దూరవాసన | bad smell | Sakshi
Sakshi News home page

దూరవాసన

Published Wed, Oct 28 2015 11:35 PM | Last Updated on Sun, Sep 3 2017 11:38 AM

దూరవాసన

దూరవాసన

మాట మంచిదే కావచ్చు, అయినా అందరూ దూర దూరంగా తప్పించుకుని తిరుగుతుంటారు.  ‘పాపం... మాట మంచిదే కానీ, నోరు మంచిది కాదు’ అనే వ్యాఖ్యలుచాటుమాటుగా వినిపిస్తూనే ఉంటాయి. బడికి వెళ్లే పిల్లలకు ఈ సమస్య ఉంటే, వారు నోరు విప్పి మాట్లాడేందుకు ప్రయత్నిస్తే చాలు, తోటి పిల్లల నుంచి హేళనలు ఎదురవుతాయి. గృహిణులకు ఇదే సమస్య ఉంటే, వారుఎదురైతే చాలు సాటి అమ్మలక్కలు ఏదో అర్జంటు పని ఉన్నట్లు ముఖం తిప్పేసుకుంటారు. ఉద్యోగులకు ఈ సమస్య ఉంటే, కొలీగ్స్ దూరమవుతారు. తప్పనిసరిగా బాస్‌ను కలుసుకోవాల్సిన సందర్భాల్లో చిర్రుబుర్రులు ఎదురవుతాయి. ఒకవేళ బాస్‌కే ఈ సమస్య ఉంటే, ఉద్యోగుల ఇబ్బంది ఇక వర్ణనాతీతం. నోటి దుర్వాసన మాచెడ్డ సమస్య. దూరంగా వ్యాపించే వాసన మనిషి నుంచి మనిషిని దూరం చేస్తుంది.
 
సాధారణ మానవ సంబంధాలనే కాదు, గాఢమైన మైత్రీబంధాలనూ దెబ్బతీస్తుంది. ఒక్కోసారి దంపతుల మధ్య విడాకులకూ దారితీస్తుంది. ఫలితంగా మానసికమైన కుంగుబాటుకు, అనవసరమైన అపరాధ భావనకు దారితీస్తుంది. చాలావరకు ఈ సమస్యను ఎవరికి వారే తేలికగా తెలుసుకోవచ్చు. నోటికి ఎదురుగా అరచెయ్యి పెట్టుకుని గాలి ఊదండి. పరిస్థితి అర్థమైపోతుంది. అరుదుగా కొందరిలో ఈ సమస్య ఉన్నా, వారికి ఆ విషయం తెలియదు. అలాంటి సమస్యతో మీ సన్నిహితులెవరైనా బాధపడుతుంటే, వారికి సున్నితంగా ఆ విషయాన్ని తెలిపి, వెంటనే వైద్య సహాయం పొందేలా ప్రోత్సహించండి. నోటి దుర్వాసనను అధిగమించే మార్గాలను వివరించడానికే ఈ కథనం.

ఇవీ సాధారణ కారణాలు
నోటి దుర్వాసనను వైద్య పరిభాషలో ‘హాలిటోసిస్’ అంటారు. నోటి దుర్వాసనతో బాధపడేవారు డెంటిస్టు లేదా ఫిజీషియన్ వద్దకు వెళ్లాలి. సమస్య నిజంగానే ఉంటే వైద్యులు దానికి తగిన చికిత్స చేస్తారు. నోటి దుర్వాసనకు అనేక కారణాలు ఉంటాయి. వాటిలోని సర్వసాధారణ కారణాలు ఇవి...
     
నోటిలో లాలాజలం తగ్గడం. వయసు మళ్లుతున్న కొద్దీ లాలాజలం తగ్గి నోటి దుర్వాసన వస్తుంది.ఒక్కోసారి కట్టుడు పళ్లు కూడా నోటి దుర్వాసనకు దారితీస్తాయి. రంధ్రాలు ఏర్పడిన పిప్పిపళ్లు, చిగుళ్ల వాపు నోటి దుర్వాసనను కలిగిస్తాయి. నాలుకను సరిగా శుభ్రం చేసుకోకపోయినా నోటి దుర్వాసన వస్తుంది.   పొగతాగడం, పొగాకు నమలడం వంటి దురలవాట్లు నోటి దుర్వాసనను పెంచుతాయి. స్వీట్లు, నోటికి అంటుకుపోయే బేకరీ ఉత్పత్తులు వంటివి కూడా బ్యాక్టీరియా పెరుగుదలకు దోహదపడి నోటి దుర్వాసన కలిగిస్తాయి.జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయకపోయినప్పుడు కూడా నోటి దుర్వాసన రావచ్చు. ఇలాంటి పరిస్థితిని వైద్య పరిభాషలో ‘ఫెటార్ హెపాటికస్’ అంటారు. ఈ పరిస్థితిలో మౄతదేహం నుంచి వెలువడే వాసన వస్తుంది.
 
కొన్ని అరుదైన కారణాలు
దీర్ఘకాలిక వ్యాధులు, మనం వాడే యాంటీబయోటిక్స్ వంటి కొన్ని అరుదైన కారణాలు కూడా నోటి దుర్వాసనను కలిగిస్తాయి.ముఖ్యంగా డయాబెటిస్‌తో బాధపడేవారికి నోటి దుర్వాసన వచ్చే అవకాశాలు ఎక్కువ. వారి రక్తంలో వెలువడే కీటోన్స్ అనే విషపదార్థాలు ఈ సమస్యను కలిగిస్తాయి.కీళ్లవాతానికి సంబంధించిన జ్వరం (రుమాటిక్ ఫీవర్) ఉన్నవారిలోనూ నోటి దుర్వాసన వస్తుంది.ఊపిరితిత్తులకు గాయమైనా, ఊపిరితిత్తుల్లోకి దారితీసే వాయునాళాలు వ్యాకోచించినా నోటి దుర్వాసనకు దారితీసే అవకాశాలు ఉంటాయి. ఈ కండిషన్‌ను ‘బ్రాంకియాక్టాసిస్’ అంటారు.మూత్రపిండాలు దెబ్బతిన్నట్లయితే, అవి రక్తంలోని అమోనియా వంటి వ్యర్థాలను సమర్థంగా వడపోయలేవు. అలాంటప్పుడు కూడా నోటి దుర్వాసన రావచ్చు. రక్తకణాలకు సంబంధించిన హీమోఫీలియా, అప్లాస్టిక్ అనీమియా, రక్తంలో ప్లేట్‌లెట్లు తగ్గడం (థ్రాంబోసైటోపీనియా) వంటి వ్యాధులు ఉన్నవారిలోనూ నోటి దుర్వాసన వస్తుంటుంది

  కొందరిలో ‘ట్రైమీథైల్ అమైన్’ అనే ఎంజైమ్ లోపించడం వల్ల నోటి నుంచి చేపల వాసన వస్తుంటుంది. ఇలాంటి పరిస్థితిని వైద్య పరిభాషలో ‘ట్రైమీథైల్ మెన్యూరియా’ అని, వాడుక భాషలో ఫిష్ ఆడర్ సిండ్రోమ్ అని అంటారు. గుండెజబ్బులను నివారించే యాంటీ ఏంజినల్ డ్రగ్స్ వల్ల, మూత్రవిసర్జన సాఫీగా జరిగేలా చేసే డైయూరెటిక్స్ ఔషధాల వల్ల, కేన్సర్‌ను నిరోధించే మందుల వల్ల, రేడియేషన్ థెరపీ వల్ల, నిద్రమాత్రల వల్ల కూడా నోటి దుర్వాసన వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి ఔషధాలను వాడటం వల్ల నోట్లో లాలాజలం ఉత్పత్తి తగ్గిపోయి, నోరు పొడిబారిపోతుంది. దీన్నే ‘జీరోస్టోమియా’ అంటారు.

అత్యంత అరుదుగా టాన్సిల్స్‌లో రాళ్లు ఏర్పడిన సందర్భాల్లో కూడా నోటి దుర్వాసన వస్తుంది.నోటి దుర్వాసన సమస్య సాధారణ బరువుతో ఉండేవారి కంటే స్థూలకాయుల్లోనే ఎక్కువగా ఉంటున్నట్లు నిపుణులు గుర్తించారు. అందువల్ల బరువు తగ్గించుకోవడం ద్వారా కూడా పరిస్థితిని అదుపు చేయవచ్చు.
 
నివారణ మార్గాలు

ఆహారం తీసుకున్న తర్వాత నోటిని శుభ్రంగా కడుక్కోవాలి. {పతిరోజూ రెండు పూటలా సక్రమంగా పళ్లు తోముకోవాలి, నాలుకను శుభ్రం చేసుకోవాలి.ఉల్లి, వెల్లుల్లి తింటున్నట్లయితే, వాటిలో ఉండే గంధకం వల్ల దాదాపు 48 గంటల సేపు నోటి దుర్వాసన వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండటం మంచిది.మసాలాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల వల్ల కూడా ఇదే పరిస్థితి తలెత్తుతుంది. అందువల్ల వీటి వాడకాన్ని పరిమితం చేసుకోవాలి. కొందరికి నోటి దుర్వాసన ఉన్నా, ఆ విషయం వారికి తెలియకపోవచ్చు. అలాంటప్పుడు వారి కుటుంబ సభ్యులు లేదా సన్నిహితులు వారిని వైద్యుల వద్దకు తీసుకుపోయి, తగిన చికిత్స పొందేలా చేయాలి.
  ఆక్సిజన్ అందకపోయినా పెరిగే అనేరోబిక్ బ్యాక్టీరియా కూడా నోటి దుర్వాసనకు కారణం కావచ్చు. అలాంటప్పుడు ఇంట్రాఓరల్ స్ప్రే (నోటిని తాజాగా ఉంచే స్ప్రే) వాడటం వల్ల సమస్యను నివారించుకోవచ్చు.

జింక్, క్లోరిడాక్సిన్, హైడ్రోజన్ పెరాక్సైడ్, ఆల్కహాల్ వంటి పదార్థాలు కలిగిన మౌత్‌వాష్‌లు కూడా సూక్ష్మ క్రిములను అరికట్టి, నోటిదుర్వాసనను నివారిస్తాయి.తరచుగా నీళ్లు తాగడం, సుగర్‌ఫ్రీ చూయింగ్‌గమ్స్ నమలడం కూడా నోటి దుర్వాసనను అరికడతాయి.
 అనుమానం పెనుభూతం నోటి దుర్వాసన లేకుండానే, ఉందేమోననే అనుమానంతో కొందరు తరచు వైద్యుల వద్దకు వెళుతుంటారు. ఇలాంటి వారు ఒక వైద్యుని సలహాతో తృప్తి పడకుండా, తరచు వైద్యులను మారుస్తుంటారు. ఇలాంటి వారికి మానసిక చికిత్స అవసరమవుతుంది. అనుమానం మరీ తీవ్రంగా లేకపోతే, ఈ పరిస్థితి నివారణకు తేలికపాటి ప్రత్యామ్నాయాలూ ఉన్నాయి.
 - ఇన్‌పుట్స్: డా. ప్రత్యూష, కన్సల్టంట్ ఓరల్ ఫిజీషియన్ అండ్ కాస్సటిక్ డెంటిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్
 
 
 
 ప్రత్యామ్నాయాలు
 యాలకులు వంటి సుగంధ ద్రవ్యాలను నమలడం.
 నోటిని తాజాగా ఉంచే బ్రిథనాల్ వంటి ఉత్పత్తులను వాడటం.  టీ నుంచి సంగ్రహించే కొన్ని సహజ సిద్ధ పదార్థాలను వాడటం.
 
చికిత్స అవసరమయ్యే పరిస్థితులు

 నోటి దుర్వాసనకు చికిత్స అవసరమయ్యే పరిస్థితులను టీఎన్1 నుంచి టీఎన్5 అని వైద్య నిపుణులు వర్గీకరించారు. వాటి వివరాలు... కేటగిరీ    చికిత్స మార్గాలు
టీఎన్-1    నోటి పరిశుభ్రత కోసం స్వీయ మార్గాలు
టీఎన్-2     చిగుళ్ల సమస్య రాకుండా ముందుగానే చికిత్స తీసుకోవడం
టీఎన్-3    ఫిజీషియన్ సహాయం తీసుకోవడం
టీఎన్-4    దుర్వాసనకు కారణం గుర్తించి,
 నిపుణుల ద్వారా చికిత్స పొందడం
టీఎన్-5    ఇది కేవలం అనుమానం మాత్రమే. దీనికి సైకియాట్రిస్ట్ లేదా సైకాలజిస్ట్ ఆధ్వర్యంలో
ఫిజీషియన్లు చికిత్స చేస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement