World Hepatitis Day
-
కాలేయం.. కాపాడుకుందాం
మానవ శరీరంలో కీలకమైన భాగం కాలేయం (లివర్). ఇది మనకు తెలియకుండానే ‘హెపటైటీస్’(లివర్ వాపు)కు గురవుతుంది. దీంతో చాలా మంది అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ వ్యాధిపై అవగాహన పెంచుకోవాలి. కాలేయాన్ని కాపాడుకుంటే పది కాలాల పాటు ఆరోగ్యవంతులుగా జీవించవచ్చు. కడప రూరల్: ‘హెపటైటీస్’వ్యాధి సోకిందని తెలియక చాలా మంది అనారోగ్యానికి గురవుతున్నారు. కొంతమందిలో వ్యాధి తీవ్రత పెరగడంతో మృత్యువాత పడుతున్నారు. ఈ వ్యాధి నివారణకు..ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. ప్రతి ఏటా జూలై 28వ తేదీన ప్రపంచ హెపటైటీస్–బి నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం... కాలేయం విధులు కీలకం.. శరీరంలోని ఇతర అవయవాలతో పాటు కాలేయం కీలకమైన పనులను నిర్వర్తిస్తోంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ప్రొటీన్లను, రక్తం గడ్డ కట్టే ఫ్రాక్షర్స్ను తయారు చేస్తుంది. ఇలా మన శరీరంలో ఉండే లివర్ మనిషి సంపూర్ణవంతమైన ఆరోగ్యానికి దోహదపడుతోంది. ‘హెపటైటిస్’అంటే.. ‘హెపటైటిస్’ఇది కాలేయానికి సంబంధించిన వ్యాధి. వైద్య భాషలో ‘హెప’అంటే లివర్, టైటీస్ లేదా ఐటస్ అంటే వాపు అని అర్ధం. ఎ, బి, సి, డి, ఇ అనే ఐదు రకాల వైరస్ల సమూహమే ‘హెపటైటిస్’. అందులో ఎ, ఈ వైరస్ కలుషిత నీరును తాగడం, కలుషిత ఆహరం తీసుకోవడం వల్ల వస్తుంది. ‘డి’అంటే డెల్టా వైరస్. ఇది హైపటైటిస్‌కు చెందిన ఒక వైరస్. ఈ వైరస్లు ప్రమాదకరమైనవి కావు. బి, సి వైరస్‌లే అనారోగ్యానికి దారి తీస్తాయి. ఎందుకు వస్తుందంటే.. ►సురక్షితం కాని ఇంజక్షన్లు వాడటం.. ►శుధ్ధి లేని రక్త మార్పిడి.. ►హెపటైటీస్ వ్యాధి సోకిన తల్లి నుంచి బిడ్డకు ►అవాంచిత సెక్స్ వల్ల.. ►ఒకరు ఉపయోగించిన బ్లేడ్లు, రేజర్లు, టూత్ బ్రెష్‌లు వాడటం.. ►కలుషితమైన నీరు, ఆహరం తీసుకోవడం వల్ల హెపటైటీస్ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుంది. లక్షణాలు ఇవీ... ►కామెర్లు, జ్వరం తదితర అనారోగ్య సమస్యలు ఉంటాయి. ►చాలా మందిలో వ్యాధి లక్షణాలు కనిపించవు. ►వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే కడపు నొప్పితో పాటు కడుపు ఉబ్బరం ఉంటుంది. రక్తపు వాంతులు అవుతాయి. తీసువాల్సిన జాగ్రత్తలు.. ►హెపటైటీస్ నిర్ధారణ రక్త పరీక్ష చేసుకోవాలి ►ముందస్తు టీకా వేయించుకోవాలి ►క్రమం తప్పకుండా చికిత్స పొందడం వల్ల హెపటైటీస్‌ను నివారించవచ్చు. ప్రభుత్వం చేపడుతున్న చర్యలు.. హెపటైటీస్ నివారణకు ప్రభుత్వం గట్టి చర్యలు చేపడుతోంది. బిడ్డ జన్మించిన 24 గంటల్లోనే ఈ వైరస్ నివారణకు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఉచితంగా హెపటైటీస్–బి జీరో డోస్ టీకా వేస్తున్నారు. అలాగే ఈ టీకాను విడతల వారీగా ఎప్పుడెప్పుడు వేసుకోవాలో సూచిస్తున్నారు. ప్రతి 12 మందిలో ఒకరికి.. ఈ వ్యాధి చాప కింద నీరులా ప్రవేశిస్తుంది. వైద్యుల అభిప్రాయం ప్రకారం ప్రతి 12 మందిలో ఒకరు ఈ వైరస్‌తో ఎంతో కొంత బాధపడుతున్నారు. మరి కొందరు ఎక్కువ సమస్యతో అవస్థలు పడుతుంటారు. వ్యాధి ఉందని తెలిసేలోపు ‘లివర్’తీవ్ర ఇన్ఫెక్షన్కు గురవుతుంది. బాధితుల్లో దాదాపు 70 శాతం మందికి ఇన్ఫెక్షన్ బాగా ముదిరిన తరువాతనే అసలు విషయాన్ని తెలుసుకుంటున్నారు. కాగా హెచ్ఐవీతో పోలిస్తే హెపటైటీస్ వైరస్సే ఇతరులకు అధికంగా సోకుతుందని వైద్యులు అంటున్నారు. క్రమం తప్పకుండా టీకా వేయాలి.. హెపటైటీస్ నివారణకు అన్ని చర్యలు చేపడుతున్నాం. ఈ వైరస్‌కు అడ్డుకట్ట వేయడానికి బిడ్డ జన్మించిన 24 గంటల్లోపు టీకాను వేస్తున్నాం. తరువాత ఐదు టీకాల మిశ్రమం కలిగిన ‘పెంటావాలెంట్’టీకాను ఆరు వారాలకు, 10 వారాలకు, 14 వారాలకు ఒక సారి ఒక డోసు చొప్పున వేస్తున్నాం. ఈ పెంటావాలంట్ టీకా హెపటైటీస్–బితో అంటే కామెర్లతో పాటు గోరింత దగ్గు, ధనుర్వాతం, న్యుమోనియా నివారణకు పనిచేస్తుంది. ఈ టీకా 10 సంవత్సరాల వరకు పని చేస్తుంది. తర్వాత ఒక బూస్టర్ డోస్‌ను వేయాలి. ప్రతి బూస్టర్ డోసు ఐదేళ్ల పాటు పనిచేస్తుంది. ఈ వైరస్ నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది. వైద్యుల సూచనల ప్రకారం టీకా వేయాలి. – డాక్టర్ నాగరాజు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అవగాహన కలిగి ఉండాలి.. ఈ వ్యాధిపై ప్రజలు అవగాహన పెంచుకోవాలి. ఇన్ఫెక్షన్ ఎక్కువైతే తీవ్ర అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. చాలా మంది వ్యా«ధి ముదిరిన తరువాత వైద్యం కోసం వస్తున్నారు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ వైరస్‌కు వ్యాక్సిన్‌తో అడ్డుకట్ట వేయవచ్చు. అనారోగ్య సమస్యలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. సూచనలు సలహలు పాటించాలి. – డాక్టర్ దేవిరెడ్డి చైతన్యరెడ్డి, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, హెపటాలజిస్ట్ -
హెచ్ఐవీ కంటే హెపటైటిస్ ప్రమాదకరమా? అందులో నిజమెంత?
హెపటైటిస్ అనేది జబ్బు కాదు.. కొన్ని ఇన్ఫెక్షన్ల సమాహారం. హెపటైటిస్‌లో ఏ, బీ, సీ, డీ, ఈ అనే ఐదు రకాలు ఉన్నాయి. హెపటైటిస్ చాలా మందిలో ఉన్నప్పటికీ అది తమకు ఉన్నట్టే తెలియదు. సాధారణంగా 2, 3 వారాల్లో తగ్గిపోతుంది. కొద్ది మందిలో మాత్రం దీర్ఘకాలికంగా ఉండిపోతుంది. మొత్తం జనాభాలో 3 నుంచి 5 శాతం మంది హెపటైటిస్ బారిన పడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. హెపటైటిస్ ముదిరితే లివర్ గట్టి బడి లివర్ సిర్రోసిస్, మరికొందరిలో లివర్ క్యాన్సర్‌కు దారితీయవచ్చు. ఇంతటి ప్రమాదకరమైన హెపటైటిస్ నుంచి ముందు జాగ్రత్త చర్యలు పాటించడం, వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా రక్షణ పొందవచ్చని 40 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం ఉన్న ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ ఇ.పెదవీర్రాజు సూచిస్తున్నారు. వరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. – సీతంపేట(విశాఖ ఉత్తర) సాక్షి: హెపటైటిస్ అంటే ఏమిటి, ఎన్ని రకాలు, ఏ విధంగా వస్తుంది? డాక్టర్ పెదవీర్రాజు: హెపటైటిస్ నాలుగైదు రకాల వైరస్ల వల్ల వ్యాపిస్తుంది. హెపటైటిస్ ఏ, బీ, సీ,డీ, ఈ ఇలా ఐదు రకాల వైరస్ల వల్ల వ్యాధి బారిన పడతారు. ఇందులో హెపటైటిస్ బీ, సీ రకాలు కలుషితమైన రక్తం ఎక్కించుకోవడం, స్టెరిలైజ్ చేయని ఇంజక్షన్ సూదుల వల్ల, ఎక్కువ సార్లు శస్త్ర చికిత్సలు చేయించుకోవడం వల్ల వస్తుంది. ఏ, ఈ రకాలు కలుషితమైన నీరు, పాడైపోయిన ఆహారం వల్ల వ్యాపిస్తుంది. ముందు జాగ్రత్త చర్యలు పాటించం ద్వారా హెపటైటిస్ బారిన పడకుండా ఉండవచ్చు. సాక్షి: హెపటైటిస్ లక్షణాలు ఏమిటి? డాక్టర్ : హెపటైటిస్‌కు గురైన వారిలో జ్వరం, ఆకలి లేకపోవడం, నీళ్ల విరేచనాలు, తెలుపు రంగులో మోషన్, కడుపులో ఇబ్బంది, దురదలు, మూత్రం పచ్చగా రావడం, చర్మం, కంటిలోని తెల్లభాగం పసుపుగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రెండు నుంచి ఆరు వారాల లోపు వ్యాధి లక్షణాలు బయటపడతాయి. సాక్షి: హెపటైటిస్ బీ బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? డాక్టర్ : హెపటైటిస్ బీని నివారించడానికి వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. హెపటైటిస్ బీ వ్యాక్సిన్ మూడు డోసులు తీసుకుంటే రక్షణ ఉంటుంది. ఈ వ్యాక్సిన్ లివర్ క్యాన్సర్ బారిన పడకుండా కూడా రక్షణ కల్పిస్తుంది. భర్తకు హెపటైటిస్ బీ వస్తే భార్య.. ఇంటిలో ఒకరికి వస్తే మిగిలిన వారందరూ వ్యాక్సిన్ కచ్చితంగా తీసుకోవాలి. సాక్షి: హెపటైటిస్ సీ వైరస్ నుంచి రక్షణ పొందాలంటే..? డాక్టర్ : హెపటైటిస్ సీ కి గతంలో మందులు ఉండేవి కాదు. నాలుగేళ్ల నుంచి అద్భుతమైన మందులు అందుబాటులోకి వచ్చాయి. ఈ మందులు మూడు నెలలు వాడినట్లయితే హెపటైటిస్ సీ 95 శాతం నయం అవుతుంది. సాక్షి: హెపటైటిస్ ఏ, ఈ బారిన పడకుండా ఉండాలంటే..? డాక్టర్ : కలుషితం కాని ఆహారం, నీరు తీసుకోవడం వంటి ముందు జాగ్రత్త చర్యలు ద్వారా హెపటైటిస్ ఏ, ఈ బారిన పడుకుండా ఉండొచ్చు. హెపటైటిస్ ఏకు వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నప్పటికీ అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే వినియోగిస్తున్నారు. మనదేశంలో వ్యాక్సిన్ వినియోగించడం లేదు. హెపటైటిస్ ‘ఈ’కి వ్యాక్సిన్ లేదు. పరిసరాల పరిశుభ్రత, ఆహార నియమాలు పాటించడం ద్వారా ఏ, ఈ వైరస్ వ్యాప్తికి గురికాకుండా ఉండొచ్చు. సాక్షి: గర్భిణికి హెపటైటిస్ వస్తే పుట్టే శిశువుకు సంక్రమిస్తుందా? డాక్టర్ : గర్భిణికి హెపటైటిస్ బి ఉంటే పుట్టే శిశువుకు వచ్చే అవకాశం ఉంది. తల్లి గర్భంతో ఉన్నపుడు చేసే రక్త పరీక్షలో వ్యాధి నిర్ధారణ అయితే, బిడ్డ పుట్టగానే వ్యాక్సిన్‌తో పాటు హెచ్‌బీఐజీ ఇంజక్షన్ చేస్తారు. దీనివల్ల తల్లి నుంచి బిడ్డకు వ్యాధి సంక్రమించకుండా కాపాడవచ్చు. ఇటీవల టెనోఫెవర్ మాత్రలు అందుబాటులోకి వచ్చాయి. గర్భిణికి హెపటైటిస్‘బి’ వ్యాధి సోకి ఉండి, వైరస్ శాతం బాగా ఎక్కువగా ఉంటే.. ఆమెకు చివరి మూడు నెలలు ఈ మాత్రలు ఇవ్వాలి. దీని వల్ల ఆమె నుంచి శిశువుకు వ్యాధి వ్యాప్తి చెందకుండా ఆపొచ్చు. సాక్షి: ప్రస్తుతం ఈ వ్యాధి తీవ్రత ఏ మేరకు ఉంది? డాక్టర్ : డాక్టర్ బ్లూమ్ బెర్గ్ తన బృందంతో విస్తృత పరిశోధనల ఫలితంగా 1967లో హెపటైటిస్ బీ వైరస్‌ను గుర్తించారు. ఆ తర్వాత 1969లో హెపటైటిస్ బీ వ్యాక్సిన్ కనిపెట్టారు. అప్పటి వరకు జాండిస్ ఎందుకు వస్తుందో తెలిసేది కాదు. పరిశోధనల వల్ల రక్తం ద్వారా వస్తుందని తెలిసింది. ఇప్పుడు రక్తం ఎక్కించే ముందు స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నారు. అందువల్ల రక్తం ద్వారా హెపటైటిస్ బీ, సీ కూడా వచ్చే అవకాశాలు బాగా తగ్గిపోయాయనే చెప్పాలి. సాక్షి: ఈ వ్యాధి బారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డాక్టర్ : కలుషితం కాని ఆహారం, నీరు తీసుకోవడం ద్వారా హెపటైటిస్ ఏ, ఈ బారిన పడకుండా ఉండొచ్చు. వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా హెపటైటిస్ బీ రాకుండా రక్షణ పొందవచ్చు. హెపటైటిస్ బీ నివారణకు వ్యాక్సినే బెస్ట్ ప్రీవెన్షన్. రక్తం ఎక్కించే ముందు సరైన స్క్రీనింగ్ పరీక్షలు చేయడం ద్వారా హెపటైటిస్ బీ, సీ బారిన పడకుండా ఉండొచ్చు. హెపటైటిస్ డీ మన దేశంలో చాలా అరుదుగా వస్తుంది. ఇటలీలో కనిపిస్తుంది. ఒకప్పుడు హెపటైటిస్ వల్ల లివర్ సమస్యలు ఎక్కువగా వచ్చేవి. ప్రస్తుతం ఆల్కాహాల్, ఊబకాయం వల్ల ఎక్కువగా లివర్ సమస్యలు వస్తున్నాయి. ఢిల్లీ, బెనారస్ ప్రాంతాల్లో హెపటైటిస్ ఎక్కువగా ఉంది. ఆయా ప్రాంతాలకు వెళ్లి వచ్చిన వారు హెపటైటిస్ పరీక్ష చేయించు కోవడం మంచిది. సాక్షి: హెచ్ఐవీ కంటే హెపటైటిస్ ప్రమాదకరమా? డాక్టర్ : హెపటైటిస్ హెచ్ఐవీ కంటే ప్రమాదమన్న అపోహ ఉంది. అది నిజం కాదు. ఎందుకంటే చెమట ద్వారా, ముట్టుకోవడం, ముద్దు పెట్టుకోవడం వల్ల హెపటైటిస్ వ్యాపించదు. ఇంజక్షన్, శరీరంలోకి రక్తం ఎక్కించడం ద్వారా వ్యాపిస్తుంది. వ్యాధిగ్రస్తుడు వాడే రేజర్, బ్రష్, నెయిల్ కట్టర్ వేరుగా ఉంచాలి. భర్తకు హెపటైటిస్ బీ వస్తే భార్య వ్యాక్సిన్ తీసుకోవాలి. ఆ వ్యాక్సిన్ పని చేసే వరకు అంటే.. ఆరు నెలల వరకు కండోమ్ వాడాలి. సాక్షి: జాండిస్ తగ్గడానికి అల్లోపతి వైద్యం పనికిరాదనే అపోహ ఉంది. నిజమేనా? డాక్టర్ : జాండిస్ రాగానే అల్లోపతిలో మందు లేదని చాలా మందిలో అపోహ ఉంది. నాటు వైద్యానికి వెళ్లిపోతున్నారు. హైపటైటిస్ ఏ, బీ, సీ వచ్చినా సాధారణంగా రెండు మూడు వారాల్లో తగ్గిపోతుంది. అందువల్ల పసరు మందు రెండు మూడు వారాలు వాడగానే తగ్గిపోతుంది. అప్పటికీ తగ్గకపోతే వైద్యుడిని సంప్రదిస్తారు. ఈ లోగా వ్యాధి ముదిరిపోతుంది. జాండిస్ చాలా కారణాల వల్ల వస్తుంది. మలేరియా, లివర్‌లో స్టోన్, ట్యూమర్ వల్ల జాండిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. హెపటైసిస్ వల్ల వచ్చే జాండిస్ 2, 3 వారాల్లో తగ్గిపోతుంది. 3 నుంచి 5 శాతం మందికి దీర్ఘకాలికంగా శరీరంలో ఉండిపోతుంది. దీని వల్ల లివర్ గట్టిపడి లివర్ సిర్రోసిస్‌కు దారితీస్తుంది. పొట్టలో నీరు చేరడం, కళ్లు పచ్చబడటం, కాళ్లు పొంగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 2030 నాటికి హెపటైటిస్ నిర్మూలనే లక్ష్యం ఢిల్లీ ఎయిమ్స్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ గౌతమ్ హెపటైటిస్‌కు కారణమయ్యే వైరస్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, లేకపోతే ప్రాణాలకే ప్రమాదం వాటిల్లుతుందని ఢిల్లీ ఎయిమ్స్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ బుడిమూరి గౌతమ్ అన్నారు. హెపటైటిస్ దినోత్సవం పురస్కరించుకుని విశాఖ ప్రజల అవగాహన కోసం ఓ ప్రకటన విడుదల చేశారు. వైరల్ హెపటైటిస్ గురించి అవగాహన కల్పించాలన్న థీమ్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన నేపథ్యంలో ఆ దిశగా తాను కృషి చేస్తున్నట్టు తెలిపారు. లివర్ హెపటైటిస్ వ్యాధి తీవ్రత గణాంకాల ప్రకారం పరిశీలిస్తే.. భారతదేశంలో 4 శాతంగా ఉందన్నారు. ఒకసారి లివర్ పూర్తిగా పాడైన తర్వాత కాలేయ మార్పిడి ద్వారా మాత్రమే శాశ్వత పరిష్కారం ఉంటుందన్నారు. తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఉన్న రోగుల్లో ఫ్లూ వంటి జ్వరం, ఆకలి తగ్గడం, వికారం, పొత్తి కడుపులో నొప్పి, పచ్చ కామెర్లకు దారి తీస్తుందని, వ్యాధి అత్యంత తీవ్రమైన సందర్భాల్లో కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందన్నారు. వ్యాధి సోకిన వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకుని మందులు సక్రమంగా వాడితే.. ఆదిలోనే నివారించడంతో పాటు లివర్ వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చని వివరించారు. 2030 నాటికి హెపటైటిస్ నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. -
కాలేయ వాపుతో జాగ్రత్త.. లక్షణాలు లేకుండానే ముంచేస్తుంది!
శరీరంలో కీలకమైన భాగం కాలేయం (లివర్). ఈ అవయవం మనకు తెలియకుండానే ‘హెపటైటీస్’ (లివర్ వాపు)కు గురి అవుతోంది. దీంతో చాలా మంది అనారోగ్యానికి గురి అవుతున్నారు. ఈ వ్యాధిపై అవగాహన పెంచుకోవాలి. కాలేయంను కాపాడుకుంటే పది కాలాల పాటు ఆరోగ్యవంతులుగా జీవించవచ్చు. సాక్షి, కడప: ‘హెపటైటీస్’ వ్యాధి సోకిందని తెలియక చాలా మంది అనారోగ్యానికి గురవుతున్నారు. కొంతమందిలో వ్యాధి తీవ్రత పెరగడంతో మృత్యువాత పడుతున్నారు. ఈ వ్యాధి నివారణకు.. ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. ప్రతి ఏటా జూలై 28వ తేదీన ప్రపంచ హెపటైటీస్–బి నివారణ దినోత్సవంను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం. ‘హెపటైటీస్’ అంటే... ‘హెపటైటీస్’ ఇది కాలేయంకు సంబంధించిన వ్యాధి. వైద్య భాషలో ‘హెప’ అంటే లివర్, టైటీస్ లేదా ఐటస్ అంటే వాపు అని అర్ధం. ఎ, బి, సి, డి, ఇ అనే ఐదు రకాల వైరస్ల సమూహమే ‘హెపటైటీస్’. అందులో ఎ, ఈ వైరస్ కలుషిత నీరును తాగడం, కలుషిత ఆహరంను తీసుకోవడం వలను వస్తుంది. ‘డి’ అంటే డెల్టా వైరస్. ఇది హెపటైటీస్‌కు చెందిన ఒక వైరస్. ఈ వైరస్లు ప్రమాదకరమైనవి కావు. బి, సి వైరస్‌లే అనారోగ్యానికి దారి తీస్తాయి. చాప కింద నీరులా... ఈ వ్యాధి చాప కింద నీరులా ప్రవేశిస్తుంది. అసలు ఈ వ్యాధి ఉందని చాలా మందికి తెలియదు. వ్యాధి ఉందని తెలిసేలోపు ‘లివర్’ తీవ్ర ఇన్ఫెక్షన్కు గురి అవుతోంది. దీంతో వ్యాధి సోకిన వ్యక్తి తీవ్ర అనారోగ్యానికి లోనవుతున్నారు. బాధితుల్లో దాదాపు 70 శాతం మందికి ఇన్ఫెక్షన్ బాగా ముదిరిన తరువాతనే అసలు విషయం తెలుసుకుంటున్నారు. ఈ వైరస్ల కారణంగా దశల వారీగా కాలేయ వాపు, లివర్ సిర్రోసిస్, లివర్ క్యాన్సర్‌కు దారి తీస్తుంది. ఇందుకు ‘హెపటైటీస్’. కారణం. ఎందుకు వస్తుందంటే... ► సురక్షితంకాని ఇంజక్షన్లు వాడటం. ► శుధ్ధి లేని రక్త మారి్పడి.. ► హెపటైటీస్ వ్యాధి సోకిన తల్లి నుంచి బిడ్డకు.. ► అవాంచిత సెక్స్ వలన. ► ఒకరు ఉపయోగించిన బ్లేడ్లు, రేజర్లు, టూత్ బ్రెష్‌లు వాడటం వలన. ► కలుషితమైన నీరు, ఆహరం తీసుకోవడం వలన. లక్షణాలు.. ► కామెర్లు, జ్వరం తదితర అనారోగ్య సమస్యలు ఉంటాయి. ► చాలా మందిలో వ్యాధి లక్షణాలు కనిపించవు. ► వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే కడపు నొప్పితో పాటు కడుపు ఉబ్బరం ఉంటుంది. రక్తపు వాంతులు అవుతాయి. తీసుకోవలసిన జాగ్రత్తలు... ► హెపటైటీస్ నిర్ధారణ రక్త పరీక్ష చేసుకోవాలి. ► ముందస్తు టీకా వేయించుకోవాలి. ► ఈ వ్యాధి సోకిన వారు క్రమం తప్పకుండా చికిత్స చేసుకోవడం వలన హెపటైటీస్‌ను నివారించవచ్చు. క్రమం తప్పకుండా టీకా వేయాలి హెపటైటీస్ నివారణకు అన్ని చర్యలు చేపడుతున్నాం. ఈ వైరస్‌కు అడ్డుకట్ట వేయడానికి బిడ్డ జన్మించిన 24 గంటల్లోపు టీకాను వేస్తున్నాం. తరువాత ఐదు టీకాల మిశ్రమం కలిగిన ‘పెంటావాలెంట్’ టీకాను ఆరు వారాలకు, 10 వారాలకు, 14 వారాలకు ఒక సారి ఒక డోసు చొప్పున వ్యాక్సిన్ వేస్తున్నాం. ఈ పెంటావాలంట్ టీకా హెపటైటీస్–బితో అంటే కామెర్లతో పాటు కోరింత దగ్గు, ధనుర్వాతం, న్యుమోనియా నివారణకు పనిచేస్తుంది. ఈ టీకా 10 సంవత్సరాల వరకు పని చేస్తుంది. తరువాత ఒక బూస్టర్ డోస్‌ను వేయాలి. ప్రతి బూస్టర్ డోసు ఐదేళ్ల పాటు పనిచేస్తుంది. ఈ వైరస్ నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది. వైద్యుల సూచనల ప్రకారం టీకా వేయాలి. – డాక్టర్ అనిల్‌కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి -
కాలేయం ఖల్లాస్
జూలై 28 వరల్డ్ హెపటైటిస్ డే హెపటైటిస్... ప్రపంచాన్ని వణికిస్తున్న వ్యాధుల్లో ఇదొకటి. హెపటైటిస్‌లో ఎ, బి, సి, డి, ఇ, జి అనే రకాలు ఉన్నాయి. హెపటైటిస్-బి, హెపటైటిస్-సితో బాధపడుతున్న వారి సంఖ్య అత్యధికంగా ఉంటోంది. ప్రపంచవ్యాప్తంగా దీర్ఘకాలిక హెపటైటిస్-బి, హెపటైటిస్-సితో దాదాపు 50 కోట్ల మంది బాధపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా మరణాలకు దారితీస్తున్న వ్యాధుల్లో హెపటైటిస్ ఎనిమిదో స్థానంలో ఉంది. హెపటైటిస్-బి, హెపటైటిస్-సి ముదిరిపోతే లివర్ సిర్రోసిస్, లివర్ కేన్సర్ వంటి ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తాయి. సకాలంలో నియంత్రించకుంటే హెపటైటిస్ మొత్తం కాలేయాన్నే ఖల్లాస్ చేసేస్తుంది. హెపటైటిస్ ఏ రకానికి చెందినదైనా, ఇది కాలేయానికి సోకే ఇన్ఫెక్షన్ వల్ల తలెత్తే వ్యాధి. సకాలంలో గుర్తించి, తగిన చికిత్స తీసుకోకపోతే కాలేయం పూర్తిగా దెబ్బతింటుంది. హెపటైటిస్‌తో దీర్ఘకాలంగా బాధపడుతున్న వారిలో చాలావరకు ఎలాంటి లక్షణాలు కనిపించవు. ఇది ముదిరితే పచ్చకామెర్లు, ఆకలి తగ్గుదల, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. చాలా సందర్భాల్లో వైరస్ వల్ల హెపటైటిస్ తలెత్తుతుంది. అరుదుగా కొన్ని సందర్భాల్లో పారాసెటిమాల్ వంటి నొప్పి నివారణ మందులు, పారిశ్రామిక వ్యర్థాలు, మొక్కలకు చెందిన విష పదార్థాలు, కొన్ని ఆటో ఇమ్యూన్ వ్యాధులు కూడా హెపటైటిస్‌కు దారితీసే అవకాశాలు ఉన్నాయి. దీర్ఘకాలికంగా హెపటైటిస్ కొనసాగితే, కాలేయం మొద్దుబారడం, బిరుసెక్కడం వంటి దుష్పరిణామాలు తలెత్తుతాయి. చివరకు లివర్ సిర్రోసిస్, లివర్ ఫెయిల్యూర్ వంటి ప్రాణాంతక పరిస్థితులూ వాటిల్లుతాయి. సాధారణంగా వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల హెపటైటిస్ సోకుతుంది. అయితే, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల వల్ల, పరాన్న జీవుల వల్ల, మితిమీరిన మద్యం అలవాటు వల్ల కూడా హెపటైటిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మద్యం అలవాటు లేకపోయినా, కొందరిలో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ (ఎన్ఏఎఫ్ఎల్) వల్ల కూడా హెపటైటిస్ వచ్చే అవకాశాలు లేకపోలేదు. అరుదుగా కొన్నిసార్లు జన్యుపరమైన కారణాల వల్ల, కాలేయానికి గాయం కావడం వల్ల కూడా హెపటైటిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇలా గుర్తించాలి చాలా సందర్భాల్లో హెపటైటిస్ సోకినా ఎలాంటి లక్షణాలూ కనిపించవు. అందువల్ల ఎప్పటికప్పుడు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం ద్వారా మాత్రమే ఈ వ్యాధిని గుర్తించడం సాధ్యమవుతుంది. రక్త పరీక్ష, అల్ట్రాసౌండ్, సీటీ స్కానింగ్, ఎంఆర్ఐ పరీక్షల ద్వారా, లివర్ బయాప్సీ ద్వారా హెపటైటిస్‌ను గుర్తిస్తారు. పరిశుభ్రత పాటించడం, కలుషితమైన నీటికి, ఆహారానికి దూరంగా ఉండటం ద్వారా చాలా వరకు హెపటైటిస్ బారిన పడకుండా ఉండవచ్చు. హెపటైటిస్-సి, హెపటైటిస్-ఇ మినహా మిగిలిన రకాల హెపటైటిస్‌కు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నందున ముందుగానే వ్యాక్సిన్లు తీసుకోవడం ద్వారా చాలా వరకు రక్షణ పొందవచ్చు. వ్యాధి ఉన్నట్లు పరీక్షల్లో తేలితే వెంటనే తగిన చికిత్స తీసుకోవడం ద్వారా వ్యాధిని నయం చేసుకోవచ్చు. ఆర్థికభారం అభివృద్ధి చెందిన అగ్రరాజ్యాల్లోను, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోను హెపటైటిస్ వ్యాధి ఆర్థిక వ్యవస్థపై పెను భారం మోపుతోంది. పనిచేసే వయసులో ఉన్న వ్యక్తికి హెపటైటిస్ సోకితే కనీసం 27 పనిదినాలు నష్టపోవాల్సి వస్తుంది. చాలా దేశాల్లో హెపటైటిస్ చికిత్స కారణంగా ఎదురవుతున్న ఆర్థికభారంపై కచ్చితమైన అంచనాలేవీ లేవు. అయితే, అమెరికా ఆర్థికరంగంపై హెపటైటిస్ కారణంగా ఏటా 650 కోట్ల డాలర్ల (రూ.43,595 కోట్లు) భారం పడుతున్నట్లు అంచనా. అమెరికా వంటి అగ్రరాజ్యాలతో పోల్చుకుంటే, భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే హెపటైటిస్ బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ప్రపంచానికి పెనుసవాళ్లలో ఒకటిగా నిలుస్తున్న హెపటైటిస్పై అవగాహన కల్పించేందుకు 2010లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) జూలై 28వ తేదీని వరల్డ్ హెపటైటిస్ డేగా ప్రకటించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది ‘హెపటైటిస్‌ను నివారించండి: అది మీ చేతుల్లోనే ఉంది’ నినాదంతో ప్రచారం చేపడుతోంది. నివారణ జాగ్రత్తలు * వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. మరుగుదొడ్లను క్రిములకు దూరంగా ఉంచుకోవాలి. * ఒకరి టూత్‌బ్రష్‌లు, రేజర్లు మరొకరు వాడకుండా ఉండాలి. ఆస్పత్రులలో డిస్సోజబుల్ సిరంజీలు, సూదులు వాడాలి. * రక్తమార్పిడి చేసే ముందు రక్తాన్ని క్షుణ్ణంగా పరీక్షించి, వ్యాధులేవీ లేవని నిర్ధారించుకోవాలి. * వ్యాధి సోకిన వారితో లైంగిక సంబంధాలకు దూరంగా ఉండాలి. * కలుషితమైన ఆహారానికి, నీటికి దూరంగా ఉండాలి. హెపటైటిస్ వాస్తవాలు * హెపటైటిస్-బి, హెపటైటిస్-సి మాత్రమే లివర్ కేన్సర్‌కు దారితీస్తాయి. హెపటైటిస్-ఎ వల్ల లివర్ కేన్సర్ సోకే అవకాశం లేదు. * రోగనిరోధక శక్తి బలంగా ఉన్నవారికి హెపటైటిస్-ఎ ఒకవేళ సోకినా, ఎలాంటి చికిత్స తీసుకోకపోయినా దానంతట అదే నయమైపోతుంది. * కలుషితమైన నీరు, ఆహారం వల్ల హెపటైటిస్-ఎ సోకుతుంది. * రక్తం, ఇతర శరీర స్రావాలు, మ్యూకస్ ద్వారా, లైంగిక సంబంధాల ద్వారా హెపటైటిస్-బి సోకుతుంది. * హెపటైటిస్-బి సోకినవారిలో 90 శాతానికి పైగా చిన్నారులే. ఈ వైరస్ సోకిన తల్లుల నుంచి వారికి ఈ వ్యాధి సంక్రమిస్తోంది. లైంగిక సంబంధాల ద్వారా హెపటైటిస్-బి సోకే అవకాశాలు ఉన్నా, అవి చాలా అరుదు. * గర్భిణిగా ఉన్నప్పుడు హెపటైటిస్ సోకితే, గుర్తించిన తర్వాత వీలైనంత త్వరగా వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే, పుట్టే పిల్లలకు వ్యాధి సోకకుండా కాపాడుకోవచ్చు. * హెపటైటిస్-బి సోకిన వారిలో 25 శాతం మందికి మాత్రమే సిర్రోసిస్ లేదా కేన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మిగిలిన వారు చికిత్స తర్వాత సాధారణ జీవితం గడిపే అవకాశాలు ఉంటాయి. * హెపా-బి వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే లివర్ కేన్సర్ సోకకుండా బయటపడవచ్చు. * హెచ్ఐవీ సోకిన వారికి హెపటైటిస్-సి సోకే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. * ఒకరికి వాడిన సూదులు, రేజర్లు మరొకరికి వాడటం, రక్తమార్పిడి వంటి కారణాల ద్వారా కూడా హెపటైటిస్-సి సోకుతుంది.