కాలేయం.. కాపాడుకుందాం | World Hepatitis Day 2022: Theme History Significance Symptoms Treatment | Sakshi
Sakshi News home page

కాలేయం.. కాపాడుకుందాం

Published Thu, Jul 28 2022 10:47 PM | Last Updated on Thu, Jul 28 2022 10:47 PM

World Hepatitis Day 2022: Theme History Significance Symptoms Treatment - Sakshi

మానవ శరీరంలో కీలకమైన భాగం కాలేయం (లివర్‌). ఇది మనకు తెలియకుండానే ‘హెపటైటీస్‌’(లివర్‌ వాపు)కు గురవుతుంది. దీంతో చాలా మంది అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ వ్యాధిపై అవగాహన పెంచుకోవాలి. కాలేయాన్ని కాపాడుకుంటే పది కాలాల పాటు ఆరోగ్యవంతులుగా జీవించవచ్చు.

కడప రూరల్‌: ‘హెపటైటీస్‌’వ్యాధి సోకిందని తెలియక చాలా మంది అనారోగ్యానికి గురవుతున్నారు. కొంతమందిలో వ్యాధి తీవ్రత పెరగడంతో మృత్యువాత పడుతున్నారు. ఈ వ్యాధి నివారణకు..ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. ప్రతి ఏటా జూలై 28వ తేదీన ప్రపంచ హెపటైటీస్‌–బి నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం... 

కాలేయం విధులు కీలకం..
శరీరంలోని ఇతర అవయవాలతో పాటు కాలేయం కీలకమైన పనులను నిర్వర్తిస్తోంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ప్రొటీన్లను, రక్తం గడ్డ కట్టే ఫ్రాక్షర్స్‌ను తయారు చేస్తుంది. ఇలా మన శరీరంలో ఉండే లివర్‌ మనిషి సంపూర్ణవంతమైన ఆరోగ్యానికి దోహదపడుతోంది.

‘హెపటైటిస్‌’అంటే..
‘హెపటైటిస్‌’ఇది కాలేయానికి సంబంధించిన వ్యాధి. వైద్య భాషలో ‘హెప’అంటే లివర్, టైటీస్‌ లేదా ఐటస్‌ అంటే వాపు అని అర్ధం. ఎ, బి, సి, డి, ఇ అనే ఐదు రకాల వైరస్‌ల సమూహమే ‘హెపటైటిస్‌’. అందులో ఎ, ఈ వైరస్‌ కలుషిత నీరును తాగడం, కలుషిత ఆహరం తీసుకోవడం వల్ల వస్తుంది. ‘డి’అంటే డెల్టా వైరస్‌. ఇది హైపటైటిస్‌కు చెందిన ఒక వైరస్‌. ఈ వైరస్‌లు ప్రమాదకరమైనవి కావు. బి, సి వైరస్‌లే అనారోగ్యానికి దారి తీస్తాయి.

ఎందుకు వస్తుందంటే..
సురక్షితం కాని ఇంజక్షన్లు వాడటం.. 
శుధ్ధి లేని రక్త మార్పిడి.. 
హెపటైటీస్‌ వ్యాధి సోకిన తల్లి నుంచి బిడ్డకు 
అవాంచిత సెక్స్‌ వల్ల.. 
ఒకరు ఉపయోగించిన బ్లేడ్లు, రేజర్లు, టూత్‌ బ్రెష్‌లు వాడటం.. 
కలుషితమైన నీరు, ఆహరం తీసుకోవడం వల్ల హెపటైటీస్‌ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుంది.

లక్షణాలు ఇవీ...
కామెర్లు, జ్వరం తదితర అనారోగ్య సమస్యలు ఉంటాయి.
చాలా మందిలో వ్యాధి లక్షణాలు కనిపించవు.
వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే కడపు నొప్పితో పాటు కడుపు ఉబ్బరం ఉంటుంది. రక్తపు వాంతులు అవుతాయి.

తీసువాల్సిన జాగ్రత్తలు..
హెపటైటీస్‌ నిర్ధారణ రక్త పరీక్ష చేసుకోవాలి
ముందస్తు టీకా వేయించుకోవాలి 
క్రమం తప్పకుండా చికిత్స పొందడం వల్ల హెపటైటీస్‌ను నివారించవచ్చు.

ప్రభుత్వం చేపడుతున్న చర్యలు..
హెపటైటీస్‌ నివారణకు ప్రభుత్వం గట్టి చర్యలు చేపడుతోంది. బిడ్డ జన్మించిన 24 గంటల్లోనే ఈ వైరస్‌ నివారణకు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఉచితంగా హెపటైటీస్‌–బి జీరో డోస్‌ టీకా వేస్తున్నారు. అలాగే ఈ టీకాను విడతల వారీగా ఎప్పుడెప్పుడు వేసుకోవాలో సూచిస్తున్నారు.

ప్రతి 12 మందిలో ఒకరికి..
ఈ వ్యాధి చాప కింద నీరులా ప్రవేశిస్తుంది. వైద్యుల అభిప్రాయం ప్రకారం ప్రతి 12 మందిలో ఒకరు ఈ వైరస్‌తో ఎంతో కొంత బాధపడుతున్నారు. మరి కొందరు ఎక్కువ సమస్యతో అవస్థలు పడుతుంటారు. వ్యాధి ఉందని తెలిసేలోపు ‘లివర్‌’తీవ్ర ఇన్‌ఫెక్షన్‌కు గురవుతుంది. బాధితుల్లో దాదాపు 70 శాతం మందికి ఇన్‌ఫెక్షన్‌ బాగా ముదిరిన తరువాతనే అసలు విషయాన్ని తెలుసుకుంటున్నారు. కాగా హెచ్‌ఐవీతో పోలిస్తే హెపటైటీస్‌ వైరస్సే ఇతరులకు అధికంగా సోకుతుందని వైద్యులు అంటున్నారు.

క్రమం తప్పకుండా టీకా వేయాలి..
హెపటైటీస్‌ నివారణకు అన్ని చర్యలు చేపడుతున్నాం. ఈ వైరస్‌కు అడ్డుకట్ట వేయడానికి బిడ్డ జన్మించిన 24 గంటల్లోపు టీకాను వేస్తున్నాం. తరువాత ఐదు టీకాల మిశ్రమం కలిగిన ‘పెంటావాలెంట్‌’టీకాను ఆరు వారాలకు, 10 వారాలకు, 14 వారాలకు ఒక సారి ఒక డోసు చొప్పున వేస్తున్నాం. ఈ పెంటావాలంట్‌ టీకా హెపటైటీస్‌–బితో అంటే కామెర్లతో పాటు గోరింత దగ్గు, ధనుర్వాతం, న్యుమోనియా నివారణకు పనిచేస్తుంది. ఈ టీకా 10 సంవత్సరాల వరకు పని చేస్తుంది. తర్వాత ఒక బూస్టర్‌ డోస్‌ను వేయాలి. ప్రతి బూస్టర్‌ డోసు ఐదేళ్ల పాటు పనిచేస్తుంది. ఈ వైరస్‌ నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది. వైద్యుల సూచనల ప్రకారం టీకా వేయాలి.
– డాక్టర్‌ నాగరాజు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి

అవగాహన కలిగి ఉండాలి..
ఈ వ్యాధిపై ప్రజలు అవగాహన పెంచుకోవాలి. ఇన్‌ఫెక్షన్‌ ఎక్కువైతే తీవ్ర అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. చాలా మంది వ్యా«ధి ముదిరిన తరువాత వైద్యం కోసం వస్తున్నారు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ వైరస్‌కు వ్యాక్సిన్‌తో అడ్డుకట్ట వేయవచ్చు. అనారోగ్య సమస్యలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. సూచనలు సలహలు పాటించాలి.
– డాక్టర్‌ దేవిరెడ్డి చైతన్యరెడ్డి, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, హెపటాలజిస్ట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement