కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ టీచర్ నియామకాల కుంభకోణం దర్యాప్తులో లోతుగా వెళ్లే కొద్దీ మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈడీ సోదాల్లో బయటపడ్డ డబ్బుతో తనకేం సంబంధం లేదని, తనపై జరిగిన కుట్రకు కాలమే సమాధానం చెప్తుందని టీఎంసీ బహిష్కృత నేత.. బెంగాల్ మాజీ మంత్రి పార్థ ఛటర్జీ చెప్తున్నారు. మరోవైపు ఆయన సన్నిహితురాలు, నటి అర్పితా ముఖర్జీ మాత్రం తాను లేని టైంలో తన ఇంట్లో ఆ డబ్బును పార్థనే ఉంచారని, తన ఇంటిని మినీ బ్యాంకుగా వాడుకున్నారంటూ ఈడీ ముందు వాంగ్మూలం ఇచ్చింది. ఈ తరుణంలో..
ఈ వ్యవహారంలో ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయాన్ని ఈడీ బయటపెట్టింది. అర్పితా ముఖర్జీకి చెందిన దాదాపు 31 లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలలో నామినీగా పార్థ ఛటర్జీ పేరు ఉందని ఈడీ అధికారులు తెలిపారు. అంతేకాదు ఏపీఏ యూటిలిటీ సేవల కింద జనవరి 1, 2012 నుంచి ఇద్దరి మీద భాగస్వామ్యానికి సంబంధించిన దస్తావేజులు వెలుగులోకి వచ్చాయి. అంతేకాదు.. ఈ భాగస్వామ్యం పేరు మీదనే పలు ప్రాపర్టీలు కొనుగోలు చేసినట్లు తమ దర్యాప్తులో తేలిందని ఈడీ అధికారులు వెల్లడించారు.
కొనుగోళ్లకు సంబంధించిన లావాదేవీలు నిందితులిద్దరూ నగదు రూపంలోనే చేశారు. అయితే ఆ నగదు ఎక్కడి నుంచి వచ్చిందనేది కనిపెట్టాల్సి ఉంది అని దర్యాప్తు సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది.
ఇదిలా ఉంటే.. మనీల్యాండరింగ్ కేసులో పార్థ ఛటర్జీ, అర్పితా ముఖర్జీలను సుదీర్ఘంగా ప్రశ్నించిన తర్వాతే అరెస్ట్ చేసింది ఈడీ. అర్పితాకు చెందిన ఇళ్ల నుంచి సుమారు రూ. 50 కోట్ల నగదు, ఐదు కేజీల బంగారం, విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది కూడా. ఆపై ఈడీ ఈ ఇద్దరినీ తమ కస్టడీలోకి తీసుకోగా.. ఆగస్టు 5వ తేదీతో ఆ కస్టడీ ముగియనుంది.
ఇదీ చదవండి: సంజయ్ రౌత్ సతీమణికి ఈడీ సమన్లు
Comments
Please login to add a commentAdd a comment