పొట్ట చెక్కలయ్యేలా...
యోగా
అధిక బరువు ఉన్నవారికి మాత్రమే కాదు సరిపడా బరువు ఉన్నవారికి కూడా ఇబ్బందికరమైన సమస్య పొట్ట. శరీరంలో మరే ప్రాంతంలో ఉన్నా పర్లేదు కాని ఉదర భాగంలో పేరుకుపోయిన కొవ్వు మాత్రం మనిషి ఆకారాన్ని వికారంగా మార్చే అవకాశం ఉంది. అలా దర్జాగా పెరిగే పొట్ట... పొట్ట కొట్టే ఆసనాలు యోగాలో ఉన్నాయి. అవే ఈ వారం...
ధనురాసనం స్టెప్–1
కుర్చీ పై నుంచి లేచి నిలబడి కుడికాలుని కుర్చీ కుడి హ్యాండిల్ కింద ఉన్న గ్యాప్‌లో నుంచి తీసుకెళ్లి, కుడి పాదం భూమి మీద ఉంచాలి. అలాగే ఎడమ పాదం కూడా భూమి మీద ఉంచి సీటును కుర్చీలో వీలైనంత వెనుకకు ఉంచి ఉదర భాగాన్ని కుర్చీ ముందువైపునకు అంచునకు గట్టిగా నొక్కుతూ చేతులు భూమి మీద సమాంతరంగా ఉంచాలి. వెనుక కాళ్లను స్ట్రెయిట్‌గా లేదా మడచి ఉంచవచ్చు. సరిగా బ్యాలెన్స్ చేయగలిగితే కేవలం పొట్ట భాగాన్ని కుర్చీలో, చేతులు పక్కలకి గాలిలో ఉంచి కాళ్ల వెనుక బాగా స్ట్రెచ్ చేస్తూ 3 లేదా 5 సాధారణ శ్వాసల వరకూ ఉండవచ్చు. శ్వాస వదులుతూ కాళ్లు రిలాక్స్ చేసి చేతులు భూమి మీద ఉంచి కొంచెం రిలాక్స్ అయిన తర్వాత మళ్లీ ఇదే విధంగా రిపీట్ చేయవచ్చు.
ధనురాసనం స్టెప్–2
సీటును కుర్చీలో బాగా వెనుకకు నెట్టి (తొడ జాయింట్లు కుర్చీ అంచుకు దగ్గరగా ఉండేటట్టు) శ్వాస తీసుకుంటూ కాళ్లు రెండూ పైకి లేపి రెండు చేతులతో చీల మండలం పట్టుకునే ప్రయత్నం చేయాలి. 3 లేదా 5 సాధారణ శ్వాసల తర్వాత శ్వాస వదులుతూ చీల మండలంను వదిలిపెట్టి కాళ్లు రిలాక్స్ చేసి చేతులు రెండూ ఇంతకు ముందు ఫొటోలో చూపిన విధంగా భూమి మీద ఉంచి రిలాక్స్ కావాలి.
ఉపయోగాలు: పొట్ట చుట్టూ ఎడిపోస్ టిస్యూలో ఉన్న కొవ్వు కరగడానికి, తొడ ప్రాంతంలో ఉన్న కొవ్వు తగ్గడానికి ఉపకరిస్తుంది. రుతు సమస్యలకు కిడ్నీలు సమర్ధవంతంగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది.
అర్ధ ఉష్ట్రాసన
కుర్చీలో వజ్రాసనంలో కూర్చోవాలి. తర్వాత మోకాళ్ల మీద పైకి లేచి శరీరాన్ని వెనుకకు వాలుస్తూ కుడిచేత్తో వెనుక ఉన్న కుర్చీ హ్యాండిల్‌ని పట్టుకోవాలి. శ్వాస తీసుకుంటూ ఎడమ చేతిని పైకి స్ట్రెచ్ చేస్తూ పొట్ట భాగాన్ని వీలైనంత ముందుకు నెట్టాలి. తల పైకి ఎత్తి 3 లేదా 5 సాధారణ శ్వాసల తర్వాత శ్వాస వదులుతూ ఎడమ చేతిని పక్క నుంచి కిందకు సీటు భాగాన్ని తిరిగి మడమల మీదకు వజ్రాసన స్థితిలోకి రావాలి. అదే విధంగా మళ్లీ రెండో వైపు కూడా చేయాలి.
జాగ్రత్తలు: స్పాండిలైటిస్, షోల్డర్ జాయింట్ లేదా ఫ్రోజెన్ షోల్డర్ వంటి సమస్యలు ఉన్నట్లయితే తలను పైకి ఎత్తకుండా స్ట్రయిట్‌గా ముందుకు చూస్తూ ఉండాలి. ఒకవేళ ఏదైనా గిడ్డీనెస్, తలతిరుగుతోంది అనిపించినట్టయితే అది లో బిపి వల్ల గాని లేదా లో షుగర్ లెవల్స్ వల్ల గాని జరగవచ్చు. అటువంటి పరిస్థితుల్లో కూడా తలను వెనుకకు వాల్చకొని ఉంచాలి. లేదా వెంటనే వెనక్కు వచ్చేయాలి.
ఉష్ట్రాసన
వజ్రాసనంలో నుంచి మోకాళ్ల మీదకి పైకి లేచి కొంచెం కొంచెం వెనుకకు వాలుతూ కుడిచేత్తో కుర్చీ కుడి హ్యాండిల్‌ని, ఎడమ చేత్తో ఎడమ హ్యాండిల్‌ని పట్టుకోవాలి. పొట్టను ముందుకు నెడుతూ, తలను వెనకకు వాల్చి, 3 లేదా 4 సాధారణ శ్వాసలు తీసుకున్న తర్వాత శ్వాస వదులుతూ వెనకకు రావాలి.
జాగ్రత్తలు: ఒకవేళ సయాటికా సమస్య గాని లోయర్ బ్యాక్ ప్రాబ్లెం గాని ఉన్నట్లతతే మోకాళ్లు రెండూ వీలైనంత వరకూ దూరం ఉంచి చేయడం మంచిది. ఎన్‌లార్జ్‌డ్ థైరాయిడ్ ఉన్నవాళ్లు మరింత జాగ్రత్తగా చేయాలి.
ఉపయోగాలు: పొట్టను బలంగా ముందుకు నెడుతూ ఉండడం వలన జీర్ణవ్యవస్థ, పునరుత్పత్తి వ్యవస్థ బాగా పనిచేయడానికి దోహదం చేస్తుంది. అన్ని రకాలైన వెన్నెముక సమస్యల నివారణకు చేయదగ్గ ఆసనం. మలబద్ధకాన్ని నివారిస్తుంది. భుజాల ప్రాంతం, ఛాతీ బాగా వ్యాచోచింపబడతాయి కాబట్టి శ్వాసకోస వ్యవస్థకు రక్త ప్రసరణ వ్యవస్థకు కార్డియో వాస్క్యులర్ వ్యవస్థకు, లింఫు గ్రంధులు బాగా పనిచేయడానికి ఉత్తమమైన ఆసనం.
ఎ.ఎల్.వి కుమార్
ట్రెడిషనల్ యోగా ఫౌండేషన్
సమన్వయం: సత్యబాబు