India Facing Shortage Of Gastroenterologists In Country: కావాల్సింది 25,000 మంది ఉన్నది 2,500 మంది - Sakshi
Sakshi News home page

కావాల్సింది 25,000 మంది ఉన్నది 2,500 మంది

Published Mon, Mar 14 2022 3:03 AM | Last Updated on Mon, Mar 14 2022 1:37 PM

India Facing Shortage Of Gastroenterologists In Country - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘మన జనాభాలో 30% మంది గ్యాస్ట్రిక్‌ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. కానీ దేశంలో 2,500 మందే గ్యాస్ట్రో ఎంటరాలజిస్టులున్నారు. మనకు కనీసం 25 వేల మంది స్పెషలిస్టులు కావాలి’అని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) చైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి చెప్పారు. ఇండియాలో గ్యాస్ట్రో ఎంటరాలజీ విద్య అంతగా లేదని, తాము అడ్వాన్స్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ కోర్సు ఆఫర్‌ చేస్తున్నామని తెలిపారు.

‘గ్యాస్ట్రో’లో పరిశోధన, శిక్షణలో చేస్తున్న కృషికే తనకు అమెరికన్‌ ఏజీఏ ‘విశిష్ట విద్యావేత్త’అవార్డు వచ్చిందని, ఈ రంగంలో ఇది నోబెల్‌కు సమానమైన పురస్కారమని అన్నారు. అవార్డుకు ఎంపికైన సందర్భంగా నాగేశ్వర్‌రెడ్డి ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే..  

ఇప్పటివరకు అమెరికా, యూరప్‌ వాళ్లకే.. 
అమెరికన్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ అసోసియేషన్‌ (ఏజీఏ) ప్రసిద్ధ సంస్థ. అంతర్జాతీయంగా 20 వేల మంది సభ్యులు ఇందులో ఉన్నారు. నేనూ సభ్యుడినే. ఇండియా నుంచి 200 మంది ఉన్నారు. అందులో సభ్యత్వానికి ఎవరో ఒకరు రిఫరెన్స్‌ ఇవ్వాలి. విశిష్ట విద్యావేత్త అవార్డును ఏటా ఇస్తారు. ప్రపంచంలో ఒకరికే ఇస్తారు.

గ్యాస్ట్రో ఎంటరాలజీ రంగంలో కొత్త పరిశోధనలు, పబ్లికేషన్లు, వివిధ పత్రాలు పరిశీలిస్తారు. అవార్డు జ్యూరీ కమిటీ వాటిని అధ్యయనం చేసి ఎంపిక చేస్తుంది. ఇప్పటివరకు అమెరికన్, యూరప్‌ వాళ్లకే అవార్డు దక్కింది. తొలిసారి ఆసియా ఖండంలో భారతీయుడినైన నాకు రావడం ఆనందంగా ఉంది.

మే 22న శాంటియాగోలో ప్రదానం 
ఇండియాలో గ్యాస్ట్రో ఎంటరాలజీ విద్య అంతగా లేదు. ఇంకెక్కడా ప్రత్యేక శిక్షణ కూడా లేదు. మేం మాత్రం అడ్వాన్స్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ కోర్సు ఆఫర్‌ చేస్తున్నాం. ఇది మూడేళ్ల కోర్సు. ఏటా 20 మందికి సీట్లు ఉంటాయి. మూడేళ్లకు కలిపి 60 మంది ఉంటారు. ఇలా చేస్తున్నందుకే ఈ అవార్డు వచ్చింది.

సహజంగా అధ్యాపక వృత్తిలో ఉన్న వర్సిటీ ప్రొఫెసర్లకు ఇస్తారు. ప్రైవేట్‌ వారికి రాదు. కానీ నేను పరిశోధన, శిక్షణలో చేస్తున్న కృషికి ఇచ్చారు. ఈ ఏడాది మే 22న అమెరికా శాంటియాగోలో అవార్డును ప్రదానం చేస్తారు. దీనికి 20 వేల మంది గ్యాస్ట్రో ఎంటరాలజిస్టులు.. అమెరికాకు చెందిన ప్రముఖ రాజకీయ నేతలు, సెనెటర్లు హాజరవుతారు. అవార్డుతో పాటు సర్టిఫికెట్‌ ఇస్తారు. అవార్డుతో నాపై బాధ్యతలు పెరిగాయి.  

ఇప్పటివరకు 2 వేల మందికి శిక్షణ 
మేం ఏఐజీలో గ్యాస్ట్రో ఎంటరాలజీ రంగంలో ఇప్పటివరకు 2 వేల మందికి శిక్షణ ఇచ్చాం. యూఎస్, యూకే తదితర దేశాల నుంచి కూడా శిక్షణకు వస్తారు. యూరప్, అమెరికా తర్వాత అత్యాధునిక శిక్షణ ఇచ్చేది ఏఐజీనే. 20 ఏళ్లుగా శిక్షణ ఇస్తున్నాం. గ్యాస్ట్రో ఎంటరాలజిస్టులకు కొత్త సర్జరీలపై శిక్షణ ఉంటుంది. ఆస్పత్రిలో యానిమల్‌ ల్యాబ్, కంప్యూటర్ల ద్వారా శిక్షణ ఇస్తాం.

ఈ శిక్షణకు యూరోపియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ గుర్తింపునిచ్చింది. ఏఐజీలో గ్యాస్ట్రో ఎంటరాలజీలో పరిశోధనలు చేసేలా తీర్చిదిద్దాం. నీట్‌ పీజీ ద్వారానే 20 సీట్లు భర్తీ చేస్తాము. నీట్‌ పీజీలో టాప్‌ ర్యాంకర్లు ఏఐజీకి ప్రాధాన్యం ఇస్తారు. కడుపు కోయకుండా ఎండోస్కోపీ ద్వారానే ఏఐజీలో సర్జరీలు చేస్తున్నాం. ఇలా చేయడం ప్రపంచంలోనే తొలిసారి.    

గ్యాస్ట్రోలో దేశాన్ని నంబర్‌ వన్‌ చేయడమే లక్ష్యం 
చైనాలో సాధారణ డాక్టర్లకు కూడా గ్యాస్ట్రో ఎంటరాలజీపై శిక్షణ ఇస్తారు. ఎండీ ఎంఎస్‌ చేసిన వారికి 3 నెలల కోర్సు పెట్టాము. ఎండీ ఫిజీషియన్లు, సర్జన్లు ఏఐజీకి వస్తారు. 40 మందికి శిక్షణ ఇస్తాము. మా వద్ద పీహెచ్‌డీ కోర్సు కూడా ఉంది. అన్ని వర్సిటీలు దీన్ని గుర్తించాయి. పీహెచ్‌డీలో 6 సీట్లున్నాయి. 10 ఏళ్ల నుంచే ఈ కోర్సు ప్రారంభించాం. గ్యాస్ట్రో ఎంటరాలజీ పరిశోధన, విద్యలో చైనా, అమెరికాలు ముం దున్నాయి.

రానున్న రోజుల్లో మన దేశాన్ని నంబర్‌ వన్‌ స్థానానికి తీసుకురావాలనేది నాలక్ష్యం. మేం 2 నెలలకోసారి ఇచ్చే శిక్షణ కూడా ప్రారంభిం చాం. అందుకోసం మౌలిక సదుపాయాలు కల్పిం చాం. హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్‌ వర్సిటీల కన్నా ఎక్కువ చేస్తున్నాం. మేం చేస్తున్న కృషిని ఏజీఏ గుర్తించింది. వాళ్లు స్వయంగా ఇక్కడకు వచ్చి పరిశీలించారు. నేను 900 సైంటిఫిక్‌ పేపర్లు పబ్లిష్‌ చేశాను. మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్‌ దేశాలకు చెందినవారు ఏఐజీకి వచ్చి శిక్షణ తీసుకుంటున్నారు. మయన్మార్‌ గ్యాస్ట్రో స్పెషలిస్టులంతా ఇక్కడ శిక్షణ తీసుకున్నవారే. బంగ్లాదేశ్‌కు ప్రతీ వారం శిక్షణ ఇస్తున్నాం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement