సాక్షి, అమరావతి: అత్యంత ప్రమాదకరమైన హెపటైటిస్ వ్యాధి నియంత్రణ, నివారణ చర్యలపై వైద్యారోగ్య శాఖ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 13 ఆస్పత్రుల్లో ఈ వ్యాధికి వైద్యం అందిస్తుండగా, కొత్తగా మరో 18 వైద్య విధాన పరిషత్ ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో స్క్రీనింగ్, వైద్య సేవలకు సన్నాహాలు చేస్తోంది. ఈ ఆస్పత్రుల్లో హెపటైటిస్ బాధితులకు వైద్యానికి జనరల్ మెడిసిన్ లేదా గ్యాస్ట్రో ఎంటరాలజీ లేదా హెపటాలజీ వైద్యుల్లో ఒకరిని ప్రత్యేకంగా నియమిస్తారు.
రాష్ట్రంలో 2.3 శాతం జనాభా హెపటైటిస్ – బి, 0.3 శాతం హెపటైటిస్ – సి తో బాధపడుతున్నట్టు అంచనా. వ్యాధిని త్వరగా గుర్తించి, అరికట్టడానికి ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 9 లక్షల మందికి హెపటైటిస్ స్క్రీనింగ్ నిర్వహించాలన్నది వైద్య శాఖ లక్ష్యం. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 2 లక్షల మందికి స్క్రీనింగ్ చేశారు. 1.41 లక్షల మంది రక్త దాతలకు, 5,840 మంది ఖైదీలు, 30 వేల మంది సాధారణ ప్రజలు, 20 వేల మందికి పైగా ఎయిడ్స్ బాధితులకు స్క్రీనింగ్ చేశారు.
వీరిలో 1,500 మందికి పైగా హెపటైటిస్ బి, సి వ్యాధిగ్రస్తులను గుర్తించారు. వీరందరికీ ప్రభుత్వమే ఉచితంగా వైద్యం అందిస్తోంది. హై రిస్క్ వర్గానికి చెందిన హెచ్‌ఐవీ రోగులకు 45 యాంటీ రిట్రోవల్ థెరఫీ (ఏఆర్‌టీ) సెంటర్‌లలో స్క్రీనింగ్, వైద్య సేవలు అందిస్తున్నారు. దేశంలో హెచ్‌ఐవీ బాధితులకు హెపటైటిస్ స్క్రీనింగ్, వైద్య సేవలు అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా ఏపీకి ఘనత దక్కింది. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ అవార్డు సైతం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖకు వచ్చింది.
హైరిస్క్ వర్గాల వారికి టీకా
హెపటైటిస్ బీ వ్యాధి నియంత్రణకు టీకా పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే వైద్య శాఖలో పని చేస్తున్న వైద్యులు, సిబ్బంది లక్ష మందిలో 99 శాతం మందికి తొలి డోసు టీకా ఇచ్చారు. 95 శాతం మందికి రెండో డోసు, 89 శాతం మందికి మూడో డోసు పూర్తయింది. హైరిస్క్ వర్గానికి చెందిన హెచ్‌ఐవీ బాధితులు, సెక్స్‌వర్కర్లు, ఇంజెక్షన్ల ద్వారా మాదక ద్రవ్యాలు తీసుకునే 2 లక్షల మందికి టీకా ఇవ్వాలని నిర్ణయించారు.
తప్పనిసరిగా స్క్రీనింగ్ చేయించుకోవాలి
హెపటైటిస్ బి, సి కాలేయంపై ప్రభావం చూపుతాయి. అనారోగ్య సమస్యలు కలిగిస్తాయి. వ్యాధి పట్ల అవగాహనతో నియంత్రణ సాధ్యం అవుతుంది. రక్తమార్పిడి, సురక్షితం కాని శృంగారం, సిరంజుల ద్వారా ఇవి సోకుతాయి. తల్లి నుంచి బిడ్డకు హెపటైటిస్ బి సోకుతుంది. ఇంట్లో ఎవరికైనా హెపటైటిస్ బి ఉంటే కుటుంబ సభ్యులు అందరూ స్క్రీనింగ్ చేయించుకోవాలి. గర్భిణులు తప్పనిసరిగా స్క్రీనింగ్ చేయించుకోవాలి. తద్వారా బిడ్డకు వ్యాధి సోకకుండా నియంత్రించవచ్చు.
– డాక్టర్ ఎస్.నూర్‌బాషా, గుంటూరు జీజీహెచ్ అసిస్టెంట్ ప్రొఫెసర్, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, లివర్ స్పెషలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment