Lancet Study: 2050 కల్లా మధుమేహ బాధితులు 130 కోట్లు | Lancet Study: 130 crore people will have diabetes by 2050 | Sakshi
Sakshi News home page

Lancet Study: 2050 కల్లా మధుమేహ బాధితులు 130 కోట్లు

Published Tue, Jul 25 2023 1:08 AM | Last Updated on Tue, Jul 25 2023 3:46 AM

Lancet Study: 130 crore people will have diabetes by 2050 - Sakshi

వాషింగ్టన్‌: ప్రపంచవ్యాప్తంగా 2050 నాటికి 130 కోట్ల మంది వరకు మధుమేహం బారినపడే అవకాశం ఉన్నట్లు లాన్సెట్‌ చేపట్టిన ఓ అధ్యయనం తేల్చింది. 1990–2021 మధ్య కాలంలో 204 దేశాలు, ప్రాంతాల్లో మరణాలు, అశక్తత, డయాబెటిస్‌ వ్యాప్తి వంటి అంశాలకు సంబంధించి 27 వేలకు పైగా రకాల గణాంకాల ఆధారంగా ఈ అధ్యయనం చేపట్టినట్లు లాన్సెట్‌ తెలిపింది. 2050 నాటికి మధుమేహం వ్యాప్తి సామాజిక, భౌగోళిక అంశాలు, ఒబేసిటీ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకునే మోడల్‌ను అనుసరించినట్లు వివరించింది. ప్రజలు తమ ఆరోగ్య విషయాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉందని తెలిపింది.

ఎక్కువ మందికి టైప్‌–2నే
టైప్‌–1, టైప్‌–2 డయాబెటిస్‌లలో వచ్చే మూడు దశాబ్దాల్లో టైప్‌–2 బాధితులే ఎక్కుమంది ఉంటారని సర్వేలో వెల్లడైంది. టైప్‌–1 అనేది ఆటో ఇమ్యూన్‌ వ్యాధి, దీనివల్ల శరీరం ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేదు. ఇది ఎక్కువగా పిల్లల్లో కనిపిస్తుంది. టైప్‌–2 డయాబెటిస్‌తో ఇన్సులిన్‌ నిరోధకత క్రమంగా పెరుగుతుంటుంది. ఈ పరిస్థితి ఎక్కువగా పెద్దల్లో కనిపిస్తుంది. ముందుగానే గుర్తించి, దీనిని నివారించవచ్చు.

అప్రమత్తతే ఆయుధం
డయాబెటిస్‌తో సంబంధం ఉన్న అనేక సమస్యల కారణంగా ఈ సర్వేలో తేలిన వివరాలపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మధుమేహ బాధితులు గుండెజబ్బు, గుండెపోటు, కంటి చూపు కోల్పోవడం, పాదాలకు అల్సర్లు వంటివి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అవగాహన లేకపోవడం, సరైన చికిత్స లేకపోవడం వల్ల చాలా మంది ఈ సమస్యల బారిన పడతారు. మధుమేహం ప్రమాదాన్ని పెంచేవి సాధారణంగా వయస్సు, ఊబకాయం. ఎక్కువ బీఎంఐకి అధిక–క్యాలరీ ఉత్పత్తులు, అల్ట్రా–ప్రాసెస్డ్‌ ఆహారం, కొవ్వు, చక్కెర, జంతు ఉత్పత్తుల వినియోగం. వీటితోపాటు తగ్గిన శారీరక శ్రమ డయాబెటిస్‌కు కారణాలుగా ఉన్నాయి. జన్యు సంబంధమైన కారణాలతోపాటు అనారోగ్యకర జీవన శైలితో కూడా మధుమేహం బారినపడే ప్రమాదముంది.

జాగ్రత్తలు మేలు..
► ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను పాటించాలి.
► ఎక్కువ రిస్క్‌ ఉన్న వారు ఫైబర్‌ ఎక్కువగా ఉండే, తృణ ధాన్యాలను ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.
► ఒకే చోట గంటల కొద్దీ కూర్చోరాదు. అప్పుడప్పుడు నడక వంటి వాటితో శారీరక శ్రమ అలవాటు చేసుకోవాలి.
► రోజులో కనీసం అరగంటపాటు వ్యాయామం చేయాలి. బరువు పెరక్కుండా జాగ్రత్తపడాలి.
► దాహం అతిగా అవుతున్నా, నీరసంగా ఉన్నా, తెలియకుండానే బరువు కోల్పోతున్నా, కంటి చూపు మందగించినా, తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తున్నా వెంటనే వైద్యుడిని సంప్రదించి సరైన వైద్య చికిత్సలు తీసుకోవాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement