పొట్ట చెక్కలు... | yoga good for health | Sakshi
Sakshi News home page

పొట్ట చెక్కలు...

Published Wed, Jul 19 2017 11:07 PM | Last Updated on Tue, Sep 5 2017 4:24 PM

పొట్ట చెక్కలు...

పొట్ట చెక్కలు...

అసలు పొట్ట దగ్గర కొవ్వు ఎందుకు పెరుగుతుంది? యోగాసనాలతో దానిని తగ్గించవచ్చా? అయితే ఎలాంటి ఆసనాలు వేయాలి? ఈ ప్రశ్నలకు సమాధానాలివి...

ఫ్యాట్‌కు కారణాలివే...
తీసుకునే క్యాలరీల కంటే ఖర్చుపెట్టే క్యాలరీలు తక్కువగా ఉండడం ఊబకాయానికి మొదటి కారణం. తగినంత శారీరక శ్రమ లేకపోవడం వల్ల క్యాలరీలు ఖర్చుకావు. ఒకవేళ జీవక్రియ తక్కువగా ఉన్నా కూడా క్యాలరీలు ఖర్చుకావు. అంటే కణంలో ఉండే మైట్రోకాండ్రియా ప్రతి గ్లూకోజు మాలిక్యూర్‌ని 38 (34+2+2) ఎటిపి మాలిక్యూల్స్‌గా మార్చగలిగినపుడు తీసుకున్న క్యాలరీలన్నీ పూర్తిగా ఖర్చవుతాయి. ఒకవేళ కన్వర్షన్‌ రేట్‌ తక్కువగా ఉన్నట్లయితే అది కొవ్వు కింద మారుతుంది. పురుషులలో పొట్ట చుట్టూ, స్త్రీలలో తొడలు భుజాలలోకి  చేరుతుంది. పొట్ట చుట్టుకొలత 36 అంగుళాలు అంతకన్నా మించినట్లయితే దానిని ఒబేసిటీ కింద పరిగణించవలసి వస్తుంది.జన్యుపరమైన కారణాలతో ఆకలి, జీవక్రియలోనూ మార్పులు సంభవించి ఊబకాయానికి కారణమవుతుంది. కొన్ని అనారోగ్య పరిస్థితులు అంటే థైరాయిడ్, పిసిఒడి సమస్యల వల్ల కూడా బరువు పెరగవచ్చు.

ఈ సమస్యలు అదనం...
ఈ ఊబకాయం మరికొన్ని సమస్యలకు దారితీస్తుంది. వాటిలో నిద్రలేమి, సిఒపిడి, ఊపిరితిత్తుల పనితీరు సమస్యలకు, కరోనరీ ఆర్టరీ వ్యాధికి, మధుమేహం, డిప్రెషన్, జిఇఆర్‌డి, అధిక రక్తపోటు, హై కొలస్ట్రాల్, ఆర్ధరైటిస్, స్ట్రోక్‌..లకు దారితీస్తుంది. ఆహారంలో మార్పులు చేయడం చాలా ముఖ్యం. రాత్రి పూట తీసుకునే ఆహారమే ఈ రోజులలో ఊబకాయానికి ముఖ్యకారణం. రాత్రి భోజనం మీద నియంత్రణ ఉంటే అంటే కేవలం పండ్లు, కాయగూరల సలాడ్స్‌ తీసుకున్నట్లయితే లేదా రాత్రి సమయం 8 గంటల తరువాత పిండిపదార్థాలను పూర్తిగా మానడం ఒక మార్గం. దీనితో పాటు  యోగాసనాలను రెగ్యులర్‌గా సాధన చేయడం వలన కూడా ఊబకాయం తగ్గించవచ్చు. అలాంటి ఆసనాలలో కొన్ని....ఇవి

1. చాలన అర్ధధనురాసన
ముందు మకరాసనంలో విశ్రాంతిగా బోర్లాపడుకుని శ్వాసతీసుకుంటూ కాళ్లు రెండు దగ్గరకు తీసుకువచ్చి, చేతులు ముందుకు తీసుకురావాలి. తిరిగి శ్వాస వదుల్తూ చేతులు రెండు పక్కల నుండి (ఈత కొట్టేటప్పుడు నీటి అలలను ఎలాగైతే పక్కకు రెండు చేతులతో నెడతామో అలాగ) వెనుకకు తీసుకువెళ్ళి శ్వాసతీసుకుంటూ కాళ్లు రెండూ తొడలు పైకి లేపి ఛాతీని పైకి లేపుతూ వీలైతే రెండు చేతులను వెనుక లాక్‌ చేయవచ్చు. ఈ సెట్‌ కనీసం పది సార్లు చేయాలి. స్టెప్‌ –ఎ (మకరాసన); స్టెప్‌–బి (అధోముఖ సానాసన); స్టెప్‌–సి (శలభాసన)

2 ఎల్బో ప్లాంక్‌
ఫొటోలో చూపిన విధంగా మోచేతులు కాలివేళ్ళ సపోర్ట్‌తో శరీరాన్ని శ్వాసతీసుకుంటూ పైకి లేపి 3 లేదా 5 సాధారణ శ్వాసల తరువాత శ్వాస వదులుతూ తిరిగి కిందకు మకరాసనంలో విశ్రాంతి తీసుకోవాలి. ఇది 5 సార్లు చేయాలి.

3. చాలన కపోతాసనం
చేతుల సపోర్ట్‌తో కాళ్లు మడచి శ్వాస తీసుకుంటూ ఛాతీ భాగం వీలైనంత పైకి, మోచేతులు పూర్తిగా ఓపెన్‌ చేసి శ్వాస వదులుతూ తిరిగి కిందకు వచ్చి మకరాసనంలో విశ్రాంతి పొందాలి. ఈ విధంగా 10 సార్లు చేయాలి.


4. చాలన ఉత్కటాసన
సమస్థితిలో నిలబడి చేతులు రెండూ ఇంటర్‌లాక్‌ చేసి పాదాలను వీలైనంత అనువైన దూరంలో ఉంచి శ్వాస వదులుతూ మోకాళ్లను పక్కకు ఓపెన్‌ చేస్తూ కిందకు కూర్చుని శ్వాస తీసుకుంటూ మళ్ళీ పైకి లేపాలి. ఈ విధంగా 5 నుండి 10 సార్లు చేయాలి. మోకాలు సమస్య ఉన్నవాళ్లు జాగ్రత్తగా చేయాలి. సమస్య మరీ ఎక్కువగా ఉన్నటయితే ఈ ఆసనాన్ని చేయకుండా ఉండటం మంచిది. వీటితో పాటు చక్రాసన, పశ్చిమోత్తానాసన, చక్కీచాలనాసన, నావబాలనాసన.. వంటి ఆసనాలు కపాలభాతి, భస్త్రిక వంటి ప్రాణాయామాలు చేయడం వలన కూడా ఈ సమస్యను పరిష్కరించవచ్చు.
ఎ.ఎల్‌.వి కుమార్‌
ట్రెడిషనల్‌ యోగా ఫౌండేషన్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement