Hepatitis C
-
మలేరియాపై అస్త్రం.. అలిస్పోరివిర్
న్యూఢిల్లీ: మలేరియా. దోమకాటు వల్ల వచ్చే అతి పెద్ద జబ్బు. దేశంలో ఏటా లక్షలాది మలేరియా కేసులు నమోదవుతున్నాయి. వందలాది మంది మరణిస్తున్నారు. ఆడ ఆనాఫిలిస్ దోమకాటు వల్ల వచ్చే మలేరియా నివారణకు ఎన్నో ఔషధాలు అందుబాటులో ఉన్నా అది పూర్తిగా అంతం కావడం లేదు. ఔషధాలను తట్టుకొనేలా కొత్త శక్తి పొందుతూ వస్తోంది. దీనిపై ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) ‘సెంటర్ ఫర్ మాలిక్యులార్ మెడిసిన్’ పరిశోధకులు దృష్టి సారించారు. డ్రగ్–రెసిస్టెంట్ మలేరియా రకాల భరతం పట్టడానికి యాంటీ–హెపటైటిస్ సి డ్రగ్ ‘అలిస్పోరివిర్’ను కనిపెట్టారు. అవయవాల మార్పిడి ప్రక్రియలో ఉపయోగించే సైక్లోస్పోరిన్–ఎ డ్రగ్‌లో మార్పులు చేయడం ద్వారా దీన్ని సృష్టించారు. క్లోరోక్విన్–రెసిస్టెంట్, అర్టిమెసినిన్–రెసిస్టెంట్ మలేరియా రకాలపై ఇది చక్కగా పనిచేస్తుందని çడాక్టర్ ఆనంద్ రంగనాథన్ చెప్పారు. ‘‘దీన్ని అర్టిమెసినిన్ డ్రగ్‌తో కలిపి వాడొచ్చు. ప్రీ క్లినికల్ పరీక్షలు ఇప్పటికే విజయవంతంగా పూర్తయ్యాయి. క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఇది పూర్తిగా సురక్షితం’’ అని ప్రొఫెసర్ శైలజా సింగ్ తెలిపారు. అన్ని పరీక్షలు పూర్తయ్యాక ‘అలిస్పోరివిర్’ అందుబాటులోకి రానుంది. 2021లో మాస్కిరిక్స్ అనే యాంటీ–మలేరియా టీకాకు డబ్ల్యూహెచ్ఓ అనుమతి మంజూరు చేసింది. మలేరియా నివారణకు టీకా రావడం మాత్రం ఇదే మొదటిసారి! -
ప్రమాదకర హెపటైటిస్.. మరో 18 ఆస్పత్రుల్లో వైద్యం.. వివరాలివే!
సాక్షి, అమరావతి: అత్యంత ప్రమాదకరమైన హెపటైటిస్ వ్యాధి నియంత్రణ, నివారణ చర్యలపై వైద్యారోగ్య శాఖ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 13 ఆస్పత్రుల్లో ఈ వ్యాధికి వైద్యం అందిస్తుండగా, కొత్తగా మరో 18 వైద్య విధాన పరిషత్ ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో స్క్రీనింగ్, వైద్య సేవలకు సన్నాహాలు చేస్తోంది. ఈ ఆస్పత్రుల్లో హెపటైటిస్ బాధితులకు వైద్యానికి జనరల్ మెడిసిన్ లేదా గ్యాస్ట్రో ఎంటరాలజీ లేదా హెపటాలజీ వైద్యుల్లో ఒకరిని ప్రత్యేకంగా నియమిస్తారు. రాష్ట్రంలో 2.3 శాతం జనాభా హెపటైటిస్ – బి, 0.3 శాతం హెపటైటిస్ – సి తో బాధపడుతున్నట్టు అంచనా. వ్యాధిని త్వరగా గుర్తించి, అరికట్టడానికి ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 9 లక్షల మందికి హెపటైటిస్ స్క్రీనింగ్ నిర్వహించాలన్నది వైద్య శాఖ లక్ష్యం. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 2 లక్షల మందికి స్క్రీనింగ్ చేశారు. 1.41 లక్షల మంది రక్త దాతలకు, 5,840 మంది ఖైదీలు, 30 వేల మంది సాధారణ ప్రజలు, 20 వేల మందికి పైగా ఎయిడ్స్ బాధితులకు స్క్రీనింగ్ చేశారు. వీరిలో 1,500 మందికి పైగా హెపటైటిస్ బి, సి వ్యాధిగ్రస్తులను గుర్తించారు. వీరందరికీ ప్రభుత్వమే ఉచితంగా వైద్యం అందిస్తోంది. హై రిస్క్ వర్గానికి చెందిన హెచ్ఐవీ రోగులకు 45 యాంటీ రిట్రోవల్ థెరఫీ (ఏఆర్టీ) సెంటర్లలో స్క్రీనింగ్, వైద్య సేవలు అందిస్తున్నారు. దేశంలో హెచ్ఐవీ బాధితులకు హెపటైటిస్ స్క్రీనింగ్, వైద్య సేవలు అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా ఏపీకి ఘనత దక్కింది. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ అవార్డు సైతం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖకు వచ్చింది. హైరిస్క్ వర్గాల వారికి టీకా హెపటైటిస్ బీ వ్యాధి నియంత్రణకు టీకా పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే వైద్య శాఖలో పని చేస్తున్న వైద్యులు, సిబ్బంది లక్ష మందిలో 99 శాతం మందికి తొలి డోసు టీకా ఇచ్చారు. 95 శాతం మందికి రెండో డోసు, 89 శాతం మందికి మూడో డోసు పూర్తయింది. హైరిస్క్ వర్గానికి చెందిన హెచ్ఐవీ బాధితులు, సెక్స్‌వర్కర్లు, ఇంజెక్షన్ల ద్వారా మాదక ద్రవ్యాలు తీసుకునే 2 లక్షల మందికి టీకా ఇవ్వాలని నిర్ణయించారు. తప్పనిసరిగా స్క్రీనింగ్ చేయించుకోవాలి హెపటైటిస్ బి, సి కాలేయంపై ప్రభావం చూపుతాయి. అనారోగ్య సమస్యలు కలిగిస్తాయి. వ్యాధి పట్ల అవగాహనతో నియంత్రణ సాధ్యం అవుతుంది. రక్తమార్పిడి, సురక్షితం కాని శృంగారం, సిరంజుల ద్వారా ఇవి సోకుతాయి. తల్లి నుంచి బిడ్డకు హెపటైటిస్ బి సోకుతుంది. ఇంట్లో ఎవరికైనా హెపటైటిస్ బి ఉంటే కుటుంబ సభ్యులు అందరూ స్క్రీనింగ్ చేయించుకోవాలి. గర్భిణులు తప్పనిసరిగా స్క్రీనింగ్ చేయించుకోవాలి. తద్వారా బిడ్డకు వ్యాధి సోకకుండా నియంత్రించవచ్చు. – డాక్టర్ ఎస్.నూర్‌బాషా, గుంటూరు జీజీహెచ్ అసిస్టెంట్ ప్రొఫెసర్, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, లివర్ స్పెషలిస్ట్ -
హెచ్ఐవీ కంటే హెపటైటిస్ ప్రమాదకరమా? అందులో నిజమెంత?
హెపటైటిస్ అనేది జబ్బు కాదు.. కొన్ని ఇన్ఫెక్షన్ల సమాహారం. హెపటైటిస్‌లో ఏ, బీ, సీ, డీ, ఈ అనే ఐదు రకాలు ఉన్నాయి. హెపటైటిస్ చాలా మందిలో ఉన్నప్పటికీ అది తమకు ఉన్నట్టే తెలియదు. సాధారణంగా 2, 3 వారాల్లో తగ్గిపోతుంది. కొద్ది మందిలో మాత్రం దీర్ఘకాలికంగా ఉండిపోతుంది. మొత్తం జనాభాలో 3 నుంచి 5 శాతం మంది హెపటైటిస్ బారిన పడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. హెపటైటిస్ ముదిరితే లివర్ గట్టి బడి లివర్ సిర్రోసిస్, మరికొందరిలో లివర్ క్యాన్సర్‌కు దారితీయవచ్చు. ఇంతటి ప్రమాదకరమైన హెపటైటిస్ నుంచి ముందు జాగ్రత్త చర్యలు పాటించడం, వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా రక్షణ పొందవచ్చని 40 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం ఉన్న ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ ఇ.పెదవీర్రాజు సూచిస్తున్నారు. వరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. – సీతంపేట(విశాఖ ఉత్తర) సాక్షి: హెపటైటిస్ అంటే ఏమిటి, ఎన్ని రకాలు, ఏ విధంగా వస్తుంది? డాక్టర్ పెదవీర్రాజు: హెపటైటిస్ నాలుగైదు రకాల వైరస్ల వల్ల వ్యాపిస్తుంది. హెపటైటిస్ ఏ, బీ, సీ,డీ, ఈ ఇలా ఐదు రకాల వైరస్ల వల్ల వ్యాధి బారిన పడతారు. ఇందులో హెపటైటిస్ బీ, సీ రకాలు కలుషితమైన రక్తం ఎక్కించుకోవడం, స్టెరిలైజ్ చేయని ఇంజక్షన్ సూదుల వల్ల, ఎక్కువ సార్లు శస్త్ర చికిత్సలు చేయించుకోవడం వల్ల వస్తుంది. ఏ, ఈ రకాలు కలుషితమైన నీరు, పాడైపోయిన ఆహారం వల్ల వ్యాపిస్తుంది. ముందు జాగ్రత్త చర్యలు పాటించం ద్వారా హెపటైటిస్ బారిన పడకుండా ఉండవచ్చు. సాక్షి: హెపటైటిస్ లక్షణాలు ఏమిటి? డాక్టర్ : హెపటైటిస్‌కు గురైన వారిలో జ్వరం, ఆకలి లేకపోవడం, నీళ్ల విరేచనాలు, తెలుపు రంగులో మోషన్, కడుపులో ఇబ్బంది, దురదలు, మూత్రం పచ్చగా రావడం, చర్మం, కంటిలోని తెల్లభాగం పసుపుగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రెండు నుంచి ఆరు వారాల లోపు వ్యాధి లక్షణాలు బయటపడతాయి. సాక్షి: హెపటైటిస్ బీ బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? డాక్టర్ : హెపటైటిస్ బీని నివారించడానికి వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. హెపటైటిస్ బీ వ్యాక్సిన్ మూడు డోసులు తీసుకుంటే రక్షణ ఉంటుంది. ఈ వ్యాక్సిన్ లివర్ క్యాన్సర్ బారిన పడకుండా కూడా రక్షణ కల్పిస్తుంది. భర్తకు హెపటైటిస్ బీ వస్తే భార్య.. ఇంటిలో ఒకరికి వస్తే మిగిలిన వారందరూ వ్యాక్సిన్ కచ్చితంగా తీసుకోవాలి. సాక్షి: హెపటైటిస్ సీ వైరస్ నుంచి రక్షణ పొందాలంటే..? డాక్టర్ : హెపటైటిస్ సీ కి గతంలో మందులు ఉండేవి కాదు. నాలుగేళ్ల నుంచి అద్భుతమైన మందులు అందుబాటులోకి వచ్చాయి. ఈ మందులు మూడు నెలలు వాడినట్లయితే హెపటైటిస్ సీ 95 శాతం నయం అవుతుంది. సాక్షి: హెపటైటిస్ ఏ, ఈ బారిన పడకుండా ఉండాలంటే..? డాక్టర్ : కలుషితం కాని ఆహారం, నీరు తీసుకోవడం వంటి ముందు జాగ్రత్త చర్యలు ద్వారా హెపటైటిస్ ఏ, ఈ బారిన పడుకుండా ఉండొచ్చు. హెపటైటిస్ ఏకు వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నప్పటికీ అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే వినియోగిస్తున్నారు. మనదేశంలో వ్యాక్సిన్ వినియోగించడం లేదు. హెపటైటిస్ ‘ఈ’కి వ్యాక్సిన్ లేదు. పరిసరాల పరిశుభ్రత, ఆహార నియమాలు పాటించడం ద్వారా ఏ, ఈ వైరస్ వ్యాప్తికి గురికాకుండా ఉండొచ్చు. సాక్షి: గర్భిణికి హెపటైటిస్ వస్తే పుట్టే శిశువుకు సంక్రమిస్తుందా? డాక్టర్ : గర్భిణికి హెపటైటిస్ బి ఉంటే పుట్టే శిశువుకు వచ్చే అవకాశం ఉంది. తల్లి గర్భంతో ఉన్నపుడు చేసే రక్త పరీక్షలో వ్యాధి నిర్ధారణ అయితే, బిడ్డ పుట్టగానే వ్యాక్సిన్‌తో పాటు హెచ్‌బీఐజీ ఇంజక్షన్ చేస్తారు. దీనివల్ల తల్లి నుంచి బిడ్డకు వ్యాధి సంక్రమించకుండా కాపాడవచ్చు. ఇటీవల టెనోఫెవర్ మాత్రలు అందుబాటులోకి వచ్చాయి. గర్భిణికి హెపటైటిస్‘బి’ వ్యాధి సోకి ఉండి, వైరస్ శాతం బాగా ఎక్కువగా ఉంటే.. ఆమెకు చివరి మూడు నెలలు ఈ మాత్రలు ఇవ్వాలి. దీని వల్ల ఆమె నుంచి శిశువుకు వ్యాధి వ్యాప్తి చెందకుండా ఆపొచ్చు. సాక్షి: ప్రస్తుతం ఈ వ్యాధి తీవ్రత ఏ మేరకు ఉంది? డాక్టర్ : డాక్టర్ బ్లూమ్ బెర్గ్ తన బృందంతో విస్తృత పరిశోధనల ఫలితంగా 1967లో హెపటైటిస్ బీ వైరస్‌ను గుర్తించారు. ఆ తర్వాత 1969లో హెపటైటిస్ బీ వ్యాక్సిన్ కనిపెట్టారు. అప్పటి వరకు జాండిస్ ఎందుకు వస్తుందో తెలిసేది కాదు. పరిశోధనల వల్ల రక్తం ద్వారా వస్తుందని తెలిసింది. ఇప్పుడు రక్తం ఎక్కించే ముందు స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నారు. అందువల్ల రక్తం ద్వారా హెపటైటిస్ బీ, సీ కూడా వచ్చే అవకాశాలు బాగా తగ్గిపోయాయనే చెప్పాలి. సాక్షి: ఈ వ్యాధి బారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డాక్టర్ : కలుషితం కాని ఆహారం, నీరు తీసుకోవడం ద్వారా హెపటైటిస్ ఏ, ఈ బారిన పడకుండా ఉండొచ్చు. వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా హెపటైటిస్ బీ రాకుండా రక్షణ పొందవచ్చు. హెపటైటిస్ బీ నివారణకు వ్యాక్సినే బెస్ట్ ప్రీవెన్షన్. రక్తం ఎక్కించే ముందు సరైన స్క్రీనింగ్ పరీక్షలు చేయడం ద్వారా హెపటైటిస్ బీ, సీ బారిన పడకుండా ఉండొచ్చు. హెపటైటిస్ డీ మన దేశంలో చాలా అరుదుగా వస్తుంది. ఇటలీలో కనిపిస్తుంది. ఒకప్పుడు హెపటైటిస్ వల్ల లివర్ సమస్యలు ఎక్కువగా వచ్చేవి. ప్రస్తుతం ఆల్కాహాల్, ఊబకాయం వల్ల ఎక్కువగా లివర్ సమస్యలు వస్తున్నాయి. ఢిల్లీ, బెనారస్ ప్రాంతాల్లో హెపటైటిస్ ఎక్కువగా ఉంది. ఆయా ప్రాంతాలకు వెళ్లి వచ్చిన వారు హెపటైటిస్ పరీక్ష చేయించు కోవడం మంచిది. సాక్షి: హెచ్ఐవీ కంటే హెపటైటిస్ ప్రమాదకరమా? డాక్టర్ : హెపటైటిస్ హెచ్ఐవీ కంటే ప్రమాదమన్న అపోహ ఉంది. అది నిజం కాదు. ఎందుకంటే చెమట ద్వారా, ముట్టుకోవడం, ముద్దు పెట్టుకోవడం వల్ల హెపటైటిస్ వ్యాపించదు. ఇంజక్షన్, శరీరంలోకి రక్తం ఎక్కించడం ద్వారా వ్యాపిస్తుంది. వ్యాధిగ్రస్తుడు వాడే రేజర్, బ్రష్, నెయిల్ కట్టర్ వేరుగా ఉంచాలి. భర్తకు హెపటైటిస్ బీ వస్తే భార్య వ్యాక్సిన్ తీసుకోవాలి. ఆ వ్యాక్సిన్ పని చేసే వరకు అంటే.. ఆరు నెలల వరకు కండోమ్ వాడాలి. సాక్షి: జాండిస్ తగ్గడానికి అల్లోపతి వైద్యం పనికిరాదనే అపోహ ఉంది. నిజమేనా? డాక్టర్ : జాండిస్ రాగానే అల్లోపతిలో మందు లేదని చాలా మందిలో అపోహ ఉంది. నాటు వైద్యానికి వెళ్లిపోతున్నారు. హైపటైటిస్ ఏ, బీ, సీ వచ్చినా సాధారణంగా రెండు మూడు వారాల్లో తగ్గిపోతుంది. అందువల్ల పసరు మందు రెండు మూడు వారాలు వాడగానే తగ్గిపోతుంది. అప్పటికీ తగ్గకపోతే వైద్యుడిని సంప్రదిస్తారు. ఈ లోగా వ్యాధి ముదిరిపోతుంది. జాండిస్ చాలా కారణాల వల్ల వస్తుంది. మలేరియా, లివర్‌లో స్టోన్, ట్యూమర్ వల్ల జాండిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. హెపటైసిస్ వల్ల వచ్చే జాండిస్ 2, 3 వారాల్లో తగ్గిపోతుంది. 3 నుంచి 5 శాతం మందికి దీర్ఘకాలికంగా శరీరంలో ఉండిపోతుంది. దీని వల్ల లివర్ గట్టిపడి లివర్ సిర్రోసిస్‌కు దారితీస్తుంది. పొట్టలో నీరు చేరడం, కళ్లు పచ్చబడటం, కాళ్లు పొంగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 2030 నాటికి హెపటైటిస్ నిర్మూలనే లక్ష్యం ఢిల్లీ ఎయిమ్స్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ గౌతమ్ హెపటైటిస్‌కు కారణమయ్యే వైరస్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, లేకపోతే ప్రాణాలకే ప్రమాదం వాటిల్లుతుందని ఢిల్లీ ఎయిమ్స్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ బుడిమూరి గౌతమ్ అన్నారు. హెపటైటిస్ దినోత్సవం పురస్కరించుకుని విశాఖ ప్రజల అవగాహన కోసం ఓ ప్రకటన విడుదల చేశారు. వైరల్ హెపటైటిస్ గురించి అవగాహన కల్పించాలన్న థీమ్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన నేపథ్యంలో ఆ దిశగా తాను కృషి చేస్తున్నట్టు తెలిపారు. లివర్ హెపటైటిస్ వ్యాధి తీవ్రత గణాంకాల ప్రకారం పరిశీలిస్తే.. భారతదేశంలో 4 శాతంగా ఉందన్నారు. ఒకసారి లివర్ పూర్తిగా పాడైన తర్వాత కాలేయ మార్పిడి ద్వారా మాత్రమే శాశ్వత పరిష్కారం ఉంటుందన్నారు. తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఉన్న రోగుల్లో ఫ్లూ వంటి జ్వరం, ఆకలి తగ్గడం, వికారం, పొత్తి కడుపులో నొప్పి, పచ్చ కామెర్లకు దారి తీస్తుందని, వ్యాధి అత్యంత తీవ్రమైన సందర్భాల్లో కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందన్నారు. వ్యాధి సోకిన వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకుని మందులు సక్రమంగా వాడితే.. ఆదిలోనే నివారించడంతో పాటు లివర్ వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చని వివరించారు. 2030 నాటికి హెపటైటిస్ నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. -
ముగ్గురు శాస్త్రవేత్తలకు వైద్య నోబెల్
స్టాక్‌హోమ్: హెపటైటిస్ – సీ వైరస్‌ను గుర్తించినందుకు అమెరికన్ శాస్త్రవేత్తలు హార్వీ జే.ఆల్టర్, ఛార్లెస్ ఎం. రైస్‌లతోపాటు బ్రిటిష్ శాస్త్రవేత్త మైకేల్ హౌటన్‌లకు ఈ ఏడాది వైద్యశాస్త్ర నోబెల్ అవార్డు దక్కింది. ఈ ముగ్గురు శాస్త్రవేత్తల పరిశోధనల ఫలితంగా రక్తం ద్వారా వ్యాపించే హెపటైటిస్ గురించి ప్రపంచానికి తెలిసిందని, హెపటైటిస్ ఏ, బీల ద్వారా ఈ విషయం తెలియరాలేదని నోబెల్ కమిటీ సోమవారం స్టాక్ హోమ్‌లో సోమవారం అవార్డును ప్రకటించిన సందర్భంగా వ్యాఖ్యానించింది. అంతేకాకుండా.. వీరి పరిశోధనల ఫలితంగా హెపటైటిస్–సీ గుర్తింపులకు కొత్త రక్త పరీక్షలు, వైద్యానికి కొత్త మందులు అందుబాటులోకి వచ్చి లక్షల మంది ప్రాణాలు నిలిచాయని తెలిపింది. ‘‘వైరస్‌ను గుర్తించేందుకు అతి సున్నితమైన పరీక్షను సిద్ధం చేయడం వీరి పరిశోధనల వల్లే వీలైంది. ఫలితంగా రక్తమార్పిడి తరువాత వ్యాధి సోకే అవకాశాలు దాదాపు లేకుండా పోయాయి.‘‘ అని కమిటీ వివరించింది. చరిత్రలో తొలిసారి ఈ వ్యాధికి చికిత్స కల్పించడం కూడా ఈ ఏడాది నోబెల్ అవార్డు గ్రహీతల పరిశోధనల ఫలితంగానే సాధ్యమైందని కమిటీ తెలిపింది. అవార్డు కింద బంగారు పతకం, కోటి స్వీడిష్ క్రోనార్లు (రూ.8.22 కోట్లు) నగదు లభిస్తుంది. అవార్డు గ్రహీతలు ముగ్గురూ నగదు బహుమతిని సమానంగా పంచుకుంటారు. స్వీడన్ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ 124 ఏళ్ల క్రితం ఈ అవార్డును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దశాబ్ద కాలం అంతు చిక్కని వైరస్... హెపటైటిస్–సీ వైరస్‌ను గుర్తిచేందుకు సంప్రదాయ పద్ధతుల్లో శాస్త్రవేత్తలు జరిపిన ప్రయత్నాలు అస్సలు ఫలించలేదు. ఈ నేపథ్యంలో చిరాన్ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్న మైకేల్ హౌటన్ ఈ వైరస్‌ను వేరు చేసి జన్యుక్రమం నమోదు చేసే తాజా ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు. వైరస్ సోకి చింపాంజీ రక్తంలోని డీఎన్ఏ పోగులను వేరు చేసి పరీక్షలు జరిపారు. చింపాంజీ జన్యుక్రమానికి సంబంధించిన పోగులు అధికంగా ఉన్నప్పటికీ గుర్తు తెలియని వైరస్ తాలూకూ జన్యు అవశేషాలు కూడా ఇందులో ఉంటా యని మైకేల్ హౌటన్ అంచనా వేశారు. వైరస్‌కు వ్యతిరేకంగా రోగ నిరోధక వ్యవస్థ యాంటీబాడీలను తయారు చేసి ఉంటుంద న్న అంచనాతో ప్రయోగాలు జరిగాయి. రోగి రక్తంలో వైరస్ తాలూకూ ప్రోటీన్‌ను ఉత్పత్తి చేయగల డీఎన్ఏ పోగుల కోసం వెతుకులా ట మొదలైంది. సమగ్ర పరీక్షల ఫలితంగా ఒక్క పోగు లభ్యమైంది. తదుపరి పరీక్షలతో ఈ డీఎన్ఏ పోగు కూడా ఫ్లావివైరస్ కుటుంబానికి చెందిన ఆర్ఎన్ఏ ఆధారిత వైరస్‌కు చెందిందని స్పష్టమైంది. ఈ వైరస్‌కు హెపటైటిస్–సీగా నిర్ధారించారు. మైకేల్ హౌటన్ వైరస్ ఉనికిని నిర్ధారిస్తే.. అంతకుముందే రక్తమార్పిడి కారణంగా వచ్చే హెపటైటిస్ వ్యాధికి గుర్తు తెలియని వైరస్ ఒకటి కారణమని హార్వీ జే ఆల్టర్ నిర్ధారించారు. రక్తమార్పిడి కేసులను పకడ్బందీగా, నిశితంగా పరిశీలించడం ద్వారా హార్వీ వ్యాధికి అప్పటికే గుర్తించిన వైరస్లు ఏవీ కారణం కాదని ప్రపంచానికి తెలియజేశారు. మరోవైపు ఛార్లెస్ ఎం.రైస్ హెపటైటిస్ –సీ వైరస్ మాత్రమే హెపటైటిస్‌కు కారణమని విస్పష్టంగా గుర్తించడంతో ఆ వైరస్ తాలూకూ చివరి చిక్కుముడి కాస్తా వీడింది. వాషింగ్టన్ యూనివర్సిటీలో పనిచేస్తున్న ఛార్లెస్ ఎం. రైస్ హెపటైటిస్–సీ జన్యుక్రమం చివరి ప్రాం తం వైరస్ పునరుత్పత్తిలో కీలకమన్న అంచనాతో పరిశోధనలు చేపట్టారు. అంతేకాకుం డా.. వేరు చేసిన హెపటైటిస్–సీ వైరస్‌లో కొన్ని తేడాలు ఉండటాన్ని కూడా రైస్ గుర్తించారు. జెనిటిక్ ఇంజినీరింగ్ పద్ధతుల్లో ఈ వైరస్ నకలు ఒకదాన్ని తయారు చేసి చింపాంజీ కాలేయంలోకి ప్రవేశపెట్టినప్పుడు క్రానిక్ హెపటైటిస్ వ్యాధిగ్రస్తుల రక్తంలో కనిపించే మార్పులే కనిపించాయి. దీన్ని బట్టి హెపటైటిస్ వ్యాధికి ఈ వైరస్ ఒక్కటే కారణమవుతోందన్న నిర్ధారణకు వచ్చారు. ఏమిటీ హెపటైటిస్–సీ హెపటైటిస్–సీ వైరస్ కారణంగా కాలేయానికి వచ్చే ఆరోగ్య సమస్య పేరిది. రక్తం, వీర్యం, శరీర ద్రవాల ద్వారా ఒకరి నుంచి ఇంకొకరికి సోకుతుంది. అకస్మాత్తుగా కనిపించి కొన్ని వారాల్లో తగ్గిపోవడం ఒకరకమైన హెపటైటిస్–సీ వ్యాధి లక్షణమైతే...కాలేయాన్ని తీవ్రంగా దెబ్బతీసి కేన్సర్‌కు, కొన్ని సందర్భాల్లో మరణాలకూ దారితీసే క్రానిక్ హెపటైటిస్–సీ రెండో రకం. ప్రపంచవ్యాప్తంగా సుమారు 40 కోట్ల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలు చెబుతున్నాయి. ఏటా అరవై లక్షల నుంచి కోటి కొత్త కేసులు నమోదవుతూంటాయి. అంతేకాకుండా.. ఏడాదికి 4 లక్షల మంది ప్రాణాలను బలితీసుకుంటోంది ఈ మహమ్మారి. ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే.. 95 శాతం మందికి ఈ వ్యాధి సోకినట్లు కూడా తెలియకపోవడం. ఎవరికి సోకే అవకాశం? ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ హెపటైటిస్–సీ వ్యాధి ప్రభావం ఉన్నప్పటికీ అమెరికా, యూరప్‌లలో కొంచెం ఎక్కువ కేసులు నమోదవుతూంటాయి. సురక్షితం కాని శృంగారం, స్టెరిలైజ్ చేయని ఇంజెక్షన్లను వాడటం, మాదక ద్రవ్యాల వాడకం (ఇంజెక్షన్ల రూపంలో) ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. తల్లి నుంచి బిడ్డకు సంక్రమించే అవకాశమూ ఉంటుంది. వైరస్‌ను గుర్తించిన తరువాత చికిత్స ప్రారంభిస్తే 3 నుంచి ఆరు నెలల్లో 90% మందికి నయమయ్యే అవకాశం ఉంది. ఈ నిశ్శబ్ధ మహమ్మారిపై ప్రజల్లో అవగాహనను పెంచేందుకు ఏటా జూలై 28న వరల్డ్ హెపటైటిస్–సీ డేగా జరుపుకుంటారు. -
వేలమందిని కాపాడిన ఆ డాక్టర్ ఇక లేరు
1990లో మధ్య చైనాలో హెచ్ఐవీ, హెపటైటిస్ మహమ్మారికి సంబంధించిన సంచలన విషయాన్ని బయటపెట్టిన సాహసోపేత డాక్టర్ షుపింగ్ వాంగ్ (59) కన్నుమూశారు. దాదాపు పదివేల మందికిపైగా ప్రాణాలను కాపాడిన ఆమె ఇక సెలవంటూ ఈ ప్రపంచానికి శాశ్వత వీడ్కోలు పలికారు. ఈమె స్ఫూర్తితో రూపొందించిన నాటకం ‘ది కింగ్ ఆఫ్ హెల్స్ ప్యాలెస్’ ప్రస్తుతం లండన్‌లో నడుస్తోంది. నాటక రచయిత ఫ్రాన్సిస్ యో చూ.. వాంగ్‌ను "పబ్లిక్ హెల్త్ హీరో" అని పిలుస్తారు. ఈ సందర్భంగా డా. వాంగ్ ప్రయాణం గురించి తెలుసుకోవాలి. 1991 లో చైనా ప్రావిన్స్ హెనాన్‌లో డాక్టర్ వాంగ్ ప్రభుత్వ రక్త, ప్లాస్మా సేకరణ కేంద్రంలో పనిచేసేవారు. ఈ సందర్భంగా చాలా మంది హెచ్ఐవీ, హెపటైటిస్ బారిని పడిన వారు విచక్షణ రహితంగా రక్తాన్ని అమ్ముతున్నారని, తద్వారా లక్షలమంది రక్త గ్రహీతలు ఈ భయంకరమైన వ్యాధుల బారిన పడుతున్నారని గుర్తించింది. వెంటనే తన సీనియర్ అధికారులను అప్రమత్తం చేసింది. దీనికితోడు పేలవమైన సేకరణ పద్ధతుల ద్వారా పెనుప్రమాదం పొంచి వుందని హెచ్చరించింది. ఆమె చర్యలు వ్యాపారానికి ఆటంకం కలిగించాయని వాదించిన సీనియర్లు బదిలీని బహుమానంగా ఇచ్చారు. అయినా 1995లో, ఆమె మరో కుంభకోణాన్ని బయటపెట్టింది. హైచ్ఐవీ పాజిటివ్ వ్యక్తి పలు కేంద్రాల్లో రక్తాన్ని అమ్ముతున్నాడని గుర్తించింది. ఇదే విషయాన్ని ఆరోగ్య మంత్రిత్వ శాఖకు కూడా నివేదించింది. ఫలితంగా ఉద్యోగాన్నికోల్పోయింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖలో పనిచేసిన ఆమె భర్తను అతని సహచరులు బహిష్కరించారు. చివరికి ఇది వారి విడాకులకు దారి తీసింది. దీంతో డాక్టర్ వాంగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. హెనాన్ ప్రావిన్స్‌లో తనే స్వయంగా 400 శాంపిళ్లను సేకరించింది. ఖరీదైన పరీక్షలు నిర్వహించి, హెచ్ఐవీ రేటు 13 శాతంగా ఉన్నట్టు గుర్తించారు. ఈ ఫలితాలను రాజధాని బీజింగ్‌లోని అధికారుల వద్దకు తీసుకువెళ్లారు. కానీ ఈ సారి కూడా ఆమెపై దాడి జరిగింది. ఆమె క్లినిక్‌కు వచ్చి పరికరాలను ధ్వంసం చేశారు. ఎట్టకేలకు చైనా ప్రభుత్వం స్పందించింది. 1996లో దేశంలోని అన్ని రక్తం, ప్లాస్మా సేకరణ కేంద్రాలు మూసివేసి దర్యాప్తు చేపట్టింది. అనంతరం ఆయా కేంద్రాల్లో దాతలందరికీ హెచ్ఐవీ, హెపటైటిస్ సి స్క్రీనింగ్ చేయవలసి ఉంటుందని మంత్రిత్వ శాఖ తరువాత ప్రకటించింది. చాలా సంవత్సరాల తరువాత, డాక్టర్ వాంగ్ గ్యారీ క్రిస్టెన్‌సెన్‌ను తిరిగి వివాహం చేసుకుని 2001లో సన్‌షైన్ అనే పేరుతో అమెరికా వెళ్లి పోయారు. అక్కడ సాల్ట్ లేక్ సిటీలోని ఉటా విశ్వవిద్యాలయంలో వైద్య పరిశోధకురాలిగా పనిచేయడం ప్రారంభించారు. 2001 సంవత్సరంలోనే మధ్య చైనాలో తీవ్రమైన ఎయిడ్స్ సంక్షోభాన్ని ఎదుర్కొన్నట్లు చైనా ప్రభుత్వం అంగీకరించింది. స్థానిక రక్త బ్యాంకుల ద్వారా లక్షలాదిమంది వ్యాధి బారిన పడ్డారని వెల్లడించింది. ముఖ్యంగా డాక్టర్ వాంగ్ పనిచేసిన ప్రావిన్స్ హెనాన్ ఎక్కువగా ప్రభావితం మైంది. ఎయిడ్స్ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నవారిని చూసుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక క్లినిక్‌లను ఏర్పాటు చేసింది. 2019లో ఆమెను గతం వెంటాడింది. ఆమె జీవిత కథ ఆధారంగా రూపొందిన నాటక ప్రదర్శనను నిలువరించే ప్రయత్నాల్లోభాగంగా హునాన్‌లోని బంధువులు, స్నేహితులను కలవడానికివీల్లేదని, చైనా భద్రతా అధికారులు బెదిరించారు. వీటిని వాంగ్ ఏ మాత్రం లెక్కచేయలేదు. దీంతో "ది కింగ్ ఆఫ్ హెల్స్ ప్యాలెస్" అనే నాటకం సెప్టెంబరులో లండన్‌లోని హాంప్స్టెడ్ థియేటర్లో ప్రదర్శించడం విశేషం. నాటకంలోని ఒక దృశ్యం సెప్టెంబర్ 21 న సాల్ట్ లేక్ సిటీలో స్నేహితులు, ఆమె భర్తతో కలిసి హైకింగ్ చేస్తుండగా డాక్టర్ వాంగ్ గుండెపోటుతో కన్నుమూశారు. మరణానికి ఒక నెల ముందు హాంప్స్టెడ్ థియేటర్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన వాంగ్ అన్యాయానికి వ్యతిరేకంగా మాట్లాడటం వల్ల ఉద్యోగం, వివాహం,ఆనందం అన్నీ కోల్పోయాను. కానీ తన పోరాటం ఏంతోమంది పేదలను రక్షించడానికి సహాయపడిందని సంతోషం వ్యక్తం చేశారు. ఇంతలోనే ఆమె ఆకస్మిక మరణం ఆమె అభిమానుల్లో విషాదాన్ని నింపింది. నాటక రచయితతో డా. వాంగ్