
కోల్‌కతా: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)అమలుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి విమర్శలు గుప్పించారు. ప్రజల మధ్య విభజన సృష్టించడమే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లోక్‌సభ ఎన్నికల ముందు సీఏఏ అమలు చేస్తోందని మండిపడ్డారు. అస్సాంలో ఉన్న విధంగా పశ్చిమ బెంగాల్‌కు నిర్బంధ శిబిరాలు అవసరం లేదని అన్నారు. ‘సీఏఏ అనేది ఎన్‌ఆర్‌సీ వంటిదే. అందుకే మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అస్సాం ఉన్నట్లు మాకు నిర్బంధ కేంద్రాలు అవసరం లేదు’ అని సీఎం మమతా బెనర్జీ అన్నారు.
తాము భూస్వాములం కాదని.. అప్రమత్తంగా ఉండే సంరక్షకులమని తెలిపారు. పశ్చిమ బెంగాల్ నుంచి ఎవరినీ వెళ్లగొట్టమని అన్నారు. శరణార్థులంతా ఇక్కడే శాశ్వతంగా స్థిరపడవచ్చని సీఎం మమత అన్నారు. బీజేపీ హిందూ మతాన్ని వక్రీకరిస్తోందని.. స్వామి వివేకనంద బోధనలు నుంచి హిందుత్వాన్ని వేరు చేస్తోందని మండిపడ్డారు. సీఏఏతో భారత ప్రజల మధ్య విభజన తీసుకురావాలని ప్రయత్నం చేస్తుందని సీఎం మమత దుయ్యబట్టారు.
ఇక.. 2019లో విదేశీయులతో కూడిన నిర్బంధ కేంద్రాలను అస్సాం ప్రభుత్వ నోటీఫై చేసిన విషయం తెలిసిందే. వారికి శాశ్వత కేంద్రాల ఏర్పాటు చేసే వరకు జైళ్లను కూడా ఉపయోగించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. రాష్ట్ర రాజధాని దిస్పూర్‌కు సుమారు 130 కిలోమిటర్ల దూరం మాటియా అనే అతిపెద్ద నిర్బంధ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇదే నిర్బంధ కేంద్రంపై గతంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీశారు.