gastroenterology
-
మహిళా సర్జన్లకు అవకాశమిస్తే బెదిరింపులొచ్చాయి
సాక్షి, హైదరాబాద్: గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగంలో సర్జన్లుగా మహిళలకు అవకాశం ఇచ్చి నందుకు తనకు బెదిరింపులు ఎదురయ్యాయని ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ బి.నాగేశ్వర్‌రెడ్డి అన్నారు. ఈ–మెయిల్స్, లేఖల రూపంలో అవి వచ్చాయని తెలిపారు. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (హెచ్సీఎస్సీ) బుధవారం ‘షీ ట్రంప్స్ విత్ రెస్పెక్ట్, ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్’(స్త్రీ) పేరిట నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై కీలకోపన్యాసం చేశారు. హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ నేతృత్వంలో బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(ఐసీసీసీ)లోని ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నాగేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ... ‘తల్లి, భార్య, కుమార్తె నా జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేశారు. ఏఐజీలో పని చేస్తున్న వారిలో 60 శాతం మంది మహిళా ఉద్యోగులే. చాయ్, సిగరెట్, గాసిప్స్ వంటివి ఉండని కారణంగా మహిళా ఉద్యోగుల వల్ల ఉత్పాదకత ఎక్కువగా ఉంటుంది. పురుషుల కంటే స్త్రీలు ఎన్నో పనులను సమన్వయంతో వేగంగా పూర్తి చేయగలరు. మెడికల్ కాలేజీల్లో మహిళల సంఖ్య 60 శాతం ఉంటే.. పీజీకి వచ్చేసరికి 10 నుంచి 20 శాతానికి పడిపోతోంది. యూరప్, అమెరికా దేశాల్లోని గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ల్లో సగం మంది మహిళలే. మన దేశంలో 300 మంది మహిళా గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు ఉంటే... ఐదుగురే సర్జన్లుగా పనిచేసేవారు. ఈ పరిస్థితులను మార్చడానికి వివిధ దేశాలకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజీ మహిళా సర్జన్లను ఏఐజీకి పిలిపించి గతంలో ఓ క్యాంప్ ఏర్పాటు చేశాం. ఈ స్ఫూర్తితో దేశంలోని 100 మంది మహిళా గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు సర్జరీలు చేయడం ప్రారంభించారు. వీరిని ప్రోత్సహిస్తున్నందుకు 10 మంది నుంచి బెదిరింపులు వచ్చాయి. సాధారణ ప్రసవం, తల్లిపాలు ఇవ్వడం, ఆరు నెలలవరకు ఎలాంటి యాంటీ బయాటిక్స్ వాడకపోవడం వల్ల శిశువులు భవిష్యత్‌లో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాతో ఉంటారు. మనం మహిళలకు మద్దతు ఇవ్వడంతో పాటు బాధ్యతల్లో భాగస్వాముల్ని చేయాలి’అని కోరారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి మహమూద్ అలీ ‘కుటుంబ జీవితం–సామాజిక మాధ్యమాలు’అనే అంశంపై ఉస్మానియా యూనివర్సిటీ–హెచ్సీఎస్సీ సంయుక్తంగా చేపట్టిన అధ్యయన పత్రాన్ని ఆవిష్కరించారు. -
ఫాస్ట్ఫుడ్స్ హానికరం కాదు.. అవే అత్యంత ప్రమాదకరం
సాక్షి, కాకినాడ: తినే ఆహారమే వ్యక్తి ఆయుష్షును నిర్ణయిస్తుందని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ వ్యవస్థాపకుడు, ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి చెప్పారు. కాకినాడలోని రంగరాయ వైద్యకళాశాల ఆడిటోరియంలో ఆదివారం జరిగిన రీజినల్ అకడమిక్ కాన్ఫరెన్స్‌లో ఆయన విశిష్టవక్తగా పాల్గొన్నారు. ‘గ్యాస్ట్రోఎంట్రాలజీలో తాజా పురోగతులు’, ‘వ్యక్తిగా విజయం సాధించేందుకు దోహదంచేసే అంశాలు’ అనే అంశాలపై ఆయన మాట్లాడారు. ఫాస్ట్ఫుడ్స్ హానికారకం కాదని, రంగు, రుచి, వాసన, నిల్వసామర్థ్యం పెంచేందుకు వాటిలో కలిపే అడెటివ్స్ (సంకలనాలే) అత్యంత ప్రమాదకరమని తెలిపారు. ప్రపంచ ఆరోగ్యసంస్థతో కలిసి గత ఆరేళ్లలో తెలంగాణ ప్రభుత్వం మంచినీటి సరఫరా, నాణ్యతను విస్తృతం చేసి విజయవంతమైందని చెప్పారు. ఈ చర్య వల్ల నీటి ద్వారా వ్యాపించే ఎన్నో అనారోగ్యాలు తగ్గుముఖం పట్టాయని పేర్కొన్నారు. కేవలం జంక్ఫుడ్స్ తినడానికి అలవాటుపడిన వారిలో వయసుతో నిమిత్తంలేని జీర్ణకోశ వ్యాధులను గుర్తిస్తున్నామని తెలిపారు. క్రోన్స్ డిసీజ్, ఐబీడీ, అల్సరేటివ్ కొలైటీస్ ఎక్కువగా నమోదవుతుండడం ఆందోళనకు గురిచేస్తోందని చెప్పారు. అనంతరం జీవితంలో విజయానికి దోహదం చేసే అంశాలపై చర్చించారు. సమయపాలన, ఎప్పటిపని అప్పుడే పూర్తిచేసే లక్షణం, నిరంతరం నేర్చుకునే ఆసక్తి ఏ వ్యక్తినైనా ఉన్నత శిఖరాలకు చేరుస్తాయని డాక్టర్ నాగేశ్వరరెడ్డి చెప్పారు. -
హెచ్ఐవీ కంటే హెపటైటిస్ ప్రమాదకరమా? అందులో నిజమెంత?
హెపటైటిస్ అనేది జబ్బు కాదు.. కొన్ని ఇన్ఫెక్షన్ల సమాహారం. హెపటైటిస్‌లో ఏ, బీ, సీ, డీ, ఈ అనే ఐదు రకాలు ఉన్నాయి. హెపటైటిస్ చాలా మందిలో ఉన్నప్పటికీ అది తమకు ఉన్నట్టే తెలియదు. సాధారణంగా 2, 3 వారాల్లో తగ్గిపోతుంది. కొద్ది మందిలో మాత్రం దీర్ఘకాలికంగా ఉండిపోతుంది. మొత్తం జనాభాలో 3 నుంచి 5 శాతం మంది హెపటైటిస్ బారిన పడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. హెపటైటిస్ ముదిరితే లివర్ గట్టి బడి లివర్ సిర్రోసిస్, మరికొందరిలో లివర్ క్యాన్సర్‌కు దారితీయవచ్చు. ఇంతటి ప్రమాదకరమైన హెపటైటిస్ నుంచి ముందు జాగ్రత్త చర్యలు పాటించడం, వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా రక్షణ పొందవచ్చని 40 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం ఉన్న ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ ఇ.పెదవీర్రాజు సూచిస్తున్నారు. వరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. – సీతంపేట(విశాఖ ఉత్తర) సాక్షి: హెపటైటిస్ అంటే ఏమిటి, ఎన్ని రకాలు, ఏ విధంగా వస్తుంది? డాక్టర్ పెదవీర్రాజు: హెపటైటిస్ నాలుగైదు రకాల వైరస్ల వల్ల వ్యాపిస్తుంది. హెపటైటిస్ ఏ, బీ, సీ,డీ, ఈ ఇలా ఐదు రకాల వైరస్ల వల్ల వ్యాధి బారిన పడతారు. ఇందులో హెపటైటిస్ బీ, సీ రకాలు కలుషితమైన రక్తం ఎక్కించుకోవడం, స్టెరిలైజ్ చేయని ఇంజక్షన్ సూదుల వల్ల, ఎక్కువ సార్లు శస్త్ర చికిత్సలు చేయించుకోవడం వల్ల వస్తుంది. ఏ, ఈ రకాలు కలుషితమైన నీరు, పాడైపోయిన ఆహారం వల్ల వ్యాపిస్తుంది. ముందు జాగ్రత్త చర్యలు పాటించం ద్వారా హెపటైటిస్ బారిన పడకుండా ఉండవచ్చు. సాక్షి: హెపటైటిస్ లక్షణాలు ఏమిటి? డాక్టర్ : హెపటైటిస్‌కు గురైన వారిలో జ్వరం, ఆకలి లేకపోవడం, నీళ్ల విరేచనాలు, తెలుపు రంగులో మోషన్, కడుపులో ఇబ్బంది, దురదలు, మూత్రం పచ్చగా రావడం, చర్మం, కంటిలోని తెల్లభాగం పసుపుగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రెండు నుంచి ఆరు వారాల లోపు వ్యాధి లక్షణాలు బయటపడతాయి. సాక్షి: హెపటైటిస్ బీ బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? డాక్టర్ : హెపటైటిస్ బీని నివారించడానికి వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. హెపటైటిస్ బీ వ్యాక్సిన్ మూడు డోసులు తీసుకుంటే రక్షణ ఉంటుంది. ఈ వ్యాక్సిన్ లివర్ క్యాన్సర్ బారిన పడకుండా కూడా రక్షణ కల్పిస్తుంది. భర్తకు హెపటైటిస్ బీ వస్తే భార్య.. ఇంటిలో ఒకరికి వస్తే మిగిలిన వారందరూ వ్యాక్సిన్ కచ్చితంగా తీసుకోవాలి. సాక్షి: హెపటైటిస్ సీ వైరస్ నుంచి రక్షణ పొందాలంటే..? డాక్టర్ : హెపటైటిస్ సీ కి గతంలో మందులు ఉండేవి కాదు. నాలుగేళ్ల నుంచి అద్భుతమైన మందులు అందుబాటులోకి వచ్చాయి. ఈ మందులు మూడు నెలలు వాడినట్లయితే హెపటైటిస్ సీ 95 శాతం నయం అవుతుంది. సాక్షి: హెపటైటిస్ ఏ, ఈ బారిన పడకుండా ఉండాలంటే..? డాక్టర్ : కలుషితం కాని ఆహారం, నీరు తీసుకోవడం వంటి ముందు జాగ్రత్త చర్యలు ద్వారా హెపటైటిస్ ఏ, ఈ బారిన పడుకుండా ఉండొచ్చు. హెపటైటిస్ ఏకు వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నప్పటికీ అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే వినియోగిస్తున్నారు. మనదేశంలో వ్యాక్సిన్ వినియోగించడం లేదు. హెపటైటిస్ ‘ఈ’కి వ్యాక్సిన్ లేదు. పరిసరాల పరిశుభ్రత, ఆహార నియమాలు పాటించడం ద్వారా ఏ, ఈ వైరస్ వ్యాప్తికి గురికాకుండా ఉండొచ్చు. సాక్షి: గర్భిణికి హెపటైటిస్ వస్తే పుట్టే శిశువుకు సంక్రమిస్తుందా? డాక్టర్ : గర్భిణికి హెపటైటిస్ బి ఉంటే పుట్టే శిశువుకు వచ్చే అవకాశం ఉంది. తల్లి గర్భంతో ఉన్నపుడు చేసే రక్త పరీక్షలో వ్యాధి నిర్ధారణ అయితే, బిడ్డ పుట్టగానే వ్యాక్సిన్‌తో పాటు హెచ్‌బీఐజీ ఇంజక్షన్ చేస్తారు. దీనివల్ల తల్లి నుంచి బిడ్డకు వ్యాధి సంక్రమించకుండా కాపాడవచ్చు. ఇటీవల టెనోఫెవర్ మాత్రలు అందుబాటులోకి వచ్చాయి. గర్భిణికి హెపటైటిస్‘బి’ వ్యాధి సోకి ఉండి, వైరస్ శాతం బాగా ఎక్కువగా ఉంటే.. ఆమెకు చివరి మూడు నెలలు ఈ మాత్రలు ఇవ్వాలి. దీని వల్ల ఆమె నుంచి శిశువుకు వ్యాధి వ్యాప్తి చెందకుండా ఆపొచ్చు. సాక్షి: ప్రస్తుతం ఈ వ్యాధి తీవ్రత ఏ మేరకు ఉంది? డాక్టర్ : డాక్టర్ బ్లూమ్ బెర్గ్ తన బృందంతో విస్తృత పరిశోధనల ఫలితంగా 1967లో హెపటైటిస్ బీ వైరస్‌ను గుర్తించారు. ఆ తర్వాత 1969లో హెపటైటిస్ బీ వ్యాక్సిన్ కనిపెట్టారు. అప్పటి వరకు జాండిస్ ఎందుకు వస్తుందో తెలిసేది కాదు. పరిశోధనల వల్ల రక్తం ద్వారా వస్తుందని తెలిసింది. ఇప్పుడు రక్తం ఎక్కించే ముందు స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నారు. అందువల్ల రక్తం ద్వారా హెపటైటిస్ బీ, సీ కూడా వచ్చే అవకాశాలు బాగా తగ్గిపోయాయనే చెప్పాలి. సాక్షి: ఈ వ్యాధి బారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డాక్టర్ : కలుషితం కాని ఆహారం, నీరు తీసుకోవడం ద్వారా హెపటైటిస్ ఏ, ఈ బారిన పడకుండా ఉండొచ్చు. వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా హెపటైటిస్ బీ రాకుండా రక్షణ పొందవచ్చు. హెపటైటిస్ బీ నివారణకు వ్యాక్సినే బెస్ట్ ప్రీవెన్షన్. రక్తం ఎక్కించే ముందు సరైన స్క్రీనింగ్ పరీక్షలు చేయడం ద్వారా హెపటైటిస్ బీ, సీ బారిన పడకుండా ఉండొచ్చు. హెపటైటిస్ డీ మన దేశంలో చాలా అరుదుగా వస్తుంది. ఇటలీలో కనిపిస్తుంది. ఒకప్పుడు హెపటైటిస్ వల్ల లివర్ సమస్యలు ఎక్కువగా వచ్చేవి. ప్రస్తుతం ఆల్కాహాల్, ఊబకాయం వల్ల ఎక్కువగా లివర్ సమస్యలు వస్తున్నాయి. ఢిల్లీ, బెనారస్ ప్రాంతాల్లో హెపటైటిస్ ఎక్కువగా ఉంది. ఆయా ప్రాంతాలకు వెళ్లి వచ్చిన వారు హెపటైటిస్ పరీక్ష చేయించు కోవడం మంచిది. సాక్షి: హెచ్ఐవీ కంటే హెపటైటిస్ ప్రమాదకరమా? డాక్టర్ : హెపటైటిస్ హెచ్ఐవీ కంటే ప్రమాదమన్న అపోహ ఉంది. అది నిజం కాదు. ఎందుకంటే చెమట ద్వారా, ముట్టుకోవడం, ముద్దు పెట్టుకోవడం వల్ల హెపటైటిస్ వ్యాపించదు. ఇంజక్షన్, శరీరంలోకి రక్తం ఎక్కించడం ద్వారా వ్యాపిస్తుంది. వ్యాధిగ్రస్తుడు వాడే రేజర్, బ్రష్, నెయిల్ కట్టర్ వేరుగా ఉంచాలి. భర్తకు హెపటైటిస్ బీ వస్తే భార్య వ్యాక్సిన్ తీసుకోవాలి. ఆ వ్యాక్సిన్ పని చేసే వరకు అంటే.. ఆరు నెలల వరకు కండోమ్ వాడాలి. సాక్షి: జాండిస్ తగ్గడానికి అల్లోపతి వైద్యం పనికిరాదనే అపోహ ఉంది. నిజమేనా? డాక్టర్ : జాండిస్ రాగానే అల్లోపతిలో మందు లేదని చాలా మందిలో అపోహ ఉంది. నాటు వైద్యానికి వెళ్లిపోతున్నారు. హైపటైటిస్ ఏ, బీ, సీ వచ్చినా సాధారణంగా రెండు మూడు వారాల్లో తగ్గిపోతుంది. అందువల్ల పసరు మందు రెండు మూడు వారాలు వాడగానే తగ్గిపోతుంది. అప్పటికీ తగ్గకపోతే వైద్యుడిని సంప్రదిస్తారు. ఈ లోగా వ్యాధి ముదిరిపోతుంది. జాండిస్ చాలా కారణాల వల్ల వస్తుంది. మలేరియా, లివర్‌లో స్టోన్, ట్యూమర్ వల్ల జాండిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. హెపటైసిస్ వల్ల వచ్చే జాండిస్ 2, 3 వారాల్లో తగ్గిపోతుంది. 