కోల్‌కతా: కుల్తాలీ బాలిక హత్యాచారం కేసును పోక్సో చట్టం కింద నమోదు చేయాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోలీసులను ఆదేశించారు. ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో దోషులకు మూడు నెలల్లో ఉరిశిక్ష విధించాలని పోలీసులను కోరారు. శనివారం దక్షిణ 24 పరగణాల జిల్లా కుల్తాలీలోని ఓ కాలువలో పదేళ్ల బాలిక శవమై కనిపించిన విషయం తెలిసిందే.
‘నేరానికి రంగు, కులం, మతం లేదు. పోక్సో చట్టం కింద కుల్తాలీ కేసు నమోదు చేసి మూడు నెలల్లోగా దోషులకు ఉరిశిక్ష పడేలా చూడాలని పోలీసులను కోరుతున్నా. ఏదైనా నేరం నేరమే. దానికి మతం లేదా కులం లేదు. నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అత్యాచారం కేసుల్లో దర్యాప్తు జరగుతున్న సమయంలో మీడియా విచారణ చేయటం ఆపివేయాలి’ అని అన్నారు.
మరోవైపు.. బాలిక హత్యాచారంపై ఆదివారం దక్షిణ 24 పరగణాలలో నిరసనలు చెలరేగాయి. బాధ్యులను కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని బీజేపీ నిరసనలకు దిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్, అగ్నిమిత్ర పాల్ నిరసనల్లో పాల్గొన్నారు.
ఈ కేసుకు సంబంధించి ఓ అనుమానితుడిని పశ్చిమ బెంగాల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నామని పోలిసులు తెలిపారు. సౌత్ 24 పరగణాల పోలీసు సూపరింటెండెంట్ పలాష్ చంద్ర ధాలీ మీడియాతో మాట్లాడారు. ‘‘బాలిక ట్యూషన్ నుంచి తిరిగి వస్తుండగా సాయంత్రం తప్పిపోయింది. రాత్రి 8 గంటల వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. శనివారం(నిన్న) విచారణ ప్రారంభించాం. విచారణ తర్వాత ఈ రోజు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాం. బాలికను తానే హత్య చేశానని నిందితుడు చెప్పాడు. ప్రభుత్వం ఇటువంటి కేసులపై చాలా సీరియస్‌గా ఉంది. ఈ కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది’’ అని తెలిపారు.
అయితే... ఈ కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాలిక అత్త ఆరోపణలు చేశారు. బాధితురాలి శరీరంపై తీవ్రమైన గాయాలు ఉన్నాయని, అవయవాలు విరిగిపోయాయని అన్నారామె. నిందితులకు శిక్ష విధించాలని ఆమె డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment