మధుమేహం (డయాబెటిస్) బాధితులు దాదాపు ప్రతి కుటుంబంలో ఉంటున్నారు. ఇంతగా వ్యాప్తి చెందుతున్నా ప్రజలు దీని నిరోధానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. ముఖ్యంగా మన దేశంలో మధుమేహం చాప కింద నీరులా చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. మధుమేహం వ్యాప్తి విషయంలో భారత్ మొదటి స్థానంలో ఉంది. దేశంలో మన రెండు తెలుగు రాష్ట్రాలు మొదటి వరుసలో ఉన్నాయి. గతంలో ఎక్కువగా 50 నుంచి 60 ఏళ్ల వయసుగల వారిలో గుర్తించిన మధుమేహం, ఇప్పుడు 30 నుంచి 40 సంవత్సరాల్లోపే గుర్తించడం కనిపిస్తోంది. ఇది భారతీయులకు ఆందోళన కలిగించే విషయమే.
మధుమేహ సమస్య గ్లోబల్ సమస్య. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇన్సులిన్ ఆవిష్కర్తలలో ఒకరైన సర్ ఫ్రెడరిక్ బ్యాంటింగ్ జన్మదినమైన నవంబర్ 14వ తేదీన ‘ప్రపంచ మధుమేహ నిరోధక దినం’ (వరల్డ్ డయాబెటిస్ డే)గా ప్రకటించింది. అధిక శాతం ప్రజల్లో శారీరక శ్రమ తగ్గి పోయింది. చాలామందిలో మానసిక ఒత్తిడి తప్ప, శారీరక కదలికలు లేవు. వీటికి తోడు పర్యావరణ మార్పులు, వంశపారంపర్యత్వం, జీవన సరళిలో వచ్చిన అసంగత మార్పులు... మధుమేహం రావడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధి నుంచి బయటపడవచ్చు. తల్లిదండ్రులలో ఇద్దరికీ మధుమేహం ఉన్నా, వారి పిల్లలలో కేవలం 7% మందిలో మాత్రమే జీవిత కాలంలో మధుమేహం బారిన పడ్డట్టు పరిశోధనలు చెప్పడం ఇందుకు నిదర్శనం.
మన తాత ముత్తాతలు దంచిన లేదా తక్కువ పాలిష్ పట్టిన బియ్యం, చిరుధాన్యాలు తినేవారు. వాటిలో విటమిన్స్, ఫైబర్ ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు ఎక్కువగా పాలిష్ పట్టిన బియ్యాన్ని వాడుతున్నాం. చిరుధాన్యాలు తినడం మానేశాం. దీనికి తోడు ప్యాక్డ్ ఫుడ్స్, రెడీ టు ఈట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ వాడకం పెరిగిపోయింది. కాలినడక తగ్గిపోయింది. వాహనాల వినియోగం పెరిగిపోయింది. చాలామందిలో కుటుంబ, వృత్తి, సామాజిక పర సమస్యలు పెరిగి పోయి మానసిక ఒత్తిడి, ఆందోళనలు అధిక మయ్యాయి. ఇవన్నీ ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కు కారణాలే. ఊబకాయం తెలుసుకునేందుకు బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) కీలక పాత్ర పోషిస్తుంది. ఇది పెరిగే కొద్దీ శరీరంలో కొవ్వు శాతం పెరిగిపోతుందని అర్థం. బీఎంఐ ఎక్కువగా కలవారే ఎక్కువగా మధుమేహం బారిన పడుతున్నారని ప్రత్యేకించి చెప్పనక్కరలేదు.
చదవండి: చిన్నారుల్లో మాటలు రావడం చాలా ఆలస్యమవుతుందా..?
చేసే పనికి తగ్గ పోషకాహారం, వ్యాయామం తప్పనిసరి. ఊబకాయస్థుల శరీరం బరువు 7 శాతం తగ్గితే మధుమేహం వచ్చే అవకాశాలు 60 శాతం తగ్గిపోతాయని వైద్య పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. ప్రతిరోజు క్రమం తప్పకుండా 30 నిమి షాలైనా నడక, అవకాశం ఉన్నవారు ఈదటం, పరుగెత్తడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. గంటల తరబడి కుర్చీలో కూర్చోకుండా మధ్య మధ్య లేచి నాలుగు అడుగులు వేయడం మంచిదని వైద్య పరిశోధకులు చెబుతున్నారు.
చదవండి: శీతాకాలంలో గుండె ఆరోగ్యం కోసం తీసుకోవాల్సినవి ఇవే!
దీనివల్ల శరీరం రిలాక్స్ అవుతుంది. మానసికంగా ఉత్సాహంగా ఉంటుంది. వ్యాయామంతో పాటు ఆహారం కూడా ముఖ్యం. జంతు సంబంధ ఆహారం కంటే మొక్కల నుండి లభించే శాకాహారం శ్రేయస్కరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ప్రజారోగ్యం పైన, ఆర్థిక వ్యవస్థ మీద అత్యంత ప్రభావం చూపే మధుమేహం నిరోధంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై బాధ్యతగా వ్యహరించాలి.
– డాక్టర్ టి. సేవకుమార్
ఎస్.హెచ్.ఓ. హైపర్ టెన్షన్ అండ్ డయాబెటిక్ క్లబ్ వ్యవస్థాపకులు
(నవంబర్ 14న వరల్డ్ డయాబెటిస్ డే)
Comments
Please login to add a commentAdd a comment