Liver diseases
-
మద్యం అలవాటు లేకపోయినా ఫ్యాటీ లివర్ వస్తుందా?
మనలో కొంతమందికి ఫ్యాటీలివర్పై ఎంతో కొంత అవగాహన ఉండే ఉంటుంది. మద్యం తాగే అలవాటు ఉన్నవారు కాలేయంలో క్రమక్రమంగా కొవ్వు పెరుగుతూ ఒక దశ తర్వాత కణాలన్నీ పూర్తిగా నశించి, కొవ్వు మయం అయిపోతే..అది సిర్రోసిస్ అనే కండిషన్‌కు దారితీస్తుందనీ, అప్పుడు కాలేయ మార్పిడి తప్పదనే అవగాహన కొంతమందిలో ఉంటుంది. అయితే మద్యం తాగేవారికే ఫ్యాటీ లివర్ వస్తుందన్నది పాక్షిక సత్యమే..ఆ అలవాటు లేనివారిలోనూ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ కండిషన్‌నే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్(ఎన్ఏఎఫ్ఎల్డీ) అంటారు. శరీరతత్త్వాన్ని బట్టి మద్యం, మాంసాహార అలవాట్లు లేకపోయినా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ రావచ్చేనే అవగాహన కల్పించేదే ఈ కథనం. మద్యం అలవాటు లేనివారిలోనూ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్! మానవుల పొట్టలో కుడివైపున కాలేయం ఉంటుంది. తీసుకున్న ఆహారంలోని చక్కెరలు శక్తిగా మారాక... మిగతావి కొవ్వు రపంలోకి వరి కాలేయంలో నిల్వ ఉంటాయి. మళ్లీ అవసరమైనప్పుడు ఉపయోగపడతాయి. ఈ నిరంతర పక్రియలో కొవ్వు వెతాదులు పెరుగుతున్న కొద్దీ కాలేయ కణాలు తమ స్వగుణాన్ని కోల్పోయి కొవ్వు పేరుకున్నట్లుగా అయిపోతాయి. ఈ కండిషన్‌ను ఫ్యాటీలివర్ అంటారు. మద్యం అలవాటు ఉన్నా, పొట్ట ఎక్కువగా ముందుకొచ్చి ఉన్నా... వారిలో కాలేయం దశలవారీగా, ఎంతో కొంత ఫ్యాటీలివర్‌గా మారిపోయి ఉంటుంది. కారణాలు: జీవనశైలి / మెటబాలిక్ డిసీజెస్‌గా పేర్కొనే డయాబెటిస్ ఉన్నవారిలోన, అలాగే పొట్ట చుట్టూ కొవ్వు పేరుకోవడం (సెంట్రల్ ఒబేసిటీ), స్థూలకాయం (ఒబేసిటీ) వంటి అంశాలు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీలివర్‌కు కారణం కావచ్చు. ఆహారంలో పిండిపదార్థాలు ఎక్కువగా తీసుకోవడం. లక్షణాలు: ఆల్కహాలిక్ లివర్ డిసీజ్లోనైనా కొద్దిమేరకు లక్షణాలు కనిపింవచ్చేమోగానీ... నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్‌లో చాలావరకు లక్షణాలు కనిపించవు. అయితే మనకు చాలా సాధారణం అనిపించే కొన్ని లక్షణాలు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీలివర్‌ను పట్టిస్తుంటాయి. ఉదా: పొట్ట పెరిగి, బానపొట్టలా ముందుకు రావడం. కొందరిలో కుడివైపు పొట్ట పైభాగంలో పొడుస్తున్నట్లుగా నొప్పి రావడం. లివర్ క్రమంగా పెరుగుతుండటంతో ఈ లక్షణం బయటపడుతుంది. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీలివర్... దశలు... నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీలివర్‌లో నాలుగు దశలు ఉంటాయి. అవి మొదటి సింపుల్ స్టియటోసిస్ దశ, రెండోది స్టియటో–హెపటైటిస్ దశ. మూడోది ఫైబ్రోసిస్ దశ, నాలుగోదీ, వరదీ... ఇక వెనక్కు తిప్పడానికి వీలుకాని సిర్రోసిస్ దశ. మొదటి దశ: ఇది సాధారణమైన ఫ్యాటీ లివర్ వ్యాధి దశ. ఇందులో కాలేయ కణాల మధ్య కొద్దిగా అంటే 5 శాతం నుంచి 10 శాతం మేరకు కొవ్వు శాతం పేరుకుంటుంది. రెండో దశ (నాశ్): ఈ దశను నాన్ ఆల్కహాలిక్ స్టియటో–హెపటైటిస్ (ఎన్‌ఏఎస్‌హెచ్–నాశ్) అంటారు. ఇందులో కాలేయం కొద్దిగా గాయపడటంతో పాటు కాలేయ కణాలు కొన్ని నశిస్తాయి. మూడో దశ (ఫైబ్రోసిస్): ఈ దశలో కాలేయం పీచుగా మారినట్లుగా కనిపిస్తుంది. దీన్నే ‘ఫైబ్రోసిస్’గా పేర్కొంటారు. నాలుగో దశ (సిర్రోసిస్): ఫైబ్రోసిస్ నుం కాలేయం కొవ్వుకణాలతో నిండిపోయి, పూర్తిగా తన స్వరపాన్ని కోల్పోయి, కాలేయ వర్పిడి తప్ప ప్రత్యామ్నాయం లేని దశ వస్తుంది. ఇది వెనక్కుమరల్చలేని (ఇర్రివర్సిబుల్) దశ. నిర్ధారణ: బాధితుని స్థలకాయం, పొట్ట (సెంట్రల్ ఒబేసిటీ) చసి డాక్టర్లు పరిస్థితిని కొంతమేర అంచనా వేయగలరు. కొన్ని రక్తపరీక్షలు, అలాగే డయాబెటిస్, కొలెస్ట్రాల్ వెతాదులు, ట్రైగ్లిజరైడ్ స్థాయులు పెరిగాయా అన్నదీ చూడాలి. అల్ట్రా సౌండ్ స్కానింగ్‌తో ఫ్యాటీలివర్ తప్పక బయటపడుతుంది. కొందరిలో లివర్ బయాప్సీ అవసరం. లివర్ బయాప్సీతో ఎన్‌ఏఎఫ్‌ఎల్‌డీలో అది నాన్ఆల్కహాలిక్ ఫ్యాటీలివరా (ఎన్‌ఏఎఎఫ్‌ఎల్), లేక నాన్ ఆల్కహాలిక్ స్టియటో–హెపాటిక్ (నాశ్) కండిషనా అని నిర్ధారణ చేయవచ్చు. ఇప్పుడు ‘ఫైబ్రోస్కాన్’ అనే వైద్యపరీక్షతో లివర్‌లో ఏ మేరకు కొవ్వు పేరుకుంది, ఫైబ్రోసిస్ ఎంత ఉందన్న విషయంతో పాటు, మూడు నెలల తర్వాత మళ్లీ సమీక్షించి, కొవ్వు మోతాదులు పెరిగాయి, తగ్గాయో కూడా తెలుసుకోవచ్చు. చికిత్స : ఆల్కహాల్ అలవాటు లేనివారిలో దీని చికిత్సకు నిర్ణీతంగా ఒక ప్రొటోకాల్ లేదుగానీ... దీని చికిత్స సమయంలో ఫ్యాటీలివర్ డిసీజ్‌కు దోహదపడిన అంశాలను బట్టి డాక్టర్లు చికిత్స చేస్తారు. ముఖ్యంగా బాధితుల జీవనశైలిలోనూ, ఆహారంలో మార్పులతో పాటు వ్యాయామం వంటివి సస్తారు. బాధితులు ఏవైనా మందులు వాడుతుంటే, వాటి కారణంగా ఫ్యాటీలివర్ వచ్చిందని భావిస్తే, వాటిని మారుస్తారు. చాలా కొద్దిమందిలో మందులూ, శస్త్రచికిత్సా అవసరం కావచ్చు. ముందస్తు నివారణకు ఈ జాగ్రత్తలు... బరువు తగ్గడం : ఉండాల్సిన దాని కంటే ఎక్కువగా బరువు ఉన్నవారు ఆహారంలో పిండి పదార్థాలను తగ్గించాలి. ప్రతి వారం అర కిలో నుంచి కిలో బరువు తగ్గించుకునేలా శ్రమించాలి. ఆరోగ్యకరమైన ఆహారం: ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తప్పనిసరి. పొట్టుతో ఉండే తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. పాలిష్ చేసిన వాటికి బదులుగా పొట్టు తీయని బియ్యం, గోధుమలు వాడాలి. రిఫైన్డ్ షుగర్స్, మైదా, స్వీట్లు తగ్గించాలి. మాంసాహారం తీసుకునేవారు చేపలు తినడం మంచిది. వ్యాయామం: చురుగ్గా ఉంటూ రోజూ ఒంటికి పనిచెప్పేలా శ్రమించాలి. రోజూ కనీసం 30 నిమిషాలకు తక్కువ కాకుండా వ్యాయామం చేయాలి. డయాబెటిస్‌ను తప్పకుండా అదుపులో ఉంచుకోవాలి. కొలెస్ట్రాల్ వెతాదులను తగ్గించుకోండి. ఇందుకు వ్యాయామంతో పాటు ఒకవేళ అవసరమైతే మందులు కూడా వాడాలి. (చదవండి: ఆ చెట్టు ఆకులు తెల్ల జుట్టుకి చెక్ పెడితే..వాటి పువ్వులు ఏమో.) -
విజృంభిస్తున్న వ్యాధులు.. బాధితుల్లో చిన్నారులు సైతం
సాక్షి,హైదరాబాద్: దేశంలో, కాలేయ వ్యాధుల విస్తృతి వేగవంతమవుతోందని పలువురు వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. కాలేయ వ్యాధి చికిత్సకు పేరొందిన గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్స్‌లో ఏర్పాటైన ప్రప్రథమ లివర్ కాన్క్లేవ్ శనివారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఏఐజీ ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ నాన్–ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (ఎన్ఎఎఫ్ఎల్డి), హెపటైటిస్ బి–సి, హెపాటోసెల్లర్ కార్సినోమా (లివర్ క్యాన్సర్) చిన్నారులను ఎక్కువగా ప్రభావితం చేస్తోందని, ఊబకాయం ఉన్న పిల్లలలో సుమారు 60 శాతం మంది ఫ్యాటీ లివర్ వ్యాధికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పేలవమైన ఆహారపు అలవాట్లు, నిశ్చల జీవనశైలి ద్వారా సంభవించే మధుమేహం, ఫ్యాటీలివర్ వ్యాధుల కలయిక తీవ్రమైన సిర్రోసిస్ (కాలేయం గట్టిపడటం)కు దారి తీస్తోందన్నారు. కాలేయ వైఫల్యానికి దారితీసే అతిపెద్ద కారణాలలో ఒకటి మద్యపానం కాగా ఇటీవలి కాలంలో అది మరింత పెరిగిందన్నారు. అదే విధంగా ఆల్కహాల్ వినియోగంతో సంబంధం లేకుండా కూడా కాలేయ వైఫల్యంతో అనేకమంది బాధపడుతున్నారని, తమ హెపటాలజీ విభాగంలో ఇంతకు ముందెన్నడూ లేని స్థాయిలో రోగుల్ని తాము చూస్తున్నామని ఆసుపత్రికి చెందిన హెపటాలజీ విభాగం డైరెక్టర్ డాక్టర్ మిథున్ శర్మ చెప్పారు. నగరాలు, పట్టణాలు మాత్రమే కాకుండా ఇది గ్రామీణ జనాభాపై కూడా ప్రభావం చూపుతోందన్నారు. ఇంత పెద్ద ఎత్తున సదస్సు నిర్వహించడం వల్ల వైద్య నిపుణుల మేధో మధనాలు, విశ్లేషణల వల అంతిమంగా రోగులకి ప్రయోజనం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సదస్సులో తాను కనుగొన్న హెపటైటిస్ సి వైరస్ గురించి నోబెల్ గ్రహీత ప్రొఫెసర్ హార్వే జె ఆల్టర్ కీలకోపన్యాసం చేశారు. దాదాపు 1300 మందికి పైగా అగ్రశ్రేణి అంతర్జాతీయ కాలేయ వైద్య నిపుణులు పాల్గొన్నారు. చదవండి: వాతావరణ శాఖ గుడ్‌న్యూస్.. ఈ నెలంతా వానలే! -
కాలేయం.. కాపాడుకుందాం
మానవ శరీరంలో కీలకమైన భాగం కాలేయం (లివర్). ఇది మనకు తెలియకుండానే ‘హెపటైటీస్’(లివర్ వాపు)కు గురవుతుంది. దీంతో చాలా మంది అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ వ్యాధిపై అవగాహన పెంచుకోవాలి. కాలేయాన్ని కాపాడుకుంటే పది కాలాల పాటు ఆరోగ్యవంతులుగా జీవించవచ్చు. కడప రూరల్: ‘హెపటైటీస్’వ్యాధి సోకిందని తెలియక చాలా మంది అనారోగ్యానికి గురవుతున్నారు. కొంతమందిలో వ్యాధి తీవ్రత పెరగడంతో మృత్యువాత పడుతున్నారు. ఈ వ్యాధి నివారణకు..ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. ప్రతి ఏటా జూలై 28వ తేదీన ప్రపంచ హెపటైటీస్–బి నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం... కాలేయం విధులు కీలకం.. శరీరంలోని ఇతర అవయవాలతో పాటు కాలేయం కీలకమైన పనులను నిర్వర్తిస్తోంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ప్రొటీన్లను, రక్తం గడ్డ కట్టే ఫ్రాక్షర్స్ను తయారు చేస్తుంది. ఇలా మన శరీరంలో ఉండే లివర్ మనిషి సంపూర్ణవంతమైన ఆరోగ్యానికి దోహదపడుతోంది. ‘హెపటైటిస్’అంటే.. ‘హెపటైటిస్’ఇది కాలేయానికి సంబంధించిన వ్యాధి. వైద్య భాషలో ‘హెప’అంటే లివర్, టైటీస్ లేదా ఐటస్ అంటే వాపు అని అర్ధం. ఎ, బి, సి, డి, ఇ అనే ఐదు రకాల వైరస్ల సమూహమే ‘హెపటైటిస్’. అందులో ఎ, ఈ వైరస్ కలుషిత నీరును తాగడం, కలుషిత ఆహరం తీసుకోవడం వల్ల వస్తుంది. ‘డి’అంటే డెల్టా వైరస్. ఇది హైపటైటిస్‌కు చెందిన ఒక వైరస్. ఈ వైరస్లు ప్రమాదకరమైనవి కావు. బి, సి వైరస్‌లే అనారోగ్యానికి దారి తీస్తాయి. ఎందుకు వస్తుందంటే.. ►సురక్షితం కాని ఇంజక్షన్లు వాడటం.. ►శుధ్ధి లేని రక్త మార్పిడి.. ►హెపటైటీస్ వ్యాధి సోకిన తల్లి నుంచి బిడ్డకు ►అవాంచిత సెక్స్ వల్ల.. ►ఒకరు ఉపయోగించిన బ్లేడ్లు, రేజర్లు, టూత్ బ్రెష్‌లు వాడటం.. ►కలుషితమైన నీరు, ఆహరం తీసుకోవడం వల్ల హెపటైటీస్ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుంది. లక్షణాలు ఇవీ... ►కామెర్లు, జ్వరం తదితర అనారోగ్య సమస్యలు ఉంటాయి. ►చాలా మందిలో వ్యాధి లక్షణాలు కనిపించవు. ►వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే కడపు నొప్పితో పాటు కడుపు ఉబ్బరం ఉంటుంది. రక్తపు వాంతులు అవుతాయి. తీసువాల్సిన జాగ్రత్తలు.. ►హెపటైటీస్ నిర్ధారణ రక్త పరీక్ష చేసుకోవాలి ►ముందస్తు టీకా వేయించుకోవాలి ►క్రమం తప్పకుండా చికిత్స పొందడం వల్ల హెపటైటీస్‌ను నివారించవచ్చు. ప్రభుత్వం చేపడుతున్న చర్యలు.. హెపటైటీస్ నివారణకు ప్రభుత్వం గట్టి చర్యలు చేపడుతోంది. బిడ్డ జన్మించిన 24 గంటల్లోనే ఈ వైరస్ నివారణకు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఉచితంగా హెపటైటీస్–బి జీరో డోస్ టీకా వేస్తున్నారు. అలాగే ఈ టీకాను విడతల వారీగా ఎప్పుడెప్పుడు వేసుకోవాలో సూచిస్తున్నారు. ప్రతి 12 మందిలో ఒకరికి.. ఈ వ్యాధి చాప కింద నీరులా ప్రవేశిస్తుంది. వైద్యుల అభిప్రాయం ప్రకారం ప్రతి 12 మందిలో ఒకరు ఈ వైరస్‌తో ఎంతో కొంత బాధపడుతున్నారు. మరి కొందరు ఎక్కువ సమస్యతో అవస్థలు పడుతుంటారు. వ్యాధి ఉందని తెలిసేలోపు ‘లివర్’తీవ్ర ఇన్ఫెక్షన్కు గురవుతుంది. బాధితుల్లో దాదాపు 70 శాతం మందికి ఇన్ఫెక్షన్ బాగా ముదిరిన తరువాతనే అసలు విషయాన్ని తెలుసుకుంటున్నారు. కాగా హెచ్ఐవీతో పోలిస్తే హెపటైటీస్ వైరస్సే ఇతరులకు అధికంగా సోకుతుందని వైద్యులు అంటున్నారు. క్రమం తప్పకుండా టీకా వేయాలి.. హెపటైటీస్ నివారణకు అన్ని చర్యలు చేపడుతున్నాం. ఈ వైరస్‌కు అడ్డుకట్ట వేయడానికి బిడ్డ జన్మించిన 24 గంటల్లోపు టీకాను వేస్తున్నాం. తరువాత ఐదు టీకాల మిశ్రమం కలిగిన ‘పెంటావాలెంట్’టీకాను ఆరు వారాలకు, 10 వారాలకు, 14 వారాలకు ఒక సారి ఒక డోసు చొప్పున వేస్తున్నాం. ఈ పెంటావాలంట్ టీకా హెపటైటీస్–బితో అంటే కామెర్లతో పాటు గోరింత దగ్గు, ధనుర్వాతం, న్యుమోనియా నివారణకు పనిచేస్తుంది. ఈ టీకా 10 సంవత్సరాల వరకు పని చేస్తుంది. తర్వాత ఒక బూస్టర్ డోస్‌ను వేయాలి. ప్రతి బూస్టర్ డోసు ఐదేళ్ల పాటు పనిచేస్తుంది. ఈ వైరస్ నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది. వైద్యుల సూచనల ప్రకారం టీకా వేయాలి. – డాక్టర్ నాగరాజు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అవగాహన కలిగి ఉండాలి.. ఈ వ్యాధిపై ప్రజలు అవగాహన పెంచుకోవాలి. ఇన్ఫెక్షన్ ఎక్కువైతే తీవ్ర అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. చాలా మంది వ్యా«ధి ముదిరిన తరువాత వైద్యం కోసం వస్తున్నారు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ వైరస్‌కు వ్యాక్సిన్‌తో అడ్డుకట్ట వేయవచ్చు. అనారోగ్య సమస్యలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. సూచనలు సలహలు పాటించాలి. – డాక్టర్ దేవిరెడ్డి చైతన్యరెడ్డి, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, హెపటాలజిస్ట్ -
కాలేయం కోసం కాస్త శ్రద్ధ ఇలా...
మధ్యవయసు దాటాక వయసుతో పాటు దేహంలో కొవ్వు కూడా పెరుగుతుంది. ఇదే కొవ్వు కాలేయంలోని నార్మల్ కణాల్లో కూడా పెరుగుతూ, పేరుకుపోతూ ఉండవచ్చు. అదే ఫ్యాటీలివర్. కొన్నిసార్లు అది రక్తప్రవాహానికీ అడ్డురావచ్చు. అప్పుడు కాలేయం ఆకృతి, దాని స్వాభావికమైన రంగు దెబ్బతినవచ్చు. కాస్త గట్టిగా లేదా జిగురు జిగురుగా, పచ్చరంగుకు మారవచ్చు. ఆ కండిషన్‌నే సిర్రోసిస్ అంటారు. కొన్నిసార్లు దేహంలోకి చాలా ప్రమాదకరమైన విషాలు ప్రవేశించడం వల్ల గానీ, కొన్ని వ్యాధులు లేదా ఇన్ఫెక్షన్స్ వల్ల, తగినంత ఆహారం తీసుకోకుండా, మితిమీరిన ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా సిర్రోసిస్ రావచ్చు. అలాంటి సమయంల్లో దేహంపైన సాలీడు ఆకృతిలో రక్తనాళాలు బయటకు కనిపించవచ్చు. ఆకలి లేకపోవడం, నీరసం, నిస్సత్తువ, పొట్టలో విపరీతంగా గ్యాస్ పేరుకుపోవడం, కళ్లు పసుపు రంగులో ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తుంటే డాక్టర్‌ను సంప్రదించాలి. అప్పుడు డాక్టర్లు లివర్ ఫంక్షన్ టెస్ట్ వంటి కొన్ని పరీక్షలు చేసి కాలేయం పనితీరు తెలుసుకుంటారు. కాలేయం పనితీరు బాగుంటే ఫరవాలేదు. ఒకవేళ ఫ్యాటీలివర్ ప్రాథమిక దశలో ఉన్నా అంతగా ప్రమాదం ఉండదు. బరువు పెరగడాన్ని నియంత్రించుకోవాలి. మద్యం పూర్తిగా మానేయాలి. అన్నిరకాల పోషకాలు అందేలా... ముఖ్యంగా విటమిన్ బి లాంటివి అందేలా మంచి ఆహార నియమాలు పాటించాలి. రోజూ కొద్దిగా వ్యాయామం చేయాలి. ఇలా ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరిస్తూ ఉంటే కొద్దిపాటి మందులతోనే కాలేయం బాగుపడుతుంది, బాగుంటుంది. సాధారణంగా కాలేయం తాను దెబ్బతిన్న భాగాన్ని తనంతట తానే బాగుచేసుకుంటుంది. అలా ఒకసారి అది తనను రిపేర్ చేసుకోలేనంతగా దెబ్బతింటే మాత్రం కాలేయ మార్పిడి తప్ప మరొక ప్రత్యామ్నాయం ఉండనందున... ఒక వయసుదాటాక కాలేయంపై శ్రద్ధ అవసరం. -
సిర్రోసిస్‌తో బాధపడేవారు తీసుకోవాల్సిన ఆహారం
సిర్రోసిస్ అన్నది ఆరోగ్యకరమైన కాలేయ కణజాలం స్థానంలో అనారోగ్యకరమైన (ఫైబ్రస్ స్కార్ టిష్యూ) పెరగడం వల్ల వచ్చే సవుస్య. విపరీతంగా వుద్యం తాగేవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. అంతేకాదు... హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, ఫ్యాటీలివర్ అనే వ్యాధుల వల్ల కూడా రావచ్చు. కొన్ని సందర్భాల్లో దీనికి ఎలాంటి కారణం తెలియకపోవచ్చు కూడా. ఇలాంటి కండిషన్‌ను క్రిప్టోజెనిక్ అంటారు. సిర్రోసిస్ వల్ల కడుపులో నీరు చేరడం, కాలేయ–వుూత్రపిండాల సవుస్యలు లాంటి ఎన్నో సవుస్యలు వస్తాయి. సిర్రోసిస్ వచ్చినప్పుడు దానివల్ల వచ్చే కాంప్లికేషన్లను బట్టి ఆహార నియవూలు పాటించాల్సి ఉంటుంది. సిర్రోసిస్ సవుస్య వచ్చినవాళ్లకు సాధారణ సవుతుల ఆహారం ఇవ్వాలి. అంటే... అన్ని రకాల పోషకాలు సమంగా అందేలా... ఆహారంలో పళ్లు, కూరగాయలు, పాలు, పాల ఉత్పాదనలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. లివర్ సిర్రోసిస్ వచ్చినవాళ్లలో కడుపులో ద్రవాలు చేరడం, కాలేయవాపు, పోర్టల్ రక్తనాళంలో ప్రెషర్ ఉన్నట్లయితే... అలాంటివారికి ఉప్పు (సోడియం) ఎక్కువగా ఉండే పదార్థాలు ఇవ్వకూడదు. అంటే వారికి ఆహారంలో పచ్చళ్లు, అప్పడాలు, బేకరీ ఐటమ్స్, ఉప్పు ఎక్కువగా ఉండే చిప్స్ (సాల్టెడ్ చిప్స్), ఉప్పులో వేయించిన జీడిపప్పు (సాల్టెడ్ నట్స్), సాస్‌లు, జామ్‌లు వంటివాటిని పూర్తిగా అవాయిడ్ చేయాలి. సిర్రోసిస్వల్ల హెపాటిక్ ఎన్‌కెఫలోపతి అనే వూనసిక సవుస్య వస్తే నాన్వెజిటేరియన్ ప్రోటీన్స్ ఇవ్వడం సరికాదు. -
కాలేయాన్ని కాపాడుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
-
కాలేయాన్ని కాపాడుకోవాలంటే...ఏం చేయాలి?
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కేన్సర్లలో లివర్ కేన్సర్ కూడా ఒకటి. World wideగా ప్రతీ ఏడాది 8 లక్షలమంది లివర్ కేన్సర్‌తో బాధపడుతున్నారు. 7 లక్షలమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దేన్ క్యూర్ అన్నట్టు కాలేయాన్ని కాపాడుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి? ఆ వివరాలు మీకోసం.. ప్రపంచంలో కాలేయ వ్యాధిగ్రస్తుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సైతం హెచ్చరించిన నేపథ్యంలో మన శరీరంలోని కీలక అవయవమైన లివర్ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. మన శరీరంలోని జీర్ణకోశ నాళం నుంచి వచ్చే రక్తాన్ని వడపోయడమే లివర్ చేసే పని. అంతేకాకుండా ఆహారం ద్వారా వచ్చే రసాయనాలు, వాటిలోని విషతుల్యాలను సైతం కాలేయం తొలగిస్తుంది. ముఖ్యంగా శరీరంలో ఏర్పడే ఇన్ఫెక్షన్లు, కొవ్వులు, రక్తంలోని చక్కెర స్థాయిలను కూడా బకాలేయం నియంత్రిస్తుంది. మన జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే కాలేయమే కీలకం. వాస్తవానికి కాలేయం సమస్యను గుర్తించడం అంత సులభం కాదు. చాలావరకు 90 శాతం కాలేయం దెబ్బతినేంతవరకు వ్యాధి లక్షణాలు బయటపడవు. అందుకే జీర్ణ వ్యవస్థలో ఎలాంటి మార్పులు కనిపించినా అప్రమత్తం కావాలి. ముఖ్యంగా కాలేయంలో ఏదైనా సమస్య వస్తే కణజాలాల్లో ఫైబ్రయోస్ స్కార్స్ వల్ల కాళ్లల్లో వాపులు వస్తాయి. దీన్నే లివర్ ఫైబ్రోసిస్ అంటారు. పచ్చ కామెర్ల వ్యాధికి గురైనపుడు చర్మం, గోళ్లు పసుపు పచ్చవర్ణంలోకి మారతాయి. కళ్ళు లేత పసుపు రంగులోకి మారినట్లైతే కామెర్లుగా అనుమానించి, వెంటనే డాక్టర్‌ను సంప్రదించి తగిన వైద్యం పొందాలి. ముఖ్యంగా కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే జంక్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్ సోడా, ఇతర కార్బోనేటేడ్ పానీయాలకు దూరంగా ఉండాలి. లేదంటే తీవ్రమైన కాలేయ సమస్యలు, ఊబకాయం, ఫ్యాటీ లివర్ లాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే సిర్రోసిస్‌కు దారి తీస్తుంది. చివరకు ఇది కేన్సర్‌గా మారే ప్రమాదం ఉంది. అందుకే ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. కొవ్వు పదార్థాలు, నూనెలో బాగా వేయించిన పదార్థాలు మితంగా వాడటం మంచిది. మళ్లీ మళ్లీ అదే నూనెలో వేయించిన పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మితిమీరిన ఉప్పు, చక్కెరవాడకం కూడా ప్రమాదకరం. వీటిన్నింటికంటే లివర్ ఆరోగ్య దెబ్బతీసేవాటిల్లో కీలకమైనది మద్యం, ధూమపానం అనేది గుర్తించి వాటికి దూరంగా ఉంటే మంచిది. అలాగే తాజాగా ఆకుకూరలు, కూరగాయలతోపాటు శరీరానికి మేలు చేసే మంచి కొవ్వులను తీసుకోవాలి. విటమిన్ సీ కాలేయ వద్ద కొవ్వును నియంత్రిస్తుంది. కనుక విటమిన్ సీ ఎక్కువగా లభించే ఉసిరి, సల్ఫర్ అధికంగా ఉండే వెల్లులి పాయలు , సహజ వాధి నివారిణి పసుపు ఆహారంలో చేర్చుకోవాలి. గ్రీన్ టీ, ఆపిల్ పండ్లు సైతం కాలేయానికి మేలు చేస్తాయి. అలాగే కొంచెం ఖరీదైనవే అయినప్పటికీ వాల్ నట్స్, ఆలీవ్ ఆయిల్, అవకాడో కాలేయాన్ని శుభ్రం చేస్తాయి. వీటిన్నింటికి తోడు తగినంత నీరు తీసుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ ఏదైనా సమస్య వస్తే ఆందోళన చెందకుండా వైద్యుల సలహా తీసుకోవడం, సమయానికి మందులు తీసుకోవడం ఉత్తమం. ఏది ఏమైనా మన ఆరోగ్యం మన చేతుల్లోనే అనేది గుర్తించాలి. -
సకాలంలో కాలేయాన్నికాపాడుకోండి!
మారుతున్న జీవనశైలిలో భాగంగా ఒకేచోట కూర్చుని చేసే వృత్తుల కారణంగానైనా... లేదా మన జీవనశైలిలో ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిన ఆల్కహాల్ తీసుకోవడం వల్లనైనా ఇటీవల ఫ్యాటీలివర్ డిసీజ్ బాగా ఎక్కువగా కనిపిస్తోంది. ఇందులోనూ గ్రేడ్‌లో ఉంటాయి. మొదటి లేదా రెండో గ్రేడ్ వరకు కేవలం మంచి ఆరోగ్యకరమైన నడవడిక, మన జీవనశైలిలో భాగంగా ఆరోగ్యకరమైన అలవాట్లు, వ్యాయామంతో మొదటి, రెండో దశలోని ‘ఫ్యాటీ లివర్’ కండిషన్‌ను తేలిగ్గా అధిగమించవచ్చు. కానీ అంతకు మించి దాటితే మాత్రం కాలేయం పూర్తిగా కొవ్వుతో నిండిపోయి మొదటికే మోసం రావచ్చు. అప్పుడు కాలేయ మార్పిడి తప్ప మరో మార్గ ఉండకపోవచ్చు. అందుకే సకాలంలోనే గుర్తించి మొదటి లేదా రెండో దశలోనే ‘ఫ్యాటీ లివర్’ను నిలువరించాలి. ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి, దానికి కారణాలేమిటి, దానితో వచ్చే అనర్థాలేమిటి వంటి అనేక అంశాపై అవగాహనను కలిగించేదే ఈ కథనం. ఈ మధ్యకాలంలో మన జీవనశైలిలో నగరీకరణ /పట్టణీకరణ జరుగుతున్న కొద్దీ మనం తీసుకునే ఆహారంలో క్యాలరీ లు చాలా ఎక్కువగా ఉండటం, చక్కెరలు ఎక్కువగా ఉండే ఆహారాలు పెరుగుతున్నాయి. దానికి తోడు శారీరక శ్రమ ఎంతమాత్రమూ లేని వృత్తులే అన్నిచోట్లా ఉన్నాయి. ఫలితంగా స్థూలకాయం, డయాబెటిస్తో పాటు ఫ్యాటీలివర్ అనే కండిషన్ చాలామందిలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఫ్యాటీ లివర్ అంటే... మన పొట్టలో కుడిపైపున కాలేయం ఉంటుంది. మనం తీసుకుంటున్న ఆహారంలో క్యాలరీలు, చక్కెరలు పెరుగుతున్న కొద్దీ శరీర శ్రమకు వినియోగమైనవి పోగా... మిగతావన్నీ కాలేయంలో కొవ్వు రూపంలో నిల్వ అవుతాయి. దాంతో క్రమంగా కాలేయం కణాలు తమ సహజ గుణాన్నికోల్పోయి కొవ్వు పేరుకున్నట్లుగా అయిపోతుంటాయి. ఇలాంటి కండిషన్‌నే ఫ్యాటీలివర్ అంటారు. ఫ్యాటీలివర్... దశలు... ఫ్యాటీలివర్‌లో మూడు దశలు ఉంటాయి. మొదటి దశ : ఇది సాధారణ ఫ్యాటీ లివర్ వ్యాధి. ఇందులో కాలేయ కణాల మధ్య కొద్దిగా మాత్రమే కొవ్వు పేరుకుంటుంది. రెండో దశ: ఈ దశను నాష్ (ఎన్‌ఏఎస్‌హెచ్) అంటారు. ఇందులో కాలేయం కొద్దిగా దెబ్బతింటుంది. కొన్ని కాలేయ కణాలు సైతం నశిస్తాయి. కొవ్వుల పాళ్లు ఎక్కువగా ఉంటాయి. మూడో దశ : ఈ దశలో సిర్రోసిస్ వస్తుంది. అంటే కాలేయం పూర్తిగా తన స్వరూపాన్ని కోల్పోతుంద. పూర్తిగా కొవ్వులు నిండినట్లుగా అయిపోతుంది. ఈ దశలో కాలేయ మార్పిడి తప్ప వేరే ప్రత్యామ్నాయం ఉండదు. ఇది జరగకపోతే రోగి మనుగడే అసాధ్యం అవుతుంది. కారణాలివి... ఫ్యాటీలివర్‌లో మన ప్రమేయంతో నివారించుకోగలిగే కారణాలతో పాటు మనం నివారించలేని కారణాలూ ఉంటాయి. నివారించగల కారణాలు ఉదాహరణకు మద్యం అలవాటు ఉన్నవారిలో ఫ్యాటీ లివర్ కండిషన్ ఎక్కువ. మద్యం అలవాటును మానుకోవడం అన్నది మనం నివారించుకోగలిగే అంశం. అలాగే బరువు తగ్గించుకోవడం కూడా కొంతవరకు మన చేతుల్లో ఉన్నదే. ఇక మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ (పిండిపదార్థాలు) తీసుకోవడం కూడా మనం నివారించుకోగలిగే అంశమే. నివారించుకోలేని కారణాలు మంచి జీవనశైలి మార్గాలతో వాటిని కొంతవరకు మాత్రమే నివారించగలిగినప్పటికీ డయాబెటిస్, నివారించుకోలేనంత బరువు పెరగడం అన్నవి మనం ప్రయత్నపూర్వకంగా నివారించలేని కారణాలు. శరీరం బరువు పెరుగుతున్న కొద్దీ కాలేయానికి నష్టం వాటిల్లుతుందని అనేక అధ్యయనాల్లో తేలింది. స్థూలకాయం ఉన్న 90 శాతం మందిలో మొదటి దశ ఫ్యాటీలివర్ కనిపించడం చాలా సాధారణ అంశం. అలాగే స్థూలకాయం ఉన్న 20 శాతం వ్యక్తుల్లో మనం రెండో దశగా పేర్కొనే ఎన్‌ఏఎస్‌హెచ్ దశ ఉంటోంది. ఫ్యాటీ లివర్ వచ్చిన వ్యక్తుల్లో దాదాపు 50 శాతం మందిలో డయాబెటిస్ ఉంటుంది. ఇక సిర్రోసిస్ దశకు చేరినవారిలో 95% మంది డయాబెటిస్, స్థూలకాయం ఉన్నవారే. ఫ్యాటీలివర్ వల్ల పరిణామాలు ∙ఫ్యాటీ లివర్ వ్యాధి వచ్చాక తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే కాలేయం పూర్తిగా దెబ్బతినిపోయే సిర్రోసిస్ లేదా లివర్ క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీయవచ్చు. ∙ఫ్యాటీ లివర్ దశల్లో మొదటిదశ నుంచి క్రమంగా రెండో దశ అయిన ఎన్ఏఎస్హెచ్కూ, అక్కడి నుంచే మూడో దశ అయిన సిర్రోసిస్‌కు దారి తీస్తుందని అనుకోడానికి లేదు. చాలా సందర్భాలలో పరిస్థితులు మొదటి దశ నుంచి నేరుగా మూడో దశ అయిన సిర్రోసిస్‌కు దారితీయవచ్చు. అందుకే ఫ్యాటీలివర్ కనిపించినప్పుడే జాగ్రత్తగా ఉండాలి. ఫ్యాటీ లివర్ నివారణ మార్గాలు బరువు నియంత్రించుకోండి: మీరు ఉండాల్సిన దాని కంటే ఎక్కువగా బరువు ఉంటే మీ ఆహారంలో పిండి పదార్థాలను తగ్గించుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం: ఆహారంలో విధిగా తాజా ఆకుకూరలూ, కూరగాయలు, పండ్లు ఉండేలా జాగ్రత్త తీసుకోండి. నెయ్యి వంటి కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండండి. మాంసాహారంలో రెడ్‌మీట్‌కు బదులు స్కిన్ లేని చికెన్, చేపలు వంటివి తీసుకోండి. నూనెల్లో మంచినూనెకు బదులు ఆలివ్ ఆయిల్ వాడడం మేలు. పొట్టుతీయని తృణధాన్యాలు ఎక్కువగా వాడాలి. పాలిష్ చేసిన వాటికి బదులుగా పొట్టు తీయని బియ్యం, గోధుమలు ఎక్కువగా తీసుకోండి. డయాబెటిస్‌ను తప్పకుండా అదుపులో ఉంచుకోవాలి. కొలెస్ట్రాల్ తగ్గించుకోండి. ఇందుకోసం వ్యాయామంతో పాటు ఒకవేళ అవసరమైతే మందులు కూడా వాడాల్సి ఉంటుంది. దురలవాట్ల నుంచి దూరంగా ఉండండి: ఆల్కహాల్‌కు తప్పనిసరిగా దూరంగా ఉండాలి. వ్యాయామం ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలకు తక్కువ కాకుండా వ్యాయామం చేయండి. శారీరక శ్రమ చేయడానికి అవకాశం ఉన్న చోట్ల ఒంటికి పని చెప్పండి. అంటే లిఫ్ట్‌కు బదులు మెట్లు ఉపయోగించడం, కొద్దిపాటి దూరాలకు వాహనం ఉపయోగించకపోవడం మంచిది. ఫ్యాటీలివర్ డిసీజ్ లక్షణాలు ∙తొలిదశల్లో సాధారణంగా ఫ్యాటీలివర్ రోగుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు. అయితే అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేయించుకున్నవారిలో ఇది ఉన్నట్లు తెలుస్తుంది. ∙కొందరికి కుడివైపు పొట్ట పైభాగంలో (రిబ్కేజ్ కింద) పొడుస్తున్నట్లుగా నొప్పి వస్తుంటుంది. కాలేయం క్రమంగా పెరుగుతుండటం వల్ల కనిపించే పరిణామం ఇది. ఫ్యాటీలివర్ నిర్ధారణ పరీక్షలు అల్ట్రాసౌండ్ అబ్డామిన్ స్కానింగ్‌తో చాలావరకు ఫ్యాటీలివర్ డిసీజ్ తెలుస్తుంది. దానితోపాటు లివర్ ఫంక్షన్ పరీక్ష చేయించాలి. దానితో ఏవైనా ఎంజైములు స్రవించడం వల్ల కాలేయం దెబ్బతిన్నదా అన్న సంగతీ తెలుస్తుంది. డయాబెటిస్, కొలెస్ట్రాల్ స్థాయులు, ట్రైగ్లిజరైడ్ పెరుగుదలనూ పరిశీలించే పరీక్షలు చేయించాలి. కొందరిలో లివర్ బయాప్సీ అవసరం. ఫ్యాటీ లివర్ వ్యాధికి చికిత్స ఆల్కహాల్ అలవాటు ఉన్నట్లయితే అది పూర్తిగా మానేయాలి. ఒకవేళ ఆల్కహాల్ లేనివారిలో కనిపిస్తే వారి జీవనశైలిలో మార్పులు, ఆహారంలో మార్పులు, వ్యాయామం వంటి మార్గాలను తప్పక అనసరించాలి. చాలా కొద్దిమందిలో మందులు, శస్త్రచికిత్స అవసరం కావచ్చు. ∙రోగి వాడుతున్న ఏవైనా మందుల వల్ల ఫ్యాటీ లివర్ వ్యాధి వచ్చిందేమో అని పరిశీలించి దానికి అనుగుణంగా మందులను మార్చడం వంటి జాగ్రత్తలు తీసుకుంటారు. -
మూత్రపిండానికి గండం... మద్యం!
మూత్రపిండాల ఆరోగ్యాన్ని దెబ్బతీసే వాటిల్లో ప్రధానమైనవి కొందరు తాము రోజూ అలవాటుగా తీసుకునే మద్యం. దాంతో పాటు మనం డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా తీసుకునే ఆన్ కౌంటర్ మందులు కూడా. ఈ రెండిటిలోనూ చీప్‌లిక్కర్ అన్నది కిడ్నీలను దెబ్బతీస్తుందని మనం చాలాసార్లు వింటూనే ఉంటాం. చాలా మంది కిడ్నీ బాధితుల్లో ఇదో ప్రధానమైన కారణం. సాధారణంగా మన రక్తంలోని మలినాలను శుభ్రపరచడం అన్నది కిడ్నీల పని కదా. చీప్లిక్కర్లో మత్తును సమకూర్చడానికి వేసే వివిధ రకాల రసాయనాలు, యూరియా వంటి వాటిని రక్తం నుంచి ఒంట్లోంచి తొలగించడానికి కిడ్నీలు తమ సామర్థ్యానికి మించి కష్టపడతాయి. అవెంతగా కష్టపడతాయంటే... అలా మలినాలనూ, కాలుష్యాలనూ తొలగిస్తూ, తొలగిస్తూ, తమ సామర్థ్యాన్ని క్రమంగా కోల్పోతుంటాయి. దాంతో ఒక దశలో అవి కాలుష్యాలనే తొలగించలేని స్థితికి చేరుకుంటాయి. దీన్నే కిడ్నీ ఫెయిల్యూర్‌గా చెబుతుంటారు. ఇదే పరిణామం మద్యం వల్ల కూడా వస్తుంది. వాస్తవానికి మద్యం అంటేనే కూడా బాటిలెత్తు కాలుష్యం. దాంతో ఆ కలుషిత పదార్థాలను తొలగించే ప్రక్రియను నిరంతరాయం చేస్తూ చేస్తూ కిడ్నీలు అలసిపోతాయి. ఇక ఆన్ కౌంటర్ డ్రగ్స్‌గా మనం పేర్కొనే మందులతోనూ ఇదే అనర్థం కలుగుతుంది. ఆ మందులలోని మలినాలను తొలగించడానికి కిడ్నీలు కష్టపడతాయి. మందులలోని ఆ మాలిన్యాలను తొలగించేలోపే మళ్లీ వేసుకున్న మందులలోని కాలుష్యాలు మూత్రపిండాలను దెబ్బతీస్తాయి. గంటకు 12 లీటర్లను మాత్రమే శుభ్రపరచగలిగే ఈ కిడ్నీలు మరి అంతటి కాలుష్యాల పోగులను శుభ్రం చేయాలంటే ఎంత కష్టం? అందుకే అంతటి కష్టాన్ని భరించలేనంతటి భారం వాటిమీద పడుతున్నప్పుడు మూత్రపిండాలకు ‘క్రానిక్ కిడ్నీ డిసీజ్’ (సీకేడీ) లాంటి జబ్బులు వస్తాయి. అవి కిడ్నీ ఫెయిల్యూర్ లాంటి కండిషన్లకు దారితీస్తాయి. అలాంటప్పుడు కృత్రిమంగా కేవలం కొద్దిమేరకు అంటే మనిషి జీవించి ఉండగలిగే మేరకు మాత్రమే ఒంట్లోని కాలుష్యాలను యంత్రాల సహాయంతో తొలగించే ప్రక్రియ అయిన ‘డయాలసిస్’తో నిత్యం నరకబాధలను చూస్తూ రోజులు రోజుల ప్రాతిపదికన రోగులు తమ ప్రాణాలను దక్కించుకుంటూ ఉంటారు. ఇలాంటి బాధలేమీ పడకుండా నిండా ఆరోగ్యంతో నిండు నూరేళ్లు జీవితం గడపాలంటే మద్యం అలవాటు మానేయాలి. అలా రెండంటే రెండు కిడ్నీలను పదిలంగా చూసుకోవాలి. ఇక నొప్పి భరించలేనంతగా ఉండటమో లేదా మర్నాడు డాక్టర్ దగ్గరికి వెళ్లేలోపు కాస్త ఉపశమనంగానో తప్ప... అలవాటుగా ఆన్ కౌంటర్ డ్రగ్స్ వాడనేకూడదని గుర్తుంచుకోండి. -
లివర్ కౌన్సెలింగ్స్
నా వయసు 46 ఏళ్లు. నాకు చిన్నప్పుడు, యుక్త వయసులో చాలాసార్లు జాండీస్ వచ్చాయి. అప్పట్లో పసరువైద్యం చేశారు. అయితే ఈమధ్య ఆకలి మందగించడం, వాంతులు, వికారం లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. అలాగే కడుపునొప్పి, ఏ చిన్న పని చేసినా తీవ్రమైన అలసట కనిపిస్తున్నాయి. దాంతో డాక్టర్‌ను సంప్రదించాను. ఆయన కొన్ని పరీక్షలు చేసి, నా లివర్ పూర్తిగా పాడైపోయిందని చెబుతున్నారు. దాంతో నేనూ, మా కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నాం. నా సమస్యకు తగిన పరిష్కారం చూపండి. లివర్ పూర్తిగాపాడైంది... పరిష్కారం చెప్పండి మన దేశంలో తీవ్ర ప్రాణాంతక జబ్బులలో లివర్ వ్యాధులు ముఖ్యమైనవి. లివర్ పాడవడానికి అనేక కారణాలున్నాయి. పెద్దవాళ్లలో (ముఖ్యంగా మగవాళ్లలో) విపరీతంగా తాగడం వల్ల త్వరగా లివర్ పాడైపోతోంది. అలాగే ఎక్కువ శాతం మంది హెపటైటిస్– బీ, హెపటైటిస్–సి వైరస్ సోకడం, జన్యుపరమైన సమస్యలు, ఇతరత్రా కారణాల వల్ల కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఇక మీ విషయానికి వస్తే మీరు చిన్నప్పటి నుంచే కాలేయ సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మీరు ముందుగా కాలేయ నిపుణుడిని కలవండి. కంప్లీట్ బ్లడ్ టెస్ట్స్ నిర్వహించి మీ లివర్ ఎంతమేరకు చెడిపోయింది, ఎలా దెబ్బతిన్నదనే అంశాలను ప్రాథమికంగా గుర్తించాలి. ఆ తర్వాతే మీకు ఎలాంటి చికిత్స అందించాలనేది నిర్ణయిస్తారు. ఒకవేళ లివర్ పాక్షికంగానే దెబ్బతింటే మందుల ద్వారా దానిని సరిచేయవచ్చు. అలా కాకుండా మీ లివర్ పూర్తిగా పాడైపోయి ఇక పనిచేయని తేలితే మాత్రం ‘లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్’ తప్పనిసరిగా నిర్వహించాల్సిందే. అలాంటి పరిస్థితి వస్తే దీనికి మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మీ బ్లడ్గ్రూప్కి సరిపోలిన వారు ముందుకు రావాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను ‘లైవ్ డోనార్’ ప్రక్రియ అంటారు. ఇది చాలా సురక్షితమైన విధానం. ఇది కాకుండా ‘కెడావర్ ఆర్గాన్ విధానం ద్వారా కూడా సర్జరీ చేయించుకోవచ్చు. దీనికోసం ‘జీవన్‌దాన్’లో పేరు నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే మరణానంతరం అవయవదాతల నుంచి లివర్ లభ్యమైనప్పుడు మాత్రమే ఇలా లివర్ లభించే అవకాశం ఉంది. కెడావర్ ఆర్గాన్ పద్ధతిలో అవయవాల లభ్యత తక్కువగా ఉండటం వల్ల చాలా మంది పేషెంట్లు ‘లైవ్ డోనార్’ పైనే ఆధారపడుతున్నారు. మీరు తక్షణమే మీ సమస్యను గుర్తించి అవసరమైన చికిత్స తీసుకోండి. ఒకవేళ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సి వచ్చినా ఆందోళన అవసరం లేదు. ఈ సర్జరీ సక్సెస్ రేటు 90 శాతం ఉంటుంది. ఇక మీరు ఎంతమాత్రమూ ఆలస్యం చేయకుండా లివర్ స్పెషలిస్ట్‌ను కలవండి. నా వయసు 34 ఏళ్లు. మా అన్నయ్యకు కాలేయం పూర్తిగా దెబ్బతిన్నదనీ, కాలేయ మార్పిడి తప్ప మరో అవకాశం లేదని డాక్టర్లు చెప్పారు. రక్తసంబంధీకులలో ఎవరైనా కాలేయదానం చేయవచ్చని వివరించారు. నేను మా అన్నయ్యకు కాలేయం ఇవ్వాలని అనుకుంటున్నాను. డాక్టర్లు వివిధ పరీక్షలు చేశాక నేను దాతగా అన్నివిధాలా అర్హురాలినని చెప్పారు. మా అన్నయ్యకు కాలేయం ఇవ్వడం వల్ల భవిష్యత్తులో నాకు ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తాయా? నేను కాలేయ దానం చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులుఉంటాయా? అన్ని రకాల పరీక్షలూ చేశాక, మీ అన్నయ్యకు మీరు కాలేయం ఇవ్వడానికి అన్నివిధాలా అర్హులని వైద్యులు నిర్ధారణ చేశారు కాబట్టి మీరు నిరభ్యంతరంగా కాలేయాన్ని దానం చేయవచ్చు. మన దేహంలో కొంతభాగాన్ని తొలగించినా కూడా మళ్లీ యథారూపానికి వచ్చే స్వభావం కాలేయానికే ఉంది. మీ నుంచి 20–25 శాతం కాలేయాన్ని తొలగించి, దాన్ని మీ అన్నగారికి అమర్చుతారు. కాలేయ దానం వల్ల మీకు భవిష్యత్తులో ఎలాంటి సమస్యలూ ఉత్పన్నం కావు. కాలేయానికి ఉన్న పునరుత్పత్తి శక్తి వల్ల దాతలోని కాలేయం కూడా మళ్లీ 6–8 వారాలలో యథాస్థితికి పెరుగుతుంది. దీర్ఘకాలికంగా ఎలాంటి మందులూ వాడాల్సిన అవసరం ఉండదు. సర్జరీ తర్వాత అన్ని రకాల ఆటలూ ఆడవచ్చు. అందరిలాగే ఏవిధమైన ఇబందులూ లేకుండా సాధారణ జీవితం గడపవచ్చు. మీ అన్నయ్యకు కాలేయం పూర్తిగా విఫలమై కాలేయ మార్పిడి చేయించుకోవాలని వైద్యులు సూచించినట్లు మీరు తెలిపారు. కాబట్టి వీలైనంత త్వరగా ఈ శస్త్రచికిత్స చేయించాలి. లేకపోతే మరిన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తి అవి మీ అన్నయ్యకు మరింత ప్రమాదకరంగా పరిణమించవచ్చు. ఎందుకంటే కాలేయం చాలా కీలకమైన అవయవం. అది ఒక రసాయన కర్మాగారంలా పనిచేస్తూ మనం తిన్న ఆహారంలోని పదార్థాలను చిన్న పోషకాల్లోకి మార్చుతుంది. జీర్ణప్రక్రియలో భాగంగా పైత్యరసాన్ని స్రవింపజేస్తుంది. కొవ్వులను, పిండిపదార్థాలను, ప్రోటీన్లను, విటమిన్లను నిల్వ చేస్తుంది. రక్తం గడ్డటానికి ఉపయోగపడే అంశాలను రూపొందిస్తుంది. శరీరంలోకి చేరే విషాలను విరిచేస్తుంది. ఒకవేళ కాలేయం సరిగా పనిచేయకపోతే చిన్న దెబ్బతగిలినా తీవ్ర రక్తస్రావంతో మనిషి ప్రాణాలకే ముప్పు వస్తుంది. మీరు కాలేయాన్ని ఇవ్వడం ద్వారా మీ అన్నయకు కొత్త జీవితాన్ని ప్రసాదించినవారవుతారు. కాబట్టి నిరభ్యంతరంగా కాలేయాన్ని ఇవ్వవచ్చు. ఫ్యాటీలివర్అంటున్నారు... సలహాఇవ్వండి నా వయసు 56 ఏళ్లు. శాకాహారిని. అయితే తరచూ మద్యం తీసుకుంటూ ఉంటాను. డయాబెటిస్ ఉంది. మందులు వాడుతున్నాను. ఇటీవల హాస్పిటల్‌కు వెళ్లి జనరల్ చెకప్ చేయించుకున్నప్పుడు ఫ్యాటీలివర్ ఉన్నట్లు డాక్టరు గుర్తించారు. ఫ్యాటీలివర్ అంటే ఏమిటి? దీనికి చికిత్స చెప్పండి. ఫ్యాటీలివర్ వ్యాధి అంటే కాలేయంలో మామూలుగా ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా కొవ్వు చేరడం. శరీరంలో కొంత కొవ్వు ఉండటం సహజమే. కానీ శరీరపు బరువులో అది పదిశాతాన్ని మించినప్పుడు ఫ్యాటీలివర్ వ్యాధి వస్తుంది. ఈవ్యాధి కొంతమందిలో ఎందుకు వస్తుందో, మరికొంత మంది దీనికి నిరోధక శక్తి ఎందుకు కలిగి ఉంటారో తెలియదు. అయితే కొన్ని లక్షణాలు మాత్రం వ్యాధిగ్రస్తుల్లో సాధారణంగా కనిపిస్తుంటాయి. ఈ వ్యాధిగ్రస్తులంతా దాదాపు స్థూలకాయులే. ఊబకాయం కాలేయ వ్యాధులకు కారణమవుతోంది. ఈ వ్యాధిగ్రస్తులు చాలావరకు మధ్యవయస్కులు. రక్తంలో ట్రైగ్లిసరైడ్స్, కొలెస్ట్రాల్ అధికంగా ఉంటాయి. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు, ఇతరత్రా కాలేయ వ్యాధి ఉన్న చాలామందిలో ఫ్యాటీలివర్ వ్యాధి చాలా సాధారణంగా కనిపిస్తోంది. ఫ్యాటీ లివర్‌తో సహా చాలా కాలేయ వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. అందువల్ల ఆలస్యం చేయకుండా కాలేయ వ్యాధుల చికిత్సకు అవసరమైన ఆధునిక వసతులు, నిపుణులు ఉన్న ఆసుపత్రికి వెళ్లి చూపించుకోండి. అవసరమైన పరీక్షలు జరిపించి, వ్యాధి ఏ స్థాయిలో ఉందో తెలుసుకొని, తగు చికిత్స ప్రారంభించగలుగుతారు. మద్యం అలవాటు కాలేయ వ్యాధుల తీవ్రతను పెంచి పరిస్థితిని మరీ దిగజారుస్తుంది. మద్యం అలవాటు మానేయండి. శరీరం బరువు తగ్గించుకోండి. బరువు మూడు నుంచి ఐదు శాతం తగ్గినా కాలేయంలో కొవ్వు గణనీయంగా తగ్గిపోతుంది. ఫ్యాటీలివర్‌కు ఇతర వైద్యచికిత్సలతో పాటు ఆరోగ్యకరమైన జీవనవిధానం, క్రమం తప్పని ఏరోబిక్ వ్యాయామాలు, రెడ్‌మీట్ తినకుండా ఉండటం వంటి జీవనశైలిని సూచిస్తుంటాం. ఫ్యాటీ లివర్ ఉన్నవారు వారానికి ఐదురోజులైన రోజుకు అరగంట కంటే తగ్గకుండా వ్యాయామం చేయడం అవసరం. డాక్టర్ బాలచంద్రన్ మీనన్, సీనియర్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్, డిపార్ట్మెంట్ ఆఫ్ హెపటాలజీ అండ్ లివర్ డిసీజెస్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
ఇలాగైతే కాలేయ వ్యాధులు పెరిగి..
మన సమాజంలో ఉన్న మద్యం దురలవాటుతో పాటు ఇటీవలి ఆధునిక జీవనశైలిలో బాగా విస్తృతమైన స్థూలకాయాన్ని నియంత్రించుకోకపోతే కాలేయ వ్యాధులు పెరిగి వాటితో మరణాలూ తప్పవని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. మద్యపానం, అదేపనిగా బరువు పెరగడాన్ని మనమే ప్రయత్నపూర్వకంగా నియంత్రించుకోకపోతే ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న గుండెజబ్బుల మరణాల సంఖ్యను కాలేయవ్యాధితో కలిగే మరణాలు అధిగమిస్తాయని హెచ్చరిస్తున్నారు యూనివర్సిటీ ఆఫ్ సౌథాంప్టన్ పరిశోధకులు. ఈ అధ్యయనంలో పాలుపంచుకున్న ప్రొఫెసర్ నిక్ షెరాన్ అనే అధ్యయనవేత్త మాట్లాడుతూ ‘‘ఇప్పటివరకూ ఈ మరణాలు మధ్యవయసు వారి నుంచి క్రమంగా తగ్గుతూ తాజాగా చిన్న వయసులోనే చాలా మంది గుండెజబ్బులతో అకస్మాత్తుగా కన్నుమూయడం వరకు వచ్చింది. అయితే పెరుగుతున్న మద్యం దురలవాటు, బాగా బరువు పెరుగుతూండటం కారణాలతో 2020 నాటికి ఇలా చిన్నవయసులోనే మరణించేవారి సంఖ్య కాలేయవ్యాధిగ్రస్తుల్లోనే ఎక్కువగా ఉంటుంది’’ అంటూ హెచ్చరిస్తున్నారు. ఇటీవలే ఈ అధ్యయన ఫలితాలు ప్రముఖ మెడికల్ జర్నల్ ‘ద లాన్సెట్’లో ప్రచురితమయ్యాయి. -
భారత్‌లో పెరుగుతున్న డయాబెటీస్ మృతులు
న్యూఢిల్లీ: ఆధునిక జీవన విధానం వల్ల భారతీయులు ఎక్కువగా డయాబెటీస్ (మధుమేహం) బారిన పడుతున్నారు. ప్రపంచ డయాబెటీస్ రోగుల్లో రెండో స్థానంలో ఉన్న భారత్‌లో 2015 సంవత్సరంలో 3,46,000 మంది డబాబెటీస్ కారణంగా మరణించారని ‘గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీస్’ అనే సంస్థ వెల్లడించింది. 2005 నుంచి 2015 మధ్య భారత్‌లో డయాబెటీస్ రోగులు ఏకంగా 50 శాతం పెరగడం ఆందోళనకరమైన అంశమని వ్యాఖ్యానించింది. ఏయే వ్యాధుల కారణంగా భారతీయులు ఎక్కువగా మరణిస్తున్నారన్న విషయంలో డయాబెటీస్ జబ్బు 2005లో 11వ ర్యాంకులో ఉండగా, అది ఇప్పుడు ఏడవ ర్యాంకుకు చేరుకున్నది. భారత్‌లో ఎక్కువ మంది మరణిస్తున్నది గుండెపోటు కారణంగానే. ఆ తర్వాత కాలేయ వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు, మెదడు రక్తనాళాల సమస్య, టీబీ, అతిసారం వ్యాధులు మొదటి ఆరు స్థానాల్లో ఉండగా ఏడవ స్థానానికి డయాబెటీస్ చేరుకుంది. హెచ్ఐవికన్నా డయాబెటీస్ కారణంగానే భారతీయులు ఎక్కువగా మృత్యువాత పడుతున్నారు. మున్ముందు టీబీ కారణంగా చనిపోతున్నవారికన్నా డయాబెటీస్ కారణంగానే ఎక్కువ మంది చనిపోయే ప్రమాదం ఉందని గ్లోబల్ సంస్థ హెచ్చరించింది. 10.90 కోట్ల మంది డయాబెటీస్ రోగులతో చైనా ప్రపంచంలోనే మొదటి స్థానంలో కొనసాగుతుండగా, 6.91 కోట్ల రోగులతో భారత్ రెండో స్థానంలో కొనసాగుతోంది. భారత్‌లో డయాబెటీస్ బయటపడని రోగులు మరో మూడున్నర కోట్ల మంది ఉంటారని ‘ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్’ తాజా అట్లాస్‌లో అంచనావేసింది. 1990 దశకం నుంచి భారత్‌లో డయాబెటీస్ మృతులు ఏటేటా పెరుగుతున్నారు. 1990లో మొత్తం మృతుల్లో డయాబెటీస్ రోగులు 2.7 శాతం ఉండగా, అది 2015 సంవత్సరం నాటికి మొత్తం మృతుల్లో 3.3 శాతానికి చేరుకున్నారు. ప్రతి లక్ష మందిలో 26 మంది డయాబెటీస్‌తో మరణిస్తున్నారు. డయాబెటీస్ కారణంగా అంగవికలురు అవుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. ఇతర దేశాల్లో 60 ఏళ్ల పైబడిన వారు డయాబెటీస్ బారిన పడుతుండగా, భారత్‌లో 40-50 ఏళ్ల మధ్యనున్న వారు ఎక్కువగా ఈ జబ్బు బారిన పడడం ఆందోళనకరమైన అంశం. కొన్ని శతాబ్దాలుగా డయాబెటీస్ భారతీయులను పట్టి పీడిస్తోంది. ఇందుకు జన్యుపరమైన కారణాలతోపాటు సామాజిక కారణాలు ఉన్నాయి. ‘ఆసియన్ ఇండియన్ పెనోటైప్’గా వ్యవహరించే జన్యువుల కారణంగానే భారతీయులు ఎక్కువగా ఈ జబ్బు బారిన పడుతున్నారు. భారతీయులు బక్కగా ఉన్నప్పటికీ వారి అంతర్గత అవయవాల చుట్టూ కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండడం వల్లనే వారిలో క్లోమ గ్రంధి సవ్యంగా పనిచేయదు. కండరాలు ఇన్యుసిలన్ను సవ్యంగా గ్రహించలేవు. పర్యవసానంగా మధుమేహం తప్పడంలేదు. సరైన శారీరక శ్రమలేని ఆధునిక జీవన విధానం కూడా జబ్బు విస్తరణకు కారణం అవుతోంది. డయాబెటీస్ కారణంగా గుండె జబ్బులు, స్ట్రోక్, మెదడు నరాలు చిట్లి పోవడం, కిడ్నీలు దెబ్బతినడం లాంటి సమస్యలు ఉత్పన్నమవడమే కాకుండా నరాలు, కండరాలు దెబ్బతిని కొన్ని సందర్భాల్లో కాళ్లు తొలగించాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఈ జబ్బు చికిత్స కోసం పట్టణ ప్రాంతాల్లో ఒక్కో వ్యక్తి ఏటా పది వేల రూపాయలు ఖర్చు పెడుతుండగా, గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో వ్యక్తి ఆరున్నర వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. -
కాటేస్తున్న సారా
- నాలుగు రోజుల్లో ముగ్గురు మృతి - జీర్ణకోశ, కాలేయ వ్యాధులకు గురవుతున్న గిరిజనులు పాడేరు/కొయ్యూరు: మన్యంలో ఏరులై పారుతున్న సారా గిరిజనుల ప్రాణాలను హరిస్తోంది. విచ్చలవిడిగా చౌకగా దొరుకుతుండడంతో ఆదివాసీలు దీనికి బానిసయి ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. మారుమూల గ్రామాల్లో తయారీ మూడు పీపాలు ఆరు క్యాన్లుగా సాగిపోతోంది. అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఏజెన్సీలో కుటీర పరిశ్రమగా ఉంటున్న ఇది ‘సెలైంట్ కిల్లర్’లా అవతరిస్తోంది. దీంతో మారుమూల గూడేల్లో ఎప్పటికప్పుడు చావుడప్పు మోగుతోంది. సారా కారణంగా ఆదివాసీలు జీర్ణకోశ,కాలేయ వ్యాధులకు గురవుతున్నారు. పాడేరు మండలం జోడుమామిడికి చెందిన కొర్రా సుబ్బారావు అనారోగ్యంతో సోమవారం రాత్రి పాడేరు ఆస్పత్రిలో చేరి చనిపోయాడు. లివర్ సిరోసిస్‌తో చనిపోయినట్టు వైద్యాధికారులు నిర్ధారించారు. పూటుగా సారా తాగడమే ఇందుకు కారణమని తెలిపారు. కొయ్యూరు మండలంలోనూ సారా కాటుకు ఇద్దరు బలయ్యారు. రోజూ పూటుగా తాగడంతో తీవ్ర అనారోగ్యానికి గురై ఈ మండలంలోని మర్రివాడకు చెందిన పొత్తూరి రమణబాబు(35)చనిపోయాడు. అనారోగ్యానికి గురైన రమణబాబును మంగళవారం రాజేంద్రపాలెం ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరిస్థితి విషమంగా ఉండడంతో నర్సీపట్నం తరలించారు. బుధవారం మరణించాడు. ఆదే గ్రామానికి చెందిన షేక్ బాబ్జి(46) ఇలాగే నాలుగు రోజుల కిందట చనిపోయాడు. మరి కొందరు సారాకు బానిసలై అనారోగ్యంతో విలవిల్లాడుతున్నారు. మద్యం ధరలకు రెక్కలతో ఏజెన్సీలో సారాతయారీ, అమ్మకాలు విస్తృతమయ్యాయి. మన్యంలో జోడుమామిడి, చింతగున్నెల, వై.సులములు, ఎస్.బొడ్డాపుట్టు, దుమ్మాపుట్టు, ఉరుగొండ, కించూరు, వై.మోదాపుట్టు అటవీ ప్రాంతాల్లో సారా బట్టీల జోరు ఎక్కువైంది. నిషా కోసం ప్రాణాంతకమైన యూరియా, బ్యాటరీ పౌడర్ వంటివి వినియోగిస్తున్నారు. ఇదే ముప్పు తెస్తోంది. సారా తయారీకి ఉపయోగించే నల్లబెల్లం రవాణాను నిషేధించినప్పటికీ దీని తయారీ, రవాణాను ఎక్సైజ్‌శాఖ నియంత్రించలేకపోతోంది. 20 ఏళ్లు దాటిన యువకుల నుంచి పురుషులు, మహిళలు కూడా దీనికి బానిసలవుతున్నారు. హెల్త్ ఎడ్యుకేట్ చేస్తున్నాం... సారా కారణంగా గిరిజనులు అనారోగ్యానికి గురవుతున్నారు. ఇలాంటివి ఎక్కువ కేసులే నమోదవుతున్నాయి. దీనిపై హెల్త్ ఎడ్యుకేట్ చేస్తున్నాం. అయినా మానకపోవడంతో జీర్ణకోశ, లివర్ ఫెయిల్యూర్, లివర్‌సిరోసిస్, నరాల వ్యవస్థ క్షీణించడం, పొట్టలో నీరు చేరడం, అల్సర్ వంటి వ్యాధులకు గురవుతున్నారు. క్రమేపీ ఆరోగ్యం క్షీణించి చనిపోతున్నారు. చాలా చోట్ల మహిళలు దీనిని వ్యతిరేకిస్తున్నప్పటికీ సరైన తోడ్పాటు ఉండటం లేదు. గ్రామాల్లో చైతన్యం నింపి సారాను అరికట్టాలి. - డాక్టర్ పార్థసారధి, డిప్యూటీ డీఎంహెచ్‌వో, పాడేరు. -
ఏవీఎస్ ఇకలేరు
తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసిన హాస్యనటుడు కాలేయం, మూత్రపిండాలకు తీవ్ర ఇన్ఫెక్షన్ సాక్షి, హైదరాబాద్: ప్రముఖ తెలుగు హాస్యనటుడు ఏవీఎస్ శుక్రవారం రాత్రి తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన పూర్తి పేరు ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం. వయసు 56 సంవత్సరాలు. స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. హైదరాబాద్‌లోని మణికొండలో నివసిస్తున్న ఏవీఎస్‌కు భార్య ఆశ, కుమారుడు ప్రదీప్, కూతురు ప్రశాంతి ఉన్నారు. కొంతకాలంగా కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఏవీఎస్‌ను పది రోజుల కిందట చికిత్స కోసం గ్లోబల్ ఆస్పత్రిలో చేర్పించారు. కాలేయంలో తీవ్ర ఇన్ఫెక్షన్తో పాటు మూత్రపిండాలు పాడైపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. పది రోజుల నుంచి ఆయన్ను ఐసీయూలో ఉంచి చికిత్స అందించినా ఫలితం లేకపోవటంతో శుక్రవారం సాయంత్రం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. హైదరాబాద్ మణికొండ పంచాయతీ పరిధిలోని శివాజీనగర్ కాలనీలో గల దేవులపల్లి అపార్ట్మెంట్లో ఆయన స్వగృహానికి తరలించారు. ఏవీఎస్ రాత్రి 8.05 నిమిషాల ప్రాంతంలో కన్నుమూశారు. ఆయనకు 2008లో కాలేయం పాడైపోగా.. అప్పట్లో గ్లోబల్ ఆస్పత్రి వైద్యులు కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేశారు. ఏవీఎస్ కుమార్తె శ్రీప్రశాంతి ఆయనకు లివర్‌ను దానం చేశారు. శస్త్రచికిత్స తర్వాత కోలుకున్న ఆయన మళ్లీ సినిమాల్లో నటించడం మొదలు పెట్టారు. ఐదేళ ్లపాటు ఆరోగ్యంగానే ఉన్నారు. అయితే నటనే ప్రాణంగా బతుకుతున్న ఏవీఎస్ వేళకు మందులు వేసుకోకపోవడం, సమయానికి వైద్యుడిని సంప్రదించకపోవడం వంటి కారణాలతో కాలేయంలో ఇటీవల మళ్లీ ఇన్ఫెక్షన్ వ చ్చింది. మళ్లీ ఆస్పత్రిలో చికిత్స అందించినప్పటికీ.. ఇన్ఫెక్షన్ తగ్గకపోగా మూత్రపిండాలపై కూడా ప్రభావం పడింది. మూత్రపిండాలు కూడా పాడైపోవడంతో డయాలసిస్ చేస్తున్నారు. ఏవీఎస్‌కు మళ్లీ కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేసినా ఫలితం ఉండదని, కోలుకోలేని స్థితిలోకి వెళ్లిపోయారని, ఇక తాము ఏమీ చేయలేమని ఆయనకు చికిత్స అందిస్తున్న వైద్యులు చెప్పారు. దీంతో బంధువులు ఆయన్ను శుక్రవారం సాయంత్రం 4:30 గంటలకు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్లారు. ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్నాక తనను చూసేందుకు వచ్చిన వారితో ఏవీఎస్ మాట్లాడారు. ఆ తర్వాత కొద్ది గంటలకే ఆయన కన్నుమూశారు. ప్రముఖుల నివాళులు: పాత్రికేయుడు, హాస్యనటుడు, రచయిత, నిర్మాత, దర్శకుడిగా బహుముఖ ప్రతిభాశాలి అయిన ఏవీఎస్ మరణంతో మణికొండలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయనను చివరిసారిగా పరామర్శించిన వారిలో సినీ ప్రముఖులు మురళీమోహన్‌తో పాటు శివకృష్ణ, పరుచూరి గోపాలకృష్ణ, జయలలిత, అశోక్‌కుమార్, మహర్షి ఉన్నారు. ఏవీఎస్ మరణం విషయం తెలుసుకుని సినీనటులు సాయికుమార్, ఆలి, ఉత్తేజ్ లు నివాళులర్పించారు. పార్లమెంటు సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. ఏవీఎస్ మృతికి కిరణ్, బాబు, చిరంజీవి విచారం ఏవీఎస్ మృతి పట్ల ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఏవీఎస్ ఉత్తమ నటుడని, తన ప్రతిభతో ఎన్నో అవార్డులు గెలుచుకున్నారని సీఎం పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఏవీఎస్ మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏవీఎస్ మృతి సినీ ప్రపంచానికి తీరనిలోటని కేంద్ర మంత్రి చిరంజీవి సంతాపం వ్యక్తంచేశారు. రాష్ట్ర మంత్రి డీకే అరుణ ఏవీఎస్ కుటుంబ సభ్యులకు తన సానుభూతి తెలిపారు. జర్నలిస్టుల ఉద్యమంలో ఏవీఎస్ ఎనలేని కృషి చేశారని స్మరించుకున్నారు. పాత్రికేయుల హక్కుల కోసం ఆయన పోరాటం చేశారని ఇండియన్ జర్నలిస్టు యూనియన్ (ఐజేయూ) సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు సోమసుందర్, ప్రధాన కార్యదర్శి వై.నరేందర్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి మామిడి సోమయ్యలు సంతాపం తెలిపారు. కళా రంగానికి తీరని లోటు: జగన్ సంతాపం హాస్యనటుడు ఏవీఎస్ మరణం పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపం తెలిపారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఏవీఎస్ మరణం కళా, సాంస్కృతిక రంగాలకు తీరనిలోటన్నారు. జర్నలిస్టుగా జీవితాన్ని ప్రారంభించిన ఏవీఎస్ సినీరంగంలో స్థిరపడి, తన నటనతో తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలు చూరగొన్నారని కీర్తించారు. ఏవీఎస్ మృతి సినిమా రంగానికి తీరని లోటంటూ.. ఆయన కుటుంబ సభ్యులకు జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
కాలేయ వ్యాధులు... చికిత్స
ప్రస్తుత కాలంలో మానవ జీవన విధానంలో అనేక మార్పుల వలన, అలాగే ఆహారపు అలవాట్లలో మార్పులవలన ఈ కాలేయ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. మన ఆహారంలో తీసుకున్న కొవ్వు పరిమాణం పెరుగుతోంది. అలాగే శరీరం కదలికలు తగ్గుతున్నాయి, శ్రమ చేసే తత్వం తగ్గిపోతుంది. మద్యపానం దిన చర్యలో భాగం అయిపోయింది. ఇవి అన్నీ నాగరికత పేరుతో ఆరోగ్యానికి చెరుపు చేస్తున్నాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తీ లేదు. ఈ ఆధునిక కాలంలో మధుమేహం, స్థూలకాయం, థైరాయిడ్, సంతానలేమి అనే సమస్యలు ఎలా సాధారణం అయిపోయాయో, అలాగే కాలేయ సంబంధ సమస్యలూ ఎక్కువ అయ్యాయి. దానికి కారణాలు: ఫాస్ట్ ఫుడ్ సంస్కృతి, చక్కెర సంబంధిత ఆహార పదార్థాలసేవన, కొవ్వు అధికంగా ఉండే పదార్థాలు తీసుకోవడం. ఇటీవల ఫ్యాటీలివర్ అనే సమస్యతో బాధపడేవారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఫ్యాటీలివర్... ఉదరంలో కాలేయగ్రంథి అనేది ముఖ్యమైన అవయవం, కుడివైపున ఉంటుంది. ఇది అన్నింటి కంటే చాలా పెద్దగ్రంథి. అలాగే జీర్ణప్రక్రియలో అతి ప్రాధాన్యతను సంతరించుకున్నది. మానవులు తీసుకున్న ఆహారంలో చక్కెర శాతం పెరుగుతున్న కొలది కాలేయంలో నిల్వ అవుతూపోతుంది. తర్వాత అది శక్తిగా మారుతుంది. శక్తిగా మారుతున్న చెక్కెరను మినహాయిస్తే మిగిలినది కొవ్వుగా మారుతుంది. ఈ ప్రక్రియలో కాలేయంలో ఉండే కణాలు తమ గుణాన్ని కోల్పోయి, అక్కడ కొవ్వు పేరుకుపోతుంది. దీనినే వైద్య పరిభాషలో ఫ్యాటీలివర్‌గా వ్యవహరిస్తారు. దీనిలో అనేక దశలు ఉంటాయి. వీటిలో ముఖ్యమైనవి 3 దశలు. మొదటి దశ: కాలేయ కణాల మధ్య కొంచెం కొవ్వు పేరుకుంటుంది. రెండవ దశ: నాష్ అంటారు. ఇందులో కాలేయం గాయపడటం (డామేజ్)తో పాటు, కొన్ని కాలేయ కణాలు నశించిపోతాయి. మూడవ దశ: సిర్రోసిన్ వస్తుంది. అంటే కాలేయంలోని కణాలు తమ కార్యనిర్వహణ శక్తిని పూర్తిగా కోల్పోతుంది. స్వరూపం కూడా మారిపోతుంది. ఇది ప్రమాదకరమైన కండిషన్. ముఖ్యంగా ఇక్కడ కాలేయ మార్పిడి తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. సాధారణ కారణాలు: ఆహారంలో పిండి పదార్థాలు, కొవ్వులు ఎక్కువగా ఉన్న ఆహారం తినటం, మద్యపానం ఎక్కువగా చెయ్యటం, ప్రమేహం, స్థూలకాయం కూడా కారణాలుగా చెప్పుకోవచ్చు. సాధారణ లక్షణాలు: సాధారణంగా ఫ్యాటీలివర్ వ్యాధితో బాధపడే వారికి ఈ లక్షణాలు ఉండవు. కాని ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షలో ఇది ఉన్నట్లు నిర్ధారణ అవుతుంది కొందరికి కుడివైపు పొట్ట పైభాగంలో (రిబ్కేజ్ పక్కటెముకల కింద) పొడిచినట్లుగా నొప్పి వస్తుంది. ఇది కాలేయం కొంచెం కొంచెం పెరుగుతున్నట్లు (లివర్ ఎన్‌లార్జ్‌మెంట్) ఉండటం వల్ల వస్తుంది కొందరిలో మాంసాహారం, నూనె పదార్థాలు, తిన్నప్పుడు అలాంటి నొప్పి వచ్చే అవకాశం ఉంది. కాలక్రమేణా కాలేయంలో వచ్చే మార్పులు కాలేయవ్యాధి వచ్చిన తర్వాత తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే కాలేయం పూర్తిగా దెబ్బతిని సిర్రోసిస్ లేదా లివర్‌క్యాన్సర్‌గా మారవచ్చు. ఫ్యాటీలివర్ మొదటిదశ నుండి రెండవ దశ అయిన ఎన్.ఏఎస్.హెచ్‌కు. అక్కడి నుండి 3వ దశ అయిన సిర్రోసిస్‌కు దారి తీస్తుంది అనుకోకూడదు. చాలా సందర్భాలలో 1 నుండి నేరుగా 3 కు దారితీయవచ్చు. అందుకే ఫ్యాటీలివర్ కన్పించగానే తగు జాగ్రత్త తీసుకోవాలి. స్థూలకాయం వలన అనర్థాలు: బరువు పెరుగుతున్న కొద్దీ కాలేయానికి నష్టం వాటిల్లుతుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి స్థూలకాయం ఉన్న 90% వ్యక్తులలో ఫ్యాటీలివర్, ఫ్యాటీలివర్ మొదటిదశ కనిపిస్తుంది స్థూలకాయం ఉన్న 20% వ్యక్తుల్లో మనం రెండవ దశగా పేర్కొన్న ఎన్.ఏ.ఎస్.హెచ్. దశ ఉంటుంది ఫ్యాటీలివర్ వచ్చిన వ్యక్తులను పరిశీలిస్తే వారిలో దాదాపు 50% మందికి డయాబెటిస్ ఉన్నట్లు తెలుస్తుంది. సిర్రోసిస్ వచ్చిన వారిలో 50% మంది డయాబెటిస్, స్థూలకాయం ఉన్నవారే. నిర్ధారణ పరీక్షలు: అల్ట్రాసౌండ్, అబ్డామిన్ స్కానింగ్‌లో చాలావరకు ఫ్యాటీలివర్ డిసీజ్ తెలుస్తుంది. లివర్ ఫంక్షన్ పరీక్ష చేయించాలి. దానిలో ఏవైనా ఎంజైములు స్రవించడం వల్ల కాలేయం దెబ్బ తిన్నడం అనే విషయం తెలుస్తుంది. డయాబెటిస్, కొలెస్ట్రాల్ స్థాయిలు, టైగ్లిసరైడ్స్ స్థాయులు ఏమైనా పెరిగాయా అని చూడాలి. కొందరిలో లివర్ బయాప్సీ అవసరం. కామెల: ఆయుర్వేదశాస్త్రంలో కాలేయ వ్యాధులలో అతిసాధారణ వ్యాధి కామెల. దీనినే సాధారణంగా జాండీస్ అంటారు. ఈ సమస్య ఉన్నవారిలో ఒళ్లంతా పచ్చగా మారుతుంది. ముఖ్యంగా కళ్లు, మూత్రం, గోళ్లు, పసుపురంగుగా మారతాయి. ఇంకా తీవ్రమైతే శరీరంలోని చర్మం అంతా పసుపురంగుగా మారుతుంది. జ్వరం, ఆకలి మందగించడం, వ మనం అవుతుందనే భ్రాంతి లక్షణాలు ఉంటాయి. ఇది ఒక రకమైన వైరస్ ద్వారా వస్తుంది. తద్వారా కాలేయం సామాన్య కర్మ దెబ్బ తింటుంది. ఈ వైరస్ అనేది తీసుకొనే తినుబండారాలు, పానీయాలు ముఖ్యంగా చెరుకురసం, ఐస్ కలిసిన పండ్ల రసం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది ఎక్కువ అయితే రోగి మెదడు దెబ్బతిని కోమాలోకి కూడా వెళ్లవచ్చును. నివారణ: ఇది వేసవిలో ఎక్కువగా వస్తుంది కనుక, ఇంట్లో తయారు చేసిన పదార్థాలు తీసుకొనుట వలన, కామెర్ల వ్యాధిని నివారించవచ్చు. కలుషిత నీరు తాగకుండా నీరు కాచి, చల్లార్చి త్రాగటం మంచిది. చికిత్స: ఈ వ్యాధి సోకినవారు మసాలాలు, నూనె పదార్థాలు, కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండాలి. పెరుగు లేక మజ్జిగ అన్నం తినటం మంచిది. ద్రవపదార్థాల సేవన అంటే కొబ్బరినీళ్లు, బార్లీ, గ్లూకోజ్ నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. ఔషధ చికిత్స ఆయర్వేదంలో చక్కటి ఔషద పరిష్కార మార్గాలు ఉన్నాయి. అలాగే అవసరాన్ని బట్టి విరేచనం, తక్రధార అనే పంచకర్మ చికిత్సా పద్ధతులు ఉంటాయి. ఇవి వైద్యుల పర్యవేక్షణలో తీసుకోవాలి. డాక్టర్ హనుమంతరావు ఎం.డి (ఆయుర్వేద), స్టార్ ఆయుర్వేద, సికింద్రాబాద్, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, కర్ణాటక ph: 99089 11199 / 99599 11466 వ్యాధి నివారణ - తీసుకోవలసిన జాగ్రత్తలు బరువు తగ్గటం, ఆరోగ్యకరమైన ఆహారం, విధిగా కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. నెయ్యివంటి కొవ్వు పదార్థాలు వాడరాదు. ఆలివ్ ఆయిల్ వాడాలి. తృణధాన్యాలు, పొట్టుతీయని బియ్యం, గోధుమలు ఎక్కువగా వాడాలి. వ్యాయామం చేయాలి, డయాబెటిస్ అదుపులో ఉంచుకోవాలి. కొలెస్ట్రాల్ పాళ్లను తగ్గించుకోవాలి. దురలవాట్లు లేకుండా ఉండాలి. ఆల్కహాల్ వంటి మత్తు పదార్థాలను తీసుకొనే అలవాటు ఉంటే వాటికి దూరంగా ఉండాలి. -
శ్రీహరి ఇక లేరు
ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో గుండెపోటుతో కన్నుమూత సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ నటుడు రఘుముద్రి శ్రీహరి (49) హఠాన్మరణం పొందారు. గత కొంత కాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న శ్రీహరి ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో బుధవారం సాయంత్రం 4 గంటల 20 నిమిషాలకు కన్నుమూశారు. ముంబైలో హిందీ చిత్రం ‘రాంబో రాజ్‌కుమార్’ షూటింగ్లో పాల్గొంటున్న శ్రీహరి మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను అక్కడి లీలావతి ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీహరి తుది శ్వాస విడిచారు. కాగా, ఛాతి నొప్పి రావడంతో మధ్యాహ్నం 1. 14 గంటలకు శ్రీహరిని ఆస్పత్రికి తరలించారని బాంద్రా పోలీస్ స్టేషన్ అధికారి ధోర్కర్ చెప్పారు. మంగళవారం షూటింగ్లో పాల్గొన్న ఆయన బుధవారం కూడా కొనసాగించాల్సి ఉంది. అయితే ఉదయం 11 గంటల ప్రాంతంలో గుండె నొప్పి రావడంలో షూటింగ్ కేన్సిల్ చేశారని ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ సాక్షితో చెప్పారు. ఆయనతో పాటు భార్య శాంతి కూడా ఉన్నారు.హైదరాబాద్‌లోని బాలానగర్‌లో ఓ మధ్య తరగతి కుటుంబంలో 1964 ఆగస్టు 15న శ్రీహరి జన్మించారు. మొదట్నుంచీ కూడా ఆయనకు జిమ్నాస్టిక్స్‌పై ఆసక్తి. బాడీ బిల్డర్‌గా పేరు తెచ్చుకున్నారు. జూబ్లీ హిల్స్‌లో స్థిరపడినా కూడా, ఇప్పటికీ బాలానగర్ ప్రాంతంతో అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకూ 97 సినిమాల్లో నటించిన శ్రీహరి ‘రియల్ స్టార్’గా పేరు తెచ్చుకున్నారు. ఆయనకు భార్య శాంతి, ఇద్దరు కుమారులు మేఘాంశ్, శశాంక్ ఉన్నారు. ఆయన మరణవార్త సినీ, రాజకీయ రంగాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. శ్రీహరి మరణం పట్ల నటీనటుల సంఘం, నిర్మాతల మండలి, దర్శకుల సంఘం తమ సంతాపాన్ని తెలియజేశాయి. మంచి నటుడిని కోల్పోయాం: సీఎం కిరణ్ శ్రీహరి మృతితో తెలుగు సినీ పరిశ్రమ ఒక గొప్ప నటుడిని కోల్పోయిందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పలు విభిన్న పాత్రల్లో నటించి తెలుగువారి మెప్పు పొందిన శ్రీహరి హఠాన్మరణం చెందడం సినీ పరిశ్రమకు తీరని లోటు అన్నారు. శ్రీహరి కుటుంబానికి సానుభూతి తెలిపారు. శ్రీహరి హఠాన్మరణం బాధాకరం...వైఎస్ విజయమ్మ తెలుగు సినీ లోకంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న శ్రీహరి హఠాన్మరణం అత్యంత బాధాకరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. శ్రీహరి మృతిపై ఆమె తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్వశక్తితో ఎదిగి, తెలుగు సినిమాల్లో మంచి పాత్రలు పోషించి అభిమానులను సొంతం చేసుకోవడమే కాకుండా, పలు సామాజిక కార్యక్రమాల్లోనూ పాలుపంచుకుని తన ఉదారత చాటుకున్నారని అన్నారు. తెలుగు సినీ పరిశ్రమ ఒక మంచి నటుణ్ణి కోల్పోయిందని విజయమ్మ అన్నారు. శ్రీహరి కుటుంబానికి ఆమె ప్రగాఢ సానుభూతి తెలిపారు. తీరని లోటు: డీకే అరుణ ప్రముఖ నటుడు శ్రీహరి మృతి తెలుగు సినిమా రంగానికి తీరని లోటు అని సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి డీకే అరుణ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. శ్రీహరి మృతికి ఆమె సంతాపం తెలిపారు. యుక్త వయసులోనే సినీరంగంలో ప్రవేశించి ఎన్నో ఉత్తమ చిత్రాల్లో నటించి అభిమానులతో రియల్‌స్టార్ అనిపించుకున్నారని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అద్భుత నటుడు: దత్తాత్రేయ సినీనటుడు శ్రీహరి ఆకస్మిక మృతికి బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తంచేశారు. క్యారెక్టర్ నటుడిగా, విలన్‌గా, హీరోగా అద్భుతంగా రాణించిన శ్రీహరి పిన్నవయస్సులో మరణించడం సినీరంగానికి లోటేనని పేర్కొన్నారు. కళారంగానికే లోటు: కేసీఆర్ సినీ నటుడు శ్రీహరి మృతి పట్ల టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. శ్రీహరి మృతి సినీరంగానికి, కళారంగానికి తీరని లోటు అని పేర్కొన్నారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. శ్రీహరి మృతి కళారంగానికే కాకుండా తనకు వ్యక్తిగతంగా కూడా తీరని లోటు అని పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు డాక్టర్ దాసోజు శ్రవణ్ ఒక ప్రకటనలో సంతాపాన్ని వ్యక్తం చేశారు.