‘నామ్’లో సాంకేతిక లోపాల పరిశీలన
Published Mon, Oct 17 2016 11:40 PM | Last Updated on Mon, Sep 4 2017 5:30 PM
సుభాష్‌నగర్:
జాతీయ వ్యవసాయ మార్కెట్ (నామ్)లో తలెత్తిన సాంకేతిక లోపాలను ఢిల్లీ నుంచి వచ్చిన ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎల్ బృందం సోమవారం పరిశీలించింది. 27రోజులుగా నామ్ సర్వర్ డౌన్ కావడంతో మార్కెట్‌లో క్రయ, విక్రయాల్లో తీవ్ర జాప్యం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని మార్కెట్ కమిటీ సెక్రటరీ సంగయ్య ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రోజురోజుకూ సమస్య తీవ్రం కావడంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. అయినప్పటికీ ఓ కొలిక్కి రాకపోవడంతో మార్కెటింVŠ Sశాఖ మంత్రి హరీశ్‌రావు కేంద్ర ప్రభుత్వం, ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎల్ ప్రతినిధులను నేరుగా సంప్రదించారు. దీంతో ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎల్ ఆలిండియా టెక్నికల్ ఆఫీసర్ ఆనంద్ శర్మ నేతృత్వంలో 10మందితో కూడిన సాంకేతిక అధికారులు సోమవారం ఉదయం మార్కెట్ యార్డుకు చేరుకున్నారు. సమస్య మీదంటే.. మీది అని మార్కెట్ అధికారులు.. ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎల్ ప్రతినిధులు వాగ్వాదానికి దిగారు. ఉదయం నుంచి మార్కెట్ యార్డులోని 10 క్యాబిన్లలో బృందం సభ్యులు కూర్చొని పర్యవేక్షించారు. సమస్య ఎక్కడుందనేది తెలుసుకునేందుకు కొంత సమయం కావాలని, 3–4 రోజులు బృందం సభ్యులు అక్కడే ఉంటారని, సమస్య పరిష్కరించిన తర్వాతే వెళ్తారని నామ్ జిల్లా ఇన్‌చార్జి ఎల్లన్న తెలిపారు. మార్కెటింగ్ కమిషనర్ కార్యాలయం ప్రోగ్రామింగ్ ఆఫీసర్ ప్రవీణ్‌కుమార్, మార్కెట్‌కమిటీ సెక్రటరీ సంగయ్య, డీఎంవో రియాజ్ తదితరులు వారి వెంట ఉన్నారు.
Advertisement