హైటెక్ పోలీసింగ్
నేరాల నియంత్రణకు టెక్నాలజీ వినియోగం
ఇక వాట్సప్, ఫేస్‌బుక్‌ల ద్వారానే ఫిర్యాదులు
వాట్సప్‌ను ప్రారంభించిన ఐజీ గోపాలకృష్ణ
సేఫ్ సిటీ నినాదంతో అర్బన్ ఎస్పీ వినూత్న ప్రయత్నం
మీ కేదైనా సమస్య వచ్చిందా? పోలీసు స్టేషన్‌కు వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నారా? నో ప్రాబ్లమ్.. ఈ దగ్గర మొబైల్ ఉంటే చాలు, ఫేస్‌బుక్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. మీరేదైనా ఆపదలో ఉంటే ఆండ్రాయిడ్ మొబైల్‌తో ఏ స్థలంలో ఉన్నారో వీడియో, ఫొటో తీసి వాట్సప్‌లో పంపితే చాలు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగుతారు.
- తిరుపతి క్రైం
తిరుపతి అర్బన్ జిల్లా పోలీసులు హైటెక్ టెక్నాలజీతో నగరంలో దూసుకుపోతున్నారు. నేరాలను నియంత్రించడానికి, ట్రాఫిక్‌కు క్రమబద్దీకరించడానికి సేఫ్ సిటీ నినాదంతో సెంట్రల్ మానటరింగ్ సిస్టమ్‌ను అర్బన్ జిల్లా ఎస్పీ గోపినాథ్ జెట్టి ప్రవేశపెట్టారు. ప్రజల నుంచి ఎలాంటి సమస్యలైనా, సలహాలైనా ఏదైనా తెలుసుకోడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఇటీవల చైన్ స్నాచర్స్, నేరగాళ్ళను సీసీ కెమెరాల ద్వారా గంటల వ్యవధిలోనే పట్టుకుని టెక్నాలజీ పోలీసుగా పేరుపొందారు. ఇప్పటికే పేస్‌బుక్‌ను అందుబాటులోకి తెచ్చారు. నూతనంగా బాధ్యతలు తీసుకున్న ఐజీ గోపాలకృష్ణ గురువారం వాట్సప్‌ను కూడా ప్రారంభించారు. అత్యధికంగా ఆండ్రాయిడ్ మొబైల్స్‌నే వాడుతున్నారు. ప్రతి ఒక్కరికి వాట్సప్ సౌకర్యం ఉంది. ఈ టెక్నాలజీతో పోలీసులను ప్రజల దగ్గర చేర్చడానికి పోలీసు వాట్సప్‌ను ప్రారంభించారు. దీని కోసం 8099999977 నంబర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఎక్కడైనా శాంతి భద్రతలకు ఆటంకం కలిగినా, ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరిగినా వెంటనే ఈ నంబర్‌కు జరిగిన సంఘటనను చిత్రీకరించి పంపించవచ్చు
ఫేస్‌బుక్‌కు పెరిగిన ఆదరణ
నగరంలో తిరుపతి పొలీసు ఫేస్‌బుక్‌కు రోజు రోజుకు ఆదరణ పెరుగుతోంది. నగరంలోని ప్రజలు నిత్యం ఫేస్‌బుక్‌ను తిలకిస్తూ నగరంలోని ట్రాఫిక్ సమస్యలు, అవాంఛనీయ ఘటనలు పోలీసులకు తెలిపేలా పోస్టు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు పోలీసులు దీనిని పరిశీలిస్తూ వచ్చిన పోస్టును, కామెంట్స్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నారు. సాధారణ ప్రజలు కూడా ఇందులో భాగస్వామ్యులై సలహాలు ఇస్తున్నారు. ఇందులో లాగిన్ అయితే ఇప్పటిదాకా జరిగిన నేరాలు, సంబంధించిన వీడియోలు ఇందులో అప్‌లోడ్ చేశారు.
టెక్నాలజీతో నేరాలను అరికడతాం..
మనకు అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీతో నేరాలను అరికట్టేందుకు కృషి చేస్తున్నాం. ప్రజలకు, పోలీసులకు నిత్యం సంబంధాలు ఉండేలా ఫేస్‌బుక్, వాట్సప్ వంటి సోషల్ సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చాం. ఇప్పటికే సీసీ కెమెరాల ద్వారా ఎన్నో నేరాలను పరిష్కరించాం. ఫేస్‌బుక్ ప్రారంభించిన 20 రోజులకే మంచి స్పందన వచ్చింది. మరింత అడ్వాన్స్‌గా వాట్సప్‌ను కూడా ప్రారంభించాం. ఎక్కడైనా నేరాలు జరిగితే వెంటనే చిత్రీకరించి అప్‌లోడ్ చేయండి. మీ వివరాలను గోప్యంగా ఉంచుతాం.
-అర్బన్ జిల్లా ఎస్పీ గోపీనాథ్ జెట్టి