conservationists
-
Dr Supraja Dharini: తాబేలు గెలవాలి
కుందేలు, తాబేలు కథలో తాబేలు మెల్లగా అయినా సరే రేస్ పూర్తి చేసి గెలుస్తుంది. కాని గెలవాలంటే తాబేళ్లు ఉండాలి కదా. కాలుష్యం వల్ల, వలలకు చిక్కుకుని, గుడ్లు పెట్టే ఏకాంతం కోల్పోయి.. సముద్ర తాబేళ్లు ప్రమాదంలో పడ్డాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాల్లో తాబేళ్ల సంరక్షణ కోసం పని చేస్తున్న డాక్టర్ సుప్రజ ధారిణి కృషి. ‘సముద్ర తీరానికి వెళ్లి చూస్తే అంతా ప్రశాంతం గా అనిపిస్తుంది. నీలి ఉపరితలం, ఒడ్డుకు వచ్చి వెళ్లే కెరటాలు... ఎంత బాగుందో కదా అని మనసు ఆహ్లాదపడుతుంది. కాని సముద్ర గర్భంలో ఏం జరుగుతున్నదో మనకు తెలియదు. మనిషి చర్యల వల్ల సముద్రం లోపల ఎంత ధ్వంసమవుతోందో తెలుసుకోవాలి. జలధి పర్యావరణాన్ని కాపాడుకోవాలి’ అంటుంది డాక్టర్ సుప్రజ ధారిణి. చెన్నైలో స్థిరపడ్డ ఈ తెలుగు పర్యావరణ కార్యకర్త ఇప్పడు సముద్ర తాబేళ్లకి రక్షకురాలిగా మారింది. లక్షలాది తాబేళ్లు మృత్యవాత పడకుండా తిరిగి సముద్రానికి చేరేలా చూడగలిగింది. చెన్నై తీరం, ఆంధ్రా తీరం, ఒడిశా తీరంలో ఆమె తయారు చేసిన దళాలు గస్తీ తిరుగుతూ తాబేళ్లను కాపాడుతున్నాయి. అంతులేని విధ్వంసం ‘సముద్ర ఆరోగ్యం బాగుంటే మత్స్యకారుల జీవితాలు బాగుంటాయి. ఎందుకంటే సముద్రమే వారి జీవనాధారం కాబట్టి. సముద్ర ఆరోగ్యం, అందులోని పర్యావరణం ఎలా ఉందో తెలియాలంటే తాబేళ్ల ఉనికి, వాటి జనాభా ఒక కొండ గుర్తు. ఎందుకంటే సముద్రగర్భంలో ఉండి నేల మీదకు వచ్చే ఏకైక జలచరం అదే. తాబేళ్లలో ఒక ముఖ్యలక్షణం ఏమిటంటే అవి గుడ్డు పగిలి ఏ నేల మీద ప్రాణం పోసుకున్నాయో ఆ నేలను గుర్తు పెట్టుకుని పెరిగి పెద్దవై గుడ్లు పెట్టడానికి అదే నేలకు వస్తాయి. అంటే పుట్టింటికి వచ్చినట్టే. కాని అవి మనుషుల మీద నమ్మకంతో పెట్టిన గుడ్లను మత్స్యకారులు నిర్లక్ష్యం చేయడం నేను చూశాను. ఇక కుక్కలు దాడి చేసి గుడ్లు తవ్వుకుని తినేస్తాయి. కొన్ని పిల్లలు బయటకు తీసి ఆడుకుంటారు. వాటి వల్ల తాబేళ్ల సంఖ్య తగ్గి సముద్ర జీవ సమతుల్యత దెబ్బ తింటుంది. అందుకని మొదట మేము మత్స్యకారులను చైతన్యవంతం చేశాం. తాబేళ్లను కాపాడితే సముద్రం బాగుంటుంది.... సముద్రం బాగుంటే మీ జీవితాలు బాగుంటాయి అని చెప్పాం. వారిప్పుడు కార్యకర్తలుగా మారి తాబేళ్లను కాపాడుతున్నారు’ అని తెలిపింది సుప్రజ ధారిణి. మచిలీపట్నం సొంతూరు సుప్రజది మచిలీపట్నం. ముప్పై ఏళ్ల క్రితం వాళ్ల కుటుంబం చెన్నై తరలి వెళ్లింది. ఫిలాసఫీలో పిహెచ్డి చేసిన సుప్రజ చెన్నైలోనే ఒక ఆర్ట్ స్టుడియో స్థాపించుకుంది. అయితే 25 ఏళ్ల క్రితం ఆమె చెన్నైలోని నీలాంకరై బీచ్‌కు మార్నింగ్ వాక్కు వెళ్లినప్పుడు అక్కడ తాబేలు చచ్చిపడి ఉంది. దాపునే పిల్లలు తాబేలు గుడ్లు ఇసుక నుంచి బయటకు లాగి ఆడుకుంటూ ఉన్నారు. మత్స్యకారులు చూసినా వారించడం లేదు. ఇదంతా చూసి బాధపడింది సుప్రజ. తాబేళ్లు వొడ్డుకొచ్చి పడి చనిపోవడానికి కారణాలు తెలుసుకోవడానికి నిపుణులను సంప్రదించింది. ఆలివ్ రిడ్లే జాతి తాబేళ్లు చేపల వలల వల్ల గాయపడి చనిపోతున్నాయని, వాటి గుడ్ల సంరక్షణ సరిగ్గా జరగక సంతతి తరిగిపోతున్నదని తెలుసుకుంది. మొదట మత్స్యకారుల్లో చైతన్యం తెచ్చి తర్వాత సమాజంలో మార్పు తేవాలని నిశ్చయించుకుంది. అలా 2002లో ఆమె తాబేళ్ల సంరక్షణ, సముద్ర పర్యావరణ సంరక్షణ లక్ష్యంగా ‘ట్రీ ఫౌండేషన్’ అనే సంస్థను ప్రారంభించింది. 33 లక్షల తాబేలు పిల్లల రక్షణ తమిళనాడులోని కంచి నుంచి ఒరిస్సాలోని గంజాం వరకు తీర ప్రాంతంలో దాదాపు 700 కిలోమీటర్ల మేర తీర ప్రాంత సంరక్షణ, తాబేళ్ల గుడ్ల పరిరక్షణ, గాయపడిన తాబేళ్లకు చికిత్స చేసి మళ్లీ సముద్రంలో ఒదిలిపెట్టడం, గుడ్లకు గస్తీ కాయడం వంటి చర్యల కోసం గార్డ్లను ఏర్పాటు చేసింది సుప్రజ. ఇందుకు అవసరమైన గుర్తింపు కార్డులను తమిళనాడు ప్రభుత్వం నుంచి ఇప్పించగలిగింది. కొందరికి గౌరవ భత్యాలు కూడా అందుతున్నాయి. తాబేళ్లు గుడ్లు పెట్టే సీజన్లో వాటిని ఒకచోట చేర్చి వెదురు దడి కట్టి కాపాడటం వల్ల ఈ ఇరవై ఏళ్లలో దాదాపు 33 లక్షల గుడ్లు పొదగబడి తాబేళ్లు పిల్లలుగా సముద్రంలో చేరాయంటే అది సుప్రజ, ఆమె సేన ప్రయత్నం వల్లే. ‘సముద్రానికి నేలకూ ఉన్న అనుబంధం విడదీయరానిది. నేల మీద నివసించేవాళ్లమే సముద్రాన్ని కాపాడుకోవాలి’ అంటోంది సుప్రజ. -
దేశీ వరి పరిరక్షకుడు డా.దేబల్ దేవ్‌కు ప్రతిష్టాత్మక పురస్కారం!
ప్రముఖ దేశీ వరి వంగడాల పరిరక్షకులు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ దేబల్ దేవ్‌కు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ‘ఐఫోమ్ ఆసియా ఆర్గానిక్ మెడల్ ఆఫ్ ఆనర్’ లభించింది. వంద దేశాల్లో సేంద్రియ వ్యవసాయదారుల సంఘాల సమాఖ్య (ఐఫోమ్) ఆర్గానిక్స్ ఆసియా విభాగం, చైనాలోని క్సిచాంగ్ కౌంటీ సంయుక్తంగా 2023వ సంవత్సరపు ఆర్గానిక్ మెడల్ ఆఫ్ ఆనర్ పురస్కారానికి డా. దేబల్ దేవ్‌ను ఎంపిక చేశాయి. వైవిధ్యభరితమైన 1,440కు పైగా అపురూపమైన భారతీయ వరి వంగడాలను సేకరించడంతో పాటు.. ఒడిషాలోని తన చిన్న పరిశోధనా క్షేత్రంలో ప్రతి ఏటా సాగు చేస్తూ పరిరక్షిస్తున్న డా. దేబల్ దేవ్ దశాబ్దాలుగా నిస్వార్థ సేవ చేస్తున్నారు. 5 వేల డాలర్ల నగదు పురస్కారంతో పాటు ప్రశంసాపత్రం ప్రదానం చేస్తారు. డా. దేబల్ దేవ్ పరిరక్షిస్తున్న దేశీ వరి వంగడాల్లో వాతావరణ మార్పుల్ని తట్టుకొని నిలిచే వరి రకాలతో పాటు అత్యంత అరుదైన పౌష్టిక విలువలు కలిగిన రకాలు కూడా ఉండటం విశేషం. జీన్ బ్యాంకుల్లో ఉండే పురాతన వంగడాలు శాస్త్రవేత్తల పరిశోధనలకు మాత్రమే ఉపయోగపడతాయి. అయితే, రైతుల పొలాల్లో ఏటేటా సాగవుతూ దేశీ వరి వంగడాలు వాతావరణ మార్పులకు, సరికొత్త చీడపీడలకు దీటుగా తట్టుకుంటూ రాటుదేలుతూ రైతులకు అందుబాటులో ఉంటాయి. అందువల్లనే, ఆధునిక వంగడాలెన్ని వచ్చినా ఈ అపురూపమైన పురాతన వంగడాలను సాగు చేస్తూ పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రకృతి సేద్యానికి అనువైన ఈ వంగడాల ద్వారానే మన ఆహార సార్వభౌమత్వం నిలుస్తుందని డా. దేబల్ దేవ్ ‘సాక్షి సాగుబడి’తో అన్నారు. - సాక్షి సాగుబడి డెస్క్ -
తెల్ల సివంగులతో మార్నింగ్ వాక్ చేస్తుండగా..
కేప్‌టౌన్ : పెంపుడు తెల్ల సివంగుల దాడిలో వాటి యజమాని మృతి చెందిన ఘటన దక్షిణాఫ్రికాలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. దక్షిణాఫ్రికాకు చెందిన ప్రముఖ వన్యమృగాల సంరక్షకుడు వెస్ట్ మ్యాథ్యూసన్(65) సివంగులు పిల్లలుగా ఉన్నప్పటినుంచి ఎంతో ప్రేమగా వాటిని పెంచుతున్నాడు. బుధవారం ఉదయం సివంగులతో కలిసి ఆయన మార్నింగ్ వాక్కు వెళ్లారు. వాకింగ్ చేస్తుండగా హఠాత్తుగా ఓ సివంగి ఆయనపై పడి దాడి చేయటం మొదలుపెట్టింది. అనంతరం మరో సివంగి కూడా దాడికి దిగింది. ( పులిని చంపి, కాళ్లు అపహరణ ) ఆ సమయంలో మ్యాథ్యూతో పాటు ఉన్న ఆయన భార్య సివంగుల నుంచి భర్తను రక్షించటానికి శతవిధాలా ప్రయత్నించింది. అయినప్పటికి లాభం లేకపోయింది. దీంతో పెంపుడు సివంగుల చేతిలోనే ఆయన ప్రాణం కోల్పోయారు. ఈ నేపథ్యంలో మ్యాథ్యూ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఆ రెండు తెల్ల సివంగులను సంరక్షకుడి ఇంటినుంచి వేరే ప్రాంతానికి తరలించారు అధికారులు. వాటి భవిష్యత్తుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. (రెండు పులులు కొట్లాట.. వీడియో వైరల్) -
‘గోరక్షణ’ హత్యలను సహించం
ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరిక ► గాంధీ, వినోబా భావే కన్నా గొప్ప గోరక్షకులు లేరు ► గోభక్తి పేరుతో హింసకు పాల్పడటం సరికాదు ► ‘సబర్మతి’ శతాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవంలో ప్రధాని అహ్మదాబాద్: గోరక్షణ, మూక దాడుల పేరుతో జరిగే హత్యలను ఆమోదించే ప్రసక్తే లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదని హెచ్చరించారు. గాంధీజీ సబర్మతి ఆశ్రమాన్ని నిర్మించి వందేళ్లు అయిన సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమాలను మోదీ గురువారం ఇక్కడ ప్రారంభించారు. ‘గోభక్తి పేరుతో హింసను ప్రేరేపించటం.. మహాత్మాగాంధీ ఆలోచనకు పూర్తి వ్యతిