సముద్ర ముఖద్వారం పూడికతీతకు కృషి
వాకాడు: తూపిలిపాళెం సమీపంలో పూడిపోయిన సముద్రపు ముఖద్వారంలో పూడిక తీయించేందుకు కృషి చేస్తానని తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాద్‌రావు తెలిపారు. శనివారం సాయంత్రం తూపిలిపాళెంలో మత్స్యకారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంత మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఎవరికీ సమాచారం లేకుండా వచ్చానన్నారు. ప్రజా సేవకే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ఈ సందర్భంగా మత్స్యకారులు పలు సమస్యలను ఎంపీ దృష్టికి తెచ్చారు.
స్పందించిన ఎంపీ మత్స్యకారులు సముద్రంలో వేటాడిన మత్స్యసంపదను సులభంగా గ్రామానికి తరలించేందుకు సముద్రపు ఒడ్డున 1.5 కిలోమీటర్ల దూరం రోడ్డు నిర్మాణానికి తన ఎంపీ నిధులను కేటాయిస్తానని హామీ ఇచ్చారు. ఫిష్ ల్యాండింగ్ సెక్షన్ నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. గ్రామంలో తాగునీరు, విద్యుత్, రేషన్‌కార్డులు, పక్కా గృహాలు, పింఛన్లు తదితర మౌలిక సదుపాయలను ఆయాశాఖల అధికారులతో చర్చించి మంజూరు చేయిస్తానన్నారు. విపత్తులు సంభవించినప్పుడు మత్స్యకారులు, ఈ ప్రాంత ప్రజలు తలదాసుకునేందుకు నూతన తుఫాన్ షెల్టర్ నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. కోట మండలంలోని మత్స్యకారులు వాయిలదొరువు వద్ద తోళ్ల పరిశ్రమను నిలిపి వేయాలని ఎంపీని కోరడంతో ఈ విషయంపై కలెక్టర్‌కు లేఖ రాశామన్నారు. జమిన్‌కొత్తపాళెం పంచాయతీలో మత్స్యకారులను వేరు చేసి తూపిలిపాళెం, పాతేటిపాళెం గ్రామాలను ఒక పంచాయతీగా ఏర్పాటు చేయాలని గ్రామస్తులు ఎంపీని కోరారు. అనంతరం సముద్ర పరిసర ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పెద్దకాపు గోపాల్, రెండో కాపు వాటంగారి వెంకటరమణయ్య, మూడోకాపు కోటేశ్వరరావు, సర్పంచ్ లత, మహేంద్ర, అడపాల ఏడుకొండలు, దూడల సుధీర్, మోహన్ పాల్గొన్నారు.