సంచలన సృష్టించిన ఓ హత్య కేసులో అతనొక నిందితుడు. కింది కోర్టు అతనికి మరణశిక్ష విధించింది. హైకోర్టు, ఆపైన సుప్రీం కోర్టు కూడా కోర్టు తీర్పునే సమర్థించాయి. క్షమాభిక్ష కోరితే.. రాష్ట్రపతి సున్నితంగా తిరస్కరించారు. కొడుకు కోసం అతని తల్లి మరోసారి రాష్ట్రపతి భవన్ తలుపు తట్టింది. ఈసారి రాష్ట్రపతి కనికరించి జీవితఖైదుగా శిక్షను మార్చారు. కట్ చేస్తే.. దాదాపు 25 ఏళ్ల తర్వాత అతని విషయంలో పెద్ద తప్పే జరిగిందని దేశసర్వోన్నత న్యాయస్థానమే ఒప్పుకుంది. అతన్ని విడుదల చేయాలంటూ ఆదేశాలు జారీ చేస్తూనే ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఏంటా తప్పు?.. ఇంతకీ కోర్టు ఏం చెప్పిందంటే..
వంద మంది దోషులు తప్పించుకున్నా ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదని అంటారు. అయితే నిందితులతో పాటు దోషులకూ మన చట్టాలు కొన్ని హక్కులు కల్పిస్తున్నాయి. అయితే ఆ హక్కును న్యాయస్థానాలే నిర్లక్ష్యం చేస్తే..?! ఫలితంగా ఓం ప్రకాశ్‌లాగా పాతికేళ్లు జైల్లో మగ్గాల్సి వస్తుంది.
ఉత్తరాఖండ్‌కు చెందిన ఓం ప్రకాశ్(Om Prakash).. తన యజమానితో పాటు అతని కుటుంబాన్ని హతమార్చిన కేసులో నిందితుడు. 1994లో ఈ నేరం జరిగింది. నేరం రుజువు కావడంతో 2001లో ట్రయల్ కోర్టు అతనికి మరణశిక్ష విధించింది. అయితే నేరం జరిగిననాటికి అతను మైనర్. తన కొడుకు మైనర్ అని మరణశిక్షపై అతని తల్లి అభ్యంతరం వ్యక్తం చేసింది. మరోవైపు.. నిందితుడి పేరిట ఉన్న బ్యాంక్ పాస్‌బుక్ ఆధారంగా నేరం జరిగిన నాటికి అతనికి 20 ఏళ్లని అధికారులు వాదించారు. కోర్టు ఓం ప్రకాష్ తల్లి అభ్యర్థనను పక్కనపెట్టి మరణశిక్ష ఖరారు చేసింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ ఆమె హైకోర్టు, సుప్రీం కోర్టులకు వెళ్లారు. అయితే అక్కడా ఆ తల్లికి చేదు అనుభవం ఎదురైంది. రివ్యూ పిటిషన్లు వేస్తే వాటిని కొట్టేశాయి. దీంతో చివరి అవకాశంగా ఆమె రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరారు.
అయితే మొదటి పిటిషన్ తిరస్కరణకు గురికాగా.. 2012లో రెండో పిటిషన్‌కు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. కాకుంటే.. ఓం ప్రకాశ్‌కు 60 ఏళ్లు వచ్చేదాకా జైల్లోనే ఉంచాలంటూ సూచించారు. ఆ తర్వాత సుప్రీం కోర్టులో అతని తల్లి మరో పిటిషన్ వేసినప్పటికీ.. అది చెల్లదంటూ రిజిస్ట్రీ కొట్టిపారేశారు. 2019లో హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తే.. అదీ తిరస్కరణకే గురైంది. చివరకు..
సుప్రీం కోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ఆధారంగా బోన్ ఆసిఫికేషన్(ఎముక పరిణామంచెందే క్రమం) పరీక్ష నిర్వహించగా.. నేరం జరిగిననాటికి అతని వయసు 14 ఏళ్లుగా తేలింది!. అంతేకాదు.. సమాచారం హక్కు చట్టం ప్రకారం 14 ఏళ్ల వయసువాళ్లకూ బ్యాంక్ అకౌంట్ ఉండొచ్చనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
జువైనల్ జస్టిస్ యాక్ట్(Juvenile Justice Act) 2015 ప్రకారం.. జువైనల్‌కు కఠిన శిక్షలు విధించరాదని మన చట్టం చెబుతోంది. కానీ, ఈ కేసులో ఓం ప్రకాశ్‌కు ఏకంగా మరణశిక్ష విధించాయి కోర్టులు. అయితే.. ఈ తరహా కేసుల్లో శిక్షలు ఖరారైన తర్వాత కూడా నిందితుడి మైనర్ అని నిరూపించుకునేందుకు పిటిషన్ వేయొచ్చు. అందుకు సెక్షన్ 9(2) వెసులుబాటు కల్పించింది. అయితే.. కింది కోర్టు నుంచి సుప్రీం కోర్టు దాకా ఓం ప్రకాశ్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యహరించాయి. సెక్షన్‌కు విరుద్ధంగా ప్రవర్తించాయి.
‘‘మన దేశంలో న్యాయస్థానాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అలాంటిది ఇలాంటి కేసుల్లో.. అభ్యర్థలను కోర్టులు జాగ్రత్తగా పరిశీలించాలి. నిర్లక్ష ధోరణితో పక్కన పడేయకూడదు. 2015 జువైనల్ చట్టం.. పిల్లలను అపరాధిగా కాకుండా బాధితుడిగా పరిగణించాల చెప్పింది. వాళ్లలో పరివర్తన తీసుకొచ్చి.. సమాజంలోకి పంపించి పునరావాసం కల్పించాలని చెబుతోంది. అయితే ఇక్కడ కోర్టులు చేసిన తప్పిదానికి అప్పీలుదారుడు శిక్షను అనుభవించాడు. సమాజంలో కలిసిపోయే అవకాశాన్ని కోల్పోయాడు. తన తప్పులేకుండా అతను కోల్పోయిన కాలాన్ని ఎలాగూ వెనక్కి తేలేము’’ అంటూ జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ అరవింద్‌కుమార్ బెంచ్ వ్యాఖ్యానించింది.
మరేయిత కేసులతో గనుక అతనికి సంబంధం లేకుంటే తక్షణమే అతన్ని విడుదల చేయాలంటూ ఉత్తరాఖండ్ జైళ్ల శాఖను ఆదేశించింది. అలాగే ప్రభుత్వ పునరావాస పథకాల కింద అతనికి ఏదైనా ఉపాధి కల్పించాలని ఉత్తరాఖండ్ స్టేట్ లీగల్‌సర్వీసెస్ అథారిటీకి ధర్మాసనం సూచించింది.
1994లో ఏం జరిగిందంటే..
డెహ్రాడూన్(Dehradun)లో ఓ ఇంట్లో జరిగిన హత్యలు కలకలం రేపాయి. శ్యామ్‌లాల్ ఖన్నా అనే రిటైర్ట్ ఆర్మీ ఆఫీసర్‌ను, ఆయన కొడుకు సరిత్, భార్య సోదరిని ఎవరో కిరాతకంగా హతమార్చారు. పోలీసుల విచారణలో ఆ ఇంట్లోనే పని చేసే ఓం ప్రకాశ్ పనేనని తేలింది. ఐదేళ్ల గాలింపు తర్వాత పశ్చిమ బెంగాల్‌లో నిందితుడ్ని, అతని స్నేహితుడు నితేష్‌ను అరెస్ట్ చేశారు. అయితే.. ఈ కేసులో నితేష్ ప్రమేయం లేదని తేలడంతో కోర్టు అతన్ని నిర్దోషిగా విడుదల చేసింది.
ప్రతీక్ చాదా అనే లాయర్ సుప్రీం కోర్టులో ఓం ప్రకాశ్ తరఫున పిటిషన్ వేయగా.. ఎస్ మురళీధర్ ఓం ప్రకాశ్ తరఫున వాదనలు వినిపించారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం తరఫున అడిషనల్ సోలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్, అడ్వొకేట్ వన్షజా శుక్లా వాదనలు వినిపించారు.
Comments
Please login to add a commentAdd a comment