
ఢిల్లీ: గత కొద్దిరోజులుగా కేంద్రం, తమిళనాడు ప్రభుత్వం మధ్య మాటల యుద్దమే నడుస్తోంది. హిందీ భాష అమలు చేయడంపై కూడా నేతలు వాదించుకుంటున్నారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి ధరేంద్ర ప్రధాన్ సీఎం స్టాలిన్‌కు కౌంటరిచ్చారు. విద్యార్థులపై ఏ భాషనూ బలవంతంగా రుద్దడం లేదు అంటూ వ్యాఖ్యలు చేశారు.
జాతీయ విద్యా విధానంపై కేంద్రమంత్రి ధరేంద్ర ప్రధాన్ తాజాగా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్బంగా ధర్మేంద్ర ప్రధాన్.. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020 భాషా స్వేచ్చ సూత్రాన్ని సమర్థిస్తుంది. విద్యార్థులపై బలవంతంగా ఏ భాషనూ బలవంతంగా రుద్దడం లేదు. విద్యార్థులు తమకు నచ్చిన భాషను నేర్చుకోవచ్చు. దాన్ని కొనసాగించేలా ఈ పాలసీ ఉంది. ఇదే సమయంలో విదేశీ భాషపై అతిగా ఆధారపడటం వల్ల విద్యార్థులు భాషాపరమైన మూలాలను తెలుసుకోకుండా పరిమితం చేసినట్లవుతుంది.
తమిళనాడు ప్రభుత్వం కేవలం రాజకీయ కారణాల వల్లే కొత్త పాలసీని వ్యతిరేకిస్తోందన్నారు. ప్రగతిశీల సంస్కరణలను రాజకీయాలతో ముడిపెట్టవద్దని సూచించారు. అలాగే, 2022లోనే ప్రధాని మోదీ తమిళ భాష శాశ్వతం అనే వ్యాఖ్యలు చేసినట్టు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పటికైనా విద్యను రాజకీయం చేయడం వంటి పనులు మానుకోవాలని పేర్కొన్నారు.
ఇక, అంతకుముందు ప్రధాని మోదీకి సీఎం స్టాలిన్ లేఖ రాశారు. సమగ్రశిక్షా పథకం కింద రాష్ట్రానికి రూ.2,152 కోట్ల నిధులను వెంటనే మంజూరు చేయాలని స్టాలిన్ కోరారు. జాతీయ విద్యా విధానం-2020ని పూర్తిగా అమలు చేసి త్రిభాషా విధానాన్ని ఆమోదించే వరకు తమిళనాడుకు సమగ్ర శిక్షా పథకం కింద నిధులు మంజూరు చేయమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ఇటీవల వెల్లడించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇది రాష్ట్రంలోని విద్యార్థులు, రాజకీయ పార్టీలు, ప్రజల మధ్య ఆవేదన, ఆక్రోశం కలిగించిందని తెలిపారు. తమిళనాడులో చాలాకాలంగా ద్విభాషా విధానమే ఉందన్నారు. దాన్ని ఆచరించడంలో రాష్ట్రం దృఢంగా ఉందని పేర్కొన్నారు. అధికారిక భాషా నిబంధన 1976లో పేర్కొన్న మేరకు అధికార భాషా చట్టం 1963 హెచ్ అమలు చేయడం నుంచి రాష్ట్రానికి మినహాయింపు కల్పించడాన్ని గుర్తు చేశారు.
Highly inappropriate for a State to view NEP 2020 with a myopic vision and use threats to sustain political narratives.
Hon’ble PM @narendramodi ji’s govt. is fully committed to promote and popularise the eternal Tamil culture and language globally. I humbly appeal to not… pic.twitter.com/aw06cVCyAP— Dharmendra Pradhan (@dpradhanbjp) February 21, 2025
ఒక రాష్ట్రంలోని కాలపరిస్థితులను అనుసరించే విధానాలకు వ్యతిరేకంగా ఆ రాష్ట్రాన్ని నిర్బంధించడానికి, నిధులు అందించే వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చే ఇలాంటి ప్రయత్నం సమాఖ్య పాలనాతత్వాన్ని అతిక్రమించే చర్యగా పేర్కొన్నారు. సమగ్ర శిక్షా పథకం కింద నిధులు మంజూరు చేయకపోతే ఉపాధ్యాయులకు వేతనం, విద్యార్థులకు సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు దెబ్బతింటాయన్నారు. అందుకే నిధులు విడుదల చేయడానికి చర్యలు చేపట్టాలని కోరారు.
ఇదిలాఉండగా.. ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యలపై ఉదయనిధి స్టాలిన్ మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం హిందీని రుద్దడం కొనసాగిస్తే, ప్రధాని తమిళనాడు పర్యటనకు వచ్చినప్పుడు 'గో బ్యాక్ మోదీ' కి బదులుగా 'గెట్ అవుట్ మోదీ' నినాదాలు ఎదుర్కోవలసి వస్తుందని ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల కారణంగా తమిళనాడులో రాజకీయం మరింత హీటెక్కింది. బీజేపీ నేతలు డీఎంకే నేతలపై మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment