హోమియో కౌన్సెలింగ్స్
నా భార్య వయసు 38 ఏళ్లు. ఈమధ్య ఆమె శరీరంపై వెంట్రుకలు ఎక్కువగా పెరుగుతుంటే డాక్టర్‌కు చూపించాం. ఆమె పీసీఓడీ ఉందని చెప్పారు. దయచేసి దీనికి హోమియోలో చికిత్స ఉందేమో చెప్పండి.
– ఆర్. వెంకటరావు, శ్రీకాకుళం
రుతుక్రమం సవ్యంగా ఉన్న మహిళల్లో నెలసరి అయిన 11–18 రోజుల మధ్యకాలంలో వాళ్లలోని రెండు అండాశయల్లోని ఏదో ఒకదాని నుంచి అండం విడుదల అవుతుంది. అలా జరగకుండా అపరిపక్వమైన అండాలు వెలువడి అవి నీటిబుడగల్లా అండాశయపు గోడలపై ఉండిపోయే కండిషన్‌ను పీసీవోడీ (పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్) అంటారు. ఇవి రెండువైపులా ఉంటే ‘బైలేటరల్ పీసీఓడీ’ అంటారు. ఈ సమస్యకు కచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ జన్యుపరమైన అంశాలు ఒక కారణంగా భావిస్తున్నారు. అంతేగాక ఎఫ్‌ఎస్‌హెచ్, ఎల్‌హెచ్, ఈస్ట్రోజెన్, టెస్టోస్టెరాన్ హార్మోన్ల అసమతౌల్యత వల్ల ఈ సమస్య తలెత్తవచ్చు. సరైన జీవనశైలి పాటించనివారిలోనూ ఇది ఎక్కువ.
లక్షణాలు: నెలసరి సరిగా రాకపోవడం, వచ్చినా అండాశయం నుంచి అండం విడుదల కాకపోవడం, రుతుస్రావం సమయంలో ఎక్కువ రక్తంపోవడం, రెండు రుతుక్రమాల మధ్యకాలంలో రక్తస్రావం కావడం, నెలసరి వచ్చే సమయంలో కడుపులో బాగా నొప్పిరావడం, నెలసరి రాకపోవడం, బరువు పెరగడం, తలవెంట్రుకలు రాలిపోతుండటం, ముఖం, వీపు, శరీరంపై మొటిమలు రావడం, ముఖం, ఛాతీపైన మగవారిలా వెంట్రుకలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనివల్ల సంతానం కలగకపోవడం, స్థూలకాయం, డయాబెటిస్, కొందరిలో చాలా అరుదుగా హృద్రోగ సమస్యలు రావచ్చు. రోగిని భౌతిక లక్షణాలతో పాటు అల్ట్రాసౌండ్ స్కాన్, హెచ్‌సీజీ, టెస్టోస్టెరాన్, ఆండ్రోజెన్, ప్రోలాక్టిన్ మొదలైన హార్మోన్ల పరీక్షలు, రక్తంలో చక్కెరపాళ్లు, కొలెస్ట్రాల్ శాతం వంటి పరీక్షలతో దీన్ని నిర్ధారణ చేయవచ్చు. హోమియో విధానంలో సరైన హార్మోన్ వ్యవస్థను పరిపుష్టం చేయడం ద్వారా దుష్ఫలితాలేవీ లేకుండా శాశ్వతంగా పీసీఓడీని నయం చేయవచ్చు.
డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్,
సీఎండీ, హోమియోకేర్
ఇంటర్నేషనల్, హైదరాబాద్
గ్యాస్ట్రిక్ అల్సర్ తగ్గుతుందా?
నా వయసు 36 ఏళ్లు. ఇటీవల కండుపులో మంట, వికారంతో డాక్టర్ దగ్గరికి వెళ్తే పరీక్షలు చేయించి, అల్సర్ ఉందని చెప్పారు. నా సమస్యకు హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందా? – ఎమ్. తిరుమలమూర్తి, చీరాల
ఇటీవలి ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల జీర్ణకోశ సమస్యలు ముఖ్యంగా గ్యాస్ట్రిక్ అల్సర్ వంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. మన జీర్ణవ్యవస్థలో ఒక నిర్ణీత పరిమాణంలో ఆమ్లం (యాసిడ్) అవసరం. అందుకే ఆమ్లం ఎక్కువైతేనే కాదు... తక్కువైనప్పుడూ అల్సర్లు తయారవుతాయి. జీర్ణాశయంలో ఏర్పడే అల్సర్స్‌ను గ్యాస్ట్రిక్ అల్సర్స్ అంటారు. హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా కూడా అల్సర్స్‌కు కారణమవుతుంది. సాధారణంగా ఇతర ఏ బ్యాక్టీరియా అయినా కడుపులోని ఆమ్లంలో చనిపోతుంది. కానీ ఈ ఒక్క బ్యాక్టీరియా మాత్రమే ఆమ్లాన్ని తట్టుకొని జీవిస్తుంది. పైగా ఆమ్లం అధిక ఒత్తిడికి కూడా దోహదం చేస్తుంది. దాంతో జీర్ణాశయంలో ఆల్సర్లు పెరుగుతాయి.
కారణాలు: ∙80 శాతం మందిలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల అల్సర్లు వస్తాయి ∙చాలామందిలో కడుపులో పుండ్లు రావడానికి హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా ముఖ్యమైనది మానసిక ఒత్తిడి, కారం, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం ∙మద్యపానం, పొగతాగడం ∙వేళకు ఆహారం తీసుకోకపోవడం కలుషితమైన ఆహారం, నీరు వంటి ద్వారా క్రిములు చేరి, అవి జీర్ణవ్యవస్థలో విషపదార్థాలను విడుదల చేసి పుండ్లు రావడానికి కారణమవుతాయి.
లక్షణాలు: ∙కడుపులో నొప్పి, మంట, ఉబ్బరం ∙ఛాతీలో నొప్పి, పుల్లటి తేన్పులు, మలబద్దకం ∙తలనొప్పి, బరువు తగ్గడం, రక్తవాంతులు, రక్త విరేచనాలు ∙కొంచెం తిన్నా కడుపు నిండినట్లు ఉండటం, ఆకలి తగ్గడం ∙నోటిలో ఎక్కువగా నీళ్లు ఊరడం.
నివారణ జాగ్రత్తలు: ∙పరిశుభ్రమైన నీరు, ఆహారం తీసుకోవాలి ∙మద్యపానం, పొగతాగడం అలవాట్లు మానేయాలి ∙కారం, మసాలా ఆహారాల విషయంలో జాగ్రత్త వహించాలి ∙కంటినిండా నిద్రపోవాలి ∙మానసిక ఒత్తిడి దూరం కావడానికి యోగా, ధ్యానం వంటివి చేయాలి ∙ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. సమతులాహారం తీసుకోవాలి.
చికిత్స: గ్యాస్ట్రిక్ అల్సర్‌కు హోమియోలో మంచి మందులు ఉన్నాయి. ఆర్సనిక్ ఆల్బ్, యాసిడ్ నైట్రికమ్, మెర్క్‌సాల్, గ్రాఫైటిస్, ఫాస్ఫరస్ వంటి మందులు ఈ సమస్యకు చక్కగా పనిచేస్తాయి. అయితే అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో వీటిని తీసుకోవాలి.
డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో),
స్టార్ హోమియోపతి, హైదరాబాద్
ముక్కులు బిగదీసుకు పోతున్నాయి...
నా వయసు 29 ఏళ్లు. నేను గత ఆర్నెల్లుగా తుమ్ములు, ముక్కుకారవడం, ముక్కులు బిగదీసుకుపోతున్నాయి. వాసనలు తెలియడం లేదు. చాలా మంది డాక్టర్లను కలిశాను. సమస్య తగ్గినట్టే తగ్గి, మళ్లీ వస్తోంది. హోమియోలో దీనికి పరిష్కారం చెప్పండి. – డి. వినయ్ కుమార్, కొత్తగూడెం
మీరు ‘అలర్జిక్ రైనైటిస్’ అనే సమస్యతో బాధపడుతున్నారు. మీకు సరిపడనివి తగిలినప్పుడు (దుమ్ము, ధూళి, పుప్పొడి, ఘాటువాసనలు) మీకు అలర్జీ మొదలవుతుంది. దాంతో ముక్కులోని రక్తనాళాలు ఉబ్బినట్లుగా అయి, ఆగకుండా తుమ్ములు రావడం, ముక్కు బిగదీసుకుపోవడం వంటివి కనిపిస్తాయి.
లక్షణాలు: ఆగకుండా తుమ్ములు రావడం, ముక్కుకారడం వంటి లక్షణాలే గాక... వాటిని నిర్లక్ష్యం చేస్తే సైనస్‌లకు ఇన్ఫెక్షన్ సోకి తలబరువు, తలనొప్పి వంటివి కనిపించవచ్చు. ముక్కుపొరలు ఉబ్బడం వల్ల గాలి లోపలికి వెళ్లక వాసనలు కూడా తగ్గిపోతాయి. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే మున్ముందు సైనసైటిస్, నేసల్ పాలిప్స్, వంటి పెద్ద పెద్ద సమస్యలూ వచ్చేందుకు అవకాశం ఉంది.
వ్యాధి నిర్ధారణ కోసం ఎక్స్–రే, సీటీ స్కాన్ వంటి పరీక్షలు చేయించాల్సి ఉంటుంది.
నివారణ: ∙అలర్జీ కారకాలకు సాధ్యమైనంత దూరంగా ఉండటం ∙సరైన పోషకాహారం తీసుకోవడం ∙ముక్కుకు సంబంధించిన వ్యాయామాలు చేయడం చల్లని వాతావరణానికి దూరంగా ఉడటం ∙పొగతాగే అలవాటుకు దూరంగా ఉండటం.
చికిత్స: హోమియోలో వ్యక్తిగత లక్షణాలనూ, మానసిక స్వభావాన్ని బట్టి కాన్‌స్టిట్యూషన్ చికిత్స ఇవ్వవచ్చు. దీనివల్ల వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది. క్రమక్రమంగా వ్యాధి తీవ్రతను తగ్గిస్తూ పోయి, అలా సమస్యను పూర్తిగా తగ్గించవచ్చు. అనుభవజ్ఞులైన హోమియో నిపుణుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటూ ఉంటే అలర్జిక్ రైనైటిస్ పూర్తిగా తగ్గుతుంది.
డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ,
పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment