
రియాద్: భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ కలల ‘ప్రాజెక్ట్ చీతా’లో కీలకంగా వ్యవహరించిన ప్రముఖ పర్యావరణ పరిరక్షకుడు విన్సెంట్ వాన్ డెర్ మార్వె అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. సౌదీ అరేబియా రియాద్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఆయన విగతజీవిగా కనిపించడం.. పర్యావరణ ప్రేమికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
42 ఏళ్ల విన్సెంట్.. మార్చి 16వ తేదీన అపార్ట్‌మెంట్‌లోని హాలులో రక్తపు మడుగులో పడి కనిపించారు. ఆయన తలకు గాయం కావడంతోనే మరణించినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకి వచ్చారు. అయితే ఆయనపై మృతిపై అధికారులు స్పష్టమైన ప్రకటన చేయలేదు. మరోవైపు.. ఆయన మృతిపై అనుమానాలు ఉన్నాయని, అది ప్రమాదవశాత్తూ మరణం కాదని ఆయన కుటుంబ సభ్యులు ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ చేశారు.
దక్షిణాఫ్రికాకు చెందిన విన్సెంట్ వాన్ డెర్ మార్వె.. పర్యావరణహితం, అంతరించిపోతున్న జాతుల సంరక్షణ కోసం మెటాపాపులేషన్ ఇన్షియేటివ్(TMI) పేరిట ఓ ఫౌండేషన్ నెలకొల్పారు. దీని ద్వారా ఆసియాలోనే ఆఫ్రికాలోనూ ఆయన సేవలందించారు. మూడేళ్ల కిందట.. భారత ప్రధాని నరేంద్ర మోదీ తన పుట్టిన రోజున మధ్యప్రదేశ్ కునో నేషనల్ పార్క్‌లో ఆఫ్రికా దేశాల నుంచి రప్పించిన చీతాలను వదిలిన సంగతి తెలిసిందే.
అంతరించిపోయిన ఈ జాతిని భారత్‌లో తిరిగి ప్రవేశపెట్టడం కోసం సుమారు రూ.91 కోట్ల దాకా ఖర్చు చేశారు. నమీబియా, సౌతాఫ్రికా నుంచి 20 చీతాలను రప్పించగా.. పలు కారణాలతో కొన్ని మరణించాయి. ప్రస్తుతం 12 కూనలతో కలిపి 24 చీతాలు ఉన్నాయి.
A long wait is over, the Cheetahs have a home in India at the Kuno National Park. pic.twitter.com/8FqZAOi62F
— Narendra Modi (@narendramodi) September 17, 2022
అయితే ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకంగా వ్యవహరింది విన్సెంట్ వాన్ డెర్ మార్వె కావడం గమనార్హం. జాతీయ పులుల సంరక్షణ సంస్థ(NTCA)తో సమన్వయమై ప్రాజెక్ట్ రూపొందించడం దగ్గరి నుంచి.. చీతాలను ఎంపిక చేసి ఇక్కడికి తీసుకురావడం దాకా అంతా ఈయన పర్యవేక్షణలో జరిగింది. తాజాగా.. సౌదీ అరేబియాలోనూ చీతాలను ప్రవేశపెట్టే ప్రాజెక్టును అక్కడి ప్రభుత్వం ప్రారంభించింది. అందుకోసమే రియాద్‌కు ఆయన వెళ్లగా.. ఈలోపు ఆయన శవమై కనిపించారు.
Comments
Please login to add a commentAdd a comment