ఢిల్లీ: టీచర్ల నియామకాలకు సంబంధించిన కేసులో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఊరట లభించింది. 24 వేల టీచర్ల నియామకాన్ని పూర్తిగా రద్దు చేసి, సీబీఐ విచారణ చేపట్టాలని కోల్‌కతా హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును టీఎంసీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది.
ఈ క్రమంలో సోమవారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. ఈ కేసులో పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్‌కు చెందిన ప్రభుత్వ అధికారులపై లోతుగా దర్యాప్తు చేయాలన్న సీబీఐకి ఇచ్చిన ఆదేశాలపై తాజాగా స్టే విధించింది.
2016 నాటి టీచర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్‌మెంట్‌లో అవకతవకలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఇటీవల కోల్‌కతా హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. అప్పటి మొత్తం రిక్రూట్‌మెంట్‌ను రద్దు చేయాలని... ఇప్పటివరకు టీచర్లు తీసుకున్న జీతాలను వడ్డీతో సహా చెల్లించాలని తీర్పు ఇచ్చింది. ఇక ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియపై పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్‌ను మరింత దర్యాప్తు చేయాలని సీబీఐని ఆదేశించిన విషయం తెలిసిందే.
కోల్‌కత హైకోర్టు తీర్పుపై దీదీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీంతో తాజాగా సీబీఐ దర్యాప్తుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఈ కేసుపై సుప్రీం కోర్టు తదుపరి విచారణను మే 6 తేదీకి వాయిదా వేసింది. ఇప్పటికే ఈ వ్యవహరంలో సీబీఐ మాజీ విద్యాశాఖ మంత్రి పార్థా చటర్జీ, పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్‌లోని పలువురు అధికారులను సీబీఐ అరెస్ట్ చేయటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment