దేశరాజధాని ఢిల్లీలో కాలుష్య సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. తాజాగా కృత్రిమ వర్షాలు కురిపించే యోచనతో ఢిల్లీ ప్రభుత్వం.. ఐఐటీ కాన్పూర్‌ను సంప్రదించింది. ఈ నేపధ్యంలో ఐఐటీ కాన్పూర్ అందించిన ప్రతిపాదనను శుక్రవారం సుప్రీంకోర్టుకు సమర్పించనుంది.
ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ మాట్లాడుతూ కాలుష్యాన్ని తగ్గించేందుకు కృత్రిమ వర్షపాతం ఎంతో ప్రభావవంతంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారన్నారు. కృత్రిమ వర్షం కురిపించాలంటే కనీసం 40 శాతం మేరకు మేఘాలు ఆవరించాలని, నవంబర్ 20, 21 తేదీల్లో ఇటువంటి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని ఐఐటీ కాన్పూర్ బృందం తెలిపిందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు వస్తే కేంద్ర ప్రభుత్వ అనుమతి కూడా తీసుకుని కృత్రిమ వర్షాలు కురిపించే ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు.
ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ వర్షాలపై పలు పరిశోధనలు జరుగుతున్నాయి. కృత్రిమ వర్షాలు కురిపించేందుకు సిల్వర్ అయోడైడ్‌ను ఆకాశంలో స్ప్రే చేయాల్సివుంటుంది. ఇది విమానం సహాయంతో ఆకాశంలో జరుగుతుంది. సిల్వర్ అయోడైడ్ అనేది మంచు లాంటిది. దీని కారణంగా తేమతో కూడిన మేఘాలలో నీటి పరిమాణం పెరుగుతుంది. ఫలితంగా ఈ మేఘాల నుండి వర్షం కురుస్తుంది. దీనినే క్లౌడ్ సీడింగ్ అని కూడా అంటారు.
ఇది కూడా చదవండి: 2100 నాటికి ప్రపంచ జనాభాలో భారీ తగ్గుదల?
Comments
Please login to add a commentAdd a comment