3 నుంచి 5 శాతం మందికి దీర్ఘకాలికంగా శరీరంలో ఉండిపోతుంది. దీని వల్ల లివర్ గట్టిపడి లివర్ సిర్రోసిస్‌కు దారితీస్తుంది. పొట్టలో నీరు చేరడం, కళ్లు పచ్చబడటం, కాళ్లు పొంగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 2030 నాటికి హెపటైటిస్ నిర్మూలనే లక్ష్యం ఢిల్లీ ఎయిమ్స్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ గౌతమ్ హెపటైటిస్‌కు కారణమయ్యే వైరస్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, లేకపోతే ప్రాణాలకే ప్రమాదం వాటిల్లుతుందని ఢిల్లీ ఎయిమ్స్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ బుడిమూరి గౌతమ్ అన్నారు. హెపటైటిస్ దినోత్సవం పురస్కరించుకుని విశాఖ ప్రజల అవగాహన కోసం ఓ ప్రకటన విడుదల చేశారు. వైరల్ హెపటైటిస్ గురించి అవగాహన కల్పించాలన్న థీమ్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన నేపథ్యంలో ఆ దిశగా తాను కృషి చేస్తున్నట్టు తెలిపారు. లివర్ హెపటైటిస్ వ్యాధి తీవ్రత గణాంకాల ప్రకారం పరిశీలిస్తే.. భారతదేశంలో 4 శాతంగా ఉందన్నారు. ఒకసారి లివర్ పూర్తిగా పాడైన తర్వాత కాలేయ మార్పిడి ద్వారా మాత్రమే శాశ్వత పరిష్కారం ఉంటుందన్నారు. తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఉన్న రోగుల్లో ఫ్లూ వంటి జ్వరం, ఆకలి తగ్గడం, వికారం, పొత్తి కడుపులో నొప్పి, పచ్చ కామెర్లకు దారి తీస్తుందని, వ్యాధి అత్యంత తీవ్రమైన సందర్భాల్లో కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందన్నారు. వ్యాధి సోకిన వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకుని మందులు సక్రమంగా వాడితే.. ఆదిలోనే నివారించడంతో పాటు లివర్ వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చని వివరించారు. 2030 నాటికి హెపటైటిస్ నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. -
ఏఐజీ హాస్పిటల్స్‌లో వాటాలపై బేరింగ్ పీఈ ఏషియా దృష్టి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగంలో అగ్రగామి హైదరాబాద్ ఆస్పత్రి ఏఐజీలో (ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ) వాటాలు కొనుగోలు చేయడంపై బేరింగ్ ప్రైవేట్ ఈక్విటీ ఏషియా (బీపీఈఏ) దృష్టి పెట్టింది. ఈ రేసులో మరో ప్రైవేట్ ఈక్విటీ సంస్థ టీపీజీ కన్నా బీపీఈఏ ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. సంబంధిత వర్గాల కథనం ప్రకారం ప్రతిపాదిత డీల్‌లో భాగంగా ప్రస్తుత ఇన్వెస్టరయిన క్వాడ్రియా క్యాపిటల్ తనకున్న 30 శాతం వాటాలను విక్రయించి, వైదొలగనుంది. బీపీఈఏ మొత్తం మీద 40 శాతం వరకూ వాటాలు తీసుకోవచ్చని సమాచారం. 1986లో ఏర్పాటైన ఏఐజీకి డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి సారథ్యం వహిస్తున్నారు. గచ్చిబౌలిలో 800, సోమాజిగూడలో 300 పడకలతో ఆస్పత్రులు ఉన్నాయి. -
కావాల్సింది 25,000 మంది ఉన్నది 2,500 మంది
సాక్షి, హైదరాబాద్: ‘మన జనాభాలో 30% మంది గ్యాస్ట్రిక్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. కానీ దేశంలో 2,500 మందే గ్యాస్ట్రో ఎంటరాలజిస్టులున్నారు. మనకు కనీసం 25 వేల మంది స్పెషలిస్టులు కావాలి’అని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి చెప్పారు. ఇండియాలో గ్యాస్ట్రో ఎంటరాలజీ విద్య అంతగా లేదని, తాము అడ్వాన్స్ గ్యాస్ట్రో ఎంటరాలజీ కోర్సు ఆఫర్ చేస్తున్నామని తెలిపారు. ‘గ్యాస్ట్రో’లో పరిశోధన, శిక్షణలో చేస్తున్న కృషికే తనకు అమెరికన్ ఏజీఏ ‘విశిష్ట విద్యావేత్త’అవార్డు వచ్చిందని, ఈ రంగంలో ఇది నోబెల్‌కు సమానమైన పురస్కారమని అన్నారు. అవార్డుకు ఎంపికైన సందర్భంగా నాగేశ్వర్‌రెడ్డి ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ఇప్పటివరకు అమెరికా, యూరప్ వాళ్లకే.. అమెరికన్ గ్యాస్ట్రో ఎంటరాలజీ అసోసియేషన్ (ఏజీఏ) ప్రసిద్ధ సంస్థ. అంతర్జాతీయంగా 20 వేల మంది సభ్యులు ఇందులో ఉన్నారు. నేనూ సభ్యుడినే. ఇండియా నుంచి 200 మంది ఉన్నారు. అందులో సభ్యత్వానికి ఎవరో ఒకరు రిఫరెన్స్ ఇవ్వాలి. విశిష్ట విద్యావేత్త అవార్డును ఏటా ఇస్తారు. ప్రపంచంలో ఒకరికే ఇస్తారు. గ్యాస్ట్రో ఎంటరాలజీ రంగంలో కొత్త పరిశోధనలు, పబ్లికేషన్లు, వివిధ పత్రాలు పరిశీలిస్తారు. అవార్డు జ్యూరీ కమిటీ వాటిని అధ్యయనం చేసి ఎంపిక చేస్తుంది. ఇప్పటివరకు అమెరికన్, యూరప్ వాళ్లకే అవార్డు దక్కింది. తొలిసారి ఆసియా ఖండంలో భారతీయుడినైన నాకు రావడం ఆనందంగా ఉంది. మే 22న శాంటియాగోలో ప్రదానం ఇండియాలో గ్యాస్ట్రో ఎంటరాలజీ విద్య అంతగా లేదు. ఇంకెక్కడా ప్రత్యేక శిక్షణ కూడా లేదు. మేం మాత్రం అడ్వాన్స్ గ్యాస్ట్రో ఎంటరాలజీ కోర్సు ఆఫర్ చేస్తున్నాం. ఇది మూడేళ్ల కోర్సు. ఏటా 20 మందికి సీట్లు ఉంటాయి. మూడేళ్లకు కలిపి 60 మంది ఉంటారు. ఇలా చేస్తున్నందుకే ఈ అవార్డు వచ్చింది. సహజంగా అధ్యాపక వృత్తిలో ఉన్న వర్సిటీ ప్రొఫెసర్లకు ఇస్తారు. ప్రైవేట్ వారికి రాదు. కానీ నేను పరిశోధన, శిక్షణలో చేస్తున్న కృషికి ఇచ్చారు. ఈ ఏడాది మే 22న అమెరికా శాంటియాగోలో అవార్డును ప్రదానం చేస్తారు. దీనికి 20 వేల మంది గ్యాస్ట్రో ఎంటరాలజిస్టులు.. అమెరికాకు చెందిన ప్రముఖ రాజకీయ నేతలు, సెనెటర్లు హాజరవుతారు. అవార్డుతో పాటు సర్టిఫికెట్ ఇస్తారు. అవార్డుతో నాపై బాధ్యతలు పెరిగాయి. ఇప్పటివరకు 2 వేల మందికి శిక్షణ మేం ఏఐజీలో గ్యాస్ట్రో ఎంటరాలజీ రంగంలో ఇప్పటివరకు 2 వేల మందికి శిక్షణ ఇచ్చాం. యూఎస్, యూకే తదితర దేశాల నుంచి కూడా శిక్షణకు వస్తారు. యూరప్, అమెరికా తర్వాత అత్యాధునిక శిక్షణ ఇచ్చేది ఏఐజీనే. 20 ఏళ్లుగా శిక్షణ ఇస్తున్నాం. గ్యాస్ట్రో ఎంటరాలజిస్టులకు కొత్త సర్జరీలపై శిక్షణ ఉంటుంది. ఆస్పత్రిలో యానిమల్ ల్యాబ్, కంప్యూటర్ల ద్వారా శిక్షణ ఇస్తాం. ఈ శిక్షణకు యూరోపియన్ అసోసియేషన్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ గుర్తింపునిచ్చింది. ఏఐజీలో గ్యాస్ట్రో ఎంటరాలజీలో పరిశోధనలు చేసేలా తీర్చిదిద్దాం. నీట్ పీజీ ద్వారానే 20 సీట్లు భర్తీ చేస్తాము. నీట్ పీజీలో టాప్ ర్యాంకర్లు ఏఐజీకి ప్రాధాన్యం ఇస్తారు. కడుపు కోయకుండా ఎండోస్కోపీ ద్వారానే ఏఐజీలో సర్జరీలు చేస్తున్నాం. ఇలా చేయడం ప్రపంచంలోనే తొలిసారి. గ్యాస్ట్రోలో దేశాన్ని నంబర్ వన్ చేయడమే లక్ష్యం చైనాలో సాధారణ డాక్టర్లకు కూడా గ్యాస్ట్రో ఎంటరాలజీపై శిక్షణ ఇస్తారు. ఎండీ ఎంఎస్ చేసిన వారికి 3 నెలల కోర్సు పెట్టాము. ఎండీ ఫిజీషియన్లు, సర్జన్లు ఏఐజీకి వస్తారు. 40 మందికి శిక్షణ ఇస్తాము. మా వద్ద పీహెచ్డీ కోర్సు కూడా ఉంది. అన్ని వర్సిటీలు దీన్ని గుర్తించాయి. పీహెచ్‌డీలో 6 సీట్లున్నాయి. 10 ఏళ్ల నుంచే ఈ కోర్సు ప్రారంభించాం. గ్యాస్ట్రో ఎంటరాలజీ పరిశోధన, విద్యలో చైనా, అమెరికాలు ముం దున్నాయి. రానున్న రోజుల్లో మన దేశాన్ని నంబర్ వన్ స్థానానికి తీసుకురావాలనేది నాలక్ష్యం. మేం 2 నెలలకోసారి ఇచ్చే శిక్షణ కూడా ప్రారంభిం చాం. అందుకోసం మౌలిక సదుపాయాలు కల్పిం చాం. హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ వర్సిటీల కన్నా ఎక్కువ చేస్తున్నాం. మేం చేస్తున్న కృషిని ఏజీఏ గుర్తించింది. వాళ్లు స్వయంగా ఇక్కడకు వచ్చి పరిశీలించారు. నేను 900 సైంటిఫిక్ పేపర్లు పబ్లిష్ చేశాను. మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ దేశాలకు చెందినవారు ఏఐజీకి వచ్చి శిక్షణ తీసుకుంటున్నారు. మయన్మార్ గ్యాస్ట్రో స్పెషలిస్టులంతా ఇక్కడ శిక్షణ తీసుకున్నవారే. బంగ్లాదేశ్‌కు ప్రతీ వారం శిక్షణ ఇస్తున్నాం. -
డాక్టర్ కొల్లూరి చిరంజీవి కన్నుమూత
ఖైరతాబాద్ (హైదరాబాద్): తెలంగాణ తొలి, మలి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన డాక్టర్ కొల్లూరి చిరంజీవి (74) కన్ను మూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కొల్లూరి చిరంజీవి గత నెల 19న ఏఐజి ఆసుపత్రిలో చేరారు. అనారోగ్యంతో ఆయన చికిత్స పొందుతున్న సమయంలోనే మంత్రి కేటీఆర్ రూ.10 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. కాగా, పరిస్థితి విషమించడంతో ఆదివారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. సోమవారం సాయంత్రం నారాయణగూడలో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. 1947 ఫిబ్రవరిలో వరంగల్‌లో ఆయన జన్మించారు. తల్లి టీచర్, తండ్రి రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి. కాకతీయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివే రోజుల్లోనే ఆయన విద్యార్థి సంఘం నేతగా చురుకుగా పనిచేశారు. మెడికల్ కాలేజీలో చదువుకునే రోజుల్లోనే డాక్టర్ చంద్రావతిని ప్రేమించి ఆదర్శ వివాహం చేసుకున్నారు. 1969 ఉద్యమకారుల సమాఖ్య ఏర్పాటుచేసి సమస్యలపై పోరాటం చేస్తూ ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలిచారు. పీపుల్స్ వార్ గ్రూప్‌లో చేరి కొండపల్లి సీతారామయ్యకు ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. తర్వాత బీఎస్పీలో చేరి కీలక నేతగా ఎదిగారు. తెలంగాణ రాష్ట్ర సాధనకోసం ఎంతో మంది విద్యార్థులు, ఉద్యమకారులకు దిశానిర్దేశం చేశారు. మంత్రి కేటీఆర్ నివాళి కొల్లూరి భౌతికకాయం వద్ద మంత్రి కేటీఆర్ నివాళులు అర్పించి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ బండా ప్రకాశ్, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మందకృష్ణ మాదిగ, జై భీంటీవీ సీఈవో శ్రీధర్ తదితరులు కొల్లూరి భౌతికకాయం వద్ద నివాళులు అర్పించారు. మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తదితరులు సంతాపం ప్రకటించారు. -
కాలేయ జబ్బుల నివారణకు కొత్త మందులు
- గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డాక్టర్ చంద్రశేఖరన్ కర్నూలు(హాస్పిటల్): హెపటైటిస్-బి, సి తదితర కాలేయ వ్యాధుల నివారణకు కొత్త మందులు అందుబాటులోకి వచ్చినట్లు ఇండియన్ సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజి అధ్యక్షులు డాక్టర్ చంద్రశేఖరన్(చెన్నై) చెప్పారు. స్థానిక బళ్లారి చౌరస్తా సూరజ్‌గ్రాండ్ హోటల్లో ఆదివారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజి ఏపీ చాప్టర్ ఏర్పాటును ఏర్పాటు చేశారు. అధ్యక్షులుగా డాక్టర్ బి. శంకరశర్మ, కార్యదర్శిగా డాక్టర్ వెంకటరంగారెడ్డి, కోశాధికారిగా డాక్టర్ మోహన్‌రెడ్డి ఎన్నికయ్యారు. అనంరతం జరిగిన వైద్య విజ్ఞాన సదస్సులో హెపటైటిస్ జబ్బుల గురించి డాక్టర్ చంద్రశేఖరన్ మాట్లాడారు. హెపటైటిస్ వైరస్ కొన్నేళ్లపాటు ఏ విధమైన లక్షణాలు చూపకుండా శరీరంలో ఉండి లివర్ సిర్రోసిస్, లివర్ క్యాన్సర్‌కు కారణమవుతున్నాయన్నారు. ఇవి తల్లికి ఉంటే బిడ్డకు, కలుషిత రక్తమార్పిడి, సిరంజిలు, అరక్షిత సెక్స్ వల్ల సంక్రమించే ప్రమాదం ఉందన్నారు. కొత్తగా వచ్చిన సొఫాసుబవిర్, వెల్పటాసవిర్ మందులతో 99 శాతం మందిలో హెపటైటిస్- సిని నయం చేయవచ్చన్నారు. పుట్టిన ప్రతి బిడ్డకూ వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా హెపటైటిస్-బి నుంచి కాపాడవచ్చన్నారు. ఏసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజి చైర్మన్ డాక్టర్ డి. నాగేశ్వరరెడ్డి పెద్దపేగు, చిన్నపేగులో ఉన్న కణతులను ఆపరేషన్ లేకుండా ఎండోస్కోపి ద్వారా తొలగించడంపై వివరించారు. అనంతరం ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డాక్టర్ నరేష్‌భట్ కూడా ప్రసంగించారు.