the problem
-
ఇంత పసిదానికి ఈ గురక ఏమిటి?
మా పాపకు ఐదున్నర నెలలు. తాను పుట్టిన రెండో వారం నుంచి గురక వస్తోంది. ఇటీవల ఆ శబ్దం మరీ ఎక్కువయ్యింది. తరచూ వాంతులు కూడా చేసుకుంటోంది. డాక్టర్‌కు చూపిస్తే తగ్గిపోతుందన్నారు. పాప సమస్య ఏమిటి? మాకు ఆందోళనగా ఉంది. సలహా ఇవ్వండి. మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తుంటే మీ పాపకు ‘లారింగో మలేసియా’ సమస్య ఉన్నట్లు అనిపిస్తోంది. అంటే... శ్వాస తీసుకునే నాళంలోని ఒక భాగం బలహీనంగా ఉండటం. కొద్దిమంది పిల్లల్లో శ్వాస తీసుకునేటప్పుడు శబ్దం రావడం... మరీ ముఖ్యంగా ఆ శబ్దం... చిన్నారులు మెలకువగా ఉన్నప్పుడు, ఇతరత్రా ఇన్ఫెక్షన్లు (దగ్గు, జలుబు వంటివి) ఉన్నప్పుడు, ఆహారం తీసుకుంటున్నప్పుడు ఎక్కువ కావచ్చు. ఇలా ఎక్కువగా శబ్దం రావడాన్ని వైద్యపరిభాషలో స్ట్రయిడర్ అంటారు. పిల్లల్లో 60 శాతం మందిలో స్ట్రయిడర్ రావడానికి కారణం లారింగో మలేసియానే. ఇటువంటి పిల్లల్లో శ్వాససంబంధమైన సమస్యలు పుట్టిన రెండో వారం నుంచే మొదలై... ఆర్నెల్ల వయసప్పటికి తీవ్రతరం కావచ్చు. చాలామందిలో ఇది క్రమేణా తగ్గుముఖం పట్టడం, పరిస్థితుల్లో మెరుగుదల కనిపించడం జరుగుతుంది. ఈ మెరుగుదల ఎప్పుడైనా మొదలుకావచ్చు. అయితే కొద్దిమంది పిల్లల్లో లారింగోమలేసియాతో పాటు దగ్గు, వాంతులు కనిపించే లారింగో ఫ్యారింజియల్ రిఫ్లక్స్ అనే కండిషన్‌తో సమస్య తన తీవ్రతను చూపించవచ్చు. ఇలాంటి పిల్లల్లో కొన్నిసార్లు నీలంగా మారడం (సైనోసిస్), దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలను ఎదుర్కోవడం వంటి సమస్యలు కనిపించవచ్చు. కొన్నిసార్లు మరికొన్ని ఇతర రకాల సమస్యలైన... సబ్‌గ్లాటిక్ స్టెనోసిస్, లారింజియల్ వెబ్స్, ట్రాకియో బ్రాంకియో మలేసియా... మొదలైన కండిషన్లలోనూ మీరు చెప్పిన లక్షణాలే కనిపిస్తుంటాయి. పై అంశాలను బట్టి విశ్లేషిస్తే మీ పాపకు లారింగో మలేసియాతో పాటు గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ కండిషన్ ఉన్నట్లు అనిపిస్తోంది. దీన్ని నిర్ధారణ చేయడానికి ఫ్లెక్సిబుల్ లారింగోస్కోపీ, బ్రాంకోస్కోపీ, రేడియోగ్రాఫిక్ స్టడీస్ చేయించాల్సి ఉంటుంది. ఈ సమస్యకు చికిత్స అన్నది పిల్లల్లో కనిపించే లక్షణాల తీవ్రత, శ్వాసతీసుకునే సమయంలో ఇబ్బందిని ఏ మేరకు భరిస్తున్నారు, పిల్లల్లో ఉన్న ఇతరత్రా వైద్య సమస్యలు, ఇన్వెస్టిగేషన్ డేటా, అన్నిటి కంటే ముఖ్యంగా ఈ జబ్బు కారణంగా కుటుంబంపై పడుతున్న మానసిక ఒత్తిడి తాలూకు తీవ్రత వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ పాపకు ఉన్నది చాలా తీవ్రమైన లారింగోమలేసియా అని నిర్ధారణ అయితే శస్త్రచికిత్స ద్వారా దీన్ని సరిచేయవచ్చు. కాబట్టి... మీరు మీ పిల్లల వైద్యుడిని, పీడియాట్రిక్ ఈఎన్టీ నిపుణుడిని సంప్రదించి, ఫాలోఅప్‌లో ఉండండి. పిల్లి కరిచింది... సలహా ఇవ్వండి మా బాబుకి ఐదేళ్లు. వాడు ఆడుకుంటూ, ఆడుకుంటూ పిల్లి దగ్గరికి వెళ్లినప్పుడు అది కరిచింది. అది పెంపుడు పిల్లి కాదు. డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తే పూర్తి వ్యాక్సిన్ వేయించాలని చెప్పారు. మావాడి విషయంలో ఆందోళనగా ఉంది. దయచేసి మాకు సరైన సలహా ఇవ్వండి. జంతువుల వల్ల మనుషులకు వచ్చే జబ్బులను, జంతువులు కరవటం వల్ల వచ్చే జబ్బులను జూనోటిక్ వ్యాధులు అంటారు. ప్రమాదకరమైన జూనోటిక్ వ్యాధులలో రేబిస్ ఒకటి. అందరూ అనుకుంటున్నట్లు రేబిస్ కేవలం కుక్కల ద్వారానే కాక– పిల్లులు, నక్కలు, గబ్బిలాలు, కోతులు, అరుదుగా ఎలుకల వల్ల కూడా కలుగుతుంది. అన్ని జంతువులలో రేబిస్ ఉండకపోవచ్చు. అయితే స్ట్రే యానిమల్స్ కరిచినప్పుడు– దాని ద్వారా రేబిస్ సంక్రమిస్తుందో లేదో అని నిర్ధారణకు అయ్యేవరకు వాటికి రేబిస్ ఉన్నట్లుగానే పరిగణించి, జంతువు కాటుకు గురైన వారికి చికిత్స చేయాలి. ఒక వేళ కరిచిన జంతువు పదిరోజులలోపు చనిపోయినా లేదా అది రేబిస్ ఉన్న జంతువు అని నిర్ధారణ అయినా పూర్తి ట్రీట్మెంట్ ఎంతైనా అవసరం.జంతువుల వల్ల అయిన గాయాన్ని మూడు కేటగిరీలుగా విభజించడం జరుగుతుంది. గాయం 2, 3 కేటగిరీలకు చెందినదైతే వైద్యం తప్పనిసరిగా చేయించవలసి ఉంటుంది. వ్యాక్సిన్ కూడా తీసుకోవడం చాలా ముఖ్యం. అదే విధంగా కేటగిరీని బట్టి 3 నుంచి 5 సార్లు యాంటీరేబిస్ వ్యాక్సిన్ ఇవ్వటం కూడా జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో జంతువులు విపరీతంగా కరిచినప్పుడు వ్యాక్సిన్‌తో పాటు యాంటీ రేబిస్ ఇమ్యునో గ్లోబ్యులిన్ ఇంజెక్షన్ కూడా ఇవ్వాలి. కరిచిన జంతువుకు రేబిస్ లేకపోయినా ఇది తప్పనిసరి. మామూలుగా మన పరిసరాలలో తిరిగే జంతువులు గీరటం లేదా కరవటం జరిగినప్పుడు మొదటి పదిరోజుల్లో ఆ జంతువుకి ఎటువంటి హాని జరగకపోతే మొదటి మూడు డోసులతో వ్యాక్సిన్‌ను నిలిపివేయవచ్చు. ఇంత చిన్న బాబుకూ తలనొప్పా? పీడియాట్రిక్ కౌన్సెలింగ్స్ మా బాబుకు ఎనిమిదేళ్లు. ఇటీవల వాడు తరచూ తలనొప్పి అంటూ ఏడుస్తున్నాడు. కొన్నిసార్లు వాంతులు కూడా అవుతున్నాయి. కొన్నిసార్లు కాసేపు నిశ్శబ్దంగా పడుకోబెడితే తలనొప్పి తగ్గుతోంది. కానీ చాలాసార్లు మాత్ర వేస్తేగానీ తగ్గడం లేదు. కొన్ని సందర్భాల్లో కడుపునొప్పి, కళ్లు తిరుగుతున్నాయని కూడా చెబుతున్నాడు. మా బాబు సమస్య ఏమిటి? వాడికి తగ్గేదెలా? మీరు చెబుతున్న దాన్ని బట్టి మీ బాబుకు తరచూ తలనొప్పి ఒకింత తీవ్రంగానే ఉన్నట్లు అనిపిస్తోంది. చిన్న పిల్లలతో పాటు టీనేజర్లలో తలనొప్పి రావడం మామూలే. పిల్లల్లో పదేపదే తీవ్రమైన తలనొప్పులకు కారణాలు అనేకం. వాటిలో ముఖ్యమైన వాటిల్లో మైగ్రేన్ ఒకటి. ఇక దీనితో పాటు టెన్షన్ హెడేక్, అటనామిక్ డిస్ట్రబెన్సెస్ వల్ల కూడా తలనొప్పులు రావచ్చు. అలాగే కొన్నిసార్లు కొన్ని సెకండరీ కారణాల వల్ల అంటే... ఇతరత్రా అవయవాల్లో సమస్యల వల్ల... (ఉదాహరణకు సైనసైటిస్, కంటికి సంబంధించిన సమస్యలు లేదా మెదడుకు సంబంధించిన రుగ్మతలు ఉన్నప్పుడు) కూడా తలనొప్పి రావచ్చు. ఇక మీ బాబు విషయానికి వస్తే అది మైగ్రేన్ అని చెప్పవచ్చు. మైగ్రేన్ జబ్బు తరచూ ఒక మాదిరి నుంచి తీవ్రమైన తలనొప్పితో వస్తుంటుంది. ఇది ఒక చోట కేంద్రీకృతమైనట్లుగా ఉండవచ్చు. కొన్నిసార్లు వికారం, వాంతులు, కాంతిని చూడటాన్ని, శబ్దాలు వినడాన్ని ఇష్టపడకపోవడం, కొన్నిసందర్భాల్లో ఏదో అవయవం బలహీనంగా ఉన్నట్లు అనిపించడం, తూలిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఐదు నుంచి పదిహేనేళ్ల పిల్లల్లో 10 శాతం మందికి ఏదో ఒక రూపంలో మైగ్రేన్ కనిపిస్తుంది. తలనొప్పి వచ్చే పిల్లలందరికీ అన్ని పరీక్షలూ అవసరం లేకపోయినప్పటికీ తీవ్రత ఎక్కువగా ఉండటం లేదా దానితో పాటు నరాలకు సంబంధించిన లక్షణాలు (అసోసియేటెడ్ న్యూరలాజికల్ సింప్టమ్స్) ఉన్న కొద్దిమందిలో మాత్రం కొన్ని ఇమేజింగ్ పరీక్షలు అవసరమవుతాయి. ఇక చికిత్స విషయానికి వస్తే... తలనొప్పి కనిపించిన సందర్భం (అక్యూట్ ఫేజ్)లో ఎన్ఎస్ఏఐడీ గ్రూపు మందులతో తప్పకుండా ఉపశమనం లభిస్తుంది. ఇక దీర్ఘకాలికంగా ఈ సమస్య ఉన్న పిల్లలకు అది రాకుండా నివారించడానికి కొన్ని మందులు... ఉదాహరణకు ఎమిట్రిప్టిలిన్, ప్రొప్రొనలాల్ వంటివి అనేకం ఇప్పుడు వాడుతున్నారు. ఇవి కొన్ని నెలల పాటు వాడటం వల్ల లక్షణాలు మళ్లీ కనిపించకపోవడం లేదా చాలారోజుల పాటు కనిపించకుండా ఉండటం జరుగుతుంది. ఇలాంటి పిల్లలకు బిహేవియర్ థెరపీతో నొప్పి తీవ్రత తగ్గి, మంచి మెరుగుదల కనిపిస్తుంది. ఇక మైగ్రేన్‌ను ప్రేరేపించే ట్రిగ్గర్స్... అంటే ఏదైనా పూట ఆహారం తీసుకోకుండా ఉండటం, నీళ్లు తక్కువగా తాగడం, నిద్రలేమి, కెఫిన్ ఉన్న పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వంటి వాటికి దూరంగా ఉండటం చాలా ముఖ్యం. దీనితో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, క్రమబద్ధంగా ఒకేవేళకు ఆహారం తీసుకోవడం, కంటి నిండా నిద్రపోవడం వంటివి చేసేవారిలో నొప్పి తీవ్రత తక్కువ. పైన పేర్కొన్న సూచనలు పాటిస్తూ మీరు ఒకసారి మీ పిల్లల వైద్యనిపుణుడిని సంప్రదించండి. డా. రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
‘నామ్’లో సాంకేతిక లోపాల పరిశీలన
సుభాష్‌నగర్: జాతీయ వ్యవసాయ మార్కెట్ (నామ్)లో తలెత్తిన సాంకేతిక లోపాలను ఢిల్లీ నుంచి వచ్చిన ఎన్ఎఫ్ఎస్ఎల్ బృందం సోమవారం పరిశీలించింది. 27రోజులుగా నామ్ సర్వర్ డౌన్ కావడంతో మార్కెట్లో క్రయ, విక్రయాల్లో తీవ్ర జాప్యం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని మార్కెట్ కమిటీ సెక్రటరీ సంగయ్య ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రోజురోజుకూ సమస్య తీవ్రం కావడంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. అయినప్పటికీ ఓ కొలిక్కి రాకపోవడంతో మార్కెటింVŠ Sశాఖ మంత్రి హరీశ్‌రావు కేంద్ర ప్రభుత్వం, ఎన్ఎఫ్ఎస్ఎల్ ప్రతినిధులను నేరుగా సంప్రదించారు. దీంతో ఎన్ఎఫ్ఎస్ఎల్ ఆలిండియా టెక్నికల్ ఆఫీసర్ ఆనంద్ శర్మ నేతృత్వంలో 10మందితో కూడిన సాంకేతిక అధికారులు సోమవారం ఉదయం మార్కెట్ యార్డుకు చేరుకున్నారు. సమస్య మీదంటే.. మీది అని మార్కెట్ అధికారులు.. ఎన్ఎఫ్ఎస్ఎల్ ప్రతినిధులు వాగ్వాదానికి దిగారు. ఉదయం నుంచి మార్కెట్ యార్డులోని 10 క్యాబిన్లలో బృందం సభ్యులు కూర్చొని పర్యవేక్షించారు. సమస్య ఎక్కడుందనేది తెలుసుకునేందుకు కొంత సమయం కావాలని, 3–4 రోజులు బృందం సభ్యులు అక్కడే ఉంటారని, సమస్య పరిష్కరించిన తర్వాతే వెళ్తారని నామ్ జిల్లా ఇన్చార్జి ఎల్లన్న తెలిపారు. మార్కెటింగ్ కమిషనర్ కార్యాలయం ప్రోగ్రామింగ్ ఆఫీసర్ ప్రవీణ్‌కుమార్, మార్కెట్‌కమిటీ సెక్రటరీ సంగయ్య, డీఎంవో రియాజ్ తదితరులు వారి వెంట ఉన్నారు. -
ప్రశ్నించే గొంతు నొక్కేందుకే పీడీ యాక్టు
పంజగుట్ట: ప్రశ్నించిన ప్రతీ ఒక్కరినీ పీడీ యాక్టు పేరుతో భయపెట్టడం తగదని మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. ప్రభుత్వాలు ప్రజల ఆందోళనకు కారణాలను గుర్తించి సమస్య పరిష్కరించాలని కోరారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో ‘తెలంగాణలో నిర్భంధం ఎవరిమీద ..? పీడీ యాక్ట్ ఎందుకోసం’ అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీవ్రమైన నేరాలకు ఉద్ధేశించిన పీడీ యాక్టును చిన్న చిన్న కేసులకు, ప్రజా ఆందోళనలు, ఉద్యమాలు చేసే వారిపై ప్రయోగించడం దారుణమన్నారు. పీడీయాక్టు అమలుపై గతంలో న్యాయస్థానాలు ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాలన్నారు. ప్రజాస్వామ్యంలో పీడీ, నాసా తదితర నిర్భంధ చట్టాలను అమలు చేయాలనుకోవడం మంచిది కాదన్నారు. చెరుకు సుధాకర్ మాట్లాడుతూ ప్రస్తుతం పీడీ యాక్ట్ సర్వసాధారణమైపోయిందన్నారు. ఖమ్మం జిల్లాలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న 80 మంది గిరిజనులపై పీడీ యాక్టు ప్రయోగించడం విడ్డూరంగా ఉందన్నారు. పోడు వ్యవసాయం అటవీ హక్కు చట్టం ప్రకారం వారి హక్కుగా పేర్కొన్నారు. ప్రభుత్వానికి దమ్ముంటే నయీంతో సంబంధాలు ఉన్న అధికార పార్టీ నాయకులపై పీడి యాక్ట్ పెట్టాలని హితవు పలికారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే యెన్న శ్రీనివాస్ రెడ్డి, ఎపూరి సోమన్న, సందీప్ చమల్, శ్రీనివాస్ గౌడ్, మేరీ మాదిగ, వనజ తదితరులు పాల్గొన్నారు. -
ఆసనాల్లో రాణింపు...
సర్వాంగాసన ఆసనంలో వెల్లకిలా పడుకుని చేతులు రెండూ శరీరానికి ఇరువైపులా ఉంచాలి. అరచేతులు భూమిమీద నొక్కుతూ రెండు పాదాలను, మోకాళ్లను కలిపి ఉంచి శ్వాస తీసుకుంటూ రెండు కాళ్లను నెమ్మదిగా పైకిలేపి 90 డిగ్రీల కోణంలోకి తీసుకు రావాలి. తర్వాత కాళ్లను ఇంకా తలవైపునకు తీసుకువెళుతూ నడుముకి రెండు చేతులతో సపోర్ట్ ఉంచి నడుమును, పిరుదులను ఇంకా పైకి లేపి వీపు మధ్య భాగానికి చేతులతో సపోర్ట్ ఉంచి భుజాలు మెడ మీద శరీరం మొత్తాన్ని పైకి గాలిలోకి లేపే ప్రయత్నం చేయాలి. పూర్తి ఆసన స్థితిలోకి వచ్చిన తర్వాత స్ట్రెచ్ చేసిన పాదాలను కొంచెం రిలాక్స్డ్గా సమంగా ఉంచాలి. ఈ స్థితిలో గడ్డం ఛాతీ భాగాన్ని అదుముతూ ఉంటుంది. ఆసనంలో స్థిరంగా సాధారణ శ్వాసలు 5 లేదా 10 తీసుకుని అంటే సుమారు రెండు లేదా మూడు నిమిషాల పాటు ఉన్నట్లయితే రక్త ప్రసరణ తలవైపునకు ఎక్కువగా ఉండి క్రేనియల్ నెర్వస్ సిస్టమ్‌కి లాభం చేకూరుతుంది. ఆసనం మీద పట్టు ఉన్నట్లయితే సర్వాంగాసనంలో రెండు కాళ్లు పైన పక్కలకు సెపరేట్ చేయవచ్చు. ఒకకాలు ముందుకు ఒక కాలు వెనుకకు ఆల్టర్నేటివ్గా కదలించవచ్చు. సైక్లింగ్ చేయవచ్చు. మరింత ఫ్లెక్సిబులిటీ ఉంటే... నడుము, వెన్నెముకలో మరింత ఫ్లెక్సిబులిటీ ఉన్నట్లయితే పద్మాసనంలో కఠినమైన (వేరియంట్-1, వేరియంట్-2) సాధన చేయవచ్చు. సర్వాంగాసనంతోనే పద్మాసనం కూడా వేయవచ్చు. ఆ పద్మాసనాన్ని తల దగ్గరకు, నుదురు మీదకు ఇంకా వీలైతే తలవెనుక నేల మీదకు రెండు మోకాళ్లు సమంగా ఆనేటట్టుగా కూడా సాధన చేయవచ్చు. సర్వాంగాసనంలో నుంచి తిరిగి వెనుకకు వచ్చేటప్పుడు చేతులు రెండింటినీ నడుముకి సపోర్ట్‌గా ఉంచి కాళ్లు రెండూ నెమ్మదిగా నేల మీదకు తీసుకురావాలి. సీనియర్ సాధకులు చేతులు రెండూ నడుముకి సపోర్ట్‌గా ఉంచి పాదాలు మాత్రమే నేల మీద ఉంచి సేతు బంధనాసనంలోకి (బ్రిడ్జి పోస్చర్) రాగలుగుతారు. లేదా వెనుకకు హలాసనంలోకి తర్వాత ముందుకి సేతు బంధాసనంలోకి రాగలుగుతారు. మెడ భుజాల మీద భారం పడుతుంది కాబట్టి, దీని తర్వాత మత్స్యాసనం చేసినట్లయితే మెడ కండరాలు రిలాక్స్ అవుతాయి. ఉపయోగాలు క్రేనియల్ నెర్వస్ సిస్టమ్‌కి ఉపయుక్తం. థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్లు ముఖ్యంగా హైపోథైరాయిడ్ సమస్యకి పరిష్కారం. రెండు, మూడు నిమిషాలు లేదా అంతకన్నా ఎక్కువ సమయం ఉన్నట్లయితే కిడ్నీకి, అడ్రినలిన్ గ్లాండ్స్కి మంచిది. భావోద్వేగాలను అదుపులో ఉంచుతుంది. మలబద్ధకం, నిద్రలేమితనం, వెరికోస్ వెయిన్స, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, ఇన్గ్యునల్ హెర్నియా సమస్యలున్నవారికి ఉపయుక్తం. కుర్చీ ఆసరాతో... ఫొటోలో చూపిన విధంగా చేయలేని నూతన సాధకులు చేతులున్న ప్లాస్టిక్ కుర్చీని ఆధారం చేసుకుని చేయవచ్చు. ఆసనంలో వెల్లకిలా పడుకుని తర్వాత కుర్చీని యోగా మ్యాట్ మీద నడుముకి దగ్గరగా ఉంచి రెండు చేతులతో కింద కుర్చీ కాళ్లను పట్టుకుని శరీరానికి దగ్గరగా కుర్చీని లాగుతూ సీటును కుర్చీ సీటు కన్నా పైకి తీసుకువెళుతూ కాళ్లు రెండింటిని నిటారుగా ఉంచవచ్చు. లేకపోతే కాళ్లు రెండూ కలిపి స్ట్రెయిట్‌గా ఉంచుతూ కుర్చీ బ్యాక్ రెస్ట్‌పై భాగంలో ఉంచవచ్చు. మెడ, భుజం మీద భారం ఎక్కువగా ఉన్నట్లనిపిస్తే పలచని దిండుని ఉపయోగించవచ్చు. అన్ని అంగాలకు మంచిది కనుక సర్వాంగాలూ ఉత్తేజితం చెందుతాయి కనక దీనికి సర్వాంగాసనం అని పేరు వచ్చింది. ఆసనంలో అన్నింటికంటే రాణి వంటి ఆసనం ఇది. ఆసనాలన్నింటిలోకి తొలి ఉత్తమ ఆసనం శీర్షాసనం అయితే దాని తర్వాత స్థానం ఇది. (శీర్షాసనం గురించి వచ్చేవారం) ఎ.ఎల్.వి కుమార్ ట్రెడిషనల్ యోగా ఫౌండేషన్ -
చుండ్రు తగ్గాలంటే...
బ్యూటిప్స్ జుట్టు మృదువుగా, ఆకర్షణీయంగా కనిపించడం ఎంత ముఖ్యమో ఆరోగ్యంగా ఉంచడమూ అంతే ముఖ్యం. తల జిడ్డుతో పాటు చుండ్రు సమస్య కూడా చాలా మందిని బాధిస్తుంటుంది. ఈ సమస్యకు విరుగుడుగా.... వేప నూనె, ఆలివ్ ఆయిల్ సమపాళ్లలో కలిపి వేడి చేయాలి. గోరువెచ్చని నూనె తలకు పట్టించి మృదువుగా మర్దనా చేయాలి. 15 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి.చిన్న అల్లం ముక్క తీసుకొన్ని సన్నగా తరగాలి. ఈ ముక్కలను నువ్వుల నూనెలో వేసి మరిగించాలి. చల్లారిన తర్వాత కుదుళ్లకు నూనె పట్టేలా మర్దనా చేయాలి. గంట తర్వాత తలస్నానం చేయాలి. వారానికి ఒకసారి ఈ విధంగా చుండ్రు తగ్గిపోతుంది. ఆపిల్ సైడర్ వెనిగర్‌లో అరటిపండు గుజ్జును బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మాడుకు పట్టించి వెచ్చని నీళ్లతో శుభ్రపరుచుకోవాలి. ఆరెంజ్ తొక్కను ముద్దగా నూరి తలకు పట్టించాలి. అరగంట తర్వాత వెచ్చని నీళ్లతో కడిగేయాలి. కప్పు నీళ్లలో 2-3 టేబుల్ స్పూన్ల ఉప్పు కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. 10 నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. బేబీ ఆయిల్‌ను తలకు పట్టించి, మర్దనా చేసి వెచ్చని నీళ్లలో ముంచి తీసిన టర్కీ టవల్ని చుట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత యాంటీ-డాండ్రఫ్ షాంపూతో తలంటుకోవాలి. కలబంద గుజ్జును మాడుకు పట్టించి 15 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. కలబంద చుండ్రును నివారించడమే కాకుండా మాడుపై ఉన్న చర్మ సమస్యలనూ నివారిస్తుంది. వెంట్రుకలకు మృదుత్వాన్ని ఇస్తుంది.రెండు టేబుల్ స్పూన్ల యాపిల్ జ్యూస్ అంతే పరిమాణంలో నీళ్లు తీసుకొని తలకు పట్టించాలి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. పోషకాహారం తినడం, దుమ్ము, ధూళి నుంచి కాపాడుకోవడమే కాకుండా పరిశుభ్రత విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకుంటే చుండ్రు సమస్య బాధించదు. -
స్వరం మారుతున్నదా?
నేడు వరల్డ్ వాయిస్ డే సమస్య మొదలవుతున్నట్టే.. తస్మాత్ జాగ్రత్త గుంటూరు మెడికల్ : మానవునికి స్వరం దేవుడిచ్చిన వరం. విభిన్న రీతుల్లో స్వరాలు పలికించే శక్తి సమస్త జీవరాశుల్లో ఒక్క మానవునికే ఉంది. మానవుల్లో స్వరపేటిక కేవలం మాటలకే కాదు.. విచారం, సంతోషం, కోపం మొదలైన భావోద్వేగాలను పలికించడంలోనూ దిట్ట. గాయకులు, రాజకీయనాయకులు, వ్యాపారవేత్తలు, ఉపాధ్యాయులు, టీవీ, సినీ ఆర్టిస్టులు, డబ్బింగ్ ఆర్టిస్టులు స్వరంపైనే ఆధారపడి జీవిస్తుంటారు. వీరిని ప్రొఫెషనల్ వాయిస్ యూజర్స్ అంటారు. స్వరం వీరి భవిష్యత్తును కూడా నిర్ధేశిస్తుంది. ఇటువంటి వారిలో స్వరసమస్యలు పెద్ద ఇబ్బందులు సృష్టించవచ్చు. నేడు ప్రపంచ స్వర దినోత్సవం సందర్భంగా సాక్షి ప్రత్యేక కథనం స్వర సమస్యలు తక్కువేమీ కాదు.. స్వర సమస్యల్లో సామాన్యంగా వచ్చేది బొంగురు గొంతు. మాట్లాడేటప్పుడు స్వరం బిగపట్టిపోవటం, మాటలు మధ్యలో ఆగిపోవటం వంటివి సాధారణంగా కనిపించే సమస్యలు. మగవారిలో కీచుగొంతు లేక ఆడగొంతు రావటం, ఆడవారికి మగ గొంతురావటం, గాయకుల్లో పాడేటప్పుడు గొంతు జీరపోవటం వల్ల ఉచ్ఛ స్థాయిలో పాడలేకపోటం తదితర సమస్యలు వస్తాయి. స్వరమార్గం సన్నబడటం, స్వరనాడుల మధ్య పొరలు ఏర్పడడం, స్వరనాడుల్లో పక్షవాతం మొదలైన సమస్యలు పుట్టకతోనే వస్తాయి. ఆరేళ్లనుండి 14ఏళ్ల వయస్సులో పిల్లలో గొంతు బొంగురు పోతుంది. యుక్తవయస్సులో ఆడవారిలో మగగొంతు, మగవారిలో ఆడగొంతు ఏర్పడుతుంది. వీటిలో కొన్ని హార్మోన్ల మార్పు వల్ల సహజంగా జరిగే పరిణామాలైతే మరికొన్నింటికి ఇన్ఫెక్షన్లు కారణమవుతాయి. మధ్య వయస్కులకు స్వరపేటికలో కణుతులు ఏర్పడి అవి క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదముంది. ైథైరాయిడ్ ఆపరేషన్ తరువాత లేదా తల, మెడ, ఛాతీ భాగాలలో దెబ్బలు తగలటం, వైరల్ ఇన్ఫెక్షన్లు స్వరపేటిక పక్షవాతానికి దారితీస్తుంది. స్వర సమస్యలను తేలిగ్గా తీసుకోవద్దు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం మూడు వారాలకు మించి బొంగురు గొంతు ఉంటే క్యాన్సర్‌గా అనుమానించాల్సి ఉంటుంది. వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. 50 నుండి 60 శాతం స్వరసమస్యలను వాయిస్థెరపీ ద్వారా నయం చేసీ వీలుంది. స్వరసమస్యలు రాకుండా ఉండాలంటే పెద్దగా అరవడం, గట్టిగా కేకలు వేయడం చేయకూడదు. మాటిమాటికీ గొంతు సవరించుకునే అలవాటు మానుకోవాలి. ధూమపానం, మద్యపానం, కాఫీలకు, దూరంగా ఉండి నీరు ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. - డాక్టర్ ఫణీంద్రకుమార్, వాయిస్ సర్జన్ -
చలి... మరింత మృదువుగా!
బ్యూటిప్స్ చలి వల్ల గాల్లో తేమ తగ్గి పొడి చర్మం ఇంకా పొడిబారుతుంది. సరైన పోషణ లేకపోతే చర్మం వయసుకు మించి ముడతులు పడే అవకాశం ఉంది. ఈ సమస్యకు విరుగుడుగా... గుడ్డులోని పచ్చ సొన కోడిగుడ్డుపై పెంకు కొద్దిగా తొలగించి తెల్ల సొన ఒక పాత్రలో, పసుపు సొన మరో పాత్రలో వేయాలి. పసుపుసొనలో టీ స్పూన్ తేనె, టీ స్పూన్ పాల పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, కనీసం 15 నిమిషాలైన ఉంచాలి. తర్వాత నీళ్లతో శుభ్రపరుచుకోవాలి, రోజ్ వాటర్ ఒక చిన్న పాత్రలో రోజ్‌వాటర్ టీ స్పూన్, అంతే పరిమాణంలో తేనె కలిపి ముఖానికి రాసి, మృదువుగా మసాజ్ చేసి, తర్వాత శుభ్రపరచాలి. ఇది పొడి చర్మానికి సరైన చికిత్స. చర్మం త్వరగా శుభ్రపడుతుంది. కాంతి పెరుగుతుంది. నూనెతో మర్దన! కొబ్బరి నూనె, వంటనూనె, మర్దనా నూనెలలు చాలా వరకు ఇళ్లలో ఉంటాయి. ఈ మధ్యలో ఆలివ్ , ఆల్మండ్ ఆయిల్స కూడా ఆరోగ్యానికి, అందానికి ఉపయోగిస్తున్నారు. స్నానానికి ముందు ఏదైనా నూనెతో చర్మానికి పట్టించి, మర్దనా చేసుకోవాలి. గోళ్లకు కూడా మర్దనా చే సి, పది-పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయాలి. చర్మానికి తగినంత మాయిశ్చరైజర్ లభించి, ముందు పొడిగా ఉన్న చర్మం తర్వాత మృదువుగా మారిపోతుంది. పండ్లు బొప్పాయి, అరటిపండును గుజ్జు చేసి, ఈ రెంటిని కలపాలి. ఈ మిశ్రమాన్ని శరీరానికి పట్టించాలి. మృదువుగా మసాజ్ చేయాలి. తర్వాత శుభ్రపరుచుకోవాలి. పొడిబారిన చర్మాన్ని ఈ ప్యాక్ మృదువుగా మారుస్తుంది. -
దూరవాసన
మాట మంచిదే కావచ్చు, అయినా అందరూ దూర దూరంగా తప్పించుకుని తిరుగుతుంటారు. ‘పాపం... మాట మంచిదే కానీ, నోరు మంచిది కాదు’ అనే వ్యాఖ్యలుచాటుమాటుగా వినిపిస్తూనే ఉంటాయి. బడికి వెళ్లే పిల్లలకు ఈ సమస్య ఉంటే, వారు నోరు విప్పి మాట్లాడేందుకు ప్రయత్నిస్తే చాలు, తోటి పిల్లల నుంచి హేళనలు ఎదురవుతాయి. గృహిణులకు ఇదే సమస్య ఉంటే, వారుఎదురైతే చాలు సాటి అమ్మలక్కలు ఏదో అర్జంటు పని ఉన్నట్లు ముఖం తిప్పేసుకుంటారు. ఉద్యోగులకు ఈ సమస్య ఉంటే, కొలీగ్స్ దూరమవుతారు. తప్పనిసరిగా బాస్‌ను కలుసుకోవాల్సిన సందర్భాల్లో చిర్రుబుర్రులు ఎదురవుతాయి. ఒకవేళ బాస్కే ఈ సమస్య ఉంటే, ఉద్యోగుల ఇబ్బంది ఇక వర్ణనాతీతం. నోటి దుర్వాసన మాచెడ్డ సమస్య. దూరంగా వ్యాపించే వాసన మనిషి నుంచి మనిషిని దూరం చేస్తుంది. సాధారణ మానవ సంబంధాలనే కాదు, గాఢమైన మైత్రీబంధాలనూ దెబ్బతీస్తుంది. ఒక్కోసారి దంపతుల మధ్య విడాకులకూ దారితీస్తుంది. ఫలితంగా మానసికమైన కుంగుబాటుకు, అనవసరమైన అపరాధ భావనకు దారితీస్తుంది. చాలావరకు ఈ సమస్యను ఎవరికి వారే తేలికగా తెలుసుకోవచ్చు. నోటికి ఎదురుగా అరచెయ్యి పెట్టుకుని గాలి ఊదండి. పరిస్థితి అర్థమైపోతుంది. అరుదుగా కొందరిలో ఈ సమస్య ఉన్నా, వారికి ఆ విషయం తెలియదు. అలాంటి సమస్యతో మీ సన్నిహితులెవరైనా బాధపడుతుంటే, వారికి సున్నితంగా ఆ విషయాన్ని తెలిపి, వెంటనే వైద్య సహాయం పొందేలా ప్రోత్సహించండి. నోటి దుర్వాసనను అధిగమించే మార్గాలను వివరించడానికే ఈ కథనం. ఇవీ సాధారణ కారణాలు నోటి దుర్వాసనను వైద్య పరిభాషలో ‘హాలిటోసిస్’ అంటారు. నోటి దుర్వాసనతో బాధపడేవారు డెంటిస్టు లేదా ఫిజీషియన్ వద్దకు వెళ్లాలి. సమస్య నిజంగానే ఉంటే వైద్యులు దానికి తగిన చికిత్స చేస్తారు. నోటి దుర్వాసనకు అనేక కారణాలు ఉంటాయి. వాటిలోని సర్వసాధారణ కారణాలు ఇవి... నోటిలో లాలాజలం తగ్గడం. వయసు మళ్లుతున్న కొద్దీ లాలాజలం తగ్గి నోటి దుర్వాసన వస్తుంది.ఒక్కోసారి కట్టుడు పళ్లు కూడా నోటి దుర్వాసనకు దారితీస్తాయి. రంధ్రాలు ఏర్పడిన పిప్పిపళ్లు, చిగుళ్ల వాపు నోటి దుర్వాసనను కలిగిస్తాయి. నాలుకను సరిగా శుభ్రం చేసుకోకపోయినా నోటి దుర్వాసన వస్తుంది. పొగతాగడం, పొగాకు నమలడం వంటి దురలవాట్లు నోటి దుర్వాసనను పెంచుతాయి. స్వీట్లు, నోటికి అంటుకుపోయే బేకరీ ఉత్పత్తులు వంటివి కూడా బ్యాక్టీరియా పెరుగుదలకు దోహదపడి నోటి దుర్వాసన కలిగిస్తాయి.జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయకపోయినప్పుడు కూడా నోటి దుర్వాసన రావచ్చు. ఇలాంటి పరిస్థితిని వైద్య పరిభాషలో ‘ఫెటార్ హెపాటికస్’ అంటారు. ఈ పరిస్థితిలో మౄతదేహం నుంచి వెలువడే వాసన వస్తుంది. కొన్ని అరుదైన కారణాలు దీర్ఘకాలిక వ్యాధులు, మనం వాడే యాంటీబయోటిక్స్ వంటి కొన్ని అరుదైన కారణాలు కూడా నోటి దుర్వాసనను కలిగిస్తాయి.ముఖ్యంగా డయాబెటిస్తో బాధపడేవారికి నోటి దుర్వాసన వచ్చే అవకాశాలు ఎక్కువ. వారి రక్తంలో వెలువడే కీటోన్స్ అనే విషపదార్థాలు ఈ సమస్యను కలిగిస్తాయి.కీళ్లవాతానికి సంబంధించిన జ్వరం (రుమాటిక్ ఫీవర్) ఉన్నవారిలోనూ నోటి దుర్వాసన వస్తుంది.ఊపిరితిత్తులకు గాయమైనా, ఊపిరితిత్తుల్లోకి దారితీసే వాయునాళాలు వ్యాకోచించినా నోటి దుర్వాసనకు దారితీసే అవకాశాలు ఉంటాయి. ఈ కండిషన్‌ను ‘బ్రాంకియాక్టాసిస్’ అంటారు.మూత్రపిండాలు దెబ్బతిన్నట్లయితే, అవి రక్తంలోని అమోనియా వంటి వ్యర్థాలను సమర్థంగా వడపోయలేవు. అలాంటప్పుడు కూడా నోటి దుర్వాసన రావచ్చు. రక్తకణాలకు సంబంధించిన హీమోఫీలియా, అప్లాస్టిక్ అనీమియా, రక్తంలో ప్లేట్లెట్లు తగ్గడం (థ్రాంబోసైటోపీనియా) వంటి వ్యాధులు ఉన్నవారిలోనూ నోటి దుర్వాసన వస్తుంటుంది కొందరిలో ‘ట్రైమీథైల్ అమైన్’ అనే ఎంజైమ్ లోపించడం వల్ల నోటి నుంచి చేపల వాసన వస్తుంటుంది. ఇలాంటి పరిస్థితిని వైద్య పరిభాషలో ‘ట్రైమీథైల్ మెన్యూరియా’ అని, వాడుక భాషలో ఫిష్ ఆడర్ సిండ్రోమ్ అని అంటారు. గుండెజబ్బులను నివారించే యాంటీ ఏంజినల్ డ్రగ్స్ వల్ల, మూత్రవిసర్జన సాఫీగా జరిగేలా చేసే డైయూరెటిక్స్ ఔషధాల వల్ల, కేన్సర్‌ను నిరోధించే మందుల వల్ల, రేడియేషన్ థెరపీ వల్ల, నిద్రమాత్రల వల్ల కూడా నోటి దుర్వాసన వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి ఔషధాలను వాడటం వల్ల నోట్లో లాలాజలం ఉత్పత్తి తగ్గిపోయి, నోరు పొడిబారిపోతుంది. దీన్నే ‘జీరోస్టోమియా’ అంటారు. అత్యంత అరుదుగా టాన్సిల్స్‌లో రాళ్లు ఏర్పడిన సందర్భాల్లో కూడా నోటి దుర్వాసన వస్తుంది.నోటి దుర్వాసన సమస్య సాధారణ బరువుతో ఉండేవారి కంటే స్థూలకాయుల్లోనే ఎక్కువగా ఉంటున్నట్లు నిపుణులు గుర్తించారు. అందువల్ల బరువు తగ్గించుకోవడం ద్వారా కూడా పరిస్థితిని అదుపు చేయవచ్చు. నివారణ మార్గాలు ఆహారం తీసుకున్న తర్వాత నోటిని శుభ్రంగా కడుక్కోవాలి. {పతిరోజూ రెండు పూటలా సక్రమంగా పళ్లు తోముకోవాలి, నాలుకను శుభ్రం చేసుకోవాలి.ఉల్లి, వెల్లుల్లి తింటున్నట్లయితే, వాటిలో ఉండే గంధకం వల్ల దాదాపు 48 గంటల సేపు నోటి దుర్వాసన వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండటం మంచిది.మసాలాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల వల్ల కూడా ఇదే పరిస్థితి తలెత్తుతుంది. అందువల్ల వీటి వాడకాన్ని పరిమితం చేసుకోవాలి. కొందరికి నోటి దుర్వాసన ఉన్నా, ఆ విషయం వారికి తెలియకపోవచ్చు. అలాంటప్పుడు వారి కుటుంబ సభ్యులు లేదా సన్నిహితులు వారిని వైద్యుల వద్దకు తీసుకుపోయి, తగిన చికిత్స పొందేలా చేయాలి. ఆక్సిజన్ అందకపోయినా పెరిగే అనేరోబిక్ బ్యాక్టీరియా కూడా నోటి దుర్వాసనకు కారణం కావచ్చు. అలాంటప్పుడు ఇంట్రాఓరల్ స్ప్రే (నోటిని తాజాగా ఉంచే స్ప్రే) వాడటం వల్ల సమస్యను నివారించుకోవచ్చు. జింక్, క్లోరిడాక్సిన్, హైడ్రోజన్ పెరాక్సైడ్, ఆల్కహాల్ వంటి పదార్థాలు కలిగిన మౌత్‌వాష్‌లు కూడా సూక్ష్మ క్రిములను అరికట్టి, నోటిదుర్వాసనను నివారిస్తాయి.తరచుగా నీళ్లు తాగడం, సుగర్‌ఫ్రీ చూయింగ్‌గమ్స్ నమలడం కూడా నోటి దుర్వాసనను అరికడతాయి. అనుమానం పెనుభూతం నోటి దుర్వాసన లేకుండానే, ఉందేమోననే అనుమానంతో కొందరు తరచు వైద్యుల వద్దకు వెళుతుంటారు. ఇలాంటి వారు ఒక వైద్యుని సలహాతో తృప్తి పడకుండా, తరచు వైద్యులను మారుస్తుంటారు. ఇలాంటి వారికి మానసిక చికిత్స అవసరమవుతుంది. అనుమానం మరీ తీవ్రంగా లేకపోతే, ఈ పరిస్థితి నివారణకు తేలికపాటి ప్రత్యామ్నాయాలూ ఉన్నాయి. - ఇన్పుట్స్: డా. ప్రత్యూష, కన్సల్టంట్ ఓరల్ ఫిజీషియన్ అండ్ కాస్సటిక్ డెంటిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ ప్రత్యామ్నాయాలు యాలకులు వంటి సుగంధ ద్రవ్యాలను నమలడం. నోటిని తాజాగా ఉంచే బ్రిథనాల్ వంటి ఉత్పత్తులను వాడటం. టీ నుంచి సంగ్రహించే కొన్ని సహజ సిద్ధ పదార్థాలను వాడటం. చికిత్స అవసరమయ్యే పరిస్థితులు నోటి దుర్వాసనకు చికిత్స అవసరమయ్యే పరిస్థితులను టీఎన్1 నుంచి టీఎన్5 అని వైద్య నిపుణులు వర్గీకరించారు. వాటి వివరాలు... కేటగిరీ చికిత్స మార్గాలు టీఎన్-1 నోటి పరిశుభ్రత కోసం స్వీయ మార్గాలు టీఎన్-2 చిగుళ్ల సమస్య రాకుండా ముందుగానే చికిత్స తీసుకోవడం టీఎన్-3 ఫిజీషియన్ సహాయం తీసుకోవడం టీఎన్-4 దుర్వాసనకు కారణం గుర్తించి, నిపుణుల ద్వారా చికిత్స పొందడం టీఎన్-5 ఇది కేవలం అనుమానం మాత్రమే. దీనికి సైకియాట్రిస్ట్ లేదా సైకాలజిస్ట్ ఆధ్వర్యంలో ఫిజీషియన్లు చికిత్స చేస్తారు. -
గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్
ఉపవాసాలతో సమస్యలు... అధిగమించేదెలా? నా వయసు 33. మాది సంప్రదాయ కుటుంబం. నిత్యం పూజపురస్కారాలు చేస్తుంటాం. తరచూ ఉపవాసాలుంటాం. ఈమధ్య ఉపవాసం తర్వాత విపరీతమైన నీరసంతో పాటు కళ్లు తిరుగుతున్నాయి. గుండెల్లో మంట. డాక్టర్‌కు చూపిస్తే జీర్ణకోశంలో అల్సర్స్ అని అన్నారు. ఉపవాసాలు వద్దని సలహా ఇచ్చారు. అల్సర్లకు మందులు వాడుతున్నాను. ఉపవాసాలు మానకపోతే సమస్య మరింత జటిలం అవుతుందని డాక్టర్ చెబుతున్నారు. నేనేం చేయాలి? - కె. ప్రసన్నకుమారి, ఖమ్మం ఉపవాసం వల్ల శరీరంలో జీవక్రియలు పాక్షికంగా స్తంభించిపోతాయి. దాంతో ‘బేసల్ మెటబాలిక్ రేట్’ క్షీణించిపోతుంది. దాని ప్రభావం శరీరంలోని ద్రవాల సమతుల్యతపై పడుతుంది. శరీరంలో నీటిశాతం తగ్గిపోవడంతో డీహైడ్రేషన్ బారిన పడతుంటారు. ఉపవాసం ఉన్నప్పుడు ఇంట్లోపనులు... ముఖ్యంగా శారీరక శ్రమకు దూరంగా ఉండాలి. ఎండలో తిరగకుండా జాగ్రత్తపడాలి. తరచూ ఉపవాసాలు జీర్ణవ్యవస్థపై సైతం దుష్ర్పభావం చూపుతాయి. గుండెల్లో మంట మొదలుకొని జీర్ణకోశంలో అల్సర్లు, తలనొప్పి, డీహైడ్రేషన్, మలబద్ధకం, మూత్రపిండాల్లో రాళ్లు వంటి సమస్యలు తలెల్తే అవకాశాలు ఉన్నాయి. ఉపవాసం పేరిట భోజనం మానేయడం వల్ల శరీరంలో ముఖ్యమైన పోషకాలు లోపిస్తాయి. ముఖ్యంగా విటమిన్-బి కాంప్లెక్స్ లోపం పెరుగుతుంది. మీ విషయంలో కూడా దాదాపుగా అదే జరిగింది. ఉపవాసం పేరిట మధ్యాన్నం భోజనం చేయకుండా రాత్రిపూట ఒక్కసారిగా మితిమీరి తినడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయులు ఉన్నట్లుండి పెరిగిపోతాయి. ఇన్సులిన్ వేగంగా తగ్గుతుంది. ఇది ముందుముందు డయాబెటిస్‌కు దారితీస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయులు పడిపోయినప్పుడు దాన్ని తట్టుకోవడానికి శరీరం కొన్ని రకాల హార్మోన్లను విడుదల చేస్తుంది. దాంతో రక్తపోటు పెరుగుతుంది. రక్తనాళాలు క్రమంగా కుంచించుకుపోయే ప్రమాదం ఉంది. అందువల్ల ఉపవాసం తర్వాత ఒక్కసారిగా ఎక్కువ ఆహారం తీసుకునే బదులు, ఆహారాన్ని మితంగా దఫదఫాలుగా తీసుకోవడం వల్ల జీర్ణ ప్రక్రియ సజావుగా సాగుతుంది. నూనెతో చేసిన వేపుళ్లు, మసాలాలు బాగా దట్టించిన కూరలు, బాగా వేయించిన కూరలను దూరంగా ఉంచడం వల్ల గుండెల్లో మంట తగ్గుతుంది. ఉపవాసం చేసే సమయంలో సాధ్యమైనన్ని ఎక్కువసార్లు మంచినీళ్లు తాగాలి. ఉపవాస సమయంలో సాధారణంగా ఎక్కువమంది పండ్ల రసాలు తీసుకుంటుంటారు. కానీ ఆ టైమ్‌లో పండ్లరసాలు, కూల్‌డ్రింక్స్ తీసుకోవద్దు. వీటికి బదులు కొబ్బరినీళ్లు తీసుకోవడం శ్రేయస్కరం. ఉపవాసం విరమించిన తర్వాత పీచు ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు పుష్కలంగా తీసుకోవాలి. దీనివల్ల మలబద్ధకం ఉండదు. వీలైనంతవరకు భోజనం, అల్పాహారం మానేయకుండా చూసుకోవడం మంచిది. రోజుకు 4-5 సార్లు ఆహారం తీసుకోవడం వల్ల ఆకలీ అదుపులో ఉంటుంది, పిండిపదార్థాల నుంచి లభించే చక్కెరా ఇంధనంలా అందుతుంటుంది. ఉపవాసం వల్ల అవయవాల పనితీరు దెబ్బతింటుంది. కాబట్టి అనివార్యమైతే తప్ప తరచూ ఉపవాసాలు ఆరోగ్యానికి చేటు తెస్తాయి. డాక్టర్ కె. రఘురామ్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, సోమాజీగూడ, హైదరాబాద్ -
నిద్రలో మీరు ఎందుకు నవ్వారంటే...
నవ్వుతూ నవ్వుతూనే నిద్ర నుంచి మేల్కొంటాం.‘ఇంతకీ ఎందుకు నవ్వాను’’ అని మనల్ని మనం ప్రశ్నించుకుంటాం. తాజా కలను గుర్తు తెచ్చుకుంటాం. నిజానికి, అది మామూలు కల. నవ్వాల్సినంత సీనేమి దానిలో ఉండదు. మరి ‘నవ్వు’ సంగతి ఏమిటి? కలలో నవ్వు అనేది ఆహ్లాదకరమైన మానసిక స్థితిని ప్రతిబింబిస్తుంది. ఒక సమస్యతో విపరీతంగా విసిగి వేసారి... ఎట్టకేలకు ఆ సమస్య నుంచి ‘విముక్తి’ దొరకడం కావచ్చు, పనిభారంతో ఒత్తిడికి గురవుతూ...ఆ పని పూర్తికాగానే లభించే ‘ఉపశమనం’ కావచ్చు, ఓటమి మీద ఓటమి ఎదురై...చివరికి ఊహించని అనూహ్యమైన విజయం ఎదురైనప్పుడు లభించే ‘ఆనందం’ కావచ్చు....ఇలా వివిధ రకాల ఆహ్లాదకర భావనల సమ్మేళనమే ఈ కల. ప్రేమలో పడినప్పుడు కూడా ఇలాంటి కలలు వస్తాయి. ప్రేమలోని గాఢతను ఈ నవ్వు సూచిస్తుంది. మరో కోణం ఏమిటంటే, సుఖదుఃఖాలకు అతీతమైన స్థితిలోకి చేరినప్పుడు... ఎంత పెద్ద కష్టమైనా, దుఃఖమైనా మనసు తలుపు తట్టదు. ఇక్కడ ‘నవ్వడం’ అనేది భావోద్వేగాలకు అతీతమైన ‘సమ్యక్ దృష్టి’ అనే భావనను సూచిస్తుంది. -
హైటెక్ పోలీసింగ్
నేరాల నియంత్రణకు టెక్నాలజీ వినియోగం ఇక వాట్సప్, ఫేస్‌బుక్‌ల ద్వారానే ఫిర్యాదులు వాట్సప్‌ను ప్రారంభించిన ఐజీ గోపాలకృష్ణ సేఫ్ సిటీ నినాదంతో అర్బన్ ఎస్పీ వినూత్న ప్రయత్నం మీ కేదైనా సమస్య వచ్చిందా? పోలీసు స్టేషన్‌కు వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నారా? నో ప్రాబ్లమ్.. ఈ దగ్గర మొబైల్ ఉంటే చాలు, ఫేస్బుక్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. మీరేదైనా ఆపదలో ఉంటే ఆండ్రాయిడ్ మొబైల్‌తో ఏ స్థలంలో ఉన్నారో వీడియో, ఫొటో తీసి వాట్సప్‌లో పంపితే చాలు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగుతారు. - తిరుపతి క్రైం తిరుపతి అర్బన్ జిల్లా పోలీసులు హైటెక్ టెక్నాలజీతో నగరంలో దూసుకుపోతున్నారు. నేరాలను నియంత్రించడానికి, ట్రాఫిక్‌కు క్రమబద్దీకరించడానికి సేఫ్ సిటీ నినాదంతో సెంట్రల్ మానటరింగ్ సిస్టమ్‌ను అర్బన్ జిల్లా ఎస్పీ గోపినాథ్ జెట్టి ప్రవేశపెట్టారు. ప్రజల నుంచి ఎలాంటి సమస్యలైనా, సలహాలైనా ఏదైనా తెలుసుకోడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఇటీవల చైన్ స్నాచర్స్, నేరగాళ్ళను సీసీ కెమెరాల ద్వారా గంటల వ్యవధిలోనే పట్టుకుని టెక్నాలజీ పోలీసుగా పేరుపొందారు. ఇప్పటికే పేస్‌బుక్‌ను అందుబాటులోకి తెచ్చారు. నూతనంగా బాధ్యతలు తీసుకున్న ఐజీ గోపాలకృష్ణ గురువారం వాట్సప్‌ను కూడా ప్రారంభించారు. అత్యధికంగా ఆండ్రాయిడ్ మొబైల్స్‌నే వాడుతున్నారు. ప్రతి ఒక్కరికి వాట్సప్ సౌకర్యం ఉంది. ఈ టెక్నాలజీతో పోలీసులను ప్రజల దగ్గర చేర్చడానికి పోలీసు వాట్సప్‌ను ప్రారంభించారు. దీని కోసం 8099999977 నంబర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఎక్కడైనా శాంతి భద్రతలకు ఆటంకం కలిగినా, ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరిగినా వెంటనే ఈ నంబర్‌కు జరిగిన సంఘటనను చిత్రీకరించి పంపించవచ్చు ఫేస్‌బుక్‌కు పెరిగిన ఆదరణ నగరంలో తిరుపతి పొలీసు ఫేస్‌బుక్‌కు రోజు రోజుకు ఆదరణ పెరుగుతోంది. నగరంలోని ప్రజలు నిత్యం ఫేస్‌బుక్‌ను తిలకిస్తూ నగరంలోని ట్రాఫిక్ సమస్యలు, అవాంఛనీయ ఘటనలు పోలీసులకు తెలిపేలా పోస్టు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు పోలీసులు దీనిని పరిశీలిస్తూ వచ్చిన పోస్టును, కామెంట్స్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నారు. సాధారణ ప్రజలు కూడా ఇందులో భాగస్వామ్యులై సలహాలు ఇస్తున్నారు. ఇందులో లాగిన్ అయితే ఇప్పటిదాకా జరిగిన నేరాలు, సంబంధించిన వీడియోలు ఇందులో అప్లోడ్ చేశారు. టెక్నాలజీతో నేరాలను అరికడతాం.. మనకు అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీతో నేరాలను అరికట్టేందుకు కృషి చేస్తున్నాం. ప్రజలకు, పోలీసులకు నిత్యం సంబంధాలు ఉండేలా ఫేస్బుక్, వాట్సప్ వంటి సోషల్ సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చాం. ఇప్పటికే సీసీ కెమెరాల ద్వారా ఎన్నో నేరాలను పరిష్కరించాం. ఫేస్బుక్ ప్రారంభించిన 20 రోజులకే మంచి స్పందన వచ్చింది. మరింత అడ్వాన్స్‌గా వాట్సప్‌ను కూడా ప్రారంభించాం. ఎక్కడైనా నేరాలు జరిగితే వెంటనే చిత్రీకరించి అప్లోడ్ చేయండి. మీ వివరాలను గోప్యంగా ఉంచుతాం. -అర్బన్ జిల్లా ఎస్పీ గోపీనాథ్ జెట్టి -
సముద్ర ముఖద్వారం పూడికతీతకు కృషి
వాకాడు: తూపిలిపాళెం సమీపంలో పూడిపోయిన సముద్రపు ముఖద్వారంలో పూడిక తీయించేందుకు కృషి చేస్తానని తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాద్‌రావు తెలిపారు. శనివారం సాయంత్రం తూపిలిపాళెంలో మత్స్యకారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంత మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఎవరికీ సమాచారం లేకుండా వచ్చానన్నారు. ప్రజా సేవకే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ఈ సందర్భంగా మత్స్యకారులు పలు సమస్యలను ఎంపీ దృష్టికి తెచ్చారు. స్పందించిన ఎంపీ మత్స్యకారులు సముద్రంలో వేటాడిన మత్స్యసంపదను సులభంగా గ్రామానికి తరలించేందుకు సముద్రపు ఒడ్డున 1.5 కిలోమీటర్ల దూరం రోడ్డు నిర్మాణానికి తన ఎంపీ నిధులను కేటాయిస్తానని హామీ ఇచ్చారు. ఫిష్ ల్యాండింగ్ సెక్షన్ నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. గ్రామంలో తాగునీరు, విద్యుత్, రేషన్‌కార్డులు, పక్కా గృహాలు, పింఛన్లు తదితర మౌలిక సదుపాయలను ఆయాశాఖల అధికారులతో చర్చించి మంజూరు చేయిస్తానన్నారు. విపత్తులు సంభవించినప్పుడు మత్స్యకారులు, ఈ ప్రాంత ప్రజలు తలదాసుకునేందుకు నూతన తుఫాన్ షెల్టర్ నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. కోట మండలంలోని మత్స్యకారులు వాయిలదొరువు వద్ద తోళ్ల పరిశ్రమను నిలిపి వేయాలని ఎంపీని కోరడంతో ఈ విషయంపై కలెక్టర్‌కు లేఖ రాశామన్నారు. జమిన్కొత్తపాళెం పంచాయతీలో మత్స్యకారులను వేరు చేసి తూపిలిపాళెం, పాతేటిపాళెం గ్రామాలను ఒక పంచాయతీగా ఏర్పాటు చేయాలని గ్రామస్తులు ఎంపీని కోరారు. అనంతరం సముద్ర పరిసర ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పెద్దకాపు గోపాల్, రెండో కాపు వాటంగారి వెంకటరమణయ్య, మూడోకాపు కోటేశ్వరరావు, సర్పంచ్ లత, మహేంద్ర, అడపాల ఏడుకొండలు, దూడల సుధీర్, మోహన్ పాల్గొన్నారు.