ప్రతీకాత్మక చిత్రం
ఇటీవలి కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరూ మధుమేహంతో సతమతమవుతున్నారు. తీపి తినాలనుకుంటే నోరు కట్టేసుకోవడమే కాదు.. తరచూ చెకప్‌లు చేయించుకోవడం, ఇన్సులిన్ స్థాయిని అదుపులో ఉంచేందుకు ఇంజక్షన్‌లు తీసుకోవడం వంటి అంశాలు షుగర్ పేషంట్లకు మరింత కష్టతరంగా మారుతున్నాయి. అయితే ఇన్సులిన్ మాత్రలను అందుబాటులోకి తేవడం ద్వారా తరచూ ఇంజక్షన్ తీసుకోవాల్సిన అవసరాన్ని తప్పించి.. వారి ఇబ్బందుల్ని కాస్తైనా దూరం చేయొచ్చని తాజా పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.
ఇన్సులిన్‌ను మాత్రల రూపంలో అందించేందుకు తాము జరిపిన పరిశోధనలు సత్ఫలితాలను ఇస్తున్నాయని హార్వర్డ్ జాన్ పాల్‌సన్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ అప్లైడ్ సైన్సెన్ బయాలజీ ప్రొఫెసర్ సమీర్ మిత్రగొట్రి అంటున్నారు. అయితే కడుపులో ఉండే ఆమ్లాలు జీర్ణవ్యవస్థలోకి చేరకముందే ఇన్సులిన్‌ను నిర్వీర్యం చేయడం వల్ల మాత్రలు పూర్తి స్థాయిలో ప్రభావం చూపలేవన్నారు. ‘ఇన్సులిన్ మాత్రను పేగు లోపలి పంపించవచ్చు. కానీ ప్రొటీన్ల రవాణాను అడ్డుకునే విధంగా పేగు నిర్మాణం రూపొంది ఉండటం వల్ల అది పేగు గోడలను దాటలేదన్నారు. పేగు గోడలపై ఉన్న శ్లేష్మ పొర గుండా ఇన్సులిన్‌ను పంపించి రక్తంలోకి ప్రవహించేలా చేయడం కూడా సవాలుతో కూడుకున్న పని’ అని ఆయన వివరించారు. అయితే ఆమ్లాలను తట్టుకునే తొడుగు ఉండే మాత్రలను తయారు చేయడం ద్వారా సమస్యను అధిగమించవచ్చని పేర్కొన్నారు. దీంతో ఇన్సులిన్ మాత్రలు చిన్న పేగులను చేరే వరకూ ఇన్సులిన్‌ను విడుదల చేసే అవకాశం ఉండదు గనుక రక్తంలోకి సులభంగా ప్రవేశపెట్టవచ్చన్నారు.
ఇన్సులిన్ మాత్రల ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఆరు మధుమేహ రహిత ఎలుకలపై పరిశోధనలు చేసినట్లు ఆయన తెలిపారు. ఇందులో మూడింటికి మాత్రల రూపంలో, మిగిలిన వాటికి ఇంజక్షన్ ద్వారా ఇన్సులిన్ అందించినట్లు తెలిపారు. అయితే మాత్రలు ఇచ్చిన ఎలుకల్లో రక్తంలోని గ్లూకోజ్ స్థాయి రెండు గంటల్లోపే 38 శాతానికి పడిపోయిందని.. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా తగ్గుతూ 10 గంటల్లో 45 శాతానికి చేరిందన్నారు. ఇంక్షన్ ఇచ్చిన ఎలుకల్లో గ్లూకోజ్ స్థాయి గంటలోపే 49 శాతానికి పడిపోయినట్లు గుర్తించామన్నారు. ఇన్సులిన్ మాత్రల ప్రభావ శీలతను అంచనా వేసేందుకు ఈ పరిశోధనలు సరిపోవని, వివిధ జంతువులపై పరిశోధనలు చేయడం ద్వారా పురోగతి సాధించే అవకాశం ఉందని తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను తాజా జర్నల్‌లో సమీర్ మిత్రగొట్టి పొందుపరిచారు. అయితే మధుమేహ చికిత్సకు నోటి ద్వారా ఇన్సులిన్ అందించే ప్రక్రియలో ఏర్పడే సైడ్ ఎఫెక్ట్స్ ను రూపుమాపేందుకు లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment