సాక్షి,హైదరాబాద్: దేశంలో, కాలేయ వ్యాధుల విస్తృతి వేగవంతమవుతోందని పలువురు వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. కాలేయ వ్యాధి చికిత్సకు పేరొందిన గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్స్‌లో ఏర్పాటైన ప్రప్రథమ లివర్ కాన్‌క్లేవ్ శనివారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఏఐజీ ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ నాన్–ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (ఎన్‌ఎఎఫ్‌ఎల్‌డి), హెపటైటిస్ బి–సి, హెపాటోసెల్లర్ కార్సినోమా (లివర్ క్యాన్సర్) చిన్నారులను ఎక్కువగా ప్రభావితం చేస్తోందని, ఊబకాయం ఉన్న పిల్లలలో సుమారు 60 శాతం మంది ఫ్యాటీ లివర్ వ్యాధికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
పేలవమైన ఆహారపు అలవాట్లు, నిశ్చల జీవనశైలి ద్వారా సంభవించే మధుమేహం, ఫ్యాటీలివర్ వ్యాధుల కలయిక తీవ్రమైన సిర్రోసిస్ (కాలేయం గట్టిపడటం)కు దారి తీస్తోందన్నారు. కాలేయ వైఫల్యానికి దారితీసే అతిపెద్ద కారణాలలో ఒకటి మద్యపానం కాగా ఇటీవలి కాలంలో అది మరింత పెరిగిందన్నారు. అదే విధంగా ఆల్కహాల్ వినియోగంతో సంబంధం లేకుండా కూడా కాలేయ వైఫల్యంతో అనేకమంది బాధపడుతున్నారని, తమ హెపటాలజీ విభాగంలో ఇంతకు ముందెన్నడూ లేని స్థాయిలో రోగుల్ని తాము చూస్తున్నామని ఆసుపత్రికి చెందిన హెపటాలజీ విభాగం డైరెక్టర్ డాక్టర్ మిథున్ శర్మ చెప్పారు.
నగరాలు, పట్టణాలు మాత్రమే కాకుండా ఇది గ్రామీణ జనాభాపై కూడా ప్రభావం చూపుతోందన్నారు. ఇంత పెద్ద ఎత్తున సదస్సు నిర్వహించడం వల్ల వైద్య నిపుణుల మేధో మధనాలు, విశ్లేషణల వల అంతిమంగా రోగులకి ప్రయోజనం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సదస్సులో తాను కనుగొన్న హెపటైటిస్ సి వైరస్ గురించి నోబెల్ గ్రహీత ప్రొఫెసర్ హార్వే జె ఆల్టర్ కీలకోపన్యాసం చేశారు. దాదాపు 1300 మందికి పైగా అగ్రశ్రేణి అంతర్జాతీయ కాలేయ వైద్య నిపుణులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment