ఫ్యాట్ టు ఫిట్
యోగా
అధోముఖ సావాసన
వేరియంట్–1
ముఖ్యంగా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును కరిగించడానికి ఈ ఆసనం ఉపయోగపడుతుంది. ధనురాసనానికి, శలభాసనానికి రెసిపిరేటరీగా చేసే ఆసనాల క్రమంలో చేయడం జరుగుతుంది.
చేసే విధానం: కుర్చీ సీటు ఆర్మ్స్ మధ్యలో నుంచి కుడి కాలును, ఎడమ కాలుని పోనించి కుర్చీ చివరి భాగానికి సీటును తీసుకువెళ్ళి సౌకర్యవంతంగా ముందుకు వంగాలి. రెండు అరిచేతులను నేల మీద ఉంచి ఆ సపోర్ట్‌తో సీటుని ఇంకా లోపలికు నెట్టి, పొట్ట భాగం కుర్చీ అంచుకి ప్రెస్ చేస్తూ శ్వాస తీసుకోవాలి. చేతులు రెండూ శరీరం పక్కన ఉంచి 3 లేదా 5 శ్వాసల తరువాత శ్వాస వదులుతూ అరిచేతులు నేల మీద ఉంచాలి.
వేరియంట్ –2
శ్వాస తీసుకుంటూ చేతులు రెండూ పక్కలకు 180 డిగ్రీల కోణంలో ఉంచాలి. 3 లేదా 5 శ్వాసల తరువాత శ్వాస వదులుతూ తిరిగి అరిచేతులు నేలమీద ఉంచాలి. విశ్రాంతస్థితిలో 5 శ్వాసలు.
వేరియంట్ –3
శ్వాస తీసుకుంటూ చేతులు రెండూ ముందుకు స్ట్రెచ్ చేసి కాళ్ళకు సమాంతరంగా రెండు చేతులూ ఉంచి 3 లేదా 5 సాధారణ శ్వాసల తరువాత శ్వాస వదులుతూ తిరిగి అరిచేతులు నేలమీద ఉంచాలి. తిరిగి విశ్రాంతస్థితిలో 5 శ్వాసలు తీసుకోవాలి.
పై విధంగా మూడు వేరియేషన్స్ ఒకదాని తరువాత ఒకటి క్రమ పద్ధతిలో 5 లేదా 10 సార్లు రిపీట్ చేయవచ్చు. చేతులు శరీరానికి దగ్గరగా ఉంచినప్పుడు కిందపొట్టలో ఉన్న కొవ్వు కరగడానికి, శరీరానికి 180 డిగ్రీల కోణంలో పక్కలకు స్ట్రెచ్ చేసి ఉంచినప్పుడు మధ్య పొట్టలో ఉన్న కొవ్వు కరగడానికి ముందుకు వంచినప్పుడు పై పొట్ట భాగంలో ఉన్న కొవ్వు కరగడానికి ఉపయోగపడుతుంది. ఫలితం బాగా ఉండడానికి ఈ ఆసనాలను ఉదయం సాయంత్రం కనీసం 15 నిమిషాల పాటు చేయడం చాలా ముఖ్యం. కాళ్లు రెండు కూడా బాగా స్ట్రెచ్ చేసి ఉంచినందువల్ల కాళ్ళలో కొవ్వు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ ఆసనాన్ని నేలమీద పడుకుని చేసేదానికన్నా కుర్చీలో బోర్లా పడుకుని చేసినప్పుడు పొట్ట దగ్గర కొవ్వు ఎక్కువగా కరిగే అవకాశం ఉంటుంది.
స్ట్రెచ్ అయ్యే కండరాలు: లాటిస్సిమస్ డోర్సి, పెక్టరాలిస్ మేజర్, మైనర్, ఎక్సటర్నల్ ఆబ్లిక్, ఇంటర్నల్ ఆబ్లిక్, రెక్టస్, ట్రాన్స్‌వర్సిస్ అబ్డామినస్ కండరాలకు మంచి టోనింగ్ జరుగుతుంది.
ఉపయోగాలు: జీర్ణవ్యవస్థను మెరుగుపరిచేందుకు, లివర్, పాంక్రియాస్ గ్రంధులు ఉత్తేజిపంబడటానికీ మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉపయోగం.
జాగ్రత్తలు: హై బిపి, బ్యాక్ పెయిన్, మైగ్రెయిన్, పెప్టిక్ అల్సర్లు ఉన్నవారు జాగ్రత్తగా చేయాలి. పొట్టకు గుండెకు సంబంధించిన శస్త్రచకిత్స జరిగినవారు 6 నెలల వరకూ ఈ ఆసనాలు చేయరాదు. గర్భిణీస్త్రీలు అస్సలు చేయకూడదు.
- ఎ.ఎల్.వి కుమార్‌ట్రెడిషనల్
యోగా ఫౌండేషన్
మోడల్: రీనా
సమన్వయం: సత్యబాబు