కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో టీచర్ల నియామకాల కుంభకోణం.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మాజీ విద్యాశాఖ మంత్రి, ప్రస్తుత పరిశ్రమల, వాణిజ్య శాఖ మంత్రి పార్థా ఛటర్జీ, ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీలను ఈడీ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది కూడా. ఈ తరుణంలో అర్పిత నుంచి కీలక సమాచారం బయటపడుతోంది.
తాజాగా ఆమెకు చెందిన మరో ఇంట్లో నుంచి కూడా నోట్ల కట్టలే బయటపడ్డాయి. బుధవారం నాడు బెల్గారియా ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఆమె ఇంట్లో ఓ గది సెల్ఫ్ నుంచి కోట్ల రూపాయలను గుర్తించారు ఈడీ అధికారులు. ఈ మేరకు బ్యాంక్ అధికారులకు సమాచారం అందించగా.. హుటాహుటిన చేరుకుని కౌంటింగ్ మెషీన్‌తో లెక్కించడం ప్రారంభించారు. దాదాపుగా 20 కోట్లకు పైగా డబ్బు.. బంగారు బిస్కెట్లు.. నగల్ని రికవరీ చేశారు. అంతేకాదు దర్యాప్తునకు ఉపయోగపడే.. కీలకమైన డాక్యుమెంట్లను సైతం సేకరించారు. అందులో పార్థా ఛటర్జీకి చెందిన మరిన్ని ఆస్తులను గుర్తించినట్లు తెలుస్తోంది. రాజ్‌దంగాలోనూ అర్పితా ముఖర్జీకి మరో ఫ్లాట్ ఉన్నట్లు సమాచారం.
అర్పితా ముఖర్జీ నివాసాల్లో 18 గంటల పాటు సాగిన ఈడీ సోదాలు ముగిశాయి. కీలక పత్రాలతో పాటు దాదాపు 50 కోట్ల రూపాయల నగదు.. ఐదు కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. పది ట్రంకు పెట్టెల్లో నగదుతో పాటు నగలు, డాక్యుమెంట్లను డీసీఎం వ్యానులో తరలించారు అధికారులు.
#WATCH | West Bengal: Hugh amount of cash, amounting to at least Rs 15 Crores, recovered from the residence of Arpita Mukherjee at Belgharia.
— ANI (@ANI) July 27, 2022
She is a close aide of West Bengal Minister Partha Chatterjee. pic.twitter.com/7MMFsjzny1
మరో మహిళ ఎవరు?
ఇదిలా ఉంటే.. స్కూల్ టీచర్ల నియామకం కుంభకోణానికి సంబంధించిన వ్యవహారం దర్యాప్తులో భాగంగా ఈడీ చేపట్టిన సోదాల్లో.. గత శుక్రవారం అర్పితా ముఖర్జీ ఇంట్లో కోట్ల రూపాయలు బయటపడ్డాయి. అదే సమయంలో మంత్రి పార్థా ఛటర్జీని సైతం ఈడీ ప్రశ్నించింది. ఇక శనివారం మనీలాండరింగ్ కేసులో పార్థా ఛటర్జీతో పాటు అర్పితా ముఖర్జీలను ఈడీ అరెస్ట్ చేసింది. ఆగష్టు 3వ తేదీ వరకూ ఈ ఇద్దరూ ఈడీ కస్టడీలోనే ఉంటారు.
ఇక విచారణలో.. అర్పితా ముఖర్జీ మరో మహిళ ప్రస్తావన తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. పార్థ చటర్జీ తన ఇంటితో పాటు మరో మహిళ ఇంటిని మినీ బ్యాంక్‌గా వాడుకునేవారని, పదిరోజులకొకసారి పార్థా ఛటర్జీ, ఆయన అనుచరులు ఇంటికి వచ్చే వాళ్లని, డబ్బు దాచేవాళ్లని అర్పితా ముఖర్జీ అంగీకరించింది. అయితే మరో మహిళ ఎవరనే విషయంపై మాత్రం అధికారులు ప్రకటన చేయలేదు.
ఇదీ చదవండి: అర్పిత ముఖర్జీ ఎవరంటే..
రాజీనామానా? దేనికి..
ఇదిలా ఉంటే.. పార్థా ఛటర్జీ బెంగాల్‌లో సీనియర్ రాజకీయ నేత. టీఎంసీ తరపున ఆయన కేబినెట్‌తో పాటు పలు కీలక భాద్యతలు చేపట్టారు కూడా. కుంభకోణం ఆరోపణల నేపథ్యంలో రాజీనామా చేస్తారా? అనే ప్రశ్న ఎదురైంది ఆయనకు మీడియా నుంచి. దానికి ఆయన మండిపడ్డారు. ఎందుకు? ఏ కారణంతో రాజీనామా చేయాలి? అని అసహనం ప్రదర్శించారు.
గవర్నర్‌కు ఫిర్యాదు
కేబినెట్ మంత్రిపై ఆరోపణలు.. అరెస్ట్ జరిగినా టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ స్పందించకపోవడంపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. పార్థా ఛటర్జీని మంత్రి పదవుల నుంచి తొలగించేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలంటూ ప్రతిపక్ష నేత సువేందు అధికారి.. గవర్నర్ లా గణేశన్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఆధారాలు స్పష్టంగా ఉన్నా ఆమె(మమతా బెనర్జీని ఉద్దేశిస్తూ..) ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. తాను మాత్రమే మంచి వ్యక్తినని.. ఎదుటివాళ్లు చెడ్డవాళ్లన్నట్లు వ్యవహరిస్తున్నారు ఆమె అని అధికారి సువేందు గవర్నర్‌నుకలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment