ఆరోగ్యానికి ఆసరా
యోగా
ఆరోగ్యానికి చేయూత నిచ్చేది యోగా. అలాంటి యోగా చేస్తున్నప్పపుడు తొలి దశలో కఠినంగా అనిపించని ఆసనాలు వేస్తాం. అలాంటి ఆసనాలు వేయడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటే కుర్చీని ఆసరాగా తీసుకోవచ్చు.
నటరాజాసన
తీరుగా నిలుచుని చేతుల్ని శరీరానికి పక్కగా ఉంచాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ కుడికాలిని వంచి, కుడికాలి చీలమండను లేదా కుడికాలి బొటనవేలిని కుడి చేత్తో పట్టుకోవాలి. వీలైనంత వరకూ కుడికాలిని పైకి ఎత్తాలి. తర్వాత ఎడమచేతిని ముందుకు చాచాలి. ఇలా 3 నుంచి 5 సాధారణ శ్వాసల పాటు ఉండి, నిదానంగా పూర్వ స్థితికి రావాలి. అదే విధంగా తర్వాత ఎడమకాలితో కూడా చేయాలి. దీని వల్ల కాళ్లు, చీల మండలు, తుంటి భాగం శక్తిమంతమవుతాయి. తొడల్లో కొవ్వు తగ్గడానికి, ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగు పడడానికి, మూత్ర విసర్జన వ్యవస్థ పనితీరు మెరుగుదలకు, ఉదర కండరాలు పటిష్ఠం కావడానికి సహకరిస్తుంది. జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఇది నిజానికి కఠినమైన ఆసనం. యోగాసనాల సాధనలో పరిణతి సాధించిన వారు వేయతగినది. అయితే కొన్ని చికిత్సా సందర్భాల్లో ఇది చేయవలసి వచ్చినప్పుడు ఇదే ఆసనాన్ని కుర్చీ ఆసరాగా చేయించవచ్చు.
ఉత్కటాసన 1: కాళ్లు రెండూ కలిపి ఉంచి సమస్థితిలో నిలుచోవాలి. చేతులు రెండూ ముందుకు చాపి శ్వాస వదులుతూ (మోకాళ్లపై ఎక్కువ భారం పడకుండా) నడుం కింది భాగాన్ని వెనుకకు కొంచెం కొంచెంగా కిందకు తీసుకురావాలి. ఒకట్రెండు సాధారణ శ్వాసలు తీసుకుంటూ పైకి లేచి తిరిగి సమస్థితిలో నిలబడాలి. శరీరం బరువు మోకాళ్లు, తొడల మీద కాకుండా నడుం మీద పడేలా చూసుకోవాలి. ఈ ఆసనంతో తొడల్లో కొవ్వు కరుగుతుంది.
ఉత్కటాసన 2: (కుర్చీ సాయంతో) సమస్థితిలో నిలబడి చేతులు ముందుకు చాపి శ్వాస వదులుతూ సీటును కిందకు తీసుకువచ్చి, మళ్లీ శ్వాస తీసుకుంటూ పైకిలేచి నిలుచోవాలి. ఈ విధంగా ఈ ఆసనాన్ని 5 లేక 6 సార్లు చేయవచ్చు. దీనివల్ల మోకాళ్లు, తొడలకు రక్తప్రసరణ బాగా జరిగి బలంగా తయారవుతాయి. పై రెండు ఆసనాలు అనంతరం వేయాల్సిన మరో ఆసనం ఉంది. అదే...
ఉత్కటాసన 3: సమస్థితిలో నిలబడి కాలి మడమలు కలిపి పాదా లను వై ఆకారంలో ఉంచి రెండు చేతులను కిందకి ఉంచి ఇంటర్‌లాక్ చేసి మోకాళ్లు బయటకు మడుస్తూ వీలైనంత కిందకు కూర్చోవాలి. ఒకటి లేదా రెండు సాధారణ శ్వాసల తర్వాత శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పైకి నిలబడాలి. ఈ విధంగా కిందకు కూర్చుంటూ పైకి లేస్తూ 5 నుంచి 10 సార్లు చేయవచ్చు. సయాటికా సమస్య ఉన్న వారికి నొప్పిని తగ్గిస్తుంది. వెన్నముకను బలంగా తయారు చేస్తుంది. పాదాలకు రక్తప్రసరణ సజావుగా జరిగేలా సహకరిస్తుంది.
ఎ.ఎల్.వి కుమార్ ట్రెడిషనల్
యోగా ఫౌండేషన్