న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీతో పాటు ఉత్తర భారతదేశం అంతటా చలి వాతావరణం నెలకొంది. ఉదయం, సాయంత్రం వేళల్లో ఉష్ణోగ్రతల్లో భారీ తగ్గుదల కనిపిస్తోంది. ఢిల్లీలో కాలుష్యం కారణంగా అక్కడి ప్రజలకు స్వచ్ఛమైన గాలి అందడం లేదు. మరోవైపు కొండ ప్రాంతాల్లో మంచు కురుస్తోంది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది.
ఈరోజు(మంగళవారం) ఉదయం ఢిల్లీలో అంతటా పొగమంచు కమ్మేసింది. గరిష్ట ఉష్ణోగ్రత 26, కనిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెల్సియస్‌గా ఉండే అవకాశాలున్నాయి. నవంబర్ 27 నుండి డిసెంబర్ ఒకటి వరకు ఏర్పడే వాతావరణం విషయానికి వస్తే గరిష్ట ఉష్ణోగ్రత 25, కనిష్టంగా 10 డిగ్రీల వరకు ఉండవచ్చు. నవంబర్ 28, 29 తేదీలలో పొగమంచు కమ్మేయనున్న దృష్ట్యా ఎల్లో అలర్ట్ జారీచేశారు. అ సమయంలో వర్షాలు కురిసే అవకాశం కూడా లేదు.
ఢిల్లీకి ఆనుకుని ఉన్న పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో కూడా చలి మొదలైంది. నవంబర్ 27, 28, 29 తేదీలలో ఉదయం వేళ పొగమంచు కమ్మేయనుంది. చండీగఢ్‌లో ఫాగ్ అలర్ట్ ఉంది. ఈ రోజు హర్యానాలో గరిష్ట ఉష్ణోగ్రత 26-27 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 11-12 డిగ్రీల సెల్సియస్‌గా ఉండనుంది. పంజాబ్‌లో ఈరోజు గరిష్ట ఉష్ణోగ్రత 25-26 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 10-11 డిగ్రీల మధ్య ఉండనుంది.
జమ్మూ కాశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రత -2 నుండి -3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతోంది. ఈరోజు జమ్మూలో కనిష్ట ఉష్ణోగ్రత 10 డిగ్రీలుగా ఉంది. ఈ పరిస్థితి నవంబర్ 29 వరకు కొనసాగనుంది. రాజస్థాన్‌లో కూడా చలి అధికంగానే ఉంది. ఉత్తరప్రదేశ్‌లో పొగమంచు కురిసే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: 11 గంటలు లేటుగా వందేభారత్.. ప్రయాణికుల ఆందోళన
Comments
Please login to add a commentAdd a comment