యోగా అంటే కలయిక. మన శరీరాన్ని మనస్సుతో సంయోగం చేసే ఒక ఆధ్యాత్మిక ఆరోగ్య ప్రక్రియ. దీనిని నిరంతర సాధన చేస్తే మన గమ్యమైన ముక్తి లేక మోక్షం ప్రాప్తిస్తుంది. అనగా మనస్సును ఐహిక బంధం నుండి వేరుచేయడం అన్న మాట. దైవాంశమైన ఆత్మను క్రమబద్ధంగా నియంత్రించడం వల్ల బంధ విముక్తి పొంది సమున్నత స్థితికి చేరటమే యోగా అని అరబిందో నిర్వ చించారు.
యోగాలో చాలా రకాలున్నాయి. జ్ఞానయోగం, భక్తి యోగం, పతంజలి యోగం, కుండలినీ యోగం, హఠ యోగం, మంత్ర యోగం, లయ యోగం, రాజ యోగం, జైన యోగం, బౌద్ధ యోగం వంటివి వాటిలో కొన్ని. అయితే ప్రతి యోగా పద్ధతికి సంబంధించి... నియమావళి, సూత్రాలు, ఆచరణ వేరు వేరుగా ఉంటాయి. వీటిలో ముఖ్యమైనది మన శరీర ఆరోగ్యానికి సంబంధించినదైన పతంజలి యోగా.
రోజూ క్రమం తప్పకుండా యోగా చేస్తే రక్తనాళాల్లో అవరోధాలు తొలగిపోయి ప్రతి అవ యవం కండిషన్లో ఉంటుంది. దీనికి తోడు యుక్తా హారం తీసుకొని జీవనశైలిలో మార్పు తెచ్చుకొంటే ఆరోగ్య సమస్యలను రూపుమాపవచ్చు. మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. మనం రోజూ యోగా చేస్తే మన పంచేంద్రియాలు, శరీరం లోని జీర్ణ వ్యవస్థ, రక్త సరఫరా వ్యవస్థ, విసర్జిక వ్యవస్థ, శ్వాసకోశ వ్యవస్థ, పునరుత్పత్తి వ్యవస్థ, నాడీ వ్యవస్థ, వినాళ గ్రంథి వ్యవస్థ వంటి అన్ని వ్యవస్థలూ స్పందించి ఆయా అవయవాలు సక్రమ స్థితిలో ఉంటాయి. యోగా చేసేవారు గురువు సూచనలు పాటించాలి. ఆపరేషన్ చేయించుకున్నవారూ, గర్భిణులూ డాక్టర్ సూచనలు పాటించాలి.
వ్యాధి ఒక్కరోజులో సంక్రమించదు. వ్యాధి పెరుగుదల ఐదు దశల్లో ఉంటుంది. మొదటి దశలో ఏ లక్షణాలూ పైకి కనపడవు కానీ శరీరంలో వ్యాధి పెరుగుతుంది. ద్వితీయ దశలో పైకి స్వల్ప లక్షణాలు కనపడతాయి. మూడవ దశలో వ్యాధి లక్షణాలు బాగా కనపడి బాధను కల్గిస్తాయి. ఈ దశలో త్వరగా వ్యాధి నిర్ధారణ చేసి వైద్యం అందివ్వాలి. లేకపోతే నాలుగవ దశలోకి ప్రవేశిస్తాడు. ఈ దశలో అవసరమైన శస్త్ర చికిత్స చేసి అంగవైకల్యానికి పరిమితం చేస్తారు. ఐదో దశ పునరావాసం లేక మరణం. వీటిలో మొదటి రెండు దశల్లోనూ యోగా వల్ల ఉత్పత్తి అయిన రోగ నిరోధక శక్తితో వ్యాధిని విజయ వంతంగా నిరోధించవచ్చు. నేడు ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులలో కార్డియాలజీ, న్యూరాలజీ, డయబెటాలజీ వంటి క్లినిక్‌లలో అనేక వందల మంది రోగులను ప్రతిరోజూ చూస్తున్నాం. రోగుల సంఖ్య అధికమవ్వటం వల్ల డాక్టర్లు వైద్య ప్రమా ణాలు పాటించని లేని స్థితికి చేరి వైద్యం చేస్తున్నారు. ఈ రోగుల సంఖ్యను గణనీయంగా యోగా వల్ల తగ్గించవచ్చు.
అంతేకాదు యోగా చేసిన వెంటనే సదరు వ్యక్తి శరీరంలో ఎండార్ఫిన్ అనే సంతోషాన్ని కలిగించే హార్మోన్ విడుదల అవుతుంది. రాత్రి చక్కగా నిద్ర పడుతుంది. అంతేకాదు యోగా వల్ల స్థూల శరీరం తగ్గి చక్కటి ఆకృతి ఏర్పడుతుంది. మన శరీరంలోని కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది. యోగా వల్ల రక్తనాళాలు, నాడులకు ఉన్న సాగే గుణం సురక్షిత మవుతుంది. యోగా వల్ల వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. క్రమం తప్పకుండా యోగా చేస్తే మనస్సు సమస్థితిలోకి వచ్చి అసహ్యం, అసూయ, కోపం వంటి మానసిక ఉద్రేకాలు తగ్గుతాయి. యోగా రక్తపోటు, మధుమేహ మందుల డోసును గణనీయంగా తగ్గిస్తుంది. కాబట్టి ప్రతి వ్యక్తీ రోజూ ఒక గంట యోగా చెయ్యాలి.
- వి.వి. రత్నాకరుడు
రిటైర్డ్ నాన్ మెడికల్ ఫేకల్టీ ఆఫీసర్
(జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం)
Comments
Please login to add a commentAdd a comment