
సీఐఏ పరోక్ష పాత్రను బహిర్గతం చేసిన రహస్య పత్రాలు
తాజాగా 63వేల రహస్యపత్రాలు వెల్లడించిన ట్రంప్ సర్కార్
డల్లాస్(అమెరికా): కేవలం 43 ఏళ్లకే అగ్రరాజ్యానికి అధ్యక్షుడిగా జాన్ ఎఫ్.కెన్నడీ అధికారాన్ని కైవసం చేసుకోవడం ఎంత చరిత్రాత్మకమో ఆయన హత్యోదంతం అంతే వివాదాలు, మిస్టరీలతో అంతులేని రహస్యంగా మిగిలిపోయింది. ఇందులోని చిక్కుముడులను కొన్నింటిని విప్పేందుకు డొనాల్ట్ ట్రంప్ సర్కార్ ప్రయత్నాలు మొదలెట్టింది. దాదాపు 60 లక్షల పత్రాలు, ఫొటోలు, వీడియోలు, సౌండ్ రికార్డులు, సాక్ష్యాధారాల్లో గతంలో చాలావరకు బహిర్గతమైనా వాటి ద్వారా ఆయన హత్యకు కారణాలపై స్పష్టత రాలేదు. దీంతో మంగళవారం మరో 63,000 పేజీల కీలక సమాచారాన్ని అమెరికా నేషనల్ ఆర్కైవ్స్ అండ్ రికార్డ్స్ అడ్మినిస్ట్రేషన్ తాజాగా తమ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.
ఆరోజు ఏం జరిగింది?
1963 నవంబర్ 22వ తేదీన డల్లాస్‌లో అధ్యక్షుడు కెన్నడీ, భార్య జాక్వెలిన్‌తో కలిసి కారులో ప్రయాణిస్తూ రోడ్డుకు ఇరువైపులా ఉన్న వందలమంది మద్దతుదారులకు అభివాదం చేస్తున్న సమయంలో కాల్పుల మోత మోగింది. ఈ సమయంలో కెన్నడీ బుల్లెట్ గాయాలతో ప్రాణాలు కోల్పోయారు. సమీపంలోని టెక్సాస్ స్కూల్‌బుక్ డిపాజిటరీ భవనం ఆరో అంతస్తులో తుపాకీతో ఉన్న 24 ఏళ్ల మాజీ నావికాదళ సైనికుడు లీ హార్వే ఓస్వాల్డ్‌ను పోలీసులు అరెస్ట్‌చేశారు.
తర్వాత ఏమైంది?
ఇక్కడే అసలు కథ మొదలైంది. హంతకుడిని పట్టుకు న్నామని భావించేలోపే అతడిని చంపేశారు. ఓ స్వాల్డ్‌ను రెండు రోజుల తర్వాత జైలుకు తరలిస్తున్న సమయంలో ఒక నైట్‌క్లబ్ యజమాని జాక్ రూబీ కాల్చి చంపాడు. అయితే కొంతకాలం తర్వాత జాక్‌రూబీ జైలులో ఉన్నప్పుడు ఊపిరి తిత్తిలో ధమ నిలో రక్తం గడ్డకట్టి చనిపోయాడు. అసలు కెన్నడీని ఓస్వాల్డ్ ఎందుకు చంపాడు?. ఓస్వాల్డ్‌ను జాక్‌రూబీ ఎందుకు చంపాడు?. జాక్‌రూబీది సాధారణ మరణమేనా? అనేవి ఇప్పటికీ మిస్టరీగా ఉన్నాయి.
వెలుగులోకి సీఐఏ పాత్ర
విదేశాల రహస్యాలను అధ్యక్షుడికి చేరవేయాల్సిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) తన వృత్తిధర్మానికి విరుద్ధంగా అధ్యక్షుడి పర్యటన వివరా లను శత్రుదేశాలకు చేరవేసిందని పలు పత్రాల్లో వెల్లడైంది. అయితే మొత్తం సీఐఏ వ్యవస్థకాకుండా సీఐఏలోని కొందరు ఏజెంట్లు అమెరికాకు వ్యతిరేకంగా పనిచేశారని తాజా పత్రాల్లో తేలింది. అమెరికాకు బద్ధశత్రువులైన నాటి సోవియట్ రష్యా, క్యూబా వంటి దేశాలు అధ్యక్షుడిని అంతమొందించేందుకు ప్రయత్నించాయని, ఆ పనిలో సఫలీకృతమయ్యా యని కొందరు వాదించారు. అయితే తాజా పత్రాల్లో దీనికి సంబంధించిన బలమైన సాక్ష్యాలు లేనప్పటికీ పరోక్ష సాక్ష్యాధారాలు వెలుగులోకి వచ్చాయి. కెన్నడీని హత్యచేసిన ఓస్వాల్డ్ అంతకుముందు రష్యాకు, క్యూబాకు వెళ్లేందుకు ప్రయత్నించాడని, వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాడన్న ఆధారాలను తాజాగా నేషనల్ ఆర్కైవ్స్ బహిర్గతంచేసింది.
అసలు చంపింది ఎవరు?
ఘటనాస్థలిలో ఓస్వాల్డ్‌ను అదుపులోకి తీసుకున్నప్పటికీ, ప్రత్యక్ష సాక్షుల కథనాలు వేరుగా ఉన్నాయి. ఓస్వాల్డ్ దూరంగా బిల్డింగ్‌లో ఆరో అంతస్తులో ఉంటే కాల్పుల శబ్దాలు ఆ భవంతి నుంచికాకుండా పక్కనే ఉన్న పచ్చికబయళ్ల నుంచి వచ్చాయని పలువురు సాక్ష్యాలు ఇచ్చారు. దీంతో తర్వాతి అధ్యక్షుడు లైడన్ బీ జాన్సన్ ఆదేశాలతో ఏర్పాటైన వారెన్ కమిషన్ ఇచ్చిన నివేదిక పైనా తాజాగా అనుమానాలు రేకెత్తుతున్నాయి. సీఏఐ లోని ఒక వర్గానికి కెన్నడీ అధ్యక్షుడిగా కొనసాగడం ఇష్టంలేదని, అందుకే వాళ్లు శత్రు దేశాలతో చేతులు కలిపారని మరో వాదన ఉంది.
దీనికి బలం చేకూర్చే అంశం తాజాగా వెల్లడైంది. హత్య జరిగిన వెంటనే సీఏఐ ఏజెంట్ గ్యారీ అండర్‌హిల్ వాషింగ్టన్ సిటీ నుంచి పారిపోయి న్యూజెర్సీలో స్నేహితుని ఇంట్లో దాక్కున్నాడు. ఒకానొక సమయంలో స్నేహితుడితో మాట్లా డుతూ.. ‘‘ సీఐఏలోని ఒక ఉన్నతస్థాయి అధికార వర్గానికి కెన్నడీ అంటే అస్సలు గిట్టదు. వాళ్లే కెన్నడీని అంతంచేశారు. వాళ్లు దొరక్కుండా ఉండేందుకు ఓస్వాల్డ్‌ను బలిపశువును చేశారు’’ అని అన్నారు. కొద్దినెలల తర్వాత ఏజెంట్ గ్యారీ చనిపో యాడు. ఆత్మహత్య చేసుకున్నట్లు రిపోర్టులొచ్చాయి. రహస్య పత్రాల్లో ఇంకా మూడింట రెండొంతలు బహిర్గతంచేయలేదని, అవి వెల్లడిస్తే హత్యపై స్పష్టత వస్తుందని పలువురు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment