మాట్లాడుతున్న జస్టిస్ చంద్రకుమార్
పంజగుట్ట: ప్రశ్నించిన ప్రతీ ఒక్కరినీ పీడీ యాక్టు పేరుతో భయపెట్టడం తగదని మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. ప్రభుత్వాలు ప్రజల ఆందోళనకు కారణాలను గుర్తించి సమస్య పరిష్కరించాలని కోరారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో ‘తెలంగాణలో నిర్భంధం ఎవరిమీద ..? పీడీ యాక్ట్ ఎందుకోసం’ అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీవ్రమైన నేరాలకు ఉద్ధేశించిన పీడీ యాక్టును చిన్న చిన్న కేసులకు, ప్రజా ఆందోళనలు, ఉద్యమాలు చేసే వారిపై ప్రయోగించడం దారుణమన్నారు. పీడీయాక్టు అమలుపై గతంలో న్యాయస్థానాలు ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాలన్నారు. ప్రజాస్వామ్యంలో పీడీ, నాసా తదితర నిర్భంధ చట్టాలను అమలు చేయాలనుకోవడం మంచిది కాదన్నారు. చెరుకు సుధాకర్ మాట్లాడుతూ ప్రస్తుతం పీడీ యాక్ట్ సర్వసాధారణమైపోయిందన్నారు. ఖమ్మం జిల్లాలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న 80 మంది గిరిజనులపై పీడీ యాక్టు ప్రయోగించడం విడ్డూరంగా ఉందన్నారు. పోడు వ్యవసాయం అటవీ హక్కు చట్టం ప్రకారం వారి హక్కుగా పేర్కొన్నారు. ప్రభుత్వానికి దమ్ముంటే నయీంతో సంబంధాలు ఉన్న అధికార పార్టీ నాయకులపై పీడి యాక్ట్ పెట్టాలని హితవు పలికారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే యెన్న శ్రీనివాస్ రెడ్డి, ఎపూరి సోమన్న, సందీప్ చమల్, శ్రీనివాస్ గౌడ్, మేరీ మాదిగ, వనజ తదితరులు పాల్గొన్నారు.