పోలీసులు విడుదల చేసిన పోస్టర్
పెద్దపల్లి: చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంది కదా.. అని ఇష్టం వచ్చినట్లు వాట్స్‌యాప్ గ్రూపుల్లో వివాదస్పద కామెంట్లు చేస్తే ఇక కటకటాలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో పోస్టర్లను ముద్రించి హెచ్చరికలతో కూడిన ప్రచారాన్ని చేపడుతోంది. ఇతర మతాలను, వ్యక్తులను కించపరిచేలా ఫేస్‌బుక్, వాట్స్‌యాప్ గ్రూపుల్లో పోస్టులు చేస్తే వాటిపై చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. ఇటీవల కాలంలో రాజకీయ పార్టీ నాయకులతోపాటు తమ వ్యక్తిగత శత్రువులను కించపరుస్తూ పుంకాను పుంకాలుగా వాట్స్‌యాప్ గ్రూపుల్లో వైరల్ అవుతున్నాయి. జవాబు చెప్పలేని పరిస్థితిలో ఉండగా, పోలీస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి వదిలేస్తున్నారు.
దీనిపై అనేక సందర్భాల్లో వాట్స్‌యాప్ గ్రూపుల్లో వ్యాఖ్యలు శృతిమించడంతో కామెంట్లతోపాటు వివాదస్పదమైన అంశాలకు లైక్‌లు కొట్టిన వారిని సైతం బాధ్యులను చేస్తూ చర్యలు తీసుకుంటామని పోలీసులు ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి నేరాలకు పాల్పడిన వ్యక్తులపై సెక్షన్ 153 ఎ, 295 ఎ, ఐపీసీ 66సి, ఐటీ యాక్టు కింద అరెస్టు చేసి, నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేస్తామని పోలీస్ అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఎవరో మిత్రుడు చేసిన పోస్టును తనకు తెలియకుండా ఇతర గ్రూపుల్లో పోస్టు చేశానంటూ తప్పించుకునే అవకాశం కూడా ఉండదని, ఇతరులు పోస్టు చేసిన వాటిని సైతం బాధ్యులుగానే చూస్తామని పోలీస్ అధికారులు చెబుతున్నారు.
రాజకీయ నాయకులకు ఊరట
పోలీసులు తాజాగా వాట్స్‌యాప్ గ్రూపులు, ఫేస్‌బుక్ ఖాతాలపై తీసుకున్న నిర్ణయంతో రాజకీయ పార్టీ నాయకులకు ఊరట కలుగుతోంది. కొంతకాలంగా పరుష పదజాలంతో వాట్స్‌యాప్ గ్రూపుల్లో వైరల్ అవుతుండడంతో నాయకుల ఆత్మగౌరవం దెబ్బతింటుందని ఆవేదనగా ఉండేవారు. అయితే సమాధానం ఇవ్వడం కంటే మౌనంగా ఊరుకోవడమే మంచిదని కొందరుంటే, మరికొందరు కయ్యానికి వెళ్తూ సవాళ్లు, జవాబుల మధ్య వాట్స్‌యాప్ గ్రూపుల్లో ఉన్న సభ్యులకు తలనొప్పిగా మారుతున్నారు. ప్రస్తుతం పోలీసులు తీసుకుంటున్న చర్యల హెచ్చరికలు ఫలిస్తే గాయపరిచే పోస్టులైనా నిలిచిపోతాయని భావిస్తున్నారు
Comments
Please login to add a commentAdd a comment