సూపర్ బగ్స్‌ను అంతం చేయగల సామర్థ్యం వాటికి ఉన్నట్లు గుర్తింపు
యాంటీబయోటిక్స్ మందులను మరింత శక్తివంతం చేయగలవని ప్రయోగాల్లో వెల్లడి
చర్మవ్యాధులు, రక్త సంబంధ ఇన్ఫెక్షన్లు, సిస్టిక్ ఫైబ్రోసిస్ వంటి అనారోగ్యాల
తగ్గుదలకు దోహదం.. ‘ప్లోస్ వన్’లో ప్రచురితమైన శాస్త్రవేత్తల పరిశోధన ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: వివిధ అనారోగ్యాలను తగ్గించడంలో యాంటీబయోటిక్ మందులు కీలకపాత్ర పోషిస్తాయన్న సంగతి తెలిసిందే. అయితే యాంటీబయోటిక్‌లకు సైతం చావని కొన్ని సూక్ష్మక్రిములను అంతం చేయగల శక్తి ఓ సముద్రజీవికి ఉందని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. ఆల్చిప్పల రక్తంలోని యాంటీమైక్రోబియల్ ప్రొటీన్లు, పెప్టిన్లు సూపర్ బగ్స్‌ను సమర్థంగా చంపగలవని తేల్చారు.
‘ప్లోస్ వన్’లో ప్రచురితమైన తాజా పరిశోధనల ప్రకారం ఆల్చిప్పల్లోని హీమోలింఫ్ (ఆల్చిప్పల రక్తంగా దీన్ని చెప్పొచ్చు)లో సూక్ష్మక్రిములను చంపే మాంసకృత్తులు ఉన్నాయి. అనేక ఇన్ఫెక్షన్లకు కారణమవుతున్న సూక్ష్మక్రిములను సమర్థంగా అరికట్టే శక్తి హీమోలింఫ్ ప్రొటీన్లకు ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఈ నేపథ్యంలో మొండి బ్యాక్టీరియా జాతుల (సూపర్ బగ్స్) పీచమణిచేలా యాంటీబయాటిక్స్ ఔషధాలను శక్తివంతం చేయడంలో ఆల్చిప్పల ప్రొటీన్లు ఉపయోగపడతాయని అంటున్నారు.
ఏమిటీ సూపర్ బగ్స్?
స్ట్రెప్టోకాక్కస్ న్యూమోనియే అనే సూక్ష్మక్రిమి వల్ల శ్వాసకోశ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఐదేళ్లలోపు పిల్లల మరణాలకు ఇదే ముఖ్యకారణం. వృద్ధులు తరచూ ఆసుపత్రులపాలవ్వడానికి కారణం కూడా ఇదే. టాన్‌సిలైటిస్ లాంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్ సాధారణంగా చాలా మంది చిన్నారుల్లో కనిపిస్తుంటుంది. స్ట్రెప్టోకాక్కస్ ప్యోజెనెస్ సూక్ష్మక్రిమి చర్మంపై, గొంతులో ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది.
ఇది నొప్పులతో రుమాటిక్ జ్వరం, రుమాటిక్ గుండె జబ్బుకు కూడా దారితీయొచ్చు. ఇటువంటి ఇన్ఫెక్షన్లకు యాంటీబయోటిక్స్ మందులు తరచూ వాడాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే సూక్ష్మక్రిములు ఈ మందులకు నిరోధకత పెంచుకొని డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియాగా మారుతాయి. ఈ సూపర్ బగ్స్ కారణంగా వ్యాధులకు చికిత్స చేయడం కష్టతరంగా మారుతోంది.
బయోఫిల్‌్మల రక్షణ వలయంలో..
సూపర్ బగ్స్ తమ చుట్టూతా బయోఫిల్‌్మలు అనే రక్షణ కవచాలను రూపొందించుకొని యాంటీబయాటిక్ ఔషధాల నుంచి రక్షించుకుంటూ ఉంటాయి. ఇన్ఫెక్షన్లను కలిగించే అన్ని రకాల బ్యాక్టీరియాలు బయోఫిల్‌్మల రక్షణలోనే ఉంటాయి. ఈ రక్షణ వలయాన్ని ఛేదించగలగటంపైనే యాంటీబయోటిక్‌ల విజయం ఆధారపడి ఉంటుంది.
32 రెట్లు మెరుగుపడ్డ ఫలితాలు
ఇప్పటికే వాడుకలో ఉన్న యాంటీబయోటిక్స్‌కు ఆస్ట్రేలియా రాతి ఆల్చిప్పల ప్రొటీన్లను జోడించగా వాటి ప్రభావశీలత 3 నుంచి 32 రెట్లు మెరుగైనట్లు ప్రయోగాల్లో తేలిందని పరిశోధకులు ప్రకటించారు.
చర్మవ్యాధులు, రక్త సంబంధిత ఇన్ఫెక్షన్లు, సిస్టిక్ ఫైబ్రోసిస్ వంటి సమస్యలు కలిగించే డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియాలను ఆల్చిప్పల రక్తంలోని ప్రొటీన్లు సమర్థంగా అరికట్టాయని పరిశోధకులు వివరించారు. మనుషుల కణాలపై ఎటువంటి విషపూరిత ప్రభావం లేదని స్పష్టం చేశారు. అయితే సూపర్ బగ్స్‌ను అరికట్టే ఆల్చిప్పల ప్రొటీన్లపై జంతువులు, మనుషులపై క్లినికల్ ట్రయల్స్ ఇంకా జరగాల్సి ఉంది.
సిడ్నీ రాతి ఆల్చిప్పల్లో ఔషధ గుణాలు..
సముద్ర జలాల వల్ల కలిగే ఎన్నో ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించుకోవడానికి అవసరమైన యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రొటీన్లు, పెప్టయిడ్లను ఆల్చిప్పలు తమ రక్తంలో ఉత్పత్తి చేసుకుంటున్నట్లు దశాబ్దాల క్రితమే శాస్త్రవేత్తలు గుర్తించారు. శ్వాసకోశ, ఇన్‌ఫ్లమేషన్ సమస్యలకు చైనా, ఆస్ట్రేలియా సంప్రదాయ వైద్యులు ఆల్చిప్పల ఔషధాలను అనాదిగా వాడుతున్నారు.
ఈ దిశగా పరిశోధించిన శాస్త్రవేత్తలు.. సిడ్నీ రాక్ ఆయిస్టర్ల రక్తంలోని ప్రొటీన్లు, పెప్టయిడ్లలో స్ట్రెప్టోకాకస్ ఎస్‌పీపీ జాతి బ్యాక్టీరియాను చంపే ఔషధగుణాలు ఉన్నట్లు గుర్తించారు. సూక్ష్మక్రిముల చుట్టూ ఉండే రక్షణ కవచాన్ని ఛేదించటమే కాకుండా అది ఏర్పడకుండా చూసే శక్తి కూడా ఈ ప్రొటీన్లు, పెప్టయిడ్లకు ఉందని తేల్చారు.
Comments
Please login to add a commentAdd a comment