Ulcers
-
చిన్నారుల నోట్లో పుండ్లు?
కొంతమంది పిల్లల్లో నోట్లో, నాలుక మీద, గొంతు లోపల తరచూ పుండ్లలా వస్తుంటాయి. చిన్నారుల్లో ఈ సమస్య కనిపించినప్పుడు నొప్పితో బాధపడటం, నోరూ, గొంతు ఇన్ఫెక్షన్ వచ్చినప్పటిలా ఎర్రబారడమూ జరుగుతుంది. ఏమీ తినలేక సన్నబడతారు. ఇలా వచ్చే పుండ్లను వైద్యపరిభాషలో ఆఫ్తస్ అల్సర్స్ అంటారు. కారణాలు: ఈ సమస్యకు చాలా కారణాలు ఉన్నాయి. ఉదా... నోట్లో గాయాలు కావడం (బ్రషింగ్ వల్ల, బాగా ఘాటైన పేస్టులు, కొన్ని అబ్రేసివ్ ఆహారపదార్థాల వల్ల గాయాలవుతుంటాయి) విటమిన్లు, పోషకాల లోపం... (ముఖ్యంగా విటమిన్ బి12, ఐరన్, ఫోలిక్ యాసిడ్, జింక్ ల వంటి పోషకాలు లోపించడం) అనేక కారణాలతో నీరసించిపోవడం (ఫెటీగ్) వైరల్ ఇన్ఫెక్షన్లు (ముఖ్యంగా హెర్పిస్ వంటివి) పేగుకు సంబంధించిన సమస్యలు, రక్తంలో మార్పులు, గ్లూటిన్ అనే పదార్థం సరిపడకపోవడం, తరచూ జ్వరాలు... వంటి అనేక శారీరక సమస్యలతోపాటు మానసికంగా ఉద్వేగ పరమైన ఒత్తిడి (ఎమోషనల్ స్ట్రెస్) వల్ల కూడా పిల్లల్లో ఈ తరహా పుండ్లు (మౌత్ అల్సర్స్) కనిపించవచ్చు.చికిత్స / మేనేజ్మెంట్: నోట్లో పుండ్లు పడ్డ పిల్లలకు బాధ తెలియకుండా ఉండేందుకు పైపూతగా వాడే మందులు, యాంటిసెప్టిక్ మౌత్ వాష్‌లు; పోషకాహార లోపం వల్ల సమస్య వస్తే వాళ్లలో విటమిన్ సప్లిమెంట్స్ వాడాల్సి ఉంటుంది. ఇలాంటి పిల్లల్లో చాలా అరుదుగా స్టెరాయిడ్ క్రీమ్స్ వాడటం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇలా మౌత్ అల్సర్స్ కనిపించినప్పుడు పీడియాట్రీషియన్ లేదా డెంటల్ నిపుణులను సంప్రదించాలి. -
కడుపులో అల్సర్స్ తగ్గాలంటే..!
ఆహారపు అలవాట్లు మారడం తోపాటు జీవనశైలిలో ఒత్తిడి పెరగడం వల్ల జీర్ణకోశానికి వస్తున్న సమస్యల్లో కడుపులో అల్సర్స్ కూడా ఒకటి. ఆహారాన్ని జీర్ణం చేయడం కోసం కడుపులో ఆమ్లం (యాసిడ్) ఉత్పత్తి అవుతుంది. అది నిర్ణీత మోతాదులో ఉత్పత్తి కాకపోవడం వల్ల కడుపులో అల్సర్లు వస్తాయి. ఇలా జీర్ణాశయంలో వచ్చే అల్సర్‌ని గ్యాస్ట్రిక్ అల్సర్ అంటారు. ఈ అల్సర్స్‌ను అధిగమించాలంటే... యోగా, ధ్యానం వంటి వాటి ద్వారా మానసిక ఒత్తిడికి దూరంగా ఉండటం ఆహారంలో కారం, మసాలాలు తక్కువగా ఉండేలా జాగ్రత్తపడటం కాఫీ, టీలు పరిమితంగా తీసుకోవడం లేదా పూర్తిగా మానేయడం పొగతాగడం, మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉండటం క్రమం తప్పకుండా రోజూ ఒకే సమయానికి ఆహారం తీసుకోవడం.(చదవండి: ప్రపంచంలోనే తొలి పోర్టబుల్ విపత్తు ఆస్పత్రి!ఎక్కడంటే..) -
కడుపులో అల్సర్స్
ఈరోజుల్లో మన జీవనశైలి చాలా ఒడిదొడుకులతో ఉంటోంది. టైమ్‌కు భోజనం తినకపోవడం, మసాలాలతో కూడిన ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం, తీవ్రమైన ఒత్తిడితో కూడిన జీవనం గడపడంతో పాటు చాలామంది రాత్రి కాగానే ఆల్కహాల్స్, పగటిపూట సాఫ్ట్డ్రింక్స్తో అస్తవ్యస్తమైన జీవితం గడుపుతున్నారు. ఈ జీవనశైలి కారణంగా మనలో అల్సర్స్ వచ్చే అవకాశం ఎక్కువ. అలాంటి అల్సర్ల గురించి అవగాహన కల్పించేందుకే ఈ కథనం. మనం ఆహారం తీసుకున్న తర్వాత అది ప్రయాణించే మార్గమంతా మంచి లైనింగ్‌తో ఉంటుంది. ఈ లైనింగ్ మీద ఆహారం తేలిగ్గా ముందుకెళ్లడానికి జిగురు లాంటి పదార్థం (మ్యూకస్) తోడ్పడుతుంది. ఇక పేగుల దగ్గర మైక్రో విల్లై పేరిట... జీర్ణమైన ఆహారాన్ని ఒంటి లోపలికి ఇంకేలా పీల్చుకోడానికి అంతే సంక్లిష్టమైన నిర్మాణాలుంటాయి. అటు ఆహారం సజావుగా వెళ్లడానికీ, అలాగే దాని లోపలి పోషకాలు లోపలికి ఇంకడానికీ ఉన్న ఆ దారిలో ఎక్కడైనా ఒరుసుకుపోయినట్లుగా ఉంటే... వాటిని ఎరోజన్స్ అంటారు. అలాంటి ఎరోజన్స్ గాట్లు మరింత లోతుగా ఉంటే... వాటినే అల్సర్స్‌గా పిలుస్తారు. ఒకసారి అల్సర్ వస్తే అది మళ్లీ మళ్లీ వచ్చేందుకు అవకాశం ఉంది. కాబట్టి అల్సర్ వచ్చినవాళ్లు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అల్సర్స్ ఎందుకొస్తాయో, అలా ఒకసారి అల్సర్స్ వచ్చి తగ్గినవారితో పాటు... రానివాళ్లు భవిష్యత్తులో అలాంటి సమస్యే ఉత్పన్నం కాకుండా చూసుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో తెలుసుకుందాం. ఎలా ఏర్పడతాయి ఈ అల్సర్స్? మన నోటిలో ఉండే మృదువైన పొరను మ్యూకోజా అంటారు. ఆ పొరలాంటి లైనింగ్లాంటిదే దాదాపు ఆహారం ప్రయాణించే మార్గమంతా ఉంటుంది. ఈ మొత్తం దారిలో అల్సర్స్ ఎక్కడైనా రావచ్చు. అవి వచ్చేందుకు కారణాలెన్నో. అవి వచ్చిన ప్రదేశాన్ని బట్టి... నోట్లో అయితే నోటి అల్సర్ అనీ, కడుపులో స్టమక్ అల్సర్ అనీ, పేగులోని వాటికి ఇంటస్టైనల్ అల్సర్ అని పేరు పెడతారు. కారణాలివి కడుపులో స్రవించే యాసిడ్ లోపలి లైనింగ్‌ను తినేయడం, సమయానికి తినకపోవడం, సిగరెట్స్ / పొగతాగడం, ఆల్కహాల్ వల్ల మ్యూకోజా దెబ్బతినవచ్చు. ఆ గాయం మరింత తీవ్రమైతే దాన్నే అల్సర్ అని చెప్పవచ్చు. కడపులో ఉండే యాసిడ్స్ మాత్రమేగాక... ఒక్కోసారి కూల్‌డ్రింక్స్ రూపంలో మనం తాగే కార్బొనేటెడ్ డ్రింక్స్ వల్ల కూడా ఈ మ్యూకోజా గాయపడవచ్చు. కొన్నిసార్లు యాస్పిరిన్, కొన్ని నొప్పినివారణ మందులు వల్లకూడా అల్సర్స్ రావచ్చు. హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా కూడా అల్సర్లకు మరో ప్రధాన కారణం. కొన్నిసార్లు మానసిక ఒత్తిడి వల్ల కూడా ఈ అల్సర్స్ రావచ్చు. మామూలుగానైతే మ్యూకోజాలో గాయం అయినప్పుడు మనలోని డిఫెన్సివ్ ఫ్యాక్టర్ వల్ల అది దానంతట అదే తగ్గిపోతుంది. కాని గాయపరిచే శక్తుల ప్రభావం ఎక్కువై, ఆ గాయం మరింత లోతుగా అయినప్పుడు అల్సర్స్ ఏర్పడతాయి. అల్సర్ ఉంటే... కడుపులో అల్సర్స్ ఉన్నప్పుడు సాధారణంగా కడుపునొప్పి వస్తుంది. కడుపునొప్పితోపాటు కనిపించే ఇతర లక్షణాలివి... ►అకస్మాత్తుగా అర్ధరాత్రి కడుపు పైభాగంలో నొప్పి, మంటతో నిద్రాభంగం కావడం. ►ఏమీ తినకపోతే కడుపునొప్పి రావడం, ►ఏదైనా తినగానే వాంతులు కావడం, నొప్పి రావడం. ►భోజనం మొత్తం తినలేకపోవడం, అంటే... కాస్తంత తినగానే కడుపునిండిపోయినట్లు అనిపించడం. ►కడుపు ఉబ్బరం, తేన్పులు. ►కొందరిలో రక్తహీనత, బరువు తగ్గిపోవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. నిర్ధారణ పరీక్షలు ఇవి రోగి లక్షణాలను బట్టి అల్సర్స్ ఉన్నట్లు అంచనా వేసినా... దాన్ని కచ్చితంగా కనుక్కునేందుకు ఎండోస్కోపీ ఉపయోగపడుతుంది. దీని సహాయంతో కేవలం అల్సర్స్ నిర్ధారణ మాత్రమేగాక... కొన్నిసందర్భాల్లో క్యాన్సర్‌గా అనుమానించే అల్సర్‌ను బయాప్సీ ద్వారా కనుగొనవచ్చు. ఎండోస్కోపీ కేవలం నిర్ధారణ కోసం మాత్రమేగాక... కొన్ని సందర్భాల్లో అల్సర్ ఉన్నచోట రక్తస్రావం జరుగుతుంటే ఆపడం వంటి చికిత్స ప్రక్రియలు చేయడానికి కూడా వీలవుతుంది. అల్సర్స్‌తో దుష్ప్రభావాలివి అల్సర్స్ నుంచి రక్తస్రావం (బ్లీడింగ్) కావడం ఒక కాంప్లికేషన్ కాగా... పేగుకు రంధ్రం పడటం (పెర్ఫొరేషన్) అన్నది మరో కాంప్లికేషన్. పేగు సన్నబడటం (స్టెనోసిస్) అన్నది ఇంకో కాంప్లికేషన్. ఈ రోగుల్లో ఒక్కోసారి రక్తపు వాంతులు కావడం, మలవిసర్జన నల్లగా కావడం, తీవ్రమైన కడుపునొప్పితో వాంతులు కావడం వంటివి జరుగుతాయి. ఆకలి మందగించి కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఇక్కడా అల్సర్స్ లక్షణాలే... తేడా గుర్తించాలిలా పిత్తాశయం (గాల్‌బ్లాడర్)లో రాళ్లు, పాంక్రియాటైటిస్, పాంక్రియాటిక్ క్యాన్సర్లలోనూ అల్సర్స్ ఉన్నప్పటి లక్షణాలే కనిపిస్తాయి. కాబట్టి కడుపునొప్పి, మంట వంటివి కనిపిస్తే కచ్చితమైన వ్యాధి నిర్ధారణ కోసం అల్ట్రాసౌండ్ లేదా అబ్డామినల్ సీటీ స్కాన్ పరీక్షలు చేయించాలి. అలా చేయించడం వల్ల పరిస్థితి ముదరకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఇక అల్సర్ లక్షణాలు కనిపిస్తుంటే ఆ రోగులు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. యాంటాసిడ్స్ తీసుకుంటున్నా కడుపులో విపరీతంగా మంట, నొప్పి తగ్గకుండటం, వాంతులు, కొంచెం తినగానే కడుపునిండిపోయినట్లు అనిపించడం, రక్తహీనత, బరువు తగ్గడం, రక్తపు వాంతులు కావడం, మలం నల్లగా ఉండడం వంటివి చోటుచేసుకుంటే తక్షణం అప్పర్ గ్యాస్ట్రో ఇంటస్టినల్ ఎండోస్కోపీ చేయించాలి. ఎండోస్కోపీ నార్మల్‌గా ఉంటే అప్పుడు అల్ట్రాసౌండ్ లేదా అబ్డామిన్ సీటీస్కాన్ చేయించాలి. పైన పేర్కొన్న అంశాలపై అవగాహన పెంచుకుంటే అల్సర్ వచ్చిన వారూ సురక్షితంగా ఉండవచ్చు. అల్సర్ లేనివారు దాన్ని నివారించుకోవచ్చు. చికిత్స ఇలా... అల్సర్ కోసం కేవలం చికిత్స మాత్రమే సరిపోదు. మందులు వాడటంతో పాటు చాలా నివారణ జాగ్రత్తలనూ పాటించాలి. పొగతాగడం, ఆల్కహాల్ మానేయడం, ఒత్తిడి నివారించుకోవడం, వేళకు తినడం, నొప్పినివారణ మందులు తీసుకోకపోవడం అవసరం. వీటితోపాటు కడుపులో యాసిడ్‌ను తగ్గించే మందులు వాడాలి. ఈ చర్యలతో అల్సర్స్ దాదాపుగా తగ్గిపోతాయి. ఒకసారి అల్సర్ గనక వచ్చిందంటే ఎప్పుడూ వస్తూనే ఉండే అవకాశాలు చాలా ఎక్కువ. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. హెలికోబ్యాక్టర్ పైలోరీ బ్యాక్టీరియా ఉంటే దాన్ని నివారించడానికి మందులు వాడాలి. ఇందుకోసం ప్రొటాన్ పంప్ ఇన్హిబిటర్స్‌తో పాటు టెట్రాసైక్లిన్, మెట్రోనిడజాల్, క్లారిథ్రోమైసిన్, అమాక్సిలిన్, బిస్మత్ సాల్ట్ వంటి మందులు వాడాల్సి ఉంటుంది. ఈ మందులతో దాదాపు 80–90 శాతం అల్సర్ తగ్గుతుంది. అయితే మందులతో తగ్గకపోతే వాళ్లలో ఎండోస్కోపీ ప్రక్రియ ద్వారా రక్తస్రావం ఆపడం లేదా స్టెనోసిస్ (పేగు సన్నబడటం) జరిగితే దాన్ని సర్జరీ ద్వారా చక్కదిద్దాల్సి ఉంటుంది. డాక్టర్ భవాని రాజు, సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
అజీర్ణం... కడుపు ఉబ్బరం ఎందుకిలా?
నా వయసు 43 ఏళ్లు. నాకు కొంతకాలంగా కడుపులో విపరీతమైన మంట, నొప్పి, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే గ్యాస్ట్రైటిస్ అన్నారు. ఈ సమస్య ఎందుకు వస్తుంది. హోమియో చికిత్స ద్వారా నయమవుతుందా? జీర్ణకోశం లోపల ఉండే మ్యూకస్ పొర ఇన్ఫ్లమేషన్ లేదా వాపునకు గురికావడాన్ని గ్యాస్ట్రైటిస్ అంటారు. మనం తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు మన మెదడు లాగే జీర్ణ వ్యవస్థ మీద కూడా ప్రభావం పడుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు ఆకస్మికంగా మొదలై కొన్ని రోజుల వరకు ఉండి తగ్గిపోతే అక్యూట్ గ్యాస్ట్రైటిస్ అంటారు. దీర్ఘకాలికంగా ఇదే సమస్య ఉంటే దాన్ని క్రానిక్ గ్యాస్ట్రైటిస్ అంటారు. కొందరిలో గ్యాస్ట్రిక్ సమస్య ముదిరితే అవి కడుపులో అల్సర్స్ లేదా పుండ్లుగా ఏర్పడతాయి. కారణాలు: ►20 నుంచి 50 శాతం అక్యూట్ గ్యాస్ట్రైటిస్‌లకు వైరస్, బ్యాక్టీరియా (ముఖ్యంగా హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా) కారణమవుతుంది. ►తీవ్రమైన మానసిక ఒత్తిడి, మద్యం ఎక్కువగా తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం ►కొన్నిరకాల మందులు... ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్ వాడటం ►పైత్య రసం వెనక్కి ప్రవహించడం ►క్రౌన్స్ డిసీజ్, కొన్ని ఆటో ఇమ్యూన్ వ్యాధులు ►శస్త్రచికిత్స లేదా వంశపారంపర్య చరిత్ర ఉన్నవారిలో ►ఆహారంలో వేపుళ్లు, మసాలాలు, కారం, పులుపు వంటివి ఎక్కువగా తీసుకునే వారిలో గ్యాస్ట్రైటిస్ సమస్య కనిపిస్తుంది. లక్షణాలు : ►కడుపు నొప్పి, మంట ►కడుపు ఉబ్బరం, కొంచెం తిన్నా కడుపు నిండుగా అనిపించడం ►అజీర్ణం, వికారం, రక్తంతో కూడిన వాంతులు ►ఆకలి తగ్గిపోవడం ►కొందరిలో గ్యాస్ట్రిక్ సమస్య వల్ల మలం రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నివారణ కోసం పాటించాల్సిన జాగ్రత్తలు : ►సమయానికి ఆహారం తీసుకోవాలి ►కొద్దికొద్ది మోతాదుల్లో ఎక్కువ సార్లు తినాలి ►పొగతాగడం, మద్యపానం వంటి దురలవాట్లు పూర్తిగా మానేయాలి ►ఆహారంలో మసాలాలు, కారం, వేపుళ్లు తగ్గించాలి తిన్న వెంటనే పడుకోకూడదు. కనీసం రెండు గంటల తర్వాత నిద్రించాలి. చికిత్స : హోమియో వైద్య విధానం ద్వారా గ్యాస్ట్రిక్ సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. ఈ సమస్యలకు మూలకారణమైన ఆమ్లాలు, తీవ్ర రసాయనాల సమతౌల్యతను చక్కదిద్దడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించవచ్చు. డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ మైగ్రేన్ తలనొప్పి చికిత్సతో తగ్గుతుంది... నాకు వారంలో ఒకటి, రెండు సార్లు తీవ్రమైన తలనొప్పి వస్తోంది. ఎన్నో రక్తపరీక్షలు, ఎక్స్–రే, స్కానింగ్ పరీక్షలు చేయించాను. డాక్టర్లు దీన్ని మైగ్రేన్‌గా నిర్ధారణ చేశారు. హోమియోపతిలో దీనికి చికిత్స ఉందా? మైగ్రేన్ తలనొప్పిని పార్శ్వపు తలనొప్పి అంటారు. మానసిక ఆందోళన, ఒత్తిడి, జరిగిపోయిన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం, డిప్రెషన్, నిద్రలేమి, అధికప్రయాణాలు, సూర్యరశ్మి, స్త్రీలలో హార్మోన్ సమస్యల వల్ల ఈ పార్శ్వపు తలనొప్పి వస్తుంటుంది. పురుషులతో పోలిస్తే ఇది స్త్రీలలోనే ఎక్కువ. మైగ్రేన్‌లో దశలూ, లక్షణాలు : సాధారణంగా మైగ్రేన్ వచ్చినప్పుడు 24 గంటల నుంచి 72 గంటలలోపు అదే తగ్గిపోతుంది. ఒకవేళ 72 గంటలకు పైనే ఉంటే దాన్ని స్టేటస్ మైగ్రేన్ అంటారు. దీంతోపాటు వాంతులు కావడం, వెలుతురునూ, శబ్దాలను అస్సలు భరించలేకపోవడం వంటి లక్షణాలూ కనిపిస్తాయి. వ్యాధి నిర్ధారణ: రక్తపరీక్షలు, రక్తపోటును పరీక్షించడం, సీటీస్కాన్, ఎంఆర్ఐ పరీక్షల ద్వారా మైగ్రేన్‌ను నిర్ధారణ చేయవచ్చు. నివారణ : మైగ్రేన్ రావడానికి చాలా అంశాలు దోహదపడతాయి. ఉదాహరణకు మనం తినే ఆహారంలో మార్పులు, మనం ఆలోచించే విధానం, మానసిక ఒత్తిడి, వాతావరణ మార్పులు, నిద్రలేమి, మహిళల్లో రుతుసమస్యలు వంటి కారణాలతో వచ్చినప్పుడు జీవనశైలిలో మార్పులతో దీన్ని కొంతవరకు నివారించవచ్చు. ఇక మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు వ్యాయామం, యోగా, ప్రాణాయామం చేయాలి. చికిత్స: మైగ్రేన్‌ను పూర్తిగా తగ్గించడానికి హోమియోలో మంచి మందులు ఉన్నాయి. శారీరక, మానసిక, కుటుంబ, అనువంశీక, వాతావరణ, వృత్తిసంబంధమైన కారణాలను అంచనా వేసి, వాటికి అనుగుణంగా మందును ఎంపిక చేయాల్సి ఉంటుంది. వారి జెనెటిక్ కన్‌స్టిట్యూటషన్ సిమిలియమ్ వంటి అంశాలన పరిగణనలోకి తీసుకొని బెల్లడోనా, ఐరిస్, శ్యాంగ్యునేరియా, ఇగ్నీషియా, సెపియా వంటి కొన్ని మందులు మైగ్రేన్‌కు అద్భుతంగా పనిచేస్తాయి. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ మీ సమస్య ఐబీఎస్ కావచ్చు నా వయసు 35 ఏళ్లు. మధ్యానం తిన్న వెంటనే టాయిలెట్‌కు వెళ్లాల్సి వస్తోంది. కొన్నిసార్లు మలబద్దకం, విరేచనం ఒకదాని తర్వాత మరొకటి కనిపిస్తున్నాయి. తేన్పులు, కడుపు ఉబ్బరం వికారం, తలనొప్పి, ఆందోళన ఉన్నాయి. దయచేసి నా సమస్య ఏమిటో వివరించి, హోమియోలో చికిత్స చెప్పండి. ►మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్)తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ సమస్యకు నిర్దిష్టమైన కారణం తెలియదు. అయితే... ►జీర్ణవ్యవస్థలో తరచూ వచ్చే ఇన్ఫెక్షన్లు ►దీర్ఘకాల జ్వరాలు ►మానసిక ఆందోళన ►కుంగుబాటు ►ఎక్కువరోజులు యాంటీబయాటిక్స్‌వాడటం ►జన్యుపరమైన కారణలు చిన్నపేగుల్లో బ్యాక్టీరియా ఎక్కువ సంఖ్యలో ఉండటం వంటివి ఐబీఎస్‌కు దోహదం చేస్తుంటాయి. మీరు చెప్పిన లక్షణాలతో పాటు కొందరిలో నొప్పి లేకుండా కూడా ఐబీఎస్ వస్తుండవచ్చు. వీళ్లలో చాలా వేగంగా మలవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంటుంది. నిద్రలేస్తూనే టాయెలెట్‌కు వెళ్లాల్సివస్తుంది. ఐబీఎస్ క్యాన్సర్‌కు దారితీయదు. ప్రాణాంతకమూ కాదు. అయితే చాలా ఇబ్బంది పెడుతుంది. దీని నిర్ధారణకు నిర్దిష్టమైన పరీక్ష అంటూ ఏదీ లేదు. కాకపోతే రోగి లక్షణాలను బట్టి, రోగి కడుపులో ఏవైనా పరాన్నజీవులు ఉన్నాయా లేదా, చిన్నపేగుల్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఉన్నాయా అనే కొన్ని అంశాల ఆధారంగా దీన్ని చాలా నిశిత పరిశీలనతో వ్యాధి నిర్ధారణ చేస్తారు. దాంతోపాటు మలపరీక్ష, రక్తపరీక్ష, అల్ట్రాసౌండ్ స్కానింగ్ అబ్డామిన్, ఎండోస్కోపీ, హైడ్రోజెన్ బ్రీత్ టెస్ట్ వంటి పరీక్షలు ఈ వ్యాధి నిర్ధారణకు తోడ్పడతాయి. వ్యాధి నివారణ/నియంత్రణకు సూచనలు : ►పీచుపదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి ►ఒత్తిడిని నివారించుకోవాలి ►పొగతాగడం, మద్యపానం వంటి అలవాట్లుంటే ఆయా అలవాట్లను పూర్తిగా మానుకోవాలి ►రోజుకు కనీసం ఎనిమిది గంటలు హాయిగా నిద్రపోవాలి. చికిత్స: ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్‌కు హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. కాన్స్టిట్యూషనల్ సిమిలియమ్ ద్వారా చికిత్స చేసి, సమస్యను చాలావరకు శాశ్వతంగా పరిష్కరించవచ్చు. డాక్టర్ టి.కిరణ్‌కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ -
గ్యాస్ట్రయిటిస్ నయమవుతుందా?
నా వయసు 44 ఏళ్లు. నాకు కొంతకాలంగా కడుపులో విపరీతమైన మంటతోనూ, నొప్పి, అజీర్ణం, కడుపు ఉబ్బరంతో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే గ్యాస్ట్రైటిస్ అన్నారు. మందులు వాడుతున్నంత సేపు బాగానే ఉన్నా, అవి మానేస్తే మళ్లీ మామూలే. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది. హోమియో చికిత్స ద్వారా నయమవుతుందా? ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో అధిక పని ఒత్తిడి వల్ల ఉరుకులు పరుగుల జీవితం గడుపుతున్న నేపథ్యంలో చాలా మంది సరైన ఆహార నియమాలు పాటించకపోవడం, తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురికావడం, శారీరక శ్రమ పెద్దగా లేకపోవడం వంటి కారణాలతో చాలామంది గ్యాస్ట్రైటిస్ సమస్యతో ఇప్పుడు బాధపడుతున్నారు. జీర్ణకోశం లోపల ఉండే మ్యూకస్ పొర ఇన్ఫ్లమేషన్ లేదా వాపునకు గురికావడాన్ని గ్యాస్ట్రైటిస్ అంటారు. మనం తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు మన మెదడు లాగే జీర్ణ వ్యవస్థ మీద కూడా ప్రభావం పడుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు ఆకస్మికంగా మొదలై కొన్ని రోజుల వరకు ఉండి తగ్గిపోతే అక్యూట్ గ్యాస్ట్రైటిస్ అంటారు. దీర్ఘకాలికంగా ఇదే సమస్య ఉంటే దాన్ని క్రానిక్ గ్యాస్ట్రైటిస్ అంటారు. కొందరిలో గ్యాస్ట్రిక్ సమస్య ముదిరితే అవి కడుపులో అల్సర్స్ లేదా పుండ్లుగా ఏర్పడతాయి. కారణాలు : – 20 నుంచి 50 శాతం అక్యూట్ గ్యాస్ట్రైటిస్ లకు వైరస్, బ్యాక్టీరియా (ముఖ్యంగా హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా) కారణమవుతుంది. ∙తీవ్రమైన మానసిక ఒత్తిడి, మద్యం ఎక్కువగా తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం ∙కొన్ని రకాల మందులు... ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్ వాడటం ∙పైత్య రసం వెనక్కి ప్రవహించడం ∙కొన్ని జీర్ణకోశ వ్యాధులు (క్రౌన్స్ డిసీజ్), కొన్ని ఆటో ఇమ్యూన్ వ్యాధులు ∙శస్త్రచికిత్స లేదా వంశపారంపర్య చరిత్ర ఉన్నవారిలో ∙ఆహారంలో వేపుళ్లు, మసాలాలు, కారం, పులుపు వంటివి ఎక్కువగా తీసుకునే వారిలో గ్యాస్ట్రైటిస్ సమస్య కనిపిస్తుంది. లక్షణాలు : కడుపు నొప్పి, మంట ∙కడుపు ఉబ్బరం, కొంచెం తిన్నా కడుపు నిండుగా అనిపించడం ∙అజీర్ణం, వికారం, రక్తంతో కూడిన వాంతులు ∙ఆకలి తగ్గిపోవడం ∙కొందరిలో గ్యాస్ట్రిక్ సమస్య వల్ల మలం రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నివారణ కోసం పాటించాల్సిన జాగ్రత్తలు సమయానికి ఆహారం తీసుకోవాలి .కొద్దికొద్ది మోతాదుల్లో ఎక్కువ సార్లు తినాలి ∙పొగతాగడం, మద్యపానం వంటి దురలవాట్లు పూర్తిగా మానేయాలి ∙ఆహారంలో మసాలాలు, కారం, వేపుళ్లు తగ్గించాలి తిన్న వెంటనే పడుకోకూడదు. కనీసం రెండు గంటల తర్వాత నిద్రించాలి. చికిత్స : హోమియో వైద్య విధానం ద్వారా గ్యాస్ట్రిక్ సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. ఈ సమస్యలకు మూలకారణమైన ఆమ్లాలు, తీవ్ర రసాయనాల సమతౌల్యతను చక్కదిద్దడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించవచ్చు. డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, ఎప్పుడూ ఏదోఆలోచిస్తోంది... సమస్య నయమవుతుందా? మా అమ్మాయి వయసు 24 ఏళ్లు. గత కొంతకాలంగా ఎప్పుడూ పరధ్యానంగా ఉంటోంది. ఎవరితో సరిగా మాట్లాడటం లేదు. మాట్లాడినా ఆ మాటలు తీవ్రమైన నిరాశపూరితంగా ఉంటున్నాయి. ఎప్పుడూ ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటోంది. ఆమెకు సరైన హోమియో మందు సూచించండి. మీరు చెబుతున్న లక్షణాలు డిప్రెషన్ వ్యాధిని సూచిస్తున్నాయి. డిప్రెషన్ మనసుకు సంబంధించిన ఒక రకమైన రుగ్మత. దీనికి గురైన వారు విచారం, నిస్సహాయత, అపరాధభావం, నిరాశలలో ఉంటారు. భావోద్వేగాలు మారుతుంటాయి. శారీరకంగానూ కొన్ని మార్పులు కనిపిస్తాయి. అకస్మాత్తుగా బరువు కోల్పోవడం లేదా పెరగడం, చికాకు పడుతుండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరు నిర్దిష్టంగా కొన్ని కాలాలలో డిప్రెషన్‌కు గురయ్యే అవకాశం ఉంది. ఈ వ్యాధితో బాధపడేవారు పూర్తి డిప్రెషన్లోకి కూరుకుపోయేలోపే చికిత్స అందించడం మంచిది. హోమియో విధానంలో దీనికి మంచి చికిత్స ఉంది. డిప్రెషన్‌ను రెండు రకాలుగా చెప్పవచ్చు. మొదటిది వంశపారంపర్యంగా వచ్చేది. రెండోది న్యూరోటిక్ డిప్రెషన్. ఇవి... మన చుట్టూ ఉండే వాతావరణం, సంఘంలో అసమానతలు, ఉద్యోగం కోల్పోవడం, ఎవరైనా దగ్గరివాళ్లు దూరం కావడం లేదా చనిపోవడం, తీవ్రస్థాయి మానసిక వేదన... వంటి ఎన్నో అంశాల వల్ల రావచ్చు. వివిధ పరిశోధనల ద్వారా ఈ ఆధునిక కాలంలో దీన్ని డిప్రెసివ్ డిజార్డర్‌గా పేర్కొన్నారు. దీనిలో రకాలు మేజర్ డిప్రెషన్ : ఇందులో డిప్రెషన్ లక్షణాలు తీవ్రస్థాయిలో ఉంటాయి. ఆకలి లేకపోవడం, నిద్రలేకపోవడం, పనిలో శ్రద్ధ లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. డిస్థిమిక్ డిజార్డర్ : రోగి తక్కువస్థాయి డిప్రెషన్లో దీర్ఘకాలం పాటు ఉంటాడు. అయితే కొన్నిసార్లు రోగి నార్మల్‌గా ఉన్నట్లుగా అనిపించి, తిరిగి డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తాయి. సైకియాటిక్ డిప్రెషన్ : డిప్రెషన్‌తో పాటు భ్రాంతులు కూడా కనిపిస్తుంటాయి. పోస్ట్ నేటల్ డిప్రెషన్ : మహిళల్లో ప్రసవం తర్వాత దీని లక్షణాలు కనిపిస్తుంటాయి. సీజనల్ ఎఫెక్టివ్ డిప్రెషన్ : సూర్యరశ్మి తగ్గడం వల్ల కొంతమందిలో సీజనల్‌గా డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తుంటాయి. బైపోలార్ డిజార్డర్ : ఈ డిప్రెషన్లో కొంతమంది పిచ్చిగా, కోపంగా, విపరీతమైన ప్రవర్తనను కనబరుస్తుంటారు. కొంత ఉద్రేకం తర్వాత నార్మల్ అయిపోతారు. చికిత్స : హోమియో వైద్యవిధానంలో నేట్రమ్మూర్, ఆరమ్‌మెట్, సెపియా, ఆర్సినిక్ ఆల్బ్, సిమిసిఫ్యూగో వంటి మందులు డిప్రెషన్ తగ్గించడానికి బాగా పనిచేస్తాయి. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), సైనసైటిస్‌కు చికిత్స ఉందా? నా వయసు 33 ఏళ్లు. చాలాకాలంగా సైనసైటిస్‌తో బాధపడుతున్నాను. ఎన్నో మందులు వాడాను. కానీ సమస్య తగ్గడం లేదు. శాశ్వతంగా తగ్గేందుకు హోమియోలో చికిత్స ఉందా? సైనస్ అంటే గాలి గది. మన ముఖంలోని ఎముకల మధ్యల్లో నాలుగు జతలుగా ఖాళీగా ఉండే గాలి గదులు ఉన్నాయి. సైనస్ల లోపలివైపున మ్యూకస్ మెంబ్రేన్ అనే లైనింగ్‌పొర ఉంటుంది. సైనస్‌లు అన్నీ ఆస్టియం అనే రంధ్రం ద్వారా ముక్కులోకి తెరచుకుంటాయి. మనం పీల్చుకునే గాలి ఉష్ణోగ్రతను మన శరీర ఉష్ణోగ్రతకు దగ్గరగా ఉండేలా చేయడానికి సైనస్‌లు ఉపయోగపడతాయి. సైనస్‌లలోకి అంటే... ఖాళీ గదుల్లో ఇన్ఫెక్షన్ వస్తే అది సైనసైటిస్‌కు దారితీస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ ఫ్యారింగ్స్ లేదా టాన్సిల్స్‌కు వ్యాపిస్తే ఫారింజైటిస్, టాన్సిలైటిస్‌కు దారితీయవచ్చు. ఒకవేళ చెవికి చేరితే ఒటైటిస్ మీడియా అనే చెవి ఇన్ఫెక్షన్ వస్తుంది. లక్షణాలు : సైనసైటిస్ వచ్చిన వారికి ∙తరచూ జలుబుగా ఉండటం ∙ముక్కుద్వారా గాలిపీల్చుకోవడం కష్టం కావడం ముక్కు, గొంతులో కఫం లేదా చీముతో కూడిన కఫం చేరడం కొందరిలో ఈ కఫం చెడువాసన రావడం ∙నుదుటి పైభాగంలో లేదా కళ్లకింద, కనుబొమల మధ్య నొప్పి రావడం తల ముందుకు వంచినప్పుడు లేదా దగ్గినప్పుడు తలనొప్పి ఎక్కువ రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధి వచ్చినప్పుడు సైనస్ల నుంచి ఇతర భాగాలకు అంటే... గొంతు, శ్వాసనాళాలకు ఇన్ఫెక్షన్ వ్యాపించవచ్చు. పరీక్షలు : ఎక్స్–రే, సీటీస్కాన్ వంటి పరీక్షల ద్వారా సైనసైటిస్‌ను నిర్ధారణ చేస్తారు. చికిత్స : సైనస్ వ్యాధిని సరైన సమయంలో గుర్తిస్తే ఎలాంటి ఆపరేషన్ లేకుండానే హోమియో మందుల ద్వారా సమర్థంగా నివారించవచ్చు. హోమియో ప్రక్రియలో రోగి వ్యక్తిగత ఆహార అలవాట్లు, ఆలోచనా విధానం, నడవడిక, వ్యాధి లక్షణాలు... ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని మందులు సూచిస్తారు. ఈ వ్యాధికి వాడే కొన్ని ముఖ్యమైన మందులివి... హెపార్ సల్ఫూరికమ్ : అతికోపం, చికాకు ఉండేవారిలో, చల్లగాలికి తిరిగే సైనస్ లక్షణాలు ఎక్కువయ్యే వారికి ఇది మంచి మందు. ∙మెర్క్‌సాల్ : రక్తహీనత ఉండి, అతినీరసం, అల్సర్లు త్వరగా మానకపోవడం, నోటిపూత, నోరు తడిగా ఉన్నప్పటికీ దాహంగా అనిపించడం వంటి లక్షణాలు ఉన్నవారికి ఈ మందు మేలు. ఈ మందులేగాక... మరిన్ని రకాల మందులను వ్యక్తుల శారీరక, మానసిక లక్షణాల ఆధారంగా ఇస్తారు. ఇందులో ఫాస్ఫరస్, ఆర్సినికమ్ ఆల్బ్, కాలీ కార్బ్, సైలీషియా, రస్టక్స్ మొదలైనవి ఉన్నాయి. అయితే నిపుణులైన హోమియో వైద్యుల ఆధ్వర్యంలో మందులు తీసుకోవాలి. వాళ్లు రోగిని చూసి తగిన మందును, మోతాదును నిర్ణయిస్తారు. -
పీసీఓడీకి చికిత్స అందుబాటులో ఉందా?
హోమియో కౌన్సెలింగ్స్ నా భార్య వయసు 38 ఏళ్లు. ఈమధ్య ఆమె శరీరంపై వెంట్రుకలు ఎక్కువగా పెరుగుతుంటే డాక్టర్‌కు చూపించాం. ఆమె పీసీఓడీ ఉందని చెప్పారు. దయచేసి దీనికి హోమియోలో చికిత్స ఉందేమో చెప్పండి. – ఆర్. వెంకటరావు, శ్రీకాకుళం రుతుక్రమం సవ్యంగా ఉన్న మహిళల్లో నెలసరి అయిన 11–18 రోజుల మధ్యకాలంలో వాళ్లలోని రెండు అండాశయల్లోని ఏదో ఒకదాని నుంచి అండం విడుదల అవుతుంది. అలా జరగకుండా అపరిపక్వమైన అండాలు వెలువడి అవి నీటిబుడగల్లా అండాశయపు గోడలపై ఉండిపోయే కండిషన్‌ను పీసీవోడీ (పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్) అంటారు. ఇవి రెండువైపులా ఉంటే ‘బైలేటరల్ పీసీఓడీ’ అంటారు. ఈ సమస్యకు కచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ జన్యుపరమైన అంశాలు ఒక కారణంగా భావిస్తున్నారు. అంతేగాక ఎఫ్ఎస్హెచ్, ఎల్‌హెచ్, ఈస్ట్రోజెన్, టెస్టోస్టెరాన్ హార్మోన్ల అసమతౌల్యత వల్ల ఈ సమస్య తలెత్తవచ్చు. సరైన జీవనశైలి పాటించనివారిలోనూ ఇది ఎక్కువ. లక్షణాలు: నెలసరి సరిగా రాకపోవడం, వచ్చినా అండాశయం నుంచి అండం విడుదల కాకపోవడం, రుతుస్రావం సమయంలో ఎక్కువ రక్తంపోవడం, రెండు రుతుక్రమాల మధ్యకాలంలో రక్తస్రావం కావడం, నెలసరి వచ్చే సమయంలో కడుపులో బాగా నొప్పిరావడం, నెలసరి రాకపోవడం, బరువు పెరగడం, తలవెంట్రుకలు రాలిపోతుండటం, ముఖం, వీపు, శరీరంపై మొటిమలు రావడం, ముఖం, ఛాతీపైన మగవారిలా వెంట్రుకలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనివల్ల సంతానం కలగకపోవడం, స్థూలకాయం, డయాబెటిస్, కొందరిలో చాలా అరుదుగా హృద్రోగ సమస్యలు రావచ్చు. రోగిని భౌతిక లక్షణాలతో పాటు అల్ట్రాసౌండ్ స్కాన్, హెచ్‌సీజీ, టెస్టోస్టెరాన్, ఆండ్రోజెన్, ప్రోలాక్టిన్ మొదలైన హార్మోన్ల పరీక్షలు, రక్తంలో చక్కెరపాళ్లు, కొలెస్ట్రాల్ శాతం వంటి పరీక్షలతో దీన్ని నిర్ధారణ చేయవచ్చు. హోమియో విధానంలో సరైన హార్మోన్ వ్యవస్థను పరిపుష్టం చేయడం ద్వారా దుష్ఫలితాలేవీ లేకుండా శాశ్వతంగా పీసీఓడీని నయం చేయవచ్చు. డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ గ్యాస్ట్రిక్ అల్సర్ తగ్గుతుందా? నా వయసు 36 ఏళ్లు. ఇటీవల కండుపులో మంట, వికారంతో డాక్టర్ దగ్గరికి వెళ్తే పరీక్షలు చేయించి, అల్సర్ ఉందని చెప్పారు. నా సమస్యకు హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందా? – ఎమ్. తిరుమలమూర్తి, చీరాల ఇటీవలి ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల జీర్ణకోశ సమస్యలు ముఖ్యంగా గ్యాస్ట్రిక్ అల్సర్ వంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. మన జీర్ణవ్యవస్థలో ఒక నిర్ణీత పరిమాణంలో ఆమ్లం (యాసిడ్) అవసరం. అందుకే ఆమ్లం ఎక్కువైతేనే కాదు... తక్కువైనప్పుడూ అల్సర్లు తయారవుతాయి. జీర్ణాశయంలో ఏర్పడే అల్సర్స్‌ను గ్యాస్ట్రిక్ అల్సర్స్ అంటారు. హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా కూడా అల్సర్స్‌కు కారణమవుతుంది. సాధారణంగా ఇతర ఏ బ్యాక్టీరియా అయినా కడుపులోని ఆమ్లంలో చనిపోతుంది. కానీ ఈ ఒక్క బ్యాక్టీరియా మాత్రమే ఆమ్లాన్ని తట్టుకొని జీవిస్తుంది. పైగా ఆమ్లం అధిక ఒత్తిడికి కూడా దోహదం చేస్తుంది. దాంతో జీర్ణాశయంలో ఆల్సర్లు పెరుగుతాయి. కారణాలు: ∙80 శాతం మందిలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల అల్సర్లు వస్తాయి ∙చాలామందిలో కడుపులో పుండ్లు రావడానికి హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా ముఖ్యమైనది మానసిక ఒత్తిడి, కారం, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం ∙మద్యపానం, పొగతాగడం ∙వేళకు ఆహారం తీసుకోకపోవడం కలుషితమైన ఆహారం, నీరు వంటి ద్వారా క్రిములు చేరి, అవి జీర్ణవ్యవస్థలో విషపదార్థాలను విడుదల చేసి పుండ్లు రావడానికి కారణమవుతాయి. లక్షణాలు: ∙కడుపులో నొప్పి, మంట, ఉబ్బరం ∙ఛాతీలో నొప్పి, పుల్లటి తేన్పులు, మలబద్దకం ∙తలనొప్పి, బరువు తగ్గడం, రక్తవాంతులు, రక్త విరేచనాలు ∙కొంచెం తిన్నా కడుపు నిండినట్లు ఉండటం, ఆకలి తగ్గడం ∙నోటిలో ఎక్కువగా నీళ్లు ఊరడం. నివారణ జాగ్రత్తలు: ∙పరిశుభ్రమైన నీరు, ఆహారం తీసుకోవాలి ∙మద్యపానం, పొగతాగడం అలవాట్లు మానేయాలి ∙కారం, మసాలా ఆహారాల విషయంలో జాగ్రత్త వహించాలి ∙కంటినిండా నిద్రపోవాలి ∙మానసిక ఒత్తిడి దూరం కావడానికి యోగా, ధ్యానం వంటివి చేయాలి ∙ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. సమతులాహారం తీసుకోవాలి. చికిత్స: గ్యాస్ట్రిక్ అల్సర్‌కు హోమియోలో మంచి మందులు ఉన్నాయి. ఆర్సనిక్ ఆల్బ్, యాసిడ్ నైట్రికమ్, మెర్క్‌సాల్, గ్రాఫైటిస్, ఫాస్ఫరస్ వంటి మందులు ఈ సమస్యకు చక్కగా పనిచేస్తాయి. అయితే అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో వీటిని తీసుకోవాలి. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ ముక్కులు బిగదీసుకు పోతున్నాయి... నా వయసు 29 ఏళ్లు. నేను గత ఆర్నెల్లుగా తుమ్ములు, ముక్కుకారవడం, ముక్కులు బిగదీసుకుపోతున్నాయి. వాసనలు తెలియడం లేదు. చాలా మంది డాక్టర్లను కలిశాను. సమస్య తగ్గినట్టే తగ్గి, మళ్లీ వస్తోంది. హోమియోలో దీనికి పరిష్కారం చెప్పండి. – డి. వినయ్ కుమార్, కొత్తగూడెం మీరు ‘అలర్జిక్ రైనైటిస్’ అనే సమస్యతో బాధపడుతున్నారు. మీకు సరిపడనివి తగిలినప్పుడు (దుమ్ము, ధూళి, పుప్పొడి, ఘాటువాసనలు) మీకు అలర్జీ మొదలవుతుంది. దాంతో ముక్కులోని రక్తనాళాలు ఉబ్బినట్లుగా అయి, ఆగకుండా తుమ్ములు రావడం, ముక్కు బిగదీసుకుపోవడం వంటివి కనిపిస్తాయి. లక్షణాలు: ఆగకుండా తుమ్ములు రావడం, ముక్కుకారడం వంటి లక్షణాలే గాక... వాటిని నిర్లక్ష్యం చేస్తే సైనస్లకు ఇన్ఫెక్షన్ సోకి తలబరువు, తలనొప్పి వంటివి కనిపించవచ్చు. ముక్కుపొరలు ఉబ్బడం వల్ల గాలి లోపలికి వెళ్లక వాసనలు కూడా తగ్గిపోతాయి. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే మున్ముందు సైనసైటిస్, నేసల్ పాలిప్స్, వంటి పెద్ద పెద్ద సమస్యలూ వచ్చేందుకు అవకాశం ఉంది. వ్యాధి నిర్ధారణ కోసం ఎక్స్–రే, సీటీ స్కాన్ వంటి పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. నివారణ: ∙అలర్జీ కారకాలకు సాధ్యమైనంత దూరంగా ఉండటం ∙సరైన పోషకాహారం తీసుకోవడం ∙ముక్కుకు సంబంధించిన వ్యాయామాలు చేయడం చల్లని వాతావరణానికి దూరంగా ఉడటం ∙పొగతాగే అలవాటుకు దూరంగా ఉండటం. చికిత్స: హోమియోలో వ్యక్తిగత లక్షణాలనూ, మానసిక స్వభావాన్ని బట్టి కాన్స్టిట్యూషన్ చికిత్స ఇవ్వవచ్చు. దీనివల్ల వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది. క్రమక్రమంగా వ్యాధి తీవ్రతను తగ్గిస్తూ పోయి, అలా సమస్యను పూర్తిగా తగ్గించవచ్చు. అనుభవజ్ఞులైన హోమియో నిపుణుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటూ ఉంటే అలర్జిక్ రైనైటిస్ పూర్తిగా తగ్గుతుంది. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ -
అల్సర్స్‌ను దూరం చేస్తుంది
ఉడికించేటప్పుడు కాస్తంత వాసన వేస్తుంది కానీ, క్యాబేజీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో పీచుపదార్థాలు (డయటరీ ఫైబర్) చాలా ఎక్కువ. అందుకే పేగులకు దీనివల్ల ఎంతో మేలు. క్యాబేజీని క్రమం తప్పకుండా తినేవారిలో పేగుల్లో అల్సర్స్ నివారితమవుతాయి. ముఖ్యంగా ఇది పెద్ద పేగు ఆరోగ్యానికి ఇది చాలా మేలు చేస్తుంది.మలబద్దకం సమస్య నుంచి విముక్తి పొందడానికి క్యాబేజీ చాలా నమ్మకమైన ఆహార పదార్థం.క్యాబేజీలో విటమిన్ సి, విటమిన్ కె, ఫోలేట్, పొటాషియమ్, మ్యాంగనీస్, విటమిన్ ఏ, థయాబిన్, క్యాల్షియమ్, ఐరన్, మెగ్నీషియమ్... వంటి పోషకాలన్నీ ఎక్కువ. అందుకే ఒక వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యానికి దోహదం చేసే ఆహారంగా దీన్ని పేర్కొంటారు. క్యాబేజీలోని విలువైన ఫైటో కెమికల్స్ అనేక రకాల క్యాన్సర్ల నుంచి రక్షిస్తాయి.దీని నుంచి వెలువడే క్యాలరీలు చాలా తక్కువ. దాదాపు 100 గ్రాముల క్యాబేజీ నుంచి కేవలం 15 క్యాలరీల శక్తి మాత్రమే లభ్యమవుతుంది. అందుకే స్థూలకాయులు, బరువు పెరుగుతున్న వారికి ఇది మంచి ఆహారం. బరువు తగ్గాలనుకునేవారు రోజూ ఒక గ్లాసు క్యాబేజీ జ్యూస్ తీసుకోవడం వల్ల త్వరలోనే ఫలితం కనిపిస్తుంది. -
గుక్కపట్టి ఏడ్చినపుడు పాప నీలం రంగులోకి...
పీడియాట్రిక్ కౌన్సెలింగ్ మా పాపకు 10 నెలలు. ఒక్కోసారి అదేపనిగా గుక్కపట్టి ఏడుస్తూనే ఉంటుంది. అలా ఏడ్చినప్పుడు పాప ముఖం నీలంగా మారుతోంది. ఆ సమయంలో పాపను చూస్తుంటే ఆందోళనగా ఉంది. దయచేసి ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి. – సరస్వతి, కర్నూలు మీ పాప సమస్యను ‘బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్’గా చెప్పవచ్చు. అంటే పాప కాసేపు ఊపిరి తీసుకోకుండా ఉండిపోతుంటుంది. పిల్లల్లో కోపం / ఫ్రస్టేషన్ / భయం / కొన్ని సందర్భాల్లో గాయపడటం జరిగినప్పుడు ఇలా కావడం చాలా సాధారణం. ఇందుకు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. తొమ్మిది నెలల నుంచి 24 నెలల లోపు పిల్లల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఇలాంటి లక్షణం ఉన్న పిల్లలు పెద్దయ్యాక చాలా మొండిగా అవుతారంటూ కొన్ని అపోహలున్నా, వాటికి శాస్త్రీయమైన ఆధారాలేమీ లేవు. ఇది ఎందుకు వస్తుందనేది చెప్పడం కష్టమైనప్పటికీ రక్తహీనత ఉన్నవారిలో ఇది ఎక్కువ శాతం మందిలో కనిపిస్తుండటాన్ని చూడవచ్చు. బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్‌లో... సింపుల్, సైనోటిక్, పాలిడ్, కాంప్లికేటెడ్ అని నాలుగు రకాలు ఉన్నాయి. మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీ పాపకు వస్తోంది సైనోటిక్ అనిపిస్తోంది. ఇక ప్యాలిడ్ అనే రకంలో పిల్లలు పాలిపోయినట్లుగా అయిపోయి, స్పృహతప్పిపోతారు. ఇటువంటి పిల్లల్లో ఒకసారి ఈసీజీ, ఈఈజీ తీయించడం చాలా అవసరం. ఎందుకంటే తీవ్రమైన కారణాలు ఏవైనా ఉంటే అవి బయటపడే అవకాశం ఉంటుంది. ఇక చికిత్స విషయానికి వస్తే... పాపలో ఈ ధోరణి కనిపించినప్పుడు కుటుంబ సభ్యులంతా తీవ్రమైన ఆందోళనకు గురవుతారు కాబట్టి వాళ్లకు ధైర్యం చెప్పడమే మొదటి అవసరం. చాలా కొద్దిమందిలో మాత్రం ఐరన్ ఇవ్వడం ఉపయోగకరం. పిల్లలూ, పేరెంట్స్ మధ్య ప్రేమాభిమానాలు బలపడినకొద్దీ ఈ లక్షణం క్రమంగా తగ్గిపోతుంది. ఐదేళ్ల వయసు వచ్చాక ఇది కనిపించడం చాలా అరుదు. పైన పేర్కొన్న పరీక్షలు కూడా ఏవైనా తీవ్రమైన సమస్య ఉందేమో తెలుసుకోవడం కోసమే. ఈ విషయంలో నిర్భయంగా ఉండండి. మరీ అవసరమైతే మీ పిల్లల డాక్టర్‌ను సంప్రదించండి. పాప తల ఫ్లాట్‌గా ఉంది... మా పాప వయసు 13 నెలలు. తల ఎడమవైపున ఫ్లాట్‌గా ఉంది. పరిశీలించి చూస్తే ఒకవైపు సొట్టపడ్డట్లుగా అనిపిస్తోంది. మాకు ఆందోళనగా ఉంది. పరిష్కారం చెప్పండి. – భవాని, విజయవాడ మీ పాపకు పొజిషనల్ సెఫాలీ అనే కండిషన్ ఉందని అనిపిస్తోంది. దీన్నే ఫ్లాటెన్‌డ్ హెడ్ సిండ్రోమ్ అని కూడా అంటారు. పిల్లలను ఎప్పుడూ ఒకే స్థితిలో పడుకోబెట్టినప్పుడు ఇది కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో పాప గర్భంలో ఉన్నప్పుడు ఇది మొదలై ఉండవచ్చు. ఇలాంటిదే మరో సమస్య కూడా ఉంది. దీన్నే క్రేనియో సినోస్టాసిస్ అంటారు. ఇది కాస్తంత తీవ్రమైన సమస్య. పిల్లలు పడుకున్నప్పుడు వాళ్ల తల పొజిషన్‌ను తరచూ మారుస్తుండటం చాలా అవసరం. మెడ కండరాలకు సంబంధించిన సమస్య ఏదైనా ఉంటే ఒకసారి డాక్టర్‌కు చూపించి దానికి తగిన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. చిన్నారులు పెరుగుతున్న కొద్దీ ఈ సమస్య అదే సర్దుకుంటుంది. అంటే కాలక్రమంలో తలలోని సొట్టలు కూడా తగ్గిపోయేందుకు అవకాశం ఉంది. దీని వల్ల మెదడుపై ఎలాంటి ప్రభావం ఉండదు. ఈ పిల్లల్లో కూడా సాధారణ పిల్లల్లాగానే తెలివితేటలుంటాయి. మీరు ఒకసారి మీ పాపను పీడియాట్రిషియన్‌కు చూపించి... ఇది పొజిషనల్ సమస్యేనా, లేదా ఇతరత్రా ఏవైనా సమస్యలున్నాయా అని తెలుసుకోండి. కేవలం తల ఒకవైపు ఫ్లాట్‌గా కనిపిస్తుండటమే సమస్య అయితే దాని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నోట్లో పొక్కులు ఎందుకు? మా బాబు వయస్సు ఎనిమిదేళ్లు. ఈ మధ్య వాడికి నోట్లో పొక్కులు వస్తున్నాయి. దీనికి కారణం ఏమై ఉంటుంది. వాడి సమస్యకు పరిష్కారం చెప్పండి. – సుందరి, ఖమ్మం మీ బాబుకు ఉన్న కండిషన్‌ను యాఫ్తస్ అల్సర్స్ లేదా యాఫ్తస్ స్టొమటైటిస్ అని అంటారు. ఈ పొక్కులు ముఖ్యంగా నోట్లో, పెదవులు, గొంతుపై భాగం (అప్పర్ థ్రోట్)లో ఎక్కువగా వస్తుంటాయి. ఓరల్ క్యావిటీలో ఇవి ఎక్కడైనా రావచ్చు. నోటిలో ఉండే పొర (మ్యూకస్ మెంబ్రేన్)లో పగుళ్లు రావడం వల్ల ఈ అల్సర్ వస్తాయి. ఇవి రావడానికి ఫలానా అంశమే కారణమని నిర్దిష్టంగా చెప్పడానికి ఉండదు. కాని నిమ్మజాతి (సిట్రస్) ఫ్రూట్స్, పులుపు పదార్థాలు ఎక్కువగా తిన్నప్పుడు, బాగా కారంగా ఎక్కువ మసాలాలతో ఉండే ఆహారం తీసుకున్నప్పుడు ఇవి రావచ్చు. కొందరిలో ఇవి విటమిన్ బి12, ఐరన్, ఫోలిక్ యాసిడ్, జింక్ లోపాలతోనూ రావచ్చు. అత్యధిక సాంద్రత ఉన్న టూత్‌పేస్టులు వాడేవారిలో, ఎక్కువ మానసిక ఒత్తిడికి గురయ్యేవారిలో ఇవి కనిపిస్తాయి. కొందరిలో ఇవి బాగా అలసిపోయిన (ఫెటిగ్) సందర్భాల్లో చూస్తూ ఉంటాం. మరికొందరిలో జబ్బుపడ్డప్పుడు కనిపిస్తాయి. కొన్ని హార్మోన్ల అసమతౌల్యత వల్ల, జీర్ణకోశవ్యాధులు ఉన్న సందర్భాల్లోనూ ఇవి కనిపించవచ్చు. ఇవి రాకుండా నివారించడానికి కొన్ని చర్యలు... ►నోటికి బాధ కలిగించే పదార్థాలు తీసుకోకపోవడం ∙బాగా పుల్లగా ఉండే పదార్థాలు అవాయిడ్ చేయడం ∙నోరు ఒరుసుకుపోయేందుకు దోహదపడే ఆహారపదార్థాలు (అబ్రేసివ్ ఫుడ్స్) తీసకోకపోవడం ∙నోటి పరిశుభ్రత (ఓరల్ హైజీన్) పాటించడం వంటివి చేయాలి. పరిష్కారాలు : ఈ సమస్య మరీ ఎక్కువగా ఉన్నప్పుడు లోకల్ అనస్థిటిక్ జెల్స్‌తో పాటు కార్టికోస్టెరాయిడ్స్, సిల్వర్ నైట్రేట్ వాడటంతో పాటు కొన్ని సందర్భాల్లో ఓరల్ యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది. సమస్య మాటిమాటికీ వస్తున్నట్లయితే నాన్ ఆల్కహాలిక్ మౌత్‌వాష్, తక్కువ లో కాన్సంట్రేటెడ్ మౌత్ వాష్ వంటివి ఉపయోగిస్తే కొంతవరకు ఉపయోగం ఉంటుంది. ఇక మీ బాబు విషయానికి వస్తే నోటి పరిశుభ్రత (గుడ్ ఓరల్ హైజీన్) పాటించడంతో పాటు అతడికి విటమిన్ బి12, జింక్ సప్లిమెంట్స్ ఇవ్వండి. లోకల్ అనస్థిటిక్ జెల్స్ కూడా వాడవచ్చు. సమస్య మరీ తీవ్రంగా ఉంటే మీ పిల్లల వైద్య నిపుణుడిని కలిసి చికిత్స తీసుకోండి. ఆందోళన పడాల్సిన అవసరం లేదు. బాబుకు తరచూ జ్వరం మా బాబుకు మూడేళ్లు. ఇటీవల వాడికి చాలా సార్లు జ్వరం వస్తోంది. డాక్టర్లు రాసిన మందులు వాడుతున్నంత సేపు తగ్గి మళ్లీ వస్తోంది. ఇలా వాడికి మాటిమాటికీ జ్వరం రావడంతో మాకు చాలా ఆందోళనగా ఉంది. మాకు తగిన సలహా ఇవ్వండి. – నిత్య, హైదరాబాద్ చిన్నారులు నిత్యం సూక్ష్మక్రిములు, వైరస్, బ్యాక్టీరియాకు ఎక్స్పోజ్ అవుతుండటం వల్ల ఇలా జ్వరం వస్తుండటం చాలా సాధారణం. అందునా కాలం మారినప్పుడు (సీజనల్ వేరియేషన్స్) ఇన్ఫెక్షన్స్ఎక్కువగా రావచ్చు. గడ్డలు, బ్రుస్సెల్లోసిస్, డెంటల్ యాబ్సెస్, దీర్ఘకాలికమైన జబ్బులు, క్రిప్టోకోకస్, సిస్టైటిస్, ఫెమీలియల్ ఫీవర్ సిండ్రోమ్ వంటి అనేక సాధారణ సమస్యలు మొదలుకొని కొన్ని తీవ్రమైన సమస్యల వరకు ఇలా జ్వరం రావచ్చు. మీరు ఇచ్చిన కొద్దిపాటి సమాచారంతో మీ బాబుకు జ్వరం ఎందుకు వస్తోందనేది నిర్దిష్టంగా చెప్పడం సాధ్యం కాదు. అయితే ఒకసారి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కు సంబంధించిన పరీక్షలతోపాటు దీర్ఘకాలికమైన జబ్బులకు ఏమైనా అంతర్గతంగా ఉన్నాయేమోనని వాటి నిర్ధారణకు అవసరమైన పరీక్షలు చేయించడం అవసరం. జ్వరం వచ్చిన ప్రతీసారీ కారణం తెలుసుకోకుండా మందులు... అందునా మరీ ముఖ్యంగా యాంటీబయాటిక్స్, ఎన్ఎస్ఏఐడీ వంటివి చాలాకాలం పాటు వాడుతూ పోవడం చాలా అపాయకరం. మీరు మరోసారి మీ పిల్లల వైద్య నిపుణుడిని సంప్రదించి ఈ అంశాలన్నీ చర్చించి, తగిన చికిత్స తీసుకోండి. డా. రమేశ్‌బాబు దాసరి, సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్
ఉపవాసాలతో సమస్యలు... అధిగమించేదెలా? నా వయసు 33. మాది సంప్రదాయ కుటుంబం. నిత్యం పూజపురస్కారాలు చేస్తుంటాం. తరచూ ఉపవాసాలుంటాం. ఈమధ్య ఉపవాసం తర్వాత విపరీతమైన నీరసంతో పాటు కళ్లు తిరుగుతున్నాయి. గుండెల్లో మంట. డాక్టర్‌కు చూపిస్తే జీర్ణకోశంలో అల్సర్స్ అని అన్నారు. ఉపవాసాలు వద్దని సలహా ఇచ్చారు. అల్సర్లకు మందులు వాడుతున్నాను. ఉపవాసాలు మానకపోతే సమస్య మరింత జటిలం అవుతుందని డాక్టర్ చెబుతున్నారు. నేనేం చేయాలి? - కె. ప్రసన్నకుమారి, ఖమ్మం ఉపవాసం వల్ల శరీరంలో జీవక్రియలు పాక్షికంగా స్తంభించిపోతాయి. దాంతో ‘బేసల్ మెటబాలిక్ రేట్’ క్షీణించిపోతుంది. దాని ప్రభావం శరీరంలోని ద్రవాల సమతుల్యతపై పడుతుంది. శరీరంలో నీటిశాతం తగ్గిపోవడంతో డీహైడ్రేషన్ బారిన పడతుంటారు. ఉపవాసం ఉన్నప్పుడు ఇంట్లోపనులు... ముఖ్యంగా శారీరక శ్రమకు దూరంగా ఉండాలి. ఎండలో తిరగకుండా జాగ్రత్తపడాలి. తరచూ ఉపవాసాలు జీర్ణవ్యవస్థపై సైతం దుష్ర్పభావం చూపుతాయి. గుండెల్లో మంట మొదలుకొని జీర్ణకోశంలో అల్సర్లు, తలనొప్పి, డీహైడ్రేషన్, మలబద్ధకం, మూత్రపిండాల్లో రాళ్లు వంటి సమస్యలు తలెల్తే అవకాశాలు ఉన్నాయి. ఉపవాసం పేరిట భోజనం మానేయడం వల్ల శరీరంలో ముఖ్యమైన పోషకాలు లోపిస్తాయి. ముఖ్యంగా విటమిన్-బి కాంప్లెక్స్ లోపం పెరుగుతుంది. మీ విషయంలో కూడా దాదాపుగా అదే జరిగింది. ఉపవాసం పేరిట మధ్యాన్నం భోజనం చేయకుండా రాత్రిపూట ఒక్కసారిగా మితిమీరి తినడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయులు ఉన్నట్లుండి పెరిగిపోతాయి. ఇన్సులిన్ వేగంగా తగ్గుతుంది. ఇది ముందుముందు డయాబెటిస్‌కు దారితీస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయులు పడిపోయినప్పుడు దాన్ని తట్టుకోవడానికి శరీరం కొన్ని రకాల హార్మోన్లను విడుదల చేస్తుంది. దాంతో రక్తపోటు పెరుగుతుంది. రక్తనాళాలు క్రమంగా కుంచించుకుపోయే ప్రమాదం ఉంది. అందువల్ల ఉపవాసం తర్వాత ఒక్కసారిగా ఎక్కువ ఆహారం తీసుకునే బదులు, ఆహారాన్ని మితంగా దఫదఫాలుగా తీసుకోవడం వల్ల జీర్ణ ప్రక్రియ సజావుగా సాగుతుంది. నూనెతో చేసిన వేపుళ్లు, మసాలాలు బాగా దట్టించిన కూరలు, బాగా వేయించిన కూరలను దూరంగా ఉంచడం వల్ల గుండెల్లో మంట తగ్గుతుంది. ఉపవాసం చేసే సమయంలో సాధ్యమైనన్ని ఎక్కువసార్లు మంచినీళ్లు తాగాలి. ఉపవాస సమయంలో సాధారణంగా ఎక్కువమంది పండ్ల రసాలు తీసుకుంటుంటారు. కానీ ఆ టైమ్‌లో పండ్లరసాలు, కూల్‌డ్రింక్స్ తీసుకోవద్దు. వీటికి బదులు కొబ్బరినీళ్లు తీసుకోవడం శ్రేయస్కరం. ఉపవాసం విరమించిన తర్వాత పీచు ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు పుష్కలంగా తీసుకోవాలి. దీనివల్ల మలబద్ధకం ఉండదు. వీలైనంతవరకు భోజనం, అల్పాహారం మానేయకుండా చూసుకోవడం మంచిది. రోజుకు 4-5 సార్లు ఆహారం తీసుకోవడం వల్ల ఆకలీ అదుపులో ఉంటుంది, పిండిపదార్థాల నుంచి లభించే చక్కెరా ఇంధనంలా అందుతుంటుంది. ఉపవాసం వల్ల అవయవాల పనితీరు దెబ్బతింటుంది. కాబట్టి అనివార్యమైతే తప్ప తరచూ ఉపవాసాలు ఆరోగ్యానికి చేటు తెస్తాయి. డాక్టర్ కె. రఘురామ్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, సోమాజీగూడ, హైదరాబాద్ -
పీడియాట్రీ కౌన్సెలింగ్
మా పాపకు ఎనిమిదేళ్లు. ఆమెకు తరచూ నాలుక మీద, పెదవుల మీద, దవడ భాగాల్లో పుండ్లు వస్తున్నాయి. ఆమె నాలుకపైన ఎర్రటి మచ్చల్లా రావడంతో ఏమీ తినలేకపోతోంది. ఇవి రావడానికి కారణం ఏమిటి? ఇది ఏమైనా తీవ్రమైన వ్యాధికి సూచనా? సరైన సలహా ఇవ్వండి. - శారద, మంచిర్యాల మీ పాపకు ఉన్న సమస్యను ఏఫ్తస్ అల్సర్స్ అంటారు. ఇవి కొందరిలో పదే పదే వస్తూ ఉండవచ్చు. ఇది చాలా సాధారణంగా, తరచూ చూసే నోటి సమస్యల్లో ఒకటి. ఈ అల్సర్స్‌కు నిర్దిష్టంగా ఇదే కారణమని చెప్పలేకపోయినా... అలర్జీ, ఇమ్యూనలాజికల్ సమస్యలు, హెర్పిస్, రసాయనాల వల్ల నోరు కాలడం, వేడి వేడి ఆహారం తీసుకోవడంతో నోరు కాలడం, నోటిలోని మృదువైన కణజాలంలో అయ్యే గాయాల వల్ల, కొన్నిసార్లు ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ వల్ల కూడా ఈ రకమైన నోటి అల్సర్స్ వచ్చేందుకు అవకాశం ఉంది. ఈ పుండ్లు 5 నుంచి 10 రోజుల పాటు ఉండి, వాటికవే నిదానంగా తగ్గుతుంటాయి. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు బెంజోకైన్ లేదా లిడోకైన్ వంటి ద్రావకాలను స్థానికంగా పూయడం, సమస్య తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే పుండ్లపై పూతమందుల రూపంలో లభ్యమయ్యే స్టెరాయిడ్స్ పూయడం, కొన్ని సందర్భాల్లో సరైన యాంటీబయాటిక్స్ వాడటం కూడా జరుగుతుంది. అలాగే వ్యక్తిగత నోటి పరిశుభ్రత పాటించడం కూడా చాలా ప్రధానం. ఇక మీ పాపకు సంబంధించిన మరో సమస్య విషయానికి వస్తే... నాలుక మీద మచ్చలు మచ్చలుగా రావడాన్ని ‘జియోగ్రాఫికల్ టంగ్’ అని అంటారు. ఇది కొందరిలో అకస్మాత్తుగా వస్తూ... కొన్ని గంటలు లేదా రోజుల్లో మారుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఈ సమస్య ఒత్తిడి వల్ల, కారంగా ఉండే ఘాటైన ఆహారాల వల్ల మరింత తీవ్రమవుతుంది. అయితే ఈ సమస్యకు నిర్దిష్టమైన చికిత్స ఏదీ అవసరం లేదు. కాకపోతే ఘాటైన కారంతో ఉన్నవీ, మసాలాలతో కూడిన ఆహారాలకు దూరంగా ఉండి, నోటి పరిశుభ్రత పాటించాలి. సమస్య మరీ తీవ్రమైతే ఒకసారి మీ పిల్లల వైద్య నిపుణుడిని సంప్రదించండి. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్ స్టార్ హాస్పిటల్స్,బంజారాహిల్స్, హైదరాబాద్ -
అల్సర్స్‌ని అడ్డుకుందాం....
స్టమక్ అల్సర్స్ ఆహారాన్ని జీర్ణం చేయడానికి మన కడుపులో ఆమ్లం స్రవిస్తూ ఉంటుంది. అది ఆమ్లం కాబట్టి ఆహారంపై పనిచేయడానికి బదులుగా మన కడుపు కండరాల మీదే పని చేస్తే కడుపులో మంట వస్తుంటుంది. ఇది చాలామందికి అనుభవంలోకి వచ్చే విషయమే. యాసిడ్ వల్ల కనిపించే ప్రభావం కాబట్టి దీన్ని వాడుకభాషలో సైతం ‘ఎసిడిటీ’ అంటూ చాలామంది పేర్కొంటుండటం వల్ల ఇది ప్రజల్లో ఎంత ప్రాచుర్యంలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ అదే యాసిడ్ క్రమక్రమంగా కడుపులోని కండరాలపై పనిచేస్తూ పోతే... జీర్ణవ్యవస్థ పొడవునా చాలా చోట్ల పుండ్లు పడే అవకాశం ఉంది. అయితే ఇలా పుండ్లు పడటంలో వేళ తప్పి తినడం లాంటి వాటి కంటే హెచ్. పైలోరీ అనే బ్యాక్టీరియా, ఆస్పిరిన్ వంటి రక్తాన్ని పలచబార్చే మందులు, ఐబూప్రొఫిన్ వంటి నొప్పి నివారణ మందులు (ఎన్ఎస్ఏఐడీస్) ఎక్కువగా కారణమవుతాయి. ఈ పుండ్లనే పెప్టిక్ అల్సర్స్ అని వ్యవహరిస్తుంటారు. ఇటీవల ఈ పెప్టిక్ అల్సర్లు ఎక్కువయ్యాయి. ఈ సమస్యపై అవగాహన కోసమే ఈ కథనం. అల్సర్లు... రకాలు! జీర్ణవ్యవస్థ పొడవునా యాసిడ్ తన దుష్ర్పభావం చూపి, అక్కడి మెత్తటి కణజాలంపై పనిచేసి, ఆ మృదుకణజాలం ఒరుసుకుపోయేలా చేస్తుంది. ఇలా ఒరుసుకుపోయిన ప్రాంతమే పుండులా మారుతుంది. ఈ ఒరుసుకుపోయిన ప్రాంతం పేరును బట్టి సదరు అల్సర్ పేరును నిర్ణయిస్తారు. ఉదాహరణకు ఈసోఫేగస్ భాగంలో ఇలా ఒరుసుకుపోతే వాటిని ఈసోఫేజియల్ అల్సర్స్ అంటారు. జీర్ణాశయంలో పుండు పడితే దాన్ని గ్యాస్ట్రిక్ అల్సర్ అంటారు. ఇక చిన్న పేగులో మూడు భాగాలుంటాయి. చిన్నపేగులోని మొదటిభాగమైన డియోడినమ్ అనేచోట పుండు పడితే దాన్ని డియోడినల్ అల్సర్ అని... ఇలా అది ఏర్పడే ప్రదేశాన్ని బట్టి అల్సర్పేరును నిర్ణయిస్తారన్నమాట. స్థూలంగా చెప్పాలంటే ప్రదేశం వేరైనా అల్సర్లన్నీ ఒకేలాంటి ప్రభావం చూపిస్తాయి. రిఫ్రాక్టరీ అల్సర్స్ ఇవి ప్రత్యేకమైన అల్సర్లు. కొన్నిసార్లు ఎంతగా చికిత్స తీసుకున్నా రోగి తాలూకు వ్యక్తిగత అలవాట్ల కారణంగానో (అంటే పొగాకు వినియోగం, ఆల్కహాల్ తాగడం వంటివి), హెలికోబ్యాక్టర్ పైలోరీ బ్యాక్టీరియాపై యాంటీబయాటిక్ మందులు పనిచేయకపోవడం వల్లనో (అంటే ఆ బ్యాక్టీరియా సదరు మందులపట్ల నిరోధాన్ని పెంచుకోవడం వల్ల), జోలింగర్-ఎలిసన్ సిండ్రోమ్ వల్లనో... అల్సర్లు ఎప్పటికీ తగ్గవు. పైగా కడుపులోని స్రావాలు మరింతగా పెరుగుతాయి. ఇలాంటి మొండి అల్సర్లను రిఫ్రాక్టివ్ అల్సర్స్ అంటారు. గుర్తుంచుకోండి గతంలో అల్సర్స్‌కు యాంటాసిడ్స్, సైటోప్రొటెక్టివ్ ఏజెంట్స్, హెచ్టూ బ్లాకర్స్ (ట్యాగమెట్, జాంటాక్) వంటి మాత్రలు వాడేవారు. కానీ అవి అల్సర్‌పై పని చేయవని ఆధునిక పరిశోధనల్లో తేలింది. కాబట్టి వాటిని రొటీన్‌గా ప్రిస్క్రయిబ్ చేయడం, వాడటం మంచిది కాదు. లక్షణాలు ►కడుపులో మంటలా అనిపించే నొప్పి. ఒక్కోసారి ఈ మంట గొంతువైపునకు పాకుతున్నట్లుగా అనిపిస్తుంటుంది. ఛాతీ మీద మంటగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. ► ఎప్పుడూ ఆకలిగానే ఉన్నట్లుగా అనిపిస్తుంది. కొద్దిగా తినగానే కడుపు నిండిపోయినట్లుగా ఉంటుంది. ► ఒక్కోసారి వికారంగా ఉంటుంది. వాంతులు కూడా కావచ్చు. వాంతులు అయినప్పుడు కొన్నిసార్లు రక్తం కూడా పడవచ్చు. ► తిండి సయించకపోవడంతో ఎప్పుడూ నీరసంగా, అలసటగా ఉంటుంది. ► ఛాతీకి కింద, కడుపునకు పైభాగంలో నొప్పిగా ఉండి, ఆ నొప్పి పెరిగి ఒక్కోసారి రాత్రివేళల్లో నిద్రాభంగం అవుతుంటుంది. ఆ నొప్పి వీపు వైపునకు కూడా పాకినట్లుగా అనిపిస్తుంది. (దీన్నే రిఫర్డ్ పెయిన్ అని అంటారు). ► అల్సర్ల నుంచి రక్తస్రావం జరిగితే... ఆ రక్తం మలంలో కలవడం వల్ల మలం నల్లగా కనిపించే అవకాశాలూ ఉంటాయి. ► బరువు తగ్గడం, ఛాతీ మీద ఏదో బరువు పెట్టినట్లుగా అనిపించడం వంటి లక్షణాలు చాలా సాధారణం. ► అల్సర్ ఉన్నవారిలో భోజనం తిన్న తర్వాత అది ఈసోఫేజియల్ భాగం/ఛాతీ భాగంలో చిక్కుకుపోయినట్లుగా ఉంటుంది. నిర్థారణ ► కడుపులో అల్సర్లు ఉన్న లక్షణాలు కనిపించినప్పుడు రక్తపరీక్షలూ, మల పరీక్షల ద్వారా ముందుగా హెలికోబ్యాక్టర్ పైలోరీ బ్యాక్టీరియా ఉందా అనే నిర్ధారణ పరీక్షలు చేయాలి. ► ఎండోస్కోపీ ప్రక్రియతో జీర్ణవ్యవస్థ పైభాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. ► ఒకవేళ ఎక్కడైనా అల్సర్ కనిపిస్తే... ఆ భాగం నుంచి చిన్న ముక్క సేకరించి, దాన్ని బయాప్సీ పరీక్షకు పంపాలి. ► రోగి చేత బేరియం ద్రవాన్ని తాగించి ఎక్స్-రే తీసి పరీక్ష చేయడం ద్వారా కూడా అల్సర్లను నిర్ధారణ చేయవచ్చు. ► బయాప్సీ చేసినప్పుడు మనం హెచ్. పైలోరీ గురించి నిర్ధారణగా తెలుసుకోవచ్చు. బయాప్సీ ద్వారా అల్సర్‌లో క్యాన్సర్ ఉందా, లేదా తెలుస్తుంది. అందుకే స్టమక్ అల్సర్లన్నింటి విషయంలోనూ బయాప్సీ చేయించాలన్నది అంతర్జాతీయ సిఫార్సు (రికమండేషన్). డాక్టర్‌ను ఎప్పుడు కలవాలంటే... ►మీ కడుపులో అకస్మాత్తుగా తీవ్రమైన నొప్పి మొదలై అది కడుపులో శూలంగా గుచ్చుతున్నంత తీవ్రంగా (ప్రికింగ్ పెయిన్) ఆగకుండా నొప్పి వస్తున్నప్పుడు. ► పొట్టను తడిమినప్పుడు మీ చేతికి అది మృదువుగా లేకుండా, చాలా గట్టిగా మారినట్లుగా అనిపిస్తున్నప్పుడు... ► నొప్పితో పాటు వాంతులు కావడం, అందులో రక్తం కనిపించడం వంటివి జరిగినా లేదా మలవిసర్జనకు వెళ్లినప్పుడు మలం నల్లగా కనిపించినప్పుడు... ► స్పృహ తప్పడం, అయోమయంగా మాట్లాడటం, తీవ్రంగా చెమటలు పట్టడం, తల అంతా తేలికైపోయిన భావన కలగడం, నిద్రవస్తున్నట్లుగా మత్తుగా అనిపించడం జరిగితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. చికిత్స ► అల్సర్ ఏ ప్రాంతంలో ఏర్పడింది, అది ఏర్పడటానికి కారణం ఏమిటి అనే అనేక అంశాల మీద చికిత్స ఆధారపడి ఉంటుంది. ఒకవేళ హెలికోబ్యాక్టర్ పైలోరీ వల్ల అల్సర్లు ఏర్పడితే దానికి యాంటీబయాటిక్స్‌తో పాటూ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అనే మాత్రలు 10 నుంచి 14 రోజుల పాటు ఇస్తారు. ►హెలికోబ్యాక్టర్ పైలోరీ బ్యాక్టీరియా లేని అల్సర్స్‌కు కేవలం ప్రొటాన్ పంప్ ఇన్హిబిటర్స్‌ను 4 నుంచి 8 వారాల పాటు ఇస్తూ చికిత్స చేస్తారు. ► కొన్ని సందర్భాల్లో కడుపులో స్రవించే యాసిడ్ పరిమాణం తగ్గేందుకు మందులు ఇస్తూ... దానితో పాటు కడుపులో ఏర్పడ్డ పుండ్లు మానేందుకూ మందులు రాస్తారు. ► చికిత్సలో భాగంగా అల్సర్స్‌ను పుట్టేలా ప్రేరేపించే (అఫెండింగ్ ఏజెంట్స్) పొగతాగడం వంటి అలవాట్లను పూర్తిగా మానేయాలి. కొన్ని రిఫ్రాక్టరీ అల్సర్స్‌ను శస్త్రచికిత్స చేసి తొలగించాల్సి ఉంటుంది. ప్రమాదకరంగానూ మారవచ్చు... ఒక్కోసారి జీర్ణాశయంలోగానీ లేదా పేగుల్లో గానీ ఒరుసుకుపోయిన చోటే... మళ్లీ మళ్లీ ఒరుసుకుపోతే అది జీర్ణాశయానికి / పేగుకు రంధ్రంలా పడేందుకు అవకాశం ఉంది. ఇలాంటి కండిషన్‌ను అల్సర్ పెర్ఫొరేషన్ అయి అది పెరిటోనైటిస్ అనే కండిషన్‌కు దారి తీస్తుంది. ఇది ప్రాణాపాయాన్ని కలిగించే స్థితి. ఇలాంటి పరిస్థితుల్లో జీర్ణాశయంలో స్రవించే ద్రవాలు, ఆ మార్గానికే పరిమితం కాకుండా శరీరం (బాడీ-క్యావిటీ)లోని అన్ని భాగాలకూ విస్తరించి శరీరాన్ని విషపూరితం చేసే అవకాశం ఉంది. ఇది చాలా ప్రమాదకరమైన కండిషన్. ఇలాంటప్పుడు అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాల్సి రావచ్చు. నివారణ ► ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోండి. వేళకు భోజనం చేయండి. వేళతప్పి తినకండి. ►సమతులాహారం తీసుకోండి. మీ ఆహారంలో పీచు పదార్థాలు ఉండే కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా ఉండేలా చేసుకోండి. మాంసాహారం తినాల్సి వచ్చినా... దానితో పాటు శాకాహారపు సలాడ్లు అంతే మోతాదులో తీసుకుంటూ ఉండండి. ► బాగా ఉడికిన ఆహారాన్ని కాస్త వేడిగా (మరీ వేడిగా కాదు) ఉన్నప్పుడే తినండి. ఎలాగైనా సద్వినియోగం చేద్దామనే ఉద్దేశంతో చెడిపోయిన ఆహారాన్ని తీసుకోకండి. దానివల్ల జరిగే సద్వినియోగం కంటే మీరు మీ ఆరోగ్యానికి చేసుకునే హానే ఎక్కువ. ► అల్సర్స్ మందులను డాక్టర్ సలహా మేరకు వాడాలి. ఎందుకంటే ఇందులో ఇచ్చే ప్రోటాప్ పంప్ ఇన్హిబిటర్స్ (పీపీఐ) మందులను భోజనానికి ముందే వాడాల్సి ఉంటుంది. అందుకే అల్సర్ మందుల విషయంలో ఎలాపడితే అలా వాడకుండా డాక్టర్ సూచనలు పాటించడం తప్పనిసరి. ► చిన్న చిన్న నొప్పులకు నొప్పి నివారణ మాత్రలు వాడకండి. వాటితో చాలా అనర్థాలు వస్తాయి. అంతగా నొప్పిని భరించలేకపోతే పారసిటమాల్ వంటి మందులను నొప్పి తగ్గించేందుకు ఒకటి రెండు రోజులు వాడవచ్చు. ఒకవేళ అప్పటికీ నొప్పి తగ్గకపోతే డాక్టర్‌ను కలవడం తప్పనిసరి. ► పొగతాగడం, పొగాకు నమలడం, ఆల్కహాల్ తీసుకోవడం వంటి దురలవాట్లను వెంటనే మానేయండి. ఇలాంటి అల్సర్స్ విషయంలో పొగతాగే అలవాటు, ఆల్కహాల్ కంటే మరింత ప్రమాదకారి అని గుర్తించండి. అలాగని ఆల్కహాల్ కూడా మంచిదేమీ కాదు. ► మలబద్దకం లేకుండా చూసుకోవడం మంచిది. ఇందుకోసం పీచు ఎక్కువగా ఉండే తాజా పండ్లు, ఏ సీజన్లో లభించేవి ఆ సీజన్లో వాడుతూ ఉండండి. ►అలాగే జీర్ణవ్యవస్థలోని కండరాల కదలికలు ఆరోగ్యంగా ఉండటానికి క్రమబద్ధంగా వాకింగ్ వంటి వ్యాయామాలు చేయండి. చివరగా... పొట్టలో (స్టమక్) అల్సర్స్ ఉన్నవారు చికిత్స తీసుకున్న తర్వాత కూడా అవన్నీ తగ్గాయా లేదా అని మరోసారి నిర్ధారణ చేసుకోవాలి. ఎందుకంటే స్టమక్ అల్సర్స్లో ఒకవేళ క్యాన్సర్ లక్షణాలు ఉంటే అలాంటివి చికిత్స తర్వాత కూడా తగ్గవు. కాబట్టి అలాంటివి ఏవైనా ఉంటే వాటిని ఒకసారి బయాప్సీ తీసి పరీక్ష చేయాలి. కానీ డియోడినల్ అల్సర్స్ విషయంలో ఈ జాగ్రత్త అవసరం లేదు. కాబట్టి అల్సర్స్ ఉన్నాయని తేలితే, ఆ అంశాన్ని తేలిగ్గా తీసుకోకుండా డాక్టర్‌ను కలిసి తగిన చికిత్స తీసుకోండి. డాక్టర్ గురు ఎన్. రెడ్డి చీఫ్ ఆఫ్ గ్యాస్ట్రోంటరాలజీ - లివర్ డిసీజెస్, చైర్మన్ - ఎండీ., కాంటినెంటల్ హాస్పిటల్స్, గచ్చీబౌలీ, హైదరాబాద్