హార్వీ జే.ఆల్టర్, మైకేల్ హౌటన్ ఛార్లెస్ ఎం. రైస్
స్టాక్‌హోమ్: హెపటైటిస్ – సీ వైరస్‌ను గుర్తించినందుకు అమెరికన్ శాస్త్రవేత్తలు హార్వీ జే.ఆల్టర్, ఛార్లెస్ ఎం. రైస్‌లతోపాటు బ్రిటిష్ శాస్త్రవేత్త మైకేల్ హౌటన్‌లకు ఈ ఏడాది వైద్యశాస్త్ర నోబెల్ అవార్డు దక్కింది. ఈ ముగ్గురు శాస్త్రవేత్తల పరిశోధనల ఫలితంగా రక్తం ద్వారా వ్యాపించే హెపటైటిస్ గురించి ప్రపంచానికి తెలిసిందని, హెపటైటిస్ ఏ, బీల ద్వారా ఈ విషయం తెలియరాలేదని నోబెల్ కమిటీ సోమవారం స్టాక్ హోమ్‌లో సోమవారం అవార్డును ప్రకటించిన సందర్భంగా వ్యాఖ్యానించింది.
అంతేకాకుండా.. వీరి పరిశోధనల ఫలితంగా హెపటైటిస్–సీ గుర్తింపులకు కొత్త రక్త పరీక్షలు, వైద్యానికి కొత్త మందులు అందుబాటులోకి వచ్చి లక్షల మంది ప్రాణాలు నిలిచాయని తెలిపింది. ‘‘వైరస్‌ను గుర్తించేందుకు అతి సున్నితమైన పరీక్షను సిద్ధం చేయడం వీరి పరిశోధనల వల్లే వీలైంది. ఫలితంగా రక్తమార్పిడి తరువాత వ్యాధి సోకే అవకాశాలు దాదాపు లేకుండా పోయాయి.‘‘ అని కమిటీ వివరించింది. చరిత్రలో తొలిసారి ఈ వ్యాధికి చికిత్స కల్పించడం కూడా ఈ ఏడాది నోబెల్ అవార్డు గ్రహీతల పరిశోధనల ఫలితంగానే సాధ్యమైందని కమిటీ తెలిపింది. అవార్డు కింద బంగారు పతకం, కోటి స్వీడిష్ క్రోనార్లు (రూ.8.22 కోట్లు) నగదు లభిస్తుంది. అవార్డు గ్రహీతలు ముగ్గురూ నగదు బహుమతిని సమానంగా పంచుకుంటారు. స్వీడన్ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ 124 ఏళ్ల క్రితం ఈ అవార్డును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
దశాబ్ద కాలం అంతు చిక్కని వైరస్...
హెపటైటిస్–సీ వైరస్‌ను గుర్తిచేందుకు సంప్రదాయ పద్ధతుల్లో శాస్త్రవేత్తలు జరిపిన ప్రయత్నాలు అస్సలు ఫలించలేదు. ఈ నేపథ్యంలో చిరాన్ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్న మైకేల్ హౌటన్ ఈ వైరస్‌ను వేరు చేసి జన్యుక్రమం నమోదు చేసే తాజా ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు. వైరస్ సోకి చింపాంజీ రక్తంలోని డీఎన్‌ఏ పోగులను వేరు చేసి పరీక్షలు జరిపారు. చింపాంజీ జన్యుక్రమానికి సంబంధించిన పోగులు అధికంగా ఉన్నప్పటికీ గుర్తు తెలియని వైరస్ తాలూకూ జన్యు అవశేషాలు కూడా ఇందులో ఉంటా యని మైకేల్ హౌటన్ అంచనా వేశారు. వైరస్‌కు వ్యతిరేకంగా రోగ నిరోధక వ్యవస్థ యాంటీబాడీలను తయారు చేసి ఉంటుంద న్న అంచనాతో ప్రయోగాలు జరిగాయి.
రోగి రక్తంలో వైరస్ తాలూకూ ప్రోటీన్‌ను ఉత్పత్తి చేయగల డీఎన్‌ఏ పోగుల కోసం వెతుకులా ట మొదలైంది. సమగ్ర పరీక్షల ఫలితంగా ఒక్క పోగు లభ్యమైంది. తదుపరి పరీక్షలతో ఈ డీఎన్‌ఏ పోగు కూడా ఫ్లావివైరస్ కుటుంబానికి చెందిన ఆర్‌ఎన్‌ఏ ఆధారిత వైరస్‌కు చెందిందని స్పష్టమైంది. ఈ వైరస్‌కు హెపటైటిస్–సీగా నిర్ధారించారు. మైకేల్ హౌటన్ వైరస్ ఉనికిని నిర్ధారిస్తే.. అంతకుముందే రక్తమార్పిడి కారణంగా వచ్చే హెపటైటిస్ వ్యాధికి గుర్తు తెలియని వైరస్ ఒకటి కారణమని హార్వీ జే ఆల్టర్ నిర్ధారించారు. రక్తమార్పిడి కేసులను పకడ్బందీగా, నిశితంగా పరిశీలించడం ద్వారా హార్వీ వ్యాధికి అప్పటికే గుర్తించిన వైరస్‌లు ఏవీ కారణం కాదని ప్రపంచానికి తెలియజేశారు.
మరోవైపు ఛార్లెస్ ఎం.రైస్ హెపటైటిస్ –సీ వైరస్ మాత్రమే హెపటైటిస్‌కు కారణమని విస్పష్టంగా గుర్తించడంతో ఆ వైరస్ తాలూకూ చివరి చిక్కుముడి కాస్తా వీడింది. వాషింగ్టన్ యూనివర్సిటీలో పనిచేస్తున్న ఛార్లెస్ ఎం. రైస్ హెపటైటిస్–సీ జన్యుక్రమం చివరి ప్రాం తం వైరస్ పునరుత్పత్తిలో కీలకమన్న అంచనాతో పరిశోధనలు చేపట్టారు. అంతేకాకుం డా.. వేరు చేసిన హెపటైటిస్–సీ వైరస్‌లో కొన్ని తేడాలు ఉండటాన్ని కూడా రైస్ గుర్తించారు. జెనిటిక్ ఇంజినీరింగ్ పద్ధతుల్లో ఈ వైరస్ నకలు ఒకదాన్ని తయారు చేసి చింపాంజీ కాలేయంలోకి ప్రవేశపెట్టినప్పుడు క్రానిక్ హెపటైటిస్ వ్యాధిగ్రస్తుల రక్తంలో కనిపించే మార్పులే కనిపించాయి. దీన్ని బట్టి హెపటైటిస్ వ్యాధికి ఈ వైరస్ ఒక్కటే కారణమవుతోందన్న నిర్ధారణకు వచ్చారు.
ఏమిటీ హెపటైటిస్–సీ
హెపటైటిస్–సీ వైరస్ కారణంగా కాలేయానికి వచ్చే ఆరోగ్య సమస్య పేరిది. రక్తం, వీర్యం, శరీర ద్రవాల ద్వారా ఒకరి నుంచి ఇంకొకరికి సోకుతుంది. అకస్మాత్తుగా కనిపించి కొన్ని వారాల్లో తగ్గిపోవడం ఒకరకమైన హెపటైటిస్–సీ వ్యాధి లక్షణమైతే...కాలేయాన్ని తీవ్రంగా దెబ్బతీసి కేన్సర్‌కు, కొన్ని సందర్భాల్లో మరణాలకూ దారితీసే క్రానిక్ హెపటైటిస్–సీ రెండో రకం. ప్రపంచవ్యాప్తంగా సుమారు 40 కోట్ల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలు చెబుతున్నాయి. ఏటా అరవై లక్షల నుంచి కోటి కొత్త కేసులు నమోదవుతూంటాయి. అంతేకాకుండా.. ఏడాదికి 4 లక్షల మంది ప్రాణాలను బలితీసుకుంటోంది ఈ మహమ్మారి. ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే.. 95 శాతం మందికి ఈ వ్యాధి సోకినట్లు కూడా తెలియకపోవడం.
ఎవరికి సోకే అవకాశం?
ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ హెపటైటిస్–సీ వ్యాధి ప్రభావం ఉన్నప్పటికీ అమెరికా, యూరప్‌లలో కొంచెం ఎక్కువ కేసులు నమోదవుతూంటాయి. సురక్షితం కాని శృంగారం, స్టెరిలైజ్ చేయని ఇంజెక్షన్లను వాడటం, మాదక ద్రవ్యాల వాడకం (ఇంజెక్షన్ల రూపంలో) ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. తల్లి నుంచి బిడ్డకు సంక్రమించే అవకాశమూ ఉంటుంది. వైరస్‌ను గుర్తించిన తరువాత చికిత్స ప్రారంభిస్తే 3 నుంచి ఆరు నెలల్లో 90% మందికి నయమయ్యే అవకాశం ఉంది. ఈ నిశ్శబ్ధ మహమ్మారిపై ప్రజల్లో అవగాహనను పెంచేందుకు ఏటా జూలై 28న వరల్డ్ హెపటైటిస్–సీ డేగా జరుపుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment