నేడు వరల్డ్ వాయిస్ డే
సమస్య మొదలవుతున్నట్టే.. తస్మాత్ జాగ్రత్త
గుంటూరు మెడికల్ : మానవునికి స్వరం దేవుడిచ్చిన వరం. విభిన్న రీతుల్లో స్వరాలు పలికించే శక్తి సమస్త జీవరాశుల్లో ఒక్క మానవునికే ఉంది. మానవుల్లో స్వరపేటిక కేవలం మాటలకే కాదు.. విచారం, సంతోషం, కోపం మొదలైన భావోద్వేగాలను పలికించడంలోనూ దిట్ట. గాయకులు, రాజకీయనాయకులు, వ్యాపారవేత్తలు, ఉపాధ్యాయులు, టీవీ, సినీ ఆర్టిస్టులు, డబ్బింగ్ ఆర్టిస్టులు స్వరంపైనే ఆధారపడి జీవిస్తుంటారు. వీరిని ప్రొఫెషనల్ వాయిస్ యూజర్స్ అంటారు. స్వరం వీరి భవిష్యత్తును కూడా నిర్ధేశిస్తుంది. ఇటువంటి వారిలో స్వరసమస్యలు పెద్ద ఇబ్బందులు సృష్టించవచ్చు. నేడు ప్రపంచ స్వర దినోత్సవం సందర్భంగా సాక్షి ప్రత్యేక కథనం
స్వర సమస్యలు తక్కువేమీ కాదు..
స్వర సమస్యల్లో సామాన్యంగా వచ్చేది బొంగురు గొంతు. మాట్లాడేటప్పుడు స్వరం బిగపట్టిపోవటం, మాటలు మధ్యలో ఆగిపోవటం వంటివి సాధారణంగా కనిపించే సమస్యలు. మగవారిలో కీచుగొంతు లేక ఆడగొంతు రావటం, ఆడవారికి మగ గొంతురావటం, గాయకుల్లో పాడేటప్పుడు గొంతు జీరపోవటం వల్ల ఉచ్ఛ స్థాయిలో పాడలేకపోటం తదితర సమస్యలు వస్తాయి. స్వరమార్గం సన్నబడటం, స్వరనాడుల మధ్య పొరలు ఏర్పడడం, స్వరనాడుల్లో పక్షవాతం మొదలైన సమస్యలు పుట్టకతోనే వస్తాయి. ఆరేళ్లనుండి 14ఏళ్ల వయస్సులో పిల్లలో గొంతు బొంగురు పోతుంది. యుక్తవయస్సులో ఆడవారిలో మగగొంతు, మగవారిలో ఆడగొంతు ఏర్పడుతుంది. వీటిలో కొన్ని హార్మోన్‌ల మార్పు వల్ల సహజంగా జరిగే పరిణామాలైతే మరికొన్నింటికి ఇన్‌ఫెక్షన్లు కారణమవుతాయి. మధ్య వయస్కులకు స్వరపేటికలో కణుతులు ఏర్పడి అవి క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదముంది. ైథైరాయిడ్ ఆపరేషన్ తరువాత లేదా తల, మెడ, ఛాతీ భాగాలలో దెబ్బలు తగలటం, వైరల్ ఇన్‌ఫెక్షన్లు స్వరపేటిక పక్షవాతానికి దారితీస్తుంది.
స్వర సమస్యలను తేలిగ్గా తీసుకోవద్దు..
ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం మూడు వారాలకు మించి బొంగురు గొంతు ఉంటే క్యాన్సర్‌గా అనుమానించాల్సి ఉంటుంది. వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. 50 నుండి 60 శాతం స్వరసమస్యలను వాయిస్‌థెరపీ ద్వారా నయం చేసీ వీలుంది. స్వరసమస్యలు రాకుండా ఉండాలంటే పెద్దగా అరవడం, గట్టిగా కేకలు వేయడం చేయకూడదు. మాటిమాటికీ గొంతు సవరించుకునే అలవాటు మానుకోవాలి. ధూమపానం, మద్యపానం, కాఫీలకు, దూరంగా ఉండి నీరు ఎక్కువ మోతాదులో తీసుకోవాలి.
- డాక్టర్ ఫణీంద్రకుమార్, వాయిస్ సర్జన్