ఆసనాల్లో రాణింపు...
సర్వాంగాసన
ఆసనంలో వెల్లకిలా పడుకుని చేతులు రెండూ శరీరానికి ఇరువైపులా ఉంచాలి. అరచేతులు భూమిమీద నొక్కుతూ రెండు పాదాలను, మోకాళ్లను కలిపి ఉంచి శ్వాస తీసుకుంటూ రెండు కాళ్లను నెమ్మదిగా పైకిలేపి 90 డిగ్రీల కోణంలోకి తీసుకు రావాలి. తర్వాత కాళ్లను ఇంకా తలవైపునకు తీసుకువెళుతూ నడుముకి రెండు చేతులతో సపోర్ట్ ఉంచి నడుమును, పిరుదులను ఇంకా పైకి లేపి వీపు మధ్య భాగానికి చేతులతో సపోర్ట్ ఉంచి భుజాలు మెడ మీద శరీరం మొత్తాన్ని పైకి గాలిలోకి లేపే ప్రయత్నం చేయాలి. పూర్తి ఆసన స్థితిలోకి వచ్చిన తర్వాత స్ట్రెచ్ చేసిన పాదాలను కొంచెం రిలాక్స్‌డ్‌గా సమంగా ఉంచాలి. ఈ స్థితిలో గడ్డం ఛాతీ భాగాన్ని అదుముతూ ఉంటుంది. ఆసనంలో స్థిరంగా సాధారణ శ్వాసలు 5 లేదా 10 తీసుకుని అంటే సుమారు రెండు లేదా మూడు నిమిషాల పాటు ఉన్నట్లయితే రక్త ప్రసరణ తలవైపునకు ఎక్కువగా ఉండి క్రేనియల్ నెర్వస్ సిస్టమ్‌కి లాభం చేకూరుతుంది. ఆసనం మీద పట్టు ఉన్నట్లయితే సర్వాంగాసనంలో రెండు కాళ్లు పైన పక్కలకు సెపరేట్ చేయవచ్చు. ఒకకాలు ముందుకు ఒక కాలు వెనుకకు ఆల్టర్నేటివ్‌గా కదలించవచ్చు. సైక్లింగ్ చేయవచ్చు.
మరింత ఫ్లెక్సిబులిటీ ఉంటే...
నడుము, వెన్నెముకలో మరింత ఫ్లెక్సిబులిటీ ఉన్నట్లయితే పద్మాసనంలో కఠినమైన (వేరియంట్-1, వేరియంట్-2) సాధన చేయవచ్చు. సర్వాంగాసనంతోనే పద్మాసనం కూడా వేయవచ్చు. ఆ పద్మాసనాన్ని తల దగ్గరకు, నుదురు మీదకు ఇంకా వీలైతే తలవెనుక నేల మీదకు రెండు మోకాళ్లు సమంగా ఆనేటట్టుగా కూడా సాధన చేయవచ్చు. సర్వాంగాసనంలో నుంచి తిరిగి వెనుకకు వచ్చేటప్పుడు చేతులు రెండింటినీ నడుముకి సపోర్ట్‌గా ఉంచి కాళ్లు రెండూ నెమ్మదిగా నేల మీదకు తీసుకురావాలి. సీనియర్ సాధకులు చేతులు రెండూ నడుముకి సపోర్ట్‌గా ఉంచి పాదాలు మాత్రమే నేల మీద ఉంచి సేతు బంధనాసనంలోకి (బ్రిడ్జి పోస్చర్) రాగలుగుతారు. లేదా వెనుకకు హలాసనంలోకి తర్వాత ముందుకి సేతు బంధాసనంలోకి రాగలుగుతారు. మెడ భుజాల మీద భారం పడుతుంది కాబట్టి, దీని తర్వాత మత్స్యాసనం చేసినట్లయితే మెడ కండరాలు రిలాక్స్ అవుతాయి.
ఉపయోగాలు
క్రేనియల్ నెర్వస్ సిస్టమ్‌కి ఉపయుక్తం. థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్లు ముఖ్యంగా హైపోథైరాయిడ్ సమస్యకి పరిష్కారం. రెండు, మూడు నిమిషాలు లేదా అంతకన్నా ఎక్కువ సమయం ఉన్నట్లయితే కిడ్నీకి, అడ్రినలిన్ గ్లాండ్స్‌కి మంచిది. భావోద్వేగాలను అదుపులో ఉంచుతుంది. మలబద్ధకం, నిద్రలేమితనం, వెరికోస్ వెయిన్‌స, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, ఇన్‌గ్యునల్ హెర్నియా సమస్యలున్నవారికి ఉపయుక్తం.
కుర్చీ ఆసరాతో...
ఫొటోలో చూపిన విధంగా చేయలేని నూతన సాధకులు చేతులున్న ప్లాస్టిక్ కుర్చీని ఆధారం చేసుకుని చేయవచ్చు. ఆసనంలో వెల్లకిలా పడుకుని తర్వాత కుర్చీని యోగా మ్యాట్ మీద నడుముకి దగ్గరగా ఉంచి రెండు చేతులతో కింద కుర్చీ కాళ్లను పట్టుకుని శరీరానికి దగ్గరగా కుర్చీని లాగుతూ సీటును కుర్చీ సీటు కన్నా పైకి తీసుకువెళుతూ కాళ్లు రెండింటిని నిటారుగా ఉంచవచ్చు. లేకపోతే కాళ్లు రెండూ కలిపి స్ట్రెయిట్‌గా ఉంచుతూ కుర్చీ బ్యాక్ రెస్ట్‌పై భాగంలో ఉంచవచ్చు. మెడ, భుజం మీద భారం ఎక్కువగా ఉన్నట్లనిపిస్తే పలచని దిండుని ఉపయోగించవచ్చు.
అన్ని అంగాలకు మంచిది కనుక సర్వాంగాలూ ఉత్తేజితం చెందుతాయి కనక దీనికి సర్వాంగాసనం అని పేరు వచ్చింది. ఆసనంలో అన్నింటికంటే రాణి వంటి ఆసనం ఇది. ఆసనాలన్నింటిలోకి తొలి ఉత్తమ ఆసనం శీర్షాసనం అయితే దాని తర్వాత స్థానం ఇది. (శీర్షాసనం గురించి వచ్చేవారం)
ఎ.ఎల్.వి కుమార్ ట్రెడిషనల్
యోగా ఫౌండేషన్