nobel prize winners
-
రష్యా, ఉక్రెయిన్ ‘హక్కుల’ గ్రూప్‌లకు నోబెల్ శాంతి బహుమతి
స్టాక్‌హోం : మానవ హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఉక్రెయిన్, రష్యాలకు చెందిన రెండు మానవ హక్కుల గ్రూప్‌లతో పాటు బెలారస్ మానవ హక్కుల కార్యకర్త అలెస్ బైలియాత్స్కీలకు సంయుక్తంగా ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి లభించింది. రష్యన్ మానవ హక్కుల సంస్థ మెమోరియల్, ఉక్రేనియన్ మానవ హక్కుల సంస్థ సెంటర్ ఫర్ లిబర్టీస్, బెలారస్ హక్కుల కార్యకర్త అలెస్ బైలియాత్స్కీల పేర్లను నోబెల్ కమిటీ శుక్రవారం ప్రకటించింది. మానవ హక్కుల కోసం వారి విశేష కృషికి గానూ ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపిక చేసినట్లు కమిటీ పేర్కొంది. నోబెల్ శాంతి పురస్కారం లభించిన వారు తమ స్వదేశాల్లో ప్రజల కోసం పోరాటం చేసినట్లు నోబెల్ కమిటీ పేర్కొంది. అధికార దుర్వినియోగాన్ని నిరంతరం ప్రశ్నిస్తూ.. పౌరుల ప్రాథమిక హక్కులను రక్షించినట్లు తెలిపింది. ‘యుద్ధ నేరాలను డాక్యుమెంట్ చేయడంలో వాళ్లు అసాధారణ సామర్థ్యాన్ని ప్రదర్శించారు. మానవ హక్కుల ఉల్లంఘనలు, అధికార దుర్వినియోగాన్ని వాళ్లు వేలెత్తి చూపారు. శాంతి, ప్రజాస్వామ్యం కోసం ఎంతో కృషి చేశారు.’ అని పేర్కొంది కమిటీ. ఇప్పటికే ఈ ఏడాదికి గాను వైద్య, భౌతిక, రసాయన శాస్త్రం, సాహిత్య రంగంలో నోబెల్ పురస్కార విజేతల పేర్లను ప్రకటించింది కమిటీ. ఇదీ చదవండి: ఫ్రెంచ్ కవయిత్రికి సాహిత్యంలో నోబెల్ -
కణ కవలలపై పరిశోధనలు
అక్కినేని నాగార్జున ద్విపాత్రాభియనం చేసిన సినిమా ‘హలో బ్రదర్’ గుర్తుందా? 1994లో విడుదలైన ఈ సినిమా చూసుంటే.. ఈ ఏడాది భౌతిక శాస్త్ర నోబెల్ ప్రైజ్ గ్రహీతలు అలెన్ ఆస్పెక్ట్, జాన్ ఎఫ్ క్లాసర్, ఆంటోనీ జీలింగర్‌లు చేసిన పరిశోధనలు అర్థం చేసుకోవడం సులువవుతుంది. కణస్థాయిలో జరిగే కొన్ని భౌతిక దృగ్విషయాలను నియంత్రించడం వీలవుతుందని వీరు వేర్వేరుగా జరిపిన పరిశోధనలు స్పష్టం చేశాయి. ఫలితంగా అత్యంత శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్ల తయారీ మొదలుకొని హ్యాకింగ్‌కు అస్సలు చిక్కని సమాచార వ్యవస్థల రూపకల్పనకు మార్గం సుగమమైంది. ఇంతకీ ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు జరిపిన ప్రయోగాలేమిటి? హలో బ్రదర్ సినిమా చూసుంటే వాటిని అర్థం చేసుకోవడం ఎలా సులువు అవుతుంది? దూరంగా ఉన్నప్పటికీ ఒకేలా ప్రవర్తన ముందుగా చెప్పుకున్నట్లు హలో బ్రదర్ చిత్రంలో నాగార్జునది ద్విపాత్రాభినయం. పుట్టినప్పుడే వేరైన ఇద్దరు కవలల కథ. కవలలంటే చూసేందుకు ఒకేలా ఉండేవారు మాత్రమే అని అనుకునేరు. వీరిద్దరు కొంచెం దగ్గరగా వస్తే చాలు.. ఒకరిని కొడితే ఇంకొకరికి నొప్పి కలుగుతుంది. కిలోమీటర్ దూరంలో ఉన్నా సరే ఒకరికి నవ్వు వచ్చినా, దుఃఖం కలిగినా అదే రకమైన భావనలు రెండో వ్యక్తిలోనూ కలుగుతూంటాయి! నిజ జీవితంలో ఇలాంటి కవలలు ఉండటం అసాధ్యమేమో గానీ భౌతిక శాస్త్రంలో మాత్రం సుసాధ్యమే. సూక్ష్మ కణాల మధ్య కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇలాంటి స్థితి ఏర్పడుతూ ఉంటుంది. దీన్నే క్వాంటమ్ ఎంటాంగిల్‌మెంట్ అని పిలుస్తుంటారు. వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ ఈ కణాల్లో ఒకదానిలో జరిగే మార్పు ప్రభావం ఇంకోదాంట్లోనూ కనిపిస్తుందన్నమాట! అలెన్ ఆస్పెక్ట్, జాన్ ఎఫ్ క్లాసర్, ఆంటోన్ జీలింగర్‌లు పరిశోధనలు చేసింది ఈ క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్‌పైనే. దూరంగా ఉన్నా కూడా ఒక్కతీరుగా ప్రవర్తించే కాంతి కణాల (ఫోటాన్లు)పై ఈ ముగ్గురు శాస్త్రవేత్తలూ వేర్వేరుగా పరిశోధనలు నిర్వహించారు. ఈ ప్రయోగాల ఫలితాల ఆధారంగా కొన్ని కొత్త, వినూత్నమైన టెక్నాలజీలు రూపుదిద్దుకున్నాయి. ఫలితంగా చాలాకాలంగా కేవలం సిద్ధాంతాలకు మాత్రమే పరిమితమైన కొన్ని విషయాలు వాస్తవ రూపం దాల్చడం మొదలైంది. లెక్కకు చిక్కనంత వేగంగా పనిచేసే కంప్యూటర్లు, అతి సురక్షితమైన సమాచార వ్యవస్థలు వీటిల్లో మచ్చుకు కొన్ని మాత్రమే. చిరకాల శేష ప్రశ్నలు నిజానికి క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్పై చాలాకాలంగా ఎన్నో శేష ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. రెండు కణాలు దూరంగా ఉన్నా ఒకేలా ప్రవర్తించడం వెనుక ఏముందో తెలుసుకునేందుకు ప్రయత్నాలు చాలానే జరిగాయి. 1960వ దశకంలో జాన్ స్టూవర్ట్ బెల్ అనే శాస్త్రవేత్త ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. గుర్తు తెలియని అంశాలు ఉన్నప్పుడు పెద్ద ఎత్తున సేకరించే కొలతల ఫలితాలు నిర్దిష్టమైన విలువకు మించి ఉండవని ఈ సిద్ధాంతం చెబుతుంది. ఈ ‘‘బెల్స్ అసమానత’’లు నిర్దిష్ట ప్రయోగాల్లో చెల్లవని క్వాంటమ్ మెకానిక్స్ చెబుతుంది. ఈ ఏడాది భౌతికశాస్త్ర నోబెల్ ప్రైజ్ గ్రహీతల్లో ఒకరైన జాన్ ఎఫ్ క్లాసర్ గతంలోని స్టూవర్ట్ బెల్ సిద్ధాంతాలను మరింత అభివృద్ధి చేయడమే కాకుండా.. లెక్కలకు మాత్రమే పరిమితం కాకుండా వాస్తవిక ప్రయోగాలు చేపట్టారు. క్వాంటమ్ మెకానిక్స్‌లో ‘‘బెల్స్ అసమానత’’లు పనిచేయవని స్పష్టమైంది. అలెన్ ఆస్పెక్ట్ ఈ విషయాలను మరింత ముందుకు తీసుకెళుతూ.. జాన్ క్లాసర్ ప్రయోగాల్లోని కొన్ని లోపాలను సరిదిద్దే వ్యవస్థను రూపొందించారు. వీరిద్దరి ప్రయోగాల ఫలితాల ఆధారంగా ఆంటోనీ జీలింగర్ ఎంటాంగిల్‌మెంట్ స్థితిలో ఉన్న కణాలను నియంత్రించవచ్చని ప్రయోగపూర్వకంగా నిరూపించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
2021 Nobel Peace Prize: ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి వీరికే..
ఓస్లో: ఏటా ప్రపంచంలో శాంతి నెలకొల్పేందుకు వ్యక్తులు, సంస్ధలు చేసిన కృషికి ప్రతిఫలంగా ప్రకటించే నోబెల్ శాంతి పురస్కారానికి ఈ ఏడాది(2021) మరియా రెస్సా, దిమిత్రి మరటోవ్ కు ఎంపికయ్యారు. నార్వేజియన్ నోబెల్ కమిటీ నేడు శాంతి పురస్కారం విజేతను ప్రకటించింది. ప్రజాస్వామ్యానికి మూలమైన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పరిరక్షణ కోసం చేసిన కృషికి గానూ వీరిని ఈ విశిష్ట పురస్కారానికి ఎంపిక చేసినట్లు నోబెల్ కమిటీ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం, మీడియా స్వేచ్ఛ పరంగా తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న ఈ సమయంలో భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం వీరు ధైర్యంగా పోరాడుతున్నారని నోబెల్ కమిటీ కమిటీ ఈ సందర్భంగా ప్రశంసించింది. (చదవండి: రసాయన శాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతి విజేతలు వీరే..!) దిమిత్రి మరటోవ్ ఒక రష్యన్ జర్నలిస్ట్, నోవాయా గజెటా వార్తాపత్రిక ఎడిటర్-ఇన్-చీఫ్. 24 ఏళ్ల పాటు ఆ పత్రిక ఎడిటర్‌గా చేశారు. ఈ పత్రికను ప్రారంభించిప్పటి నుంచి రష్యా దేశంలో పేరుకుపోయిన అవినీతి, విధానపరమైన హింస, చట్ట వ్యతిరేక అరెస్టులు, ఎన్నికల్లో మోసాలు వంటి ఎన్నో సంచలనాత్మక కథనాలు ప్రచురించారు. దీంతో అతని మీద అనేక దాడులు చేయడమే బెదిరింపులు కూడా వచ్చాయి. పత్రికా స్వేచ్ఛను రక్షించడంలో చూపించిన ధైర్యసాహసాలకు మురాటోవ్ కు 2007లో సీపీజె అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ అవార్డును గెలుచుకున్నాడు. BREAKING NEWS: The Norwegian Nobel Committee has decided to award the 2021 Nobel Peace Prize to Maria Ressa and Dmitry Muratov for their efforts to safeguard freedom of expression, which is a precondition for democracy and lasting peace.#NobelPrize #NobelPeacePrize pic.twitter.com/KHeGG9YOTT — The Nobel Prize (@NobelPrize) October 8, 2021 మరియా రెస్సా ఫిలిప్పినో-అమెరికన్ జర్నలిస్ట్. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కోసం 2012లో ఆమె ‘రాప్లర్’ పేరుతో ఓ డిజిటల్ మీడియా కంపెనీని స్థాపించారు. ఓ జర్నలిస్టుగా, రాప్లర్ సీఈవోగా రెసా.. ఎన్నో సంచలనాత్మక కథనాలను ధైర్యంగా ప్రచురించారు. అధికార పరంగా ఒత్తిళ్లు ఎదుర్కొంటూనే.. భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం పోరాడుతూ వస్తున్నారు. ఆగ్నేయ ఆసియాలో సీఎన్ఎన్ పరిశోధనాత్మక రిపోర్టర్ గా దాదాపు రెండు దశాబ్దాలు పనిచేశారు. -
ముగ్గురు శాస్త్రవేత్తలకు వైద్య నోబెల్
స్టాక్‌హోమ్: హెపటైటిస్ – సీ వైరస్‌ను గుర్తించినందుకు అమెరికన్ శాస్త్రవేత్తలు హార్వీ జే.ఆల్టర్, ఛార్లెస్ ఎం. రైస్‌లతోపాటు బ్రిటిష్ శాస్త్రవేత్త మైకేల్ హౌటన్‌లకు ఈ ఏడాది వైద్యశాస్త్ర నోబెల్ అవార్డు దక్కింది. ఈ ముగ్గురు శాస్త్రవేత్తల పరిశోధనల ఫలితంగా రక్తం ద్వారా వ్యాపించే హెపటైటిస్ గురించి ప్రపంచానికి తెలిసిందని, హెపటైటిస్ ఏ, బీల ద్వారా ఈ విషయం తెలియరాలేదని నోబెల్ కమిటీ సోమవారం స్టాక్ హోమ్‌లో సోమవారం అవార్డును ప్రకటించిన సందర్భంగా వ్యాఖ్యానించింది. అంతేకాకుండా.. వీరి పరిశోధనల ఫలితంగా హెపటైటిస్–సీ గుర్తింపులకు కొత్త రక్త పరీక్షలు, వైద్యానికి కొత్త మందులు అందుబాటులోకి వచ్చి లక్షల మంది ప్రాణాలు నిలిచాయని తెలిపింది. ‘‘వైరస్‌ను గుర్తించేందుకు అతి సున్నితమైన పరీక్షను సిద్ధం చేయడం వీరి పరిశోధనల వల్లే వీలైంది. ఫలితంగా రక్తమార్పిడి తరువాత వ్యాధి సోకే అవకాశాలు దాదాపు లేకుండా పోయాయి.‘‘ అని కమిటీ వివరించింది. చరిత్రలో తొలిసారి ఈ వ్యాధికి చికిత్స కల్పించడం కూడా ఈ ఏడాది నోబెల్ అవార్డు గ్రహీతల పరిశోధనల ఫలితంగానే సాధ్యమైందని కమిటీ తెలిపింది. అవార్డు కింద బంగారు పతకం, కోటి స్వీడిష్ క్రోనార్లు (రూ.8.22 కోట్లు) నగదు లభిస్తుంది. అవార్డు గ్రహీతలు ముగ్గురూ నగదు బహుమతిని సమానంగా పంచుకుంటారు. స్వీడన్ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ 124 ఏళ్ల క్రితం ఈ అవార్డును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దశాబ్ద కాలం అంతు చిక్కని వైరస్... హెపటైటిస్–సీ వైరస్‌ను గుర్తిచేందుకు సంప్రదాయ పద్ధతుల్లో శాస్త్రవేత్తలు జరిపిన ప్రయత్నాలు అస్సలు ఫలించలేదు. ఈ నేపథ్యంలో చిరాన్ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్న మైకేల్ హౌటన్ ఈ వైరస్‌ను వేరు చేసి జన్యుక్రమం నమోదు చేసే తాజా ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు. వైరస్ సోకి చింపాంజీ రక్తంలోని డీఎన్ఏ పోగులను వేరు చేసి పరీక్షలు జరిపారు. చింపాంజీ జన్యుక్రమానికి సంబంధించిన పోగులు అధికంగా ఉన్నప్పటికీ గుర్తు తెలియని వైరస్ తాలూకూ జన్యు అవశేషాలు కూడా ఇందులో ఉంటా యని మైకేల్ హౌటన్ అంచనా వేశారు. వైరస్‌కు వ్యతిరేకంగా రోగ నిరోధక వ్యవస్థ యాంటీబాడీలను తయారు చేసి ఉంటుంద న్న అంచనాతో ప్రయోగాలు జరిగాయి. రోగి రక్తంలో వైరస్ తాలూకూ ప్రోటీన్‌ను ఉత్పత్తి చేయగల డీఎన్ఏ పోగుల కోసం వెతుకులా ట మొదలైంది. సమగ్ర పరీక్షల ఫలితంగా ఒక్క పోగు లభ్యమైంది. తదుపరి పరీక్షలతో ఈ డీఎన్ఏ పోగు కూడా ఫ్లావివైరస్ కుటుంబానికి చెందిన ఆర్ఎన్ఏ ఆధారిత వైరస్‌కు చెందిందని స్పష్టమైంది. ఈ వైరస్‌కు హెపటైటిస్–సీగా నిర్ధారించారు. మైకేల్ హౌటన్ వైరస్ ఉనికిని నిర్ధారిస్తే.. అంతకుముందే రక్తమార్పిడి కారణంగా వచ్చే హెపటైటిస్ వ్యాధికి గుర్తు తెలియని వైరస్ ఒకటి కారణమని హార్వీ జే ఆల్టర్ నిర్ధారించారు. రక్తమార్పిడి కేసులను పకడ్బందీగా, నిశితంగా పరిశీలించడం ద్వారా హార్వీ వ్యాధికి అప్పటికే గుర్తించిన వైరస్లు ఏవీ కారణం కాదని ప్రపంచానికి తెలియజేశారు. మరోవైపు ఛార్లెస్ ఎం.రైస్ హెపటైటిస్ –సీ వైరస్ మాత్రమే హెపటైటిస్‌కు కారణమని విస్పష్టంగా గుర్తించడంతో ఆ వైరస్ తాలూకూ చివరి చిక్కుముడి కాస్తా వీడింది. వాషింగ్టన్ యూనివర్సిటీలో పనిచేస్తున్న ఛార్లెస్ ఎం. రైస్ హెపటైటిస్–సీ జన్యుక్రమం చివరి ప్రాం తం వైరస్ పునరుత్పత్తిలో కీలకమన్న అంచనాతో పరిశోధనలు చేపట్టారు. అంతేకాకుం డా.. వేరు చేసిన హెపటైటిస్–సీ వైరస్‌లో కొన్ని తేడాలు ఉండటాన్ని కూడా రైస్ గుర్తించారు. జెనిటిక్ ఇంజినీరింగ్ పద్ధతుల్లో ఈ వైరస్ నకలు ఒకదాన్ని తయారు చేసి చింపాంజీ కాలేయంలోకి ప్రవేశపెట్టినప్పుడు క్రానిక్ హెపటైటిస్ వ్యాధిగ్రస్తుల రక్తంలో కనిపించే మార్పులే కనిపించాయి. దీన్ని బట్టి హెపటైటిస్ వ్యాధికి ఈ వైరస్ ఒక్కటే కారణమవుతోందన్న నిర్ధారణకు వచ్చారు. ఏమిటీ హెపటైటిస్–సీ హెపటైటిస్–సీ వైరస్ కారణంగా కాలేయానికి వచ్చే ఆరోగ్య సమస్య పేరిది. రక్తం, వీర్యం, శరీర ద్రవాల ద్వారా ఒకరి నుంచి ఇంకొకరికి సోకుతుంది. అకస్మాత్తుగా కనిపించి కొన్ని వారాల్లో తగ్గిపోవడం ఒకరకమైన హెపటైటిస్–సీ వ్యాధి లక్షణమైతే...కాలేయాన్ని తీవ్రంగా దెబ్బతీసి కేన్సర్‌కు, కొన్ని సందర్భాల్లో మరణాలకూ దారితీసే క్రానిక్ హెపటైటిస్–సీ రెండో రకం. ప్రపంచవ్యాప్తంగా సుమారు 40 కోట్ల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలు చెబుతున్నాయి. ఏటా అరవై లక్షల నుంచి కోటి కొత్త కేసులు నమోదవుతూంటాయి. అంతేకాకుండా.. ఏడాదికి 4 లక్షల మంది ప్రాణాలను బలితీసుకుంటోంది ఈ మహమ్మారి. ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే.. 95 శాతం మందికి ఈ వ్యాధి సోకినట్లు కూడా తెలియకపోవడం. ఎవరికి సోకే అవకాశం? ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ హెపటైటిస్–సీ వ్యాధి ప్రభావం ఉన్నప్పటికీ అమెరికా, యూరప్‌లలో కొంచెం ఎక్కువ కేసులు నమోదవుతూంటాయి. సురక్షితం కాని శృంగారం, స్టెరిలైజ్ చేయని ఇంజెక్షన్లను వాడటం, మాదక ద్రవ్యాల వాడకం (ఇంజెక్షన్ల రూపంలో) ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. తల్లి నుంచి బిడ్డకు సంక్రమించే అవకాశమూ ఉంటుంది. వైరస్‌ను గుర్తించిన తరువాత చికిత్స ప్రారంభిస్తే 3 నుంచి ఆరు నెలల్లో 90% మందికి నయమయ్యే అవకాశం ఉంది. ఈ నిశ్శబ్ధ మహమ్మారిపై ప్రజల్లో అవగాహనను పెంచేందుకు ఏటా జూలై 28న వరల్డ్ హెపటైటిస్–సీ డేగా జరుపుకుంటారు. -
వైద్యరంగంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం
స్టాక్‌హోమ్ : వైద్య రంగంలో 2020 సంవత్సరానికి గాను ప్రఖ్యాత నోబెల్ పురస్కారం ఇద్దరు అమెరికన్ సైంటిస్టులు, ఒక బ్రిటీష్ శాస్త్రవేత్తను వరించింది. అమెరికాకు చెందిన జె.హార్వే, చార్లెస్ ఎం.రైజ్, బ్రిటీష్‌కు చెందిన హైకేల్ హోటాన్‌లను ఈ పురస్కారానికి నోబెల్ కమిటీ సోమవారం ఎంపిక చేసింది. హెపటైటిస్ సి వైరస్‌కు వ్యాక్సిన్ కనిపెట్టినందుకు గాను ఈ అవార్డును ప్రకటించారు. హైపటైటిస్ అనేది కాలేయానికి సంబంధించిన వ్యాధి. ఇది వైరస్, బాక్టీరియా, ప్రోటోజోవా, కొన్ని రకాల మందులు వాడడం ద్వారా సంభవిస్తుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందిని వేధిస్తున్న ప్రధాన అరోగ్య సమస్యల్లో ఇది ఒకటి. దీని వలన ఎంతో మంది కాలేయ క్యాన్సర్ బారిన పడుతున్నారు. జె.హార్వే, మైకేల్ హోటాన్, చార్లెస్ ఎం.రైజ్ పరిశోధన వలన సులభంగా హైపటైటిస్‌కు మందుకు కనుగొనడమే కాకుండా ఎంతో మంది ప్రాణాలకు వైద్యులు కాపాడగల్గుతున్నారు. వైద్యరంగంలో చేసిన సేవలకు గుర్తింపుకుగాను ఈ ఏడాది నోబెల్ పురస్కారాన్ని వీరికి ప్రకటించారు. -
ముగ్గురికి వైద్య నోబెల్
స్టాక్‌హోమ్: వైద్య రంగంలో 2019 సంవత్సరానికి గానూ ప్రఖ్యాత నోబెల్ పురస్కారం ఇద్దరు అమెరికన్ సైంటిస్టులు, ఒక బ్రిటిష్ శాస్త్రవేత్తను వరించింది. అమెరికాకు చెందిన డాక్టర్ విలియమ్ జీ కెలీన్ జూనియర్(హార్వర్డ్ యూనివర్సిటీ), డాక్టర్ గ్రెగ్ ఎల్ సెమెన్జా(హాప్కిన్స్ యూనివర్సిటీ), బ్రిటన్‌కు చెందిన డాక్టర్ పీటర్ జే రాట్క్లిఫ్(ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్స్టిట్యూట్)లను ఈ పురస్కారానికి నోబెల్ కమిటీ సోమవారం ఎంపిక చేసింది. ఈ ముగ్గురు ప్రైజ్‌మనీ అయిన 9.18 (రూ. 6.51 కోట్లు)లక్షల అమెరికన్ డాలర్లను సమంగా పంచుకుంటారు. శరీరంలోని కణాలు శరీరంలోని ఆక్సిజన్ స్థాయిలను ఎలా గుర్తిస్తాయో, ఆ స్థాయిలకు అనుగుణంగా తమ పనితీరును ఎలా మార్చుకుంటాయో అనే విషయంపై ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. రక్తహీనత, కేన్సర్ తదితర వ్యాధుల చికిత్సలో ఈ పరిశోధనలు ఉపయోగపడ్తాయని నోబెల్ కమిటీ పేర్కొంది. ‘వేర్వేరు ఆక్సిజన్ స్థాయిలకు జన్యువులు ఎలా ప్రతిస్పందిస్తాయనే విషయంలో, అలాగే, కొత్త ఎర్ర రక్త కణాలు, రక్త నాళాల ఉత్పత్తి, రోగ నిరోధక శక్తిని మెరుగుపర్చే విషయాల్లో వీరు చేసిన పరిశోధనలు ఆ శాస్త్ర విస్తృతికి ఎంతో దోహదపడ్డాయి’ అని కమిటీ ప్రశంసించింది. ఆక్సిజన్‌ను గ్రహించే విధానంలో మార్పు కలగజేసే ఔషధాల రూపకల్పన ద్వారా పలు వ్యాధులకు చికిత్స విధానాన్ని వీరు రూపొందించారు. ఈ అవార్డ్ ద్వారా తనకొచ్చిన డబ్బును ఎలా వినియోగించాలనేది ఇంకా నిర్ణయించుకోలేదని, అయితే, ఒక మంచి పనికే ఆ డబ్బును వాడుతానని డాక్టర్ కెలీన్ తెలిపారు. ‘ఉదయం 5 గంటల సమయంలో సగం నిద్రలో ఉండగా ఈ ఫోన్ కాల్ వచ్చింది. ఈ సమయంలో ఫోన్ వచ్చింది అంటే.. అది శుభవార్తే అయ్యుండొచ్చు అనుకున్నాను. నా గుండె వేగం పెరిగింది’ అని వ్యాఖ్యానించారు. ‘ఈ పరిశోధన ప్రారంభించేముందు అవార్డుల గురించి ఆలోచించలేదు. కణాల్లో ఆక్సిజన్ స్థాయిలపై పరిశోధన అంత సులభం కాదు. పరిశోధన ఫలితాలపై కొందరు అనుమానాలు కూడా వ్యక్తం చేశారు’ అని డాక్టర్ రాట్క్లిఫ్ స్పందించారు. 2018 సంవత్సరానికి గానూ అమెరికా సైంటిస్ట్ జేమ్స్ ఆలిసన్, జపాన్ శాస్త్రవేత్త తసుకు హోంజోలకు వైద్య శాస్త్ర నోబెల్ లభించింది. డైనమైట్ను రూపొందించిన ప్రఖ్యాత శాస్త్రవేత్త అల్ఫ్రెడ్ నోబెల్ పేరున ఇచ్చే ఈ పురస్కారాలను, ప్రతీ సంవత్సరం ఆయన వర్థంతి రోజైన డిసెంబర్ 10న ప్రదానం చేస్తారు. -
ప్రాణవాయువు గుట్టు విప్పినందుకు..
తిన్న ఆహారం శక్తిగా మారాలంటే మనిషితోపాటు అన్ని రకాల జంతువులకూ ఆక్సిజన్ అవసరం. సూక్ష్మస్థాయిలో కణాలూ ఆక్సిజన్ తగ్గిపోతే ఇబ్బంది పడతాయి. ఈ సూక్ష్మ కణాలు తమ పరిసరాల్లో ఆక్సిజన్ తక్కువగా ఉందని ఎలా గుర్తిస్తాయి? అందుకు తగ్గట్లుగా తమను తాము ఎలా మలచుకుంటాయి? ఈ ప్రశ్నలకు సమాధానం కనుక్కున్న శాస్త్రవేత్తలు కెలీన్, రాట్క్లిఫ్, సెమెన్జాలకు ఈ ఏడాది వైద్యనోబెల్ దక్కింది. కణస్థాయిలో ఆక్సిజన్ స్థాయికి తగ్గట్లుగా జన్యువులను ప్రేరేపించే ఓ కణ యంత్రాంగాన్ని వీరు గుర్తించారు. ఆక్సిజన్ మోతాదుల్లో వచ్చే తేడాలు జీవక్రియలను ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకునేందుకు, రక్తహీనత మొదలుకొని కేన్సర్ వరకూ అనేకవ్యాధులకు సరికొత్త, మెరుగైన చికిత్స కల్పించేందుకు ఈ పరిశోధనలు ఉపయోగపడతాయని స్వీడెన్లోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ నోబెల్ అసెంబ్లీ సోమవారం ప్రకటించింది. వాతావరణంలో 20 శాతం... భూ వాతావరణంలో 20 శాతం వరకూ ఉన్న ఆక్సిజన్ జీవక్రియల్లో కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. కణాల్లోని మైటోకాండ్రియా.. ఆక్సిజన్‌ను ఉపయోగించుకొని ఆహారాన్ని శక్తిగా మారుస్తుంది. ఎంజైమ్‌ల ద్వారా ఈ ప్రక్రియ జరుగుతూ ఉంటుందని 1931 నోబెల్ గ్రహీత ఒట్టో వార్బర్గ్ గుర్తించారు. మెడకు ఇరువైపులా రెండు పెద్ద రక్తనాళాల పక్కనే ఉండే కరోటిడ్ బాడీలో... రక్తంలో ఆక్సిజన్ మోతాదును గుర్తించే ప్రత్యేక కణాలు ఉంటాయి. ఉచ్ఛ్వాస నిశ్వాసాల వేగాన్ని నియంత్రించేందుకు ఈ కరోటిడ్ బాడీలు మెదడుకు సంకేతాలు పంపుతాయని 1938 నో»ñ ల్ గ్రహీత కార్నైయిల్ హేమన్స్ గుర్తించారు. ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు శరీరం చేపట్టే ఇంకో పని... ఎరిథ్రోపొయిటిన్ అనే హర్మోన్‌ను ఉత్పత్తి చేయడం. ఈ హార్మోన్ ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని ఎక్కువ చేస్తుంది. అయితే ఈ ప్రక్రియను ఆక్సిజన్ ఎలా నియంత్రిస్తుందన్నది ఇటీవలి వరకూ తెలియదు. జన్యు ప్రహేళిక... ఈ ఏడాది నోబెల్ అవార్డుగ్రహీతలు సెమెన్జా, రాట్క్లిఫ్లు ఎరిథ్రోపొయిటిన్ హార్మోన్‌ను ఉత్పత్తి చేసే జన్యువుపై పరిశోధనలు చేశారు. ఈ జన్యువులో మార్పులు చేసిన ఎలుకలను ఉపయోగించినప్పుడు ఆక్సిజన్ కొరతకు ఈ జన్యువు స్పందిస్తున్నట్లు తెలిసింది. సాధారణంగా ఈ ఎరిథ్రోపొయిటిన్ కిడ్నీ కణాల్లో ఉత్పత్తి అవుతూ ఉంటుంది. కానీ శరీరంలోని దాదాపు అన్ని కణజాలాల్లోనూ ఎరిథ్రోపొయిటిన్ ఉత్పత్తిని నియంత్రించే జన్యువు ఉన్నట్లు స్పష్టమైంది. దీంతోపాటు అనేక ఇతర ప్రొటీన్లు, (హెచ్ఐఎఫ్–1, ఏఆర్ఎన్టీ), ఒక రకమైన కేన్సర్‌ను నిరోధించే హార్మోన్‌ను ఉత్పత్తి చేసే జన్యువు వీహెచ్ఎల్కు కూడా కణాల ఆక్సిజన్ నియంత్రణలో తమదైన పాత్ర ఉన్నట్లు తెలిసింది. వీటన్నింటి మధ్య జరిగే చర్యలు ఆక్సిజన్ మోతాదుకు తగ్గట్లుగా కణాలు మార్పులు చేసుకునేందుకు కారణమవుతున్నట్లు తెలిసింది. వీటిల్లో కొన్ని పరిశోధనలను కెలీన్ వేరుగా చేశారు. ఏతావాతా... శరీరంలో ఆక్సిజన్ మోతాదు తక్కువగా ఉన్నప్పుడు హెచ్ఐఎఫ్–1 ప్రొటీన్ కణ కేంద్రకంలో ఎక్కువగా పోగుపడుతుంది. ఇక్కడ అది ఏఆర్ఎన్టీతో కలసి ఆక్సిజన్ లేమి, కొరతను నియంత్రించే జన్యువులకు అతుక్కుంటుంది. ఆక్సిజన్ సాధారణ స్థితిలో ఉన్నప్పుడు హెచ్ఐఎఫ్–1 వేగంగా నశిస్తూ టుంది. కొన్ని అణువులను జత చేయడం ద్వారా ఆక్సిజన్ దీనిని నియంత్రిస్తుంటుంది. ఎన్నో వ్యాధులకు హేతువు.. కణాలు ఆక్సిజన్ లేమి, కొరతలను గుర్తించకపోవడం రకరకాల వ్యాధులకు కారణమవుతుంది. కిడ్నీ వైఫల్యం ఉన్న వారిలో ఎక్కువ మంది రక్తహీనతతోనూ బాధపడుతుంటారు. ఎరిథ్రోపొయిటిన్ హార్మోన్ జన్యువు సక్రమంగా పనిచేయకపోవడం దీనికి కారణం. ఆక్సిజన్ మోతాదులను గుర్తించే వ్యవస్థ కేన్సర్ విషయంలోనూ కీలకంగా ఉంటుంది. కేన్సర్ కణితుల్లో ఈ వ్యవస్థ జీవక్రియలను మార్చేందుకు, కొత్త రక్తనాళాల ఏర్పాటు, కేన్సర్ కణాలు శరీరంలో వేగంగా వ్యాప్తి చెందేందుకూ ఉపయోగపడుతూ ఉంటాయి. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
అలిసన్, హొంజొలకు మెడిసిన్‌లో నోబెల్
న్యూయార్క్ : జపాన్‌కు చెందిన తసుకు హొంజొ, అమెరికన్ శాస్త్రవేత్త జేమ్స్ అలిసన్‌లకు మెడిసిన్‌లో 2018 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక నోబెల్ ప్రైజ్ లభించింది. క్యాన్సర్ చికిత్సలో పరిశోధనకు గాను వీరికి అత్యున్నత పురస్కారం దక్కిందని నోబెల్ కమిటి పేర్కొంది. క్యాన్సర్ కణాలను నిరోధించేలా శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని బలోపేతం చేయడంపై వీరు సాగించిన పరిశోధన క్యాన్సర్‌కు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటంలో మైలురాయి వంటిదని, వీరు ప్రతిపాదించిన ఇమ్యూన్ చెక్‌పాయింట్ సిద్ధాంతం క్యాన్సర్ చికిత్సలో గుణాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందని కమిటీ వ్యాఖ్యానించింది. క్యాన్సర్‌ను ఎలా ఎదుర్కోగలమనే మన దృక్కోణాన్ని సైతం వీరి పరిశోధన సమూలంగా మార్చివేసిందని పేర్కొంది.యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌కు చెందిన ఎండీ అండర్సన్ క్యాన్సర్ సెంటర్లో ప్రొఫెసర్ అయిన అలిసన్ సాగించిన పరిశోధనా ఫలితాలు దీటైన క్యాన్సర్ చికిత్సకు మార్గం సుగమం చేశాయని నోబెల్ కమిటీ తెలిపింది. ఇక జపాన్‌లోని క్యోటో యూనివర్సిటీ ప్రొఫెసర్ హొంజొ చేపట్టిన పరిశోధనలు సైతం సమర్ధవంతమైన క్యాన్సర్ చికిత్సకు ఊతమిచ్చాయని పేర్కొంది. హొంజొ 34 సంవత్సరాలుగా క్యోటో యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు. -
2014 నోబెల్ విజేతలు
ఓస్లో: నార్వే రాజధాని ఓస్లోలోని సిటీహాల్‌లో ఈ రోజు నోబెల్ శాంతి బహుమతిని కైలాష్ సత్యార్థి, మలాలా అందుకున్నారు. ఈ ఏడాది మొత్తం ఆరు విభాగాలలో 13 మందికి నోబెల్ బహుమతులు ప్రకటించారు. శాంతి బహుమతి: 1. కైలాస్ సత్యార్థి (వయసు 60 - భారత్) 2. మలాలా యూసఫ్‌జాయ్ (17 - పాకిస్థాన్) వైద్యశాస్త్రం: 1. జాన్ ఓ కీఫే (74, అమెరికన్ బ్రిటన్) 2. మే-బ్రిట్ మోజర్ (51, నార్వే) 3. ఎడ్వర్డ్ మోజర్ (52, నార్వే) (వీరిద్దరూ భార్యాభర్తలు) భౌతికశాస్త్రం: 1. ఇసామూ అకసకీ(85, జపాన్) 2. హిరోషి అమానో(54, జపాన్) 3. షుజీ నకామురా(60, జపాన్ అమెరికన్) రసాయనశాస్త్రం: 1. ఎరిక్ బెట్జిగ్ (54, అమెరికా) 2. విలియం మోర్నర్ (61, అమెరికా) 3. స్టీఫెన్ హెల్ (51, జర్మనీ) సాహిత్యం: 1. ప్యాట్రిక్ మోదియానో (69, ఫ్రాన్స్) ఆర్థికశాస్త్రం: 1. జీన్ టిరోల్ (61, ఫ్రాన్స్) నోబెల్ బహుమతి అందుకున్న ఏడవ భారతీయుడు కైలాస్ సత్యార్థి. సత్యార్థికి ముందు ఆరుగురు భారతీయులు ఈ అత్యున్నత పురస్కారాన్ని స్వీకరించారు. నోబెల్ పొందిన భారతీయులు: రవీంద్ర నాథ్ ఠాగూర్ -సాహిత్యం 1913 సీవీ రామన్-భౌతిక శాస్త్రం 1930 హర్గోవింద్ ఖురానా-వైద్యం 1968 మదర్ థెరిసా-శాంతి బహుమతి 1979 సుబ్రమణ్యం చంద్రశేఖర్- భౌతికశాస్త్రం 1983 అమర్థ్యసేన్-ఆర్థికశాస్త్రం 1998 కైలాస్ సత్యార్థి- శాంతి 2014 భారత సంతతికి చెందిన వారు, భారత్‌లో జన్మించి విదేశాలకు వెళ్లిన మరికొందరు ప్రముఖులు కూడా నోబెల్ బహుమతి అందుకున్నారు. **