హెపటైటిస్ అనేది జబ్బు కాదు.. కొన్ని ఇన్ఫెక్షన్ల సమాహారం. హెపటైటిస్‌లో ఏ, బీ, సీ, డీ, ఈ అనే ఐదు రకాలు ఉన్నాయి. హెపటైటిస్ చాలా మందిలో ఉన్నప్పటికీ అది తమకు ఉన్నట్టే తెలియదు. సాధారణంగా 2, 3 వారాల్లో తగ్గిపోతుంది. కొద్ది మందిలో మాత్రం దీర్ఘకాలికంగా ఉండిపోతుంది. మొత్తం జనాభాలో 3 నుంచి 5 శాతం మంది హెపటైటిస్ బారిన పడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. హెపటైటిస్ ముదిరితే లివర్ గట్టి బడి లివర్ సిర్రోసిస్, మరికొందరిలో లివర్ క్యాన్సర్‌కు దారితీయవచ్చు. ఇంతటి ప్రమాదకరమైన హెపటైటిస్ నుంచి ముందు జాగ్రత్త చర్యలు పాటించడం, వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా రక్షణ పొందవచ్చని 40 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం ఉన్న ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ ఇ.పెదవీర్రాజు సూచిస్తున్నారు. వరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
– సీతంపేట(విశాఖ ఉత్తర)
సాక్షి: హెపటైటిస్ అంటే ఏమిటి, ఎన్ని రకాలు, ఏ విధంగా వస్తుంది?
డాక్టర్ పెదవీర్రాజు: హెపటైటిస్ నాలుగైదు రకాల వైరస్‌ల వల్ల వ్యాపిస్తుంది. హెపటైటిస్ ఏ, బీ, సీ,డీ, ఈ ఇలా ఐదు రకాల వైరస్‌ల వల్ల వ్యాధి బారిన పడతారు. ఇందులో హెపటైటిస్ బీ, సీ రకాలు కలుషితమైన రక్తం ఎక్కించుకోవడం, స్టెరిలైజ్ చేయని ఇంజక్షన్ సూదుల వల్ల, ఎక్కువ సార్లు శస్త్ర చికిత్సలు చేయించుకోవడం వల్ల వస్తుంది. ఏ, ఈ రకాలు కలుషితమైన నీరు, పాడైపోయిన ఆహారం వల్ల వ్యాపిస్తుంది. ముందు జాగ్రత్త చర్యలు పాటించం ద్వారా హెపటైటిస్ బారిన పడకుండా ఉండవచ్చు.
సాక్షి: హెపటైటిస్ లక్షణాలు ఏమిటి?
డాక్టర్ : హెపటైటిస్‌కు గురైన వారిలో జ్వరం, ఆకలి లేకపోవడం, నీళ్ల విరేచనాలు, తెలుపు రంగులో మోషన్, కడుపులో ఇబ్బంది, దురదలు, మూత్రం పచ్చగా రావడం, చర్మం, కంటిలోని తెల్లభాగం పసుపుగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రెండు నుంచి ఆరు వారాల లోపు వ్యాధి లక్షణాలు బయటపడతాయి.
సాక్షి: హెపటైటిస్ బీ బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి?
డాక్టర్ : హెపటైటిస్ బీని నివారించడానికి వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. హెపటైటిస్ బీ వ్యాక్సిన్ మూడు డోసులు తీసుకుంటే రక్షణ ఉంటుంది. ఈ వ్యాక్సిన్ లివర్ క్యాన్సర్ బారిన పడకుండా కూడా రక్షణ కల్పిస్తుంది. భర్తకు హెపటైటిస్ బీ వస్తే భార్య.. ఇంటిలో ఒకరికి వస్తే మిగిలిన వారందరూ వ్యాక్సిన్ కచ్చితంగా తీసుకోవాలి.
సాక్షి: హెపటైటిస్ సీ వైరస్ నుంచి రక్షణ పొందాలంటే..?
డాక్టర్ : హెపటైటిస్ సీ కి గతంలో మందులు ఉండేవి కాదు. నాలుగేళ్ల నుంచి అద్భుతమైన మందులు అందుబాటులోకి వచ్చాయి. ఈ మందులు మూడు నెలలు వాడినట్లయితే హెపటైటిస్ సీ 95 శాతం నయం అవుతుంది.
సాక్షి: హెపటైటిస్ ఏ, ఈ బారిన పడకుండా ఉండాలంటే..?
డాక్టర్ : కలుషితం కాని ఆహారం, నీరు తీసుకోవడం వంటి ముందు జాగ్రత్త చర్యలు ద్వారా హెపటైటిస్ ఏ, ఈ బారిన పడుకుండా ఉండొచ్చు. హెపటైటిస్ ఏకు వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నప్పటికీ అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే వినియోగిస్తున్నారు. మనదేశంలో వ్యాక్సిన్ వినియోగించడం లేదు. హెపటైటిస్ ‘ఈ’కి వ్యాక్సిన్ లేదు. పరిసరాల పరిశుభ్రత, ఆహార నియమాలు పాటించడం ద్వారా ఏ, ఈ వైరస్ వ్యాప్తికి గురికాకుండా ఉండొచ్చు.
సాక్షి: గర్భిణికి హెపటైటిస్ వస్తే పుట్టే శిశువుకు సంక్రమిస్తుందా?
డాక్టర్ : గర్భిణికి హెపటైటిస్ బి ఉంటే పుట్టే శిశువుకు వచ్చే అవకాశం ఉంది. తల్లి గర్భంతో ఉన్నపుడు చేసే రక్త పరీక్షలో వ్యాధి నిర్ధారణ అయితే, బిడ్డ పుట్టగానే వ్యాక్సిన్‌తో పాటు హెచ్‌బీఐజీ ఇంజక్షన్ చేస్తారు. దీనివల్ల తల్లి నుంచి బిడ్డకు వ్యాధి సంక్రమించకుండా కాపాడవచ్చు. ఇటీవల టెనోఫెవర్ మాత్రలు అందుబాటులోకి వచ్చాయి. గర్భిణికి హెపటైటిస్‘బి’ వ్యాధి సోకి ఉండి, వైరస్ శాతం బాగా ఎక్కువగా ఉంటే.. ఆమెకు చివరి మూడు నెలలు ఈ మాత్రలు ఇవ్వాలి. దీని వల్ల ఆమె నుంచి శిశువుకు వ్యాధి వ్యాప్తి చెందకుండా ఆపొచ్చు.
సాక్షి: ప్రస్తుతం ఈ వ్యాధి తీవ్రత ఏ మేరకు ఉంది?
డాక్టర్ : డాక్టర్ బ్లూమ్ బెర్గ్ తన బృందంతో విస్తృత పరిశోధనల ఫలితంగా 1967లో హెపటైటిస్ బీ వైరస్‌ను గుర్తించారు. ఆ తర్వాత 1969లో హెపటైటిస్ బీ వ్యాక్సిన్ కనిపెట్టారు. అప్పటి వరకు జాండిస్ ఎందుకు వస్తుందో తెలిసేది కాదు. పరిశోధనల వల్ల రక్తం ద్వారా వస్తుందని తెలిసింది. ఇప్పుడు రక్తం ఎక్కించే ముందు స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నారు. అందువల్ల రక్తం ద్వారా హెపటైటిస్ బీ, సీ కూడా వచ్చే అవకాశాలు బాగా తగ్గిపోయాయనే చెప్పాలి.
సాక్షి: ఈ వ్యాధి బారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
డాక్టర్ : కలుషితం కాని ఆహారం, నీరు తీసుకోవడం ద్వారా హెపటైటిస్ ఏ, ఈ బారిన పడకుండా ఉండొచ్చు. వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా హెపటైటిస్ బీ రాకుండా రక్షణ పొందవచ్చు. హెపటైటిస్ బీ నివారణకు వ్యాక్సినే బెస్ట్ ప్రీవెన్షన్. రక్తం ఎక్కించే ముందు సరైన స్క్రీనింగ్ పరీక్షలు చేయడం ద్వారా హెపటైటిస్ బీ, సీ బారిన పడకుండా ఉండొచ్చు. హెపటైటిస్ డీ మన దేశంలో చాలా అరుదుగా వస్తుంది. ఇటలీలో కనిపిస్తుంది. ఒకప్పుడు హెపటైటిస్ వల్ల లివర్ సమస్యలు ఎక్కువగా వచ్చేవి. ప్రస్తుతం ఆల్కాహాల్, ఊబకాయం వల్ల ఎక్కువగా లివర్ సమస్యలు వస్తున్నాయి. ఢిల్లీ, బెనారస్ ప్రాంతాల్లో హెపటైటిస్ ఎక్కువగా ఉంది. ఆయా ప్రాంతాలకు వెళ్లి వచ్చిన వారు హెపటైటిస్ పరీక్ష చేయించు కోవడం మంచిది.
సాక్షి: హెచ్‌ఐవీ కంటే హెపటైటిస్ ప్రమాదకరమా?
డాక్టర్ : హెపటైటిస్ హెచ్‌ఐవీ కంటే ప్రమాదమన్న అపోహ ఉంది. అది నిజం కాదు. ఎందుకంటే చెమట ద్వారా, ముట్టుకోవడం, ముద్దు పెట్టుకోవడం వల్ల హెపటైటిస్ వ్యాపించదు. ఇంజక్షన్, శరీరంలోకి రక్తం ఎక్కించడం ద్వారా వ్యాపిస్తుంది. వ్యాధిగ్రస్తుడు వాడే రేజర్, బ్రష్, నెయిల్ కట్టర్ వేరుగా ఉంచాలి. భర్తకు హెపటైటిస్ బీ వస్తే భార్య వ్యాక్సిన్ తీసుకోవాలి. ఆ వ్యాక్సిన్ పని చేసే వరకు అంటే.. ఆరు నెలల వరకు కండోమ్ వాడాలి.
సాక్షి: జాండిస్ తగ్గడానికి అల్లోపతి వైద్యం పనికిరాదనే అపోహ ఉంది. నిజమేనా?
డాక్టర్ : జాండిస్ రాగానే అల్లోపతిలో మందు లేదని చాలా మందిలో అపోహ ఉంది. నాటు వైద్యానికి వెళ్లిపోతున్నారు. హైపటైటిస్ ఏ, బీ, సీ వచ్చినా సాధారణంగా రెండు మూడు వారాల్లో తగ్గిపోతుంది. అందువల్ల పసరు మందు రెండు మూడు వారాలు వాడగానే తగ్గిపోతుంది. అప్పటికీ తగ్గకపోతే వైద్యుడిని సంప్రదిస్తారు. ఈ లోగా వ్యాధి ముదిరిపోతుంది. జాండిస్ చాలా కారణాల వల్ల వస్తుంది. మలేరియా, లివర్‌లో స్టోన్, ట్యూమర్ వల్ల జాండిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. హెపటైసిస్ వల్ల వచ్చే జాండిస్ 2, 3 వారాల్లో తగ్గిపోతుంది. 3 నుంచి 5 శాతం మందికి దీర్ఘకాలికంగా శరీరంలో ఉండిపోతుంది. దీని వల్ల లివర్ గట్టిపడి లివర్ సిర్రోసిస్‌కు దారితీస్తుంది. పొట్టలో నీరు చేరడం, కళ్లు పచ్చబడటం, కాళ్లు పొంగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
2030 నాటికి హెపటైటిస్ నిర్మూలనే లక్ష్యం
ఢిల్లీ ఎయిమ్స్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ గౌతమ్
హెపటైటిస్‌కు కారణమయ్యే వైరస్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, లేకపోతే ప్రాణాలకే ప్రమాదం వాటిల్లుతుందని ఢిల్లీ ఎయిమ్స్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ బుడిమూరి గౌతమ్ అన్నారు. హెపటైటిస్ దినోత్సవం పురస్కరించుకుని విశాఖ ప్రజల అవగాహన కోసం ఓ ప్రకటన విడుదల చేశారు. వైరల్ హెపటైటిస్ గురించి అవగాహన కల్పించాలన్న థీమ్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన నేపథ్యంలో ఆ దిశగా తాను కృషి చేస్తున్నట్టు తెలిపారు.
లివర్ హెపటైటిస్ వ్యాధి తీవ్రత గణాంకాల ప్రకారం పరిశీలిస్తే.. భారతదేశంలో 4 శాతంగా ఉందన్నారు. ఒకసారి లివర్ పూర్తిగా పాడైన తర్వాత కాలేయ మార్పిడి ద్వారా మాత్రమే శాశ్వత పరిష్కారం ఉంటుందన్నారు. తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఉన్న రోగుల్లో ఫ్లూ వంటి జ్వరం, ఆకలి తగ్గడం, వికారం, పొత్తి కడుపులో నొప్పి, పచ్చ కామెర్లకు దారి తీస్తుందని, వ్యాధి అత్యంత తీవ్రమైన సందర్భాల్లో కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందన్నారు.
వ్యాధి సోకిన వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకుని మందులు సక్రమంగా వాడితే.. ఆదిలోనే నివారించడంతో పాటు లివర్ వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చని వివరించారు. 2030 నాటికి హెపటైటిస్ నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment