భారత్‌లో పెరుగుతున్న డయాబెటీస్ మృతులు
న్యూఢిల్లీ: ఆధునిక జీవన విధానం వల్ల భారతీయులు ఎక్కువగా డయాబెటీస్ (మధుమేహం) బారిన పడుతున్నారు. ప్రపంచ డయాబెటీస్ రోగుల్లో రెండో స్థానంలో ఉన్న భారత్‌లో 2015 సంవత్సరంలో 3,46,000 మంది డబాబెటీస్ కారణంగా మరణించారని ‘గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీస్’ అనే సంస్థ వెల్లడించింది. 2005 నుంచి 2015 మధ్య భారత్‌లో డయాబెటీస్ రోగులు ఏకంగా 50 శాతం పెరగడం ఆందోళనకరమైన అంశమని వ్యాఖ్యానించింది.
ఏయే వ్యాధుల కారణంగా భారతీయులు ఎక్కువగా మరణిస్తున్నారన్న విషయంలో డయాబెటీస్ జబ్బు 2005లో 11వ ర్యాంకులో ఉండగా, అది ఇప్పుడు ఏడవ ర్యాంకుకు చేరుకున్నది. భారత్‌లో ఎక్కువ మంది మరణిస్తున్నది గుండెపోటు కారణంగానే. ఆ తర్వాత కాలేయ వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు, మెదడు రక్తనాళాల సమస్య, టీబీ, అతిసారం వ్యాధులు మొదటి ఆరు స్థానాల్లో ఉండగా ఏడవ స్థానానికి డయాబెటీస్ చేరుకుంది. హెచ్‌ఐవికన్నా డయాబెటీస్ కారణంగానే భారతీయులు ఎక్కువగా మృత్యువాత పడుతున్నారు. మున్ముందు టీబీ కారణంగా చనిపోతున్నవారికన్నా డయాబెటీస్ కారణంగానే ఎక్కువ మంది చనిపోయే ప్రమాదం ఉందని గ్లోబల్ సంస్థ హెచ్చరించింది.
10.90 కోట్ల మంది డయాబెటీస్ రోగులతో చైనా ప్రపంచంలోనే మొదటి స్థానంలో కొనసాగుతుండగా, 6.91 కోట్ల రోగులతో భారత్ రెండో స్థానంలో కొనసాగుతోంది. భారత్‌లో డయాబెటీస్ బయటపడని రోగులు మరో మూడున్నర కోట్ల మంది ఉంటారని ‘ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్’ తాజా అట్లాస్‌లో అంచనావేసింది. 1990 దశకం నుంచి భారత్‌లో డయాబెటీస్ మృతులు ఏటేటా పెరుగుతున్నారు. 1990లో మొత్తం మృతుల్లో డయాబెటీస్ రోగులు 2.7 శాతం ఉండగా, అది 2015 సంవత్సరం నాటికి మొత్తం మృతుల్లో 3.3 శాతానికి చేరుకున్నారు. ప్రతి లక్ష మందిలో 26 మంది డయాబెటీస్‌తో మరణిస్తున్నారు. డయాబెటీస్ కారణంగా అంగవికలురు అవుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది.
ఇతర దేశాల్లో 60 ఏళ్ల పైబడిన వారు డయాబెటీస్ బారిన పడుతుండగా, భారత్‌లో 40-50 ఏళ్ల మధ్యనున్న వారు ఎక్కువగా ఈ జబ్బు బారిన పడడం ఆందోళనకరమైన అంశం. కొన్ని శతాబ్దాలుగా డయాబెటీస్ భారతీయులను పట్టి పీడిస్తోంది. ఇందుకు జన్యుపరమైన కారణాలతోపాటు సామాజిక కారణాలు ఉన్నాయి. ‘ఆసియన్ ఇండియన్ పెనోటైప్’గా వ్యవహరించే జన్యువుల కారణంగానే భారతీయులు ఎక్కువగా ఈ జబ్బు బారిన పడుతున్నారు. భారతీయులు బక్కగా ఉన్నప్పటికీ వారి అంతర్గత అవయవాల చుట్టూ కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండడం వల్లనే వారిలో క్లోమ గ్రంధి సవ్యంగా పనిచేయదు. కండరాలు ఇన్యుసిలన్‌ను సవ్యంగా గ్రహించలేవు. పర్యవసానంగా మధుమేహం తప్పడంలేదు. సరైన శారీరక శ్రమలేని ఆధునిక జీవన విధానం కూడా జబ్బు విస్తరణకు కారణం అవుతోంది.
డయాబెటీస్ కారణంగా గుండె జబ్బులు, స్ట్రోక్, మెదడు నరాలు చిట్లి పోవడం, కిడ్నీలు దెబ్బతినడం లాంటి సమస్యలు ఉత్పన్నమవడమే కాకుండా నరాలు, కండరాలు దెబ్బతిని కొన్ని సందర్భాల్లో కాళ్లు తొలగించాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఈ జబ్బు చికిత్స కోసం పట్టణ ప్రాంతాల్లో ఒక్కో వ్యక్తి ఏటా పది వేల రూపాయలు ఖర్చు పెడుతుండగా, గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో వ్యక్తి ఆరున్నర వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు.