ఈ దాపరికం ప్రమాదం..!
విశ్లేషణ
ఉపాధ్యాయులు, అధ్యాపకుల నియామకాలు సరిగ్గా జరుగుతున్నాయో లేదో నిర్ధారించడానికి న్యాక్ సంస్థకు ఇచ్చిన నివేదికలు ముఖ్యం. ఇవన్నీ సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తాయి. వాటిని అడిగిన వారికి ఇవ్వాల్సిందే.
ప్రైవేట్ పబ్లిక్ విద్యాసంస్థ లలో బోధనా ప్రమాణాలను రక్షించేదెవరు? అసలు పాఠా లుచెప్పే వారే లేని కళాశాలలు ఎలా నడుస్తున్నాయి? విద్యా ర్థులు ఏం నేర్చుకుంటున్నారు? ఎవరు నేర్పుతున్నారు?
జైపూర్ సుబోధ్ కళాశాల వారు నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్)కు ఇచ్చిన శాశ్వత అధ్యాపకుల జాబితా ప్రతి ఇవ్వాలని ఆర్టీఐ ద్వారా గిరి ధారి శరణ్ శర్మ అడిగారు. ఇవ్వకుండా న్యాక్ అధికారి ఆ దరఖాస్తును సుబోధ్ కళాశాలకు బదిలీ చేసారు.
చాలా ప్రైవేట్ కళాశాలల్లో అధ్యాపకులు సరిగా ఉండరు. సరైన వారిని నియమించరు. నియమిస్తే జీతాలు సరిగా ఇవ్వరు. వేతనాలను ప్రభుత్వం నిర్దే శించిన ప్రకారం ఇస్తున్నామని అబద్ధాలు చెబుతారు. పరిశీలక బృందాలను నమ్మించడానికి దస్తావేజులు తయారు చేస్తారు. శాశ్వత సర్వీసులో లెక్చరర్లు ఉన్నట్టు నమ్మిస్తారు. ఉపాధ్యాయులకు తక్కువ జీతాలు, విద్యా ర్థులకు తక్కువ స్థాయి పాఠాలు, యాజమాన్యాలకు ఎక్కువ లాభాలు. పుట్టగొడుగుల్లా వెలిసిన కళాశాలల్లో కుప్పలు తెప్పలుగా బయటకు వచ్చే ఇంజినీర్లు, గ్రాడ్యు యేట్లు, డాక్టర్లు ఎంతమంది పనికొస్తారో తెలియదు.
న్యాక్ వారికి ఇచ్చిన అబద్ధపత్రాలను ఎండగట్టడం ఏ విధంగా? కనీసం వారు ఇచ్చిన పత్రాల ప్రతులు అధికారికంగా బయటకు వస్తే వాటి నిజానిజాలు బయ టపెట్టడానికి విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు లేదా మోసపోయిన అధ్యాపకులకు వీలవుతుంది. శాశ్వత సర్వీసు అధ్యాపకుల జాబితా ఇవ్వగానే అందులో నిజంగా నియమితులైన వారెందరో తెలిసిపోతుంది. సమాచార హక్కు అవసరం అదే. కళాశాల స్వార్థ పూరిత కార్యక్రమాలను ఆపే బదులు, వారితో పరిశీలకులు కూడా కలిసిపోతే విద్యా ప్రమాణాలకు దిక్కేమిటి? న్యాక్ పరిశీలక బృందానికి కళాశాల యజమానులు ఇచ్చిన అధ్యాపకుల జాబితా ఇవ్వడానికి ఎందుకు భయం? రెండో అప్పీలు కేంద్ర సమాచార కమిషన్ ముందుకు వచ్చింది. న్యాక్ పక్షాన లాయర్ హాజర య్యారు. అధ్యాపకుల జాబితాను కళాశాలవారు ఇవ్వ గానే కమిటీ సభ్యులు అక్కడికక్కడే చదివి, ఆయా అధ్యా పకులు నిజంగా ఉన్నారో లేదో పరిశీలిస్తారట. తరువాత ఆ జాబితా కాగితాలు కళాశాలకే ఇచ్చివేస్తారట.
అయితే ఆ విధంగా చెక్ చేసినట్టు, ఇచ్చిన అధ్యా పకుల జాబితా సరిగ్గా ఉన్నట్టు లేదా లోపాలు ఉన్నట్టు ఎక్కడైనా రాసి ఉంటారు కదా, దాని ప్రతులు ఇవ్వ గలరా అనడిగితే జవాబు ‘నాకు తెలియదు. న్యాక్ వారు చెప్పలేదు’ అని. తమసంస్థ దగ్గర ఉండవలసిన పత్రాలు లేవనడం, ఉన్నా ఇవ్వకపోవడం, పైగా సమాచార దర ఖాస్తును కళాశాలకు బదిలీ చేసి, చేతులు దులుపుకో వడం సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించడమే అవు తుంది. దానికి షోకాజ్ నోటీసు ఇవ్వక తప్పదు. సమా ధానం సరిగా లేకపోతే జరిమానా కూడా తప్పదు. ఆ విషయం చెప్పగానే లాయర్ గారు కొంత సమయం అడి గారు. న్యాక్ ఉన్నతాధికారులను అడిగి డాక్యుమెంట్ ఇవ్వడం గురించి చెబుతానన్నారు.
న్యాక్ 1994 లో విద్యా ప్రమాణాలను పరిశీలించి ధృవీకరించడానికి ఏర్పడిన సంస్థ. యూజీసీ దీన్ని ఏర్పాటు చేసింది. ఏడు ప్రమాణ పరిశీలనాంశాలను గుర్తించింది. పాఠ్యాంశాలు, బోధనా, అధ్యయన పరి శీలన, పరిశోధన, సలహాలు విస్తరణ అంశాలు, మౌలిక వనరులు, అధ్యయన వనరులు, విద్యార్థుల సమర్థనాం శాలు, పాలన, నాయకత్వం యాజమాన్యం, సృజనాత్మ కత, ఉత్తమ విధానాలు. ఇవి ఉన్నాయో లేదో తేల్చాలి. ప్రతి సంస్థ సొంతంగా తమ కళాశాల వనరుల గురించి సమగ్రంగా అధ్యయన నివేదిక రూపొందించి ఇవ్వాలి. ఈ నివేదిక ఆధారంగానే పరిశీలన ప్రమాణాల నిర్ధారణ జరుగుతుంది.
ఈ నివేదికకు అనుబంధంగా అనేక పత్రాలు ఉంటాయి అందులో ఒకటి అధ్యాపకులు, సిబ్బంది జాబితా. ఎంతమంది తాత్కాలిక సిబ్బంది లేదా ఎందరు శాశ్వత ప్రతిపాదికమీద నియమితులై నారు. వారి జీతాల వివరాలు ఉండాలి. న్యాక్ సభ్యులు వీటిని పరిశీలించి తనిఖీ చేయాలి. ఈ విధానమంతా పారదర్శకంగా ఉండాలి. నివేదిక తయారైన తరువాత దాన్ని కళాశాల ఉన్నతాధికారికి ఇస్తారు. ఆయన పరి శీలించి అందులో ఏ వివరాలనైనా పరిశీలించలేదని అని పిస్తే, వ్యతిరేక నిర్ధారణలకు ఆధారం లేదని అనుకుంటే ఆ వివరాలను కమిటీ ముందుకు తేవచ్చు. ఆ తరువాత నివేదికకు తుది రూపు ఇవ్వడానికి అవకాశం ఉంది.
టీచర్ల నియామకాలు సరిగా జరుగుతున్నాయో లేదో నిర్ధారించడానికి ఈ న్యాక్ సంస్థకు ఇచ్చిన నివే దికలు ముఖ్యం. ఆ నివేదికలు, అనుబంధాలు అన్నీ సమాచార హక్కు చట్టం కింద సమాచారం అన్న నిర్వచనంలోకి వస్తాయి. కనుక వాటిని అడిగిన వారికి ఇవ్వక తప్పదు. ఏ విధంగానూ అవి రహస్యాలు కావు. పోటీలో నష్టపరిచే అంశాలు కూడా కావు. ఒక్క ప్రొఫె సర్‌ను అనేక కళాశాలలు తమ అధ్యాపకుడని చెప్పుకునే అవినీతిని నిరోధించడానికి కూడా ఈ సమాచార పార దర్శకత ఉపయోగపడుతుంది.
15 రోజుల్లో అధ్యాపకుల జాబితా ఇవ్వగలమని లాయర్ న్యాక్ తరఫున కమిషన్‌కు హామీ ఇచ్చారు. ఆ విధంగా ధృవీకృత ప్రతి ఇవ్వాలని కమిషన్ ఆదేశిం చింది. న్యాక్ మాత్రమే కాక సుబోధ్ కళాశాల కూడా తమ ఉద్యోగుల జాబితా ఇవ్వాలని కమిషన్ ఆదేశిం చింది. న్యాక్ తన విధి విధానాలను మరింత పార దర్శకంగా రూపొందించాలని, ఈ జాబితాలను కళాశా లల నుంచి సేకరించాలని, ఆర్టీఐ చట్టం కింద అడిగితే ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలని కమిషన్ సూచించింది. (గిరిధారి శరణ్ శర్మ వర్సెస్ న్యాక్ CIC/SA/A/2015/001420 కేసులో జనవరి 18న ఇచ్చిన తీర్పు ఆధారంగా)
వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్
professorsridhar@gmail.com
మాడభూషి శ్రీధర్