడండి .. పెనుమాకలోని పాఠశాలను పాఠశాల విద్య ఆర్జేడీ పి.పార్వతి, డీఈవో కేవీ శ్రీనివాసులురెడ్డి సందర్శించి అక్కడి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. మూడు మండలాల పరిధిలోని పాఠశాలలకు మధ్యాహ్న భోజనం సరఫరా కాలేదని తెలుసుకున్న అధికారులు అక్కడి నుంచి సంస్థ ప్రతినిధులతో మాట్లాడారు. మొదటి రోజు కావడంతో రవాణా సమస్య తలెత్తి భోజనం సరఫరా చేయలేకపోయామని సంస్థ ప్రతినిధులు చెప్పినట్లు అధికారులు తెలిపారు. మళ్లీ ఇటువంటి పరిస్థితి తలెత్తకుండా చూడాలని వారికి సూచించారు. పాఠశాలలు తెరిచిన మొదటి రోజు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు తక్కువ సంఖ్యలో హాజరయ్యారు. మోసం చేయడం చంద్రబాబుకు అలవాటే : ఎమ్మెల్యే ఆర్కే రాజధాని (తాడేపల్లి రూరల్) : పాఠశాలలు ప్రారంభమైన మొదటి రోజే విద్యార్థులు పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడిందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. తన కార్యాలయం నుంచి సోమవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆయన ఈ విధంగా పేర్కొన్నారు. మిడ్ డే మీల్స్‌ను కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పి పిల్లలలను పస్తులుంచుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజధాని ప్రాంతంలో మోసాలు చేయడం చంద్రబాబునాయుడుకు వెన్నతో పెట్టిన విద్యని విమర్శించారు. కలెక్టర్ కాంతిలాల్ దండేకు విషయాన్ని తెలియజేయడంతో విషయం తనకు తెలియదని, దీనిపై వివరణ తీసుకుంటానని చెప్పినట్లు తెలిపారు. దీనిపై మంగళగిరి, తాడేపల్లి ఎంఈవోలను ప్రశ్నించగా వారు సైతం పరిశీలిస్తున్నామన్నారేగానీ, ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. -
గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్
ఉపవాసాలతో సమస్యలు... అధిగమించేదెలా? నా వయసు 33. మాది సంప్రదాయ కుటుంబం. నిత్యం పూజపురస్కారాలు చేస్తుంటాం. తరచూ ఉపవాసాలుంటాం. ఈమధ్య ఉపవాసం తర్వాత విపరీతమైన నీరసంతో పాటు కళ్లు తిరుగుతున్నాయి. గుండెల్లో మంట. డాక్టర్‌కు చూపిస్తే జీర్ణకోశంలో అల్సర్స్ అని అన్నారు. ఉపవాసాలు వద్దని సలహా ఇచ్చారు. అల్సర్లకు మందులు వాడుతున్నాను. ఉపవాసాలు మానకపోతే సమస్య మరింత జటిలం అవుతుందని డాక్టర్ చెబుతున్నారు. నేనేం చేయాలి? - కె. ప్రసన్నకుమారి, ఖమ్మం ఉపవాసం వల్ల శరీరంలో జీవక్రియలు పాక్షికంగా స్తంభించిపోతాయి. దాంతో ‘బేసల్ మెటబాలిక్ రేట్’ క్షీణించిపోతుంది. దాని ప్రభావం శరీరంలోని ద్రవాల సమతుల్యతపై పడుతుంది. శరీరంలో నీటిశాతం తగ్గిపోవడంతో డీహైడ్రేషన్ బారిన పడతుంటారు. ఉపవాసం ఉన్నప్పుడు ఇంట్లోపనులు... ముఖ్యంగా శారీరక శ్రమకు దూరంగా ఉండాలి. ఎండలో తిరగకుండా జాగ్రత్తపడాలి. తరచూ ఉపవాసాలు జీర్ణవ్యవస్థపై సైతం దుష్ర్పభావం చూపుతాయి. గుండెల్లో మంట మొదలుకొని జీర్ణకోశంలో అల్సర్లు, తలనొప్పి, డీహైడ్రేషన్, మలబద్ధకం, మూత్రపిండాల్లో రాళ్లు వంటి సమస్యలు తలెల్తే అవకాశాలు ఉన్నాయి. ఉపవాసం పేరిట భోజనం మానేయడం వల్ల శరీరంలో ముఖ్యమైన పోషకాలు లోపిస్తాయి. ముఖ్యంగా విటమిన్-బి కాంప్లెక్స్ లోపం పెరుగుతుంది. మీ విషయంలో కూడా దాదాపుగా అదే జరిగింది. ఉపవాసం పేరిట మధ్యాన్నం భోజనం చేయకుండా రాత్రిపూట ఒక్కసారిగా మితిమీరి తినడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయులు ఉన్నట్లుండి పెరిగిపోతాయి. ఇన్సులిన్ వేగంగా తగ్గుతుంది. ఇది ముందుముందు డయాబెటిస్‌కు దారితీస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయులు పడిపోయినప్పుడు దాన్ని తట్టుకోవడానికి శరీరం కొన్ని రకాల హార్మోన్లను విడుదల చేస్తుంది. దాంతో రక్తపోటు పెరుగుతుంది. రక్తనాళాలు క్రమంగా కుంచించుకుపోయే ప్రమాదం ఉంది. అందువల్ల ఉపవాసం తర్వాత ఒక్కసారిగా ఎక్కువ ఆహారం తీసుకునే బదులు, ఆహారాన్ని మితంగా దఫదఫాలుగా తీసుకోవడం వల్ల జీర్ణ ప్రక్రియ సజావుగా సాగుతుంది. నూనెతో చేసిన వేపుళ్లు, మసాలాలు బాగా దట్టించిన కూరలు, బాగా వేయించిన కూరలను దూరంగా ఉంచడం వల్ల గుండెల్లో మంట తగ్గుతుంది. ఉపవాసం చేసే సమయంలో సాధ్యమైనన్ని ఎక్కువసార్లు మంచినీళ్లు తాగాలి. ఉపవాస సమయంలో సాధారణంగా ఎక్కువమంది పండ్ల రసాలు తీసుకుంటుంటారు. కానీ ఆ టైమ్‌లో పండ్లరసాలు, కూల్‌డ్రింక్స్ తీసుకోవద్దు. వీటికి బదులు కొబ్బరినీళ్లు తీసుకోవడం శ్రేయస్కరం. ఉపవాసం విరమించిన తర్వాత పీచు ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు పుష్కలంగా తీసుకోవాలి. దీనివల్ల మలబద్ధకం ఉండదు. వీలైనంతవరకు భోజనం, అల్పాహారం మానేయకుండా చూసుకోవడం మంచిది. రోజుకు 4-5 సార్లు ఆహారం తీసుకోవడం వల్ల ఆకలీ అదుపులో ఉంటుంది, పిండిపదార్థాల నుంచి లభించే చక్కెరా ఇంధనంలా అందుతుంటుంది. ఉపవాసం వల్ల అవయవాల పనితీరు దెబ్బతింటుంది. కాబట్టి అనివార్యమైతే తప్ప తరచూ ఉపవాసాలు ఆరోగ్యానికి చేటు తెస్తాయి. డాక్టర్ కె. రఘురామ్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, సోమాజీగూడ, హైదరాబాద్ -
అల్లాహ్ కానుక.. ఈద్ ఉల్ ఫితర్
పవిత్ర రంజాన్ ఉపవాస దీక్షలు ముగిశాయి. శుక్రవారం మగ్రీబ్ నమాజ్ అనంతరం ముస్లింలు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. నెలంతా ఉపవాసాలు ఉన్నవారికి అల్లాహ్ ఇచ్చిన కానుక ‘ఈదుల్ ఫితర్’. రంజాన్ నెల ముగింపు రోజు ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ (ఈద్). శనివారం ఈ పర్వదినం సందర్భంగా ప్రార్థనల కోసం నగరంలోని ఈద్గాలు, మసీదులు ముస్తాబయ్యాయి. ఈద్ నమాజ్‌లను ఈద్గాలోనే చేయాలనే నిబంధన ఉంది. ఈద్గాకు వెళ్లలేనివారు మసీదులో ప్రార్థన చేయవచ్చు. నగరంలో గల ఈద్గాలు, ప్రముఖ మసీదుల చరిత్ర ఇదీ.. మట్టి వాడని ‘మక్కా మసీదు’ చార్మినార్: దేశంలోని పురాతన మసీదులో మక్కా మసీదు ఒకటి. చార్మినార్ కట్టడానికి అతి సమీపంలో ఇది ఉంది. మహ్మద్ ప్రవక్త మక్కాలో నిర్మించిన మసీదు నుంచి కొన్ని రాళ్లు తీసుకొచ్చి ఇక్కడి మసీదు నిర్మాణ సమయంలో ఉపయోగించారని, అందుకే దీనికి ‘మక్కా మసీద్’గా పేరొచ్చిందన్నది చరిత్ర. ఈ కట్టడం నిర్మాణంలో ఎక్కడా మట్టిని వాడలేదు. రాళ్ల పొడిని మాత్రమే ఉపయోగించారు. మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ సమీపంలోని ఓ పెద్ద రాతి కొండను తొలిచి రాళ్లను తీశారు. వీటిని మాత్రమే నిర్మాణానికి వాడారని కథనం. ఈ మక్కా మసీదు నిర్మాణం 1617లో ప్రారంభమై దాదాపు 77 ఏళ్లపాటు సాగింది. ఇందులో ఒకేసారి మూడు వేల మంది ప్రార్థనలు చేసుకోవచ్చు. స్పానిష్ శైలిలో ‘ఇబ్బద్-ఉద్దౌలా’ జూబ్లీహిల్స్: సుమారు 120 ఏళ్ల క్రితం నిజాం ప్రభువుల కాలంలో బేగంపేటలో నిర్మించిన ‘ఇబ్బద్-ఉద్దౌలా మసీద్’ స్పానిష్ నిర్మాణ శైలికి అద్దంపడుతుంది. ప్రస్తుత ఎస్పీరోడ్డులోని ఇండియన్ ఎయిర్‌లైన్స్ కాలనీని ఆనుకొని ఎయిర్‌పోర్ట్‌కు అతి సమీపంలో దీన్ని నిర్మించారు. నిజాములకు మంత్రులుగా పనిచేసిన పైగా వంశీలు స్పెయిన్‌లో పర్యటించి అక్కడి మసీద్ నిర్మాణ కౌశలానికి ముచ్చటపడ్డారు. సరిగ్గా అలాంటి శైలిలో హైదరాబాద్‌లో ఓ మసీద్‌ను నిర్మించాలని సంకల్పించారు. స్పెయిన్ నుంచి ఆర్కిటెక్ట్‌ను పిలిపించి నిర్మాణ ం చేపట్టారు. తొలినాళ్లలో నవాబుల కుటుంబ సభ్యులు మాత్రమే ప్రార్థనలు చేసేవారు. కాలక్రమంలో సామాన్యులనూ అనుమతించారు. అరబ్బీ భాషలో అల్లాను స్మరిస్తూ లిఖించిన సందేశాలు, ఠీవిగా కనిపించే గుమ్మటాలు, తీర్చిదిద్దిన ఇంటీరియర్, వైభవం ఉట్టిపడే శిల్ప సౌందర్యం దీని ప్రత్యేకత. శతాబ్దాల చరిత్ర చిలకలగూడ ఈద్గా బన్సీలాల్‌పేట్: సుమారు నాలుగు శతాబ్దాల క్రితం నిర్మించిన చిలకలగూడలోని ఈద్గా మైదానానికి ఎంతో చరిత్ర ఉంది. ఇక్కడ సుమారు 25 వేల మంది సామూహిక ప్రార్థనలు చేయవచ్చు. చిలకలగూడ, సీతాఫల్మండి, మహ్మద్‌గూడ, బోయిగూడ, బౌద్ధనగర్, పార్సీగుట్ట, పద్మారావునగర్ తదితర 40 ప్రాంతాలకు చెందిన ముస్లింలు రంజాన్, బక్రీద్ పర్వదినాల్లో సామూహిక ప్రార్థనలు చేస్తారు. రెండు వర్గాలకు చెందిన ముస్లింలు పండుగ రోజు ఒకరి తర్వాత ఒకరు పెద్ద ఎత్తున ప్రార్థనలు చేయడం ఇక్కడి ఆనవాయితీ. అంతేగాక ముస్లిం మహిళలు సైతం సామూహిక ప్రార్థనలు చేయడం ఇక్కడి ప్రత్యేకత. మహిళ పేరుతో ‘బీ సాహెబా’ పంజగుట్ట: మండు వేసవిలోనూ ఒక్క ఫ్యాన్ కూడా అవసరం లేకుండా ఎంతో చల్లగా ఉంటుంది పంజగుట్ట జాతీయ రహదారిపై ఉన్న మసీదు బీ సాహెబా మసీదు. 1932లో బీ సాహెబా అనే వృద్ధురాలు ఇక్కడి స్థలాన్ని కొనుగోలు చేసి సుందరంగా మసీదును నిర్మించింది. కొద్దికాలానికే ఆమె మరణించడంతో ఆమె సమాధిని మసీదులోనే నిర్మించారు. అనంతరం ఆమె పేరుతోనే బీ సాహెబా మసీదుగా పేరు పెట్టినట్టు ప్రస్తుత మసీదు అధ్యక్షుడు మహ్మద్ షర్ఫుద్దీర్ ఖాజా పాషా తెలిపారు. ఎర్రమంజిల్ కాలనీలో నివసించే ఫక్రుల్ ముల్క్ అనే నిజాం రాజు ఈ మసీదులో ప్రతిరోజు ప్రార్థనలు చేసేవారట. ఇప్పటికీ నిత్యం 2000 మందికి పైగా ప్రార్థనలు చేస్తారు. తాడ్బన్ మీరాలం ఈద్గా తాడ్‌బన్‌లోని మీరాలం ఈద్గాలో సుమారు రెండు లక్షల మందిపైగా సామూహిక ప్రార్థనలు చేయవచ్చు. ఇక్కడ సామూహిక ప్రార్థనలకు ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేసింది. తాడ్బన్ ప్రధాన చౌరస్తాలో మూడు వైపుల రహదారులను పూర్తిగా సామూహిక నమాజ్‌ల కోసం సిద్ధం చేశారు. ప్రాచీన ఈద్గా కుతుబ్‌షాహీ.. నగరంలో 32 ఈద్గాలు ఉండగా, వాటిలో అత్యంత ప్రాచీనమైనది గోల్కొండలోని కుతుబ్ షాహీ ఈద్గా. క్రీ.శ. 1517లో సుల్తాన్ కులీ కుతుబుల్ ముల్క్ దీన్ని నిర్మించారు. బహదూర్పురాలోనీ మీరాలం ఈద్గాను అసఫ్ జహీల కాలంలో నిర్మించారు. గోల్కొండ కోటలో 1997లో సుల్తాన్ కులీ కుతుబ్‌షా రాజ్యాధికారి అయిన మీర్ జుమ్లా అమీనుల్ ముల్క్ అలీఫ్ ఖాన్ బహదూర్ నిర్మించారు. దీనిని కుతుబ్షాహీఈద్గాగా పిలుస్తారు. గోల్కొండ శివారులో మరో ప్రాచీమైన ఈద్గాను 1518లో సుల్తాన్ కులీ కుబుత్షా నిర్మించారు. దీన్ని ఖదీమం ఈద్గాగా పిలుస్తారు. ముగిసిన ఉపవాసాలు నెల రోజులుగా ఉపవాస దీక్షలు కొనసాగిస్తున్న ముస్లింలు శుక్రవారం సాయంత్రం దీక్షలను విరమించి రంజాన్ పండుగకు సిద్ధమయ్యారు. మగ్రీబ్ నమాజ్ అనంతరం ముస్లింలు పరస్పరం అలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈద్-ఉల్-ఫితర్ రోజున సామూహిక ప్రార్థనలు చేసేవారు తప్పనిసరిగా నూతన వస్త్రాలు ధరించాలనే సంప్రదాయం ఉండటంతో పాత నగరంలోని ప్రధాన మార్కెట్లు రాత్రివేళ కూడా సందడిగా మారాయి. శనివారం జరిగే సామూహిక ప్రార్థనల కోసం మీరాలం ఈద్గా మైదానాన్ని ముస్తాబు చేసారు. ఈద్గాకు వచ్చేవారి కోసం ఆర్టీసీ రంజాన్ స్పెషల్ బస్సులను నడపనుంది. ప్రార్థనలకు వచ్చేవారికి తాగునీరు అందించేందుకు జలమండలి మంచినీటి ప్యాకెట్లను సిద్ధం చేసింది. -చార్మినార్ -
ఈద్ ముబారక్
నేడు రంజాన్ విశాఖపట్నం : నెలవంక కనిపించింది.. రంజాన్ వచ్చేసింది.. ఉపవాస దీక్షలు విరమించి ముస్లింలు సందడి చేశారు. శనివారం ఈ పర్వదినాన్ని ఆనందోత్సాహాలతో జరపనున్నారు. రంజాన్ వేడుకలతో నగరంతో పాటు గ్రామీణ జిల్లా అంతటా కోలాహలం నెలకొంది. మసీదులను విద్యుత్ దీపాలతోఅలంకరించారు. అత్తరు వాసనలతో వాతావరణమంతా సుగంధభరితమైంది. అల్లాహ్‌పై విశ్వాసానికి ప్రతీక రంజాన్. పవిత్ర గ్రంథమైన ఖురాన్లో పేర్కొన్న విధంగా ఉపవాస దీక్షలు పూర్తి చేసుకొని ఈ పర్వదినాన్ని పాటిస్తారు. పవిత్ర మాసంలో కఠోర ఉపవాస దీక్షలు చేపట్టి, దానధర్మాలు చేస్తారు. పేదలు కూడా పండగను ఆనందంతో జరుపుకోవాలనేది ఇందులో సారాంశమని మతపెద్దలు చెబుతారు. నేడు ఇలా చేస్తారు : మసీదులు, ఈద్గాలను అలంకరిస్తారు. పేదలకు ఇవ్వాల్సిన జకాత్, ఫిత్రాలను (దానాలను) రంజాన్ పండగ ప్రత్యేక నమాజ్‌కు వెళ్లేలోగా అందజేస్తారు. కొత్త దుస్తులు ధరించి, అత్తరు పూసుకొని, కళ్లకు సుర్మా రాసుకొని నమాజ్‌కు తరలివెళ్తారు. ఉదయం జరిగే ప్రత్యేక నమాజ్‌ను మసీదుల్లో గాని, ఈద్గాల్లో గాని ఆచరిస్తారు. పండగ సందర్భంగా చిన్నారులకు ఈదీ (ప్రత్యేక కానుకలు)ను పెద్దలు అందజేయడం ఆనవాయితీ, కానుకలు నగదు రూపంలో గాని, దుస్తులు రూపేణా ఉంటాయి. కుటుంబంలోని పెద్దలను కలిసి శుభాకాంక్షలు తెలియజేసి, దీవెనలు తీసుకోవడం తప్పనిసరిగా భావిస్తారు. బంధుమిత్రులను ఇళ్లకు విందుకు ఆహ్వానిస్తారు. ప్రత్యేక వంటకాలు.... సేమియాతో ఖీర్, షీర్ఖుర్మా, సేమియా ఉప్మా తదితర వంటకాలు చేస్తారు. ఇక మధ్యాహ్నం భోజనంలో పసందైన, రుచికరమైన పలు రకాల బిర్యానీలు తయారు చేస్తారు. సాయంత్రం బంధువుల ఇళ్లకు వెళ్లి శుభాకాంక్షలు తెలియజేస్తారు. అనంతరం సమీపంలో దర్గాలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. రంజాన్ ప్రత్యేకతే వేరు... స్వల్ప విషయాలు మినహా రంజాన్ పండగ ఆచార వ్యవహారాల్లో నాటికీ, నేటికీ పెద్దగా తేడా లేదు. గత రోజుల్లో తెల్లవారు జామున యువకులు, పెద్దలు గ్రూపులుగా ఏర్పడి సహర్ సమయానికి రెండు గంటలు ముందుగా ఇంటింటికి వచ్చి మేల్కొలుపు కార్యక్రమం నిర్వహించేవారు. మేల్కొని సహర్‌కు వంటలు చేసేవారు. అప్పట్లో ముఖ్యంగా మొఘలుల వంటకాలకు ఆదరణ తక్కువ. కోస్తాంధ్రలో సైతం ఇప్పుడు బాగా ప్రాచుర్యం పొందిన హలీమ్, మొఘల్ బిర్యానీ, ఇరానీ చాయ్ అప్పుడు లేవు. ఇఫ్తార్ సమయంలో గోధుమనూకతో చేసిన గంజియే ప్రత్యేకంగా ఉండేది. ఉమ్మడి కుటుంబాలు ఉండడంతో కుటుంబీకులు, బంధుమిత్రులతో ఇఫ్తార్, సహర్ విందుల్లో హడావుడి ఉండేది. రకరకాల వంటకాలుండేవి. అప్పట్లో రంజాన్‌లో ప్రత్యేక తరావీ నమాజ్‌లో కొన్నిసార్లు ఖురాన్లో అన్ని అధ్యాయాలు ఒకే రాత్రిలో పూర్తి చేసేవారు. రాత్రి 9 గంటలకు మొదలైన నమాజ్ తెల్లవారు 3.30 గంటల వరకూ జరిగేది. -మహ్మద్ ఖాసిమ్, అక్కయ్యపాలెం -
ఉపవాసంతో ఆత్మప్రజ్వలనం
విశ్వాసి వాక్యం యేసుక్రీస్తు తన పరిచర్య ఆరంభంలో నలభై రోజుల ఉపవాస దీక్షకు పూనుకున్నాడు. రాళ్లు, ఇసుక తప్ప ఆహారమే కనబడని యూదా అరణ్యంలో రాళ్లనే రొట్టెలుగా మార్చుకొని తినమంటూ సాతాను ఆయన్ను శోధించాడు. ఆకలి, అలసటతో శారీరకంగా కృంగిన యేసుక్రీస్తు దీక్షను భగ్నం చేసేందుకు సాతాను విసిరిన వల అది. జనావళి ఆత్మీయాకలిని తీర్చేందుకు పరలోకపు ‘జీవాహారం’గా దిగివచ్చిన యేసుక్రీస్తు ఆ దీక్షలో ఆత్మీయంగా ఎంత బలపడిందీ అంచనా వేయడంలో సాతాను విఫలమయ్యాడు. శరీరం, ఆత్మ సమ్మేళనంగా ఉన్న విశ్వాసి ఆత్మీయంగా బలపడేందుకు శరీరాన్ని ఉద్దేశపూర్వకంగా కృశింపజేసుకోవడమే ఉపవాస దీక్ష. శరీరం, ఆత్మ భిన్నధృవాలుగా పనిచేసే విశ్వాసిలో ఒకటి కృశిస్తుంటే మరొకటి బలపడుతూంటుంది. శరీరం ఆహారం కోసం అలమటిస్తూంటే, ఆత్మ ‘ప్రార్థన’ కోసం ‘ప్రభువు సహవాసం’ కోసం పరితపిస్తుంది. అందుకే యేసుక్రీస్తు ‘‘మనిషి రొట్టెలతో మాత్రమే కాదు దేవుని మాటలతో బతుకుతాడు’’ అన్న జవాబుతో అతని శోధనల్ని తిప్పికొట్టాడు (లూకా 4 : 4). ఇంతసేపూ శరీర పోషణకే తాపత్రయపడే విశ్వాసి ‘ఆత్మపోషణ’కు ప్రజ్వలనకు గానే అప్పుడప్పుడూ ఉపవాసదీక్షకు పూనుకోవడం మంచిదే! శరీరం లోక ప్రతినిధిగా, ఆత్మ దేవుని ప్రతినిధిగా పనిచేసే విశ్వాసిలో, ప్రేమ, క్షమాపణ, నిస్వార్థత, సేవానిరతి వంటి దైవికాంశాలు వర్థిల్లడానికి, అంతిమంగా మట్టిలో కలిసిసోయే శరీరంకాదు, దేవుని సాన్నిధ్యానికి వెళ్లే ‘ఆత్మ’ నిత్యమైనది అన్నది గుర్తు చేయడానికి ఉపవాస దీక్ష సహాయం చేస్తుంది. శరీర పోషణే ప్రాముఖ్యమై ‘ఆత్మ పోషణ’ నిరాదరణకు గురైతే విశ్వాసి తన జీవన సాఫల్యాన్ని కోల్పోతాడు. ప్రొటీన్లు, విటమిన్లు, శరీరానికి అవసరమైనట్టే ‘ప్రార్థన’, వేదపఠన ఆత్మకు అవసరమవుతాయి. నేటి పోటీ ప్రపంచంలో ఆంతర్యశక్తి, ఆత్మ ప్రజ్వలనం నానాటికీ తగ్గుతూండగా మనిషిలో అశాంతి, అసంతృప్తి, అభద్రతాభావన అధికమై అతన్ని కృశింపజేస్తున్నాయి. క్షయమైన శరీరాన్ని, లోకాశల్ని అదుపులో పెట్టుకుంటే తప్ప ఆత్మప్రజ్వలనం సాధ్యం కాదు. ఆత్మ ప్రజ్వలనం జరిగితే తప్ప అక్షయమైన పరలోకానందం అందుబాటులోకి రాదు. ఉపవాస దీక్షలో శరీరం ఎంత క్షీణిస్తుందో దానికి అనుగుణంగా ‘ఆత్మ’ అంతకన్నా వెయ్యిరెట్లు బలపడాలి. ఈ లెంట్’ కాలంలో చేసే ఉపవాస దీక్షల్లో అది సాధించాలి. - రెవ టి.ఎ. ప్రభుకిరణ్