ఉపవాసాలతో సమస్యలు... అధిగమించేదెలా?
నా వయసు 33. మాది సంప్రదాయ కుటుంబం. నిత్యం పూజపురస్కారాలు చేస్తుంటాం. తరచూ ఉపవాసాలుంటాం. ఈమధ్య ఉపవాసం తర్వాత విపరీతమైన నీరసంతో పాటు కళ్లు తిరుగుతున్నాయి. గుండెల్లో మంట. డాక్టర్‌కు చూపిస్తే జీర్ణకోశంలో అల్సర్స్ అని అన్నారు. ఉపవాసాలు వద్దని సలహా ఇచ్చారు. అల్సర్లకు మందులు వాడుతున్నాను. ఉపవాసాలు మానకపోతే సమస్య మరింత జటిలం అవుతుందని డాక్టర్ చెబుతున్నారు. నేనేం చేయాలి?
- కె. ప్రసన్నకుమారి, ఖమ్మం
ఉపవాసం వల్ల శరీరంలో జీవక్రియలు పాక్షికంగా స్తంభించిపోతాయి. దాంతో ‘బేసల్ మెటబాలిక్ రేట్’ క్షీణించిపోతుంది. దాని ప్రభావం శరీరంలోని ద్రవాల సమతుల్యతపై పడుతుంది. శరీరంలో నీటిశాతం తగ్గిపోవడంతో డీహైడ్రేషన్ బారిన పడతుంటారు. ఉపవాసం ఉన్నప్పుడు ఇంట్లోపనులు... ముఖ్యంగా శారీరక శ్రమకు దూరంగా ఉండాలి. ఎండలో తిరగకుండా జాగ్రత్తపడాలి. తరచూ ఉపవాసాలు జీర్ణవ్యవస్థపై సైతం దుష్ర్పభావం చూపుతాయి. గుండెల్లో మంట మొదలుకొని జీర్ణకోశంలో అల్సర్లు, తలనొప్పి, డీహైడ్రేషన్, మలబద్ధకం, మూత్రపిండాల్లో రాళ్లు వంటి సమస్యలు తలెల్తే అవకాశాలు ఉన్నాయి. ఉపవాసం పేరిట భోజనం మానేయడం వల్ల శరీరంలో ముఖ్యమైన పోషకాలు లోపిస్తాయి. ముఖ్యంగా విటమిన్-బి కాంప్లెక్స్ లోపం పెరుగుతుంది. మీ విషయంలో కూడా దాదాపుగా అదే జరిగింది.
ఉపవాసం పేరిట మధ్యాన్నం భోజనం చేయకుండా రాత్రిపూట ఒక్కసారిగా మితిమీరి తినడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయులు ఉన్నట్లుండి పెరిగిపోతాయి. ఇన్సులిన్ వేగంగా తగ్గుతుంది. ఇది ముందుముందు డయాబెటిస్‌కు దారితీస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయులు పడిపోయినప్పుడు దాన్ని తట్టుకోవడానికి శరీరం కొన్ని రకాల హార్మోన్లను విడుదల చేస్తుంది. దాంతో రక్తపోటు పెరుగుతుంది. రక్తనాళాలు క్రమంగా కుంచించుకుపోయే ప్రమాదం ఉంది. అందువల్ల ఉపవాసం తర్వాత ఒక్కసారిగా ఎక్కువ ఆహారం తీసుకునే బదులు, ఆహారాన్ని మితంగా దఫదఫాలుగా తీసుకోవడం వల్ల జీర్ణ ప్రక్రియ సజావుగా సాగుతుంది. నూనెతో చేసిన వేపుళ్లు, మసాలాలు బాగా దట్టించిన కూరలు, బాగా వేయించిన కూరలను దూరంగా ఉంచడం వల్ల గుండెల్లో మంట తగ్గుతుంది. ఉపవాసం చేసే సమయంలో సాధ్యమైనన్ని ఎక్కువసార్లు మంచినీళ్లు తాగాలి. ఉపవాస సమయంలో సాధారణంగా ఎక్కువమంది పండ్ల రసాలు తీసుకుంటుంటారు. కానీ ఆ టైమ్‌లో పండ్లరసాలు, కూల్‌డ్రింక్స్ తీసుకోవద్దు. వీటికి బదులు కొబ్బరినీళ్లు తీసుకోవడం శ్రేయస్కరం. ఉపవాసం విరమించిన తర్వాత పీచు ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు పుష్కలంగా తీసుకోవాలి. దీనివల్ల మలబద్ధకం ఉండదు. వీలైనంతవరకు భోజనం, అల్పాహారం మానేయకుండా చూసుకోవడం మంచిది. రోజుకు 4-5 సార్లు ఆహారం తీసుకోవడం వల్ల ఆకలీ అదుపులో ఉంటుంది, పిండిపదార్థాల నుంచి లభించే చక్కెరా ఇంధనంలా అందుతుంటుంది. ఉపవాసం వల్ల అవయవాల పనితీరు దెబ్బతింటుంది. కాబట్టి అనివార్యమైతే తప్ప తరచూ ఉపవాసాలు ఆరోగ్యానికి చేటు తెస్తాయి.
డాక్టర్ కె. రఘురామ్
గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్,
యశోద హాస్పిటల్స్, సోమాజీగూడ,
హైదరాబాద్
గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్
Published Tue, Jul 21 2015 11:10 PM | Last Updated on Sun, Sep 3 2017 5:54 AM
Advertisement