
‘నేను బాగుంటే చాలు’ అనుకునే ఈ రోజుల్లో నలుగురి కోసం పోరాటానికి దిగడం మామూలు విషయం కాదు.పశ్చిమ బెంగాల్ టీచర్ల నియామకంలో అవక తవకలున్నాయని 25,752 ఉద్యోగాలని తొలగించింది సుప్రీంకోర్టు – ఒక్క ఉద్యోగం తప్ప. ఆ ఉద్యోగం సోమా దాస్‌ది. ఈ బెంగాలీ టీచర్ తనకు ఉద్యోగం రానందుకు పోరాడింది. ఉద్యోగం రాని వాళ్ల కోసం పోరాడింది. ఈలోపు కేన్సర్ వస్తే దానిపై పోరాడింది. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఆమె పోరాటాన్ని గౌరవించి ఉద్యోగాన్ని నిలబెట్టాయి. కాని ఇప్పుడు ఈ తీర్పు వల్ల కూడా ఎందరో రోడ్డున పడతారని పోరాటానికి సిద్ధమైంది సోమాదాస్. ఇలా ఎవరున్నారని?
‘మళ్లీ కొత్త ఓరాటం చేయాలేమో’ అంది సోమా దాస్.మొన్నటి ఏప్రిల్ 3వ తేదీకి ముందు, తర్వాత ఆమె జీవితం ఒకేలా ఉంది. ఎందుకంటే ఆమె ఉద్యోగం పోలేదు. కాని ఆమెతోపాటు ఉద్యోగంలో చేరిన వారంతా సుప్రీంకోర్టు తీర్పుతో భవిష్యత్తు తెలియని స్థితిలో పడ్డారు. ‘సుప్రీంకోర్టు తీర్పు ఇలా వెలువడటంలో ప్రభుత్వ వైఫల్యం ఉంది.
నియామకాల్లో ప్రతిభ చూపి నిజాయితీగా ఉద్యోగాలు సాధించినవారు ఉన్నారు. వారి లిస్ట్ ప్రభుత్వం దగ్గర ఉంది. సుప్రీంకోర్టుకు ఆ లిస్టు ఇచ్చి వారి ఉద్యోగాలను కాపాడాల్సింది’ అందామె. ఈ గొడవ 2016 నుంచి మొదలైంది. వెస్ట్ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ (డబ్యు.బి.ఎస్.ఎస్.సి.) 2016లో భారీగా పరీక్షలు నిర్వహించి స్కూల్, కాలేజీ స్థాయిలో చేసిన టీచింగ్, నాన్ టీచింగ్ నియామకాలు చేసింది. 25,725 మంది ఉద్యోగులు చేరారు.
అయితే ఆనాటి నుంచి గొడవలు మొదలయ్యాయి. దొడ్డిదారిన చాలామంది ఉద్యోగాల్లో చేరారంటూ అర్హులైనవారు రోడ్డెక్కారు. నిరసనలు చేశారు. వారిలో సోమాదాస్ ముందు వరుసలో ఉంది. ‘నా పేరు మెరిట్ లిస్ట్‌లో ఉంది. కాని నాకు ఉద్యోగం ఇవ్వలేదు. నా బదులు ఎవరో దొంగ పద్ధతిలో చేరారు’ అని ఆమె కోల్‌కతా హైకోర్టులో కేసు వేసింది. ఆ కేసు నడుస్తుండగానే విపరీతంగా నిరసన ప్రదర్శనల్లో ముందు వరుసలో కనిపించింది.
రోజుల తరబడి నిరాహార దీక్షల్లో కూచోవడం వల్ల ఆమె పేరు ప్రచారంలోకి వచ్చింది. ఇంతలో ఆమెకు కేన్సర్ వచ్చింది. అయినా సరే కేన్సర్‌తో పోరాడుతూనే తన కోసం, సాటి వారి కోసం పోరాటం చేసింది. ఇది కోల్‌కతా హైకోర్టు జడ్జి అభిజిత్ గంగోపాధ్యాయ్ దృష్టికి వచ్చి ఆయన ఆమెను కోర్టుకు పిలిపించారు.
‘ఇంకొక ఉద్యోగం ఇవ్వమని ప్రభుత్వానికి చెబుతాను. చేస్తావా?’ అని అడిగారు. ‘టీచర్ కావడం నా జీవిత లక్ష్యం’ అని కరాఖండీగా చెప్పింది సోమాదాస్. దాంతో 2022లో ఆమెకు బెంగాలి భాషను బోధించే టీచరుగా ఉద్యోగం వేయించారు జడ్జి. కాని అదే జడ్జి 2024, ఏప్రిల్ 12న మొత్తం నియామకాలు చెల్లవు అని తీర్పు చెప్పారు. కాని ఒక్క సోమాదాస్ ఉద్యోగం మాత్రం ఉంటుంది అని పేర్కొన్నారు.
ఈ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్‌కు వెళితే న్యాయమూర్తులు దేబాంశు, మహమ్మద్ షబ్బార్ కూడా ‘నియామకాలు చెల్లవు. సోమాదాస్ ఉద్యోగం ఉంటుంది’ అని తీర్పు చెప్పారు. కేసు సుప్రీంకోర్టుకు వచ్చాక న్యాయమూర్తులు సంజీవ్‌ఖన్నా, సంజయ్ కుమార్‌లు తీర్పు చెప్తూ ‘ఉద్యోగాలు చెల్లవు. కాని సోమాదాస్ ఉద్యోగం కొనసాగుతుంది’ అన్నారు.
ఇంతమంది న్యాయమూర్తులు సోమాదాస్‌కు వెన్నంటి నిలిచి ఆమె ఉద్యోగం కాపాడటం చాలా అరుదు. దానికి కారణం సోమాదాస్ నిరుపేద కుటుంబం నుంచి రావడం, న్యాయం కోసం వెరవక పోరాడటం, ఆమె అర్హతలన్నీ సరిగ్గా ఉండటం, కేన్సర్ వచ్చినా దానిపై పోరాడుతూ ఉద్యోగం కోసం పోరాటాన్ని కొనసాగించడం.
దీనిని బట్టి పోరాటం చేసే వారికి... న్యాయం కోసం ఎలుగెత్తే వారికి గౌరవం ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. సాధారణంగా ఈ పని చేయడానికి చాలామంది వెరుస్తూ ఉంటారు. ‘నా ఉద్యోగం ఉందని సంతోషంగా ఏమీ లేను. ఇన్నాళ్లలో ఎంతోమంది ఈ ఉద్యోగాల వల్ల స్థిరపడ్డారు. ఇప్పుడు వారి ఉద్యోగాలు పోతే కుటుంబాలను ఎలా నడుపుతారు. వారి న్యాయం కోసం ఏదైనా చేయాలి’ అంది సోమా దాస్.
నిజమే. దాదాపు ఎనిమిదేళ్లుగా ఉద్యోగం చేస్తూ ఇప్పుడు ఆ ఉద్యోగం పోగొట్టుకోవాలంటే దొడ్డిదారిన చేరిన వాళ్ల కంటే నిజమైన అర్హతలతో చేరినవారు కుదేలవుతారు. ‘త్వరలో ఏదో ఒక దారి దొరుకుతుంది. మేం పోరాడతాం’ అంటోంది సోమాదాస్.కొందరు అలా ఉంటారు మరి.