కొంతమంది పిల్లల్లో నోట్లో, నాలుక మీద, గొంతు లోపల తరచూ పుండ్లలా వస్తుంటాయి. చిన్నారుల్లో ఈ సమస్య కనిపించినప్పుడు నొప్పితో బాధపడటం, నోరూ, గొంతు ఇన్ఫెక్షన్ వచ్చినప్పటిలా ఎర్రబారడమూ జరుగుతుంది. ఏమీ తినలేక సన్నబడతారు. ఇలా వచ్చే పుండ్లను వైద్యపరిభాషలో ఆఫ్తస్ అల్సర్స్ అంటారు.
కారణాలు: ఈ సమస్యకు చాలా కారణాలు ఉన్నాయి. ఉదా...
నోట్లో గాయాలు కావడం (బ్రషింగ్ వల్ల, బాగా ఘాటైన పేస్టులు, కొన్ని అబ్రేసివ్ ఆహారపదార్థాల వల్ల గాయాలవుతుంటాయి)
విటమిన్‌లు, పోషకాల లోపం... (ముఖ్యంగా విటమిన్ బి12, ఐరన్, ఫోలిక్ యాసిడ్, జింక్ ల వంటి పోషకాలు లోపించడం)
అనేక కారణాలతో నీరసించిపోవడం (ఫెటీగ్) వైరల్ ఇన్ఫెక్షన్‌లు (ముఖ్యంగా హెర్పిస్ వంటివి)
పేగుకు సంబంధించిన సమస్యలు, రక్తంలో మార్పులు, గ్లూటిన్ అనే పదార్థం సరిపడకపోవడం, తరచూ జ్వరాలు... వంటి అనేక శారీరక సమస్యలతోపాటు మానసికంగా ఉద్వేగ పరమైన ఒత్తిడి (ఎమోషనల్ స్ట్రెస్) వల్ల కూడా పిల్లల్లో ఈ తరహా పుండ్లు (మౌత్ అల్సర్స్) కనిపించవచ్చు.
చికిత్స / మేనేజ్‌మెంట్: నోట్లో పుండ్లు పడ్డ పిల్లలకు బాధ తెలియకుండా ఉండేందుకు పైపూతగా వాడే మందులు, యాంటిసెప్టిక్ మౌత్ వాష్‌లు; పోషకాహార లోపం వల్ల సమస్య వస్తే వాళ్లలో విటమిన్ సప్లిమెంట్స్ వాడాల్సి ఉంటుంది. ఇలాంటి పిల్లల్లో చాలా అరుదుగా స్టెరాయిడ్ క్రీమ్స్ వాడటం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇలా మౌత్ అల్సర్స్ కనిపించినప్పుడు పీడియాట్రీషియన్ లేదా డెంటల్ నిపుణులను సంప్రదించాలి.
Comments
Please login to add a commentAdd a comment