ఆసనాలపై ఆసనాలు
యోగా
కూర్చోడానికి పనికి వచ్చే కుర్చీని ప్లాస్టిక్ ఆసనంగా పిలుచుకోవచ్చు. అంటే ఇక్కడ వేస్తున్న ఆసనాలు... మరో రకం ఆసనాలపై వేస్తున్నవనుకోవచ్చు. ఆసనంతో ఎన్నో ప్రయోజనాలు కదా. మరి ఆసనాలపై ఆసనాలు వేస్తే... ఆరోగ్యపరంగా ప్రయోజనాల మీద ప్రయోజనాలు చేకూరుతాయి. అవేమిటో తెలుసుకోండి.
మార్జాలాసనం
కుర్చీలను మ్యాట్‌పై కదలకుండా స్థిరంగా ఉంచాలి. రెండు మోకాళ్లను ఒకదాని తర్వాత ఒకటి కుర్చీమీదకు తీసుకురావాలి. అనంతరం శరీరాన్ని ముందుకు వంచుతూ రెండు చేతులనూ రెండవ కుర్చీ మీద ఉంచాలి. ఆసనంలో కుదురుకున్నాక నిదానంగా గాలి పీల్చుతూ నడుమును నిదానంగా లోపలకు నెడుతూ పిరుదల భాగాన్ని ముందుకు సాగదీస్తూ తలని పైకి ఎత్తాలి. ధ్యాసను నడుముపై ఉంచాలి.
ఉష్ట్రాసనం
ఇందులో రెండు రకాలుంటాయి. ఒకటి శరీరాన్ని ముందుకు వంచి చేసేది, రెండు వెనుకకు వంచి చేసేది. శరీరాన్ని ముందుకు వంచి... మార్జాలాసనంలోకి వెళ్లినట్టే ఈ ఆసనంలోకి కూడా వెళ్లాలి. తర్వాత నెమ్మదిగా గాలి వదులుతూ నడుమును పైకి ఎత్తాలి. పిరుదుల భాగాన్ని లోనికి నెడుతూ కంఠకూపస్థం లోనికి ఆనించాలి. ఒంటె మూపురంలా అనిపించే ఈ ఆసనంలో ఉన్నప్పుడు ధ్యాసని నడుము, గొంతు భాగంలో ఉంచాలి.
ఉపయోగాలు: ఈ రెండింటినీ కలిపి సాధన చేయాల్సి ఉంటుంది. రోజువారీ జీవితంలో పనుల కారణంగా నడుము మీద పడే ఒత్తిడిని తొలగించేందుకు ఉపకరిస్తాయి. తద్వారా నడుం కుడి, ఎడమల మధ్య సమతౌల్యానికి, నడుము నొప్పి నివారణ, నడుము భాగం బలోపేతం అవుతుంది. తర్వాతి దశల్లో నడుము ఆధారంగా వేసే సంక్లిష్టమైన ఆసనాల సాధనను ఇవి సులభతరం చేస్తాయి. గొంతు సాగదీయడం, సంకోచింపజేయడం వల్ల థైరాయిడ్ గ్రంధి హార్మోన్స్ సమతుల్యానికి కారణమవుతాయి.
ప్రసారిత మార్జాలాసనం
మార్జాలసనంలోకి వెళ్లినట్టే ఈ ఆసనంలోకి కూడా వెళ్లాలి. తర్వాత రెండు చేతులనూ ముందు కుర్చీ మీద బలంగా పెట్టి ఉంచాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ కుడి కాలిని పైకి ఎత్తాలి. ఇప్పుడు నెమ్మదిగా కుడిచేతిని అదే విధంగా ఛాతీ, శరీరం మొత్తాన్ని కుడివైపునకు తిప్పాలి. వీలైనంత వరకూ కుడికాలు, శరీరం, తలని ఒకే వరుసలో ఉండేలా చూడాలి. చూపు కుడిచేతి కొనలను చూస్తూ ఉండాలి. ధ్యాసంతా నడుము, కటిభాగంపైనే ఉంచాలి. అలాగే ఉంచి కొన్ని శ్వాసలు తీసుకున్న తర్వాత నిదానంగా ఛాతీని ఎడమవైపు తిప్పుతూ కుడిచేతిని కిందకు దించిన తర్వాత కాలిని కూడా కిందకు తీసుకురావాలి. ఇలాగే ఎడమవైపున కూడా చేయాలి.
ఉపయోగాలు: కటిభాగం వదులుగా మారడానికి, అక్కడ పేరుకుపోయిన టాక్సిన్స్ తొలగించడానికి శరీరంలోని దిగువ భాగాలకు రక్తసరఫరా మెరుగుపరచడానికి ఉపకరిస్తుంది.
వజ్రాసనం
కుర్చీలను ఎదురుగా ఉంచుకుని ముందుగా ఒక కుర్చీలో రెండు మోకాళ్లను ఉంచాలి. రెండు చేతులతో కుర్చీ హ్యాండిల్స్ పట్టుకుని నెమ్మదిగా సీటు భాగాన్ని కాలి మడమల మధ్య ఉంచాలి. రెండవ కుర్చీని సీటు భాగానికి సౌకర్యంగా ఉండేలా అంటే కాలి చీలమండలం దగ్గరగా ఉండేలా సరిచేసుకోవాలి. మోకాళ్ల నొప్పులు ఉన్నవారు మోకాళ్ల కింద టవల్‌గాని కుషన్‌గాని ఏర్పాటు చేసుకోవాలి. ధ్యాసంతా శరీరం వెనుక భాగంలో నడుము కింద నుంచి శరీర భాగాలపై ఉంచాలి. అలా కాసేపున్న తర్వాత రెండు చేతులతో కుర్చీ హ్యాండిల్‌ని పట్టుకుని సీటు భాగాన్ని పైకి లేపి మోకాళ్ల మీదకు రావాలి.
ఉపయోగాలు: వెన్నెముకను నిటారుగా ఉంచుతుంది. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. కాలి మడమలు, చీల మండలం... దగ్గర ఉన్న సమస్యలను నివారిస్తుంది.
ఎ.ఎల్.వి కుమార్ ట్రెడిషనల్
యోగా ఫౌండేషన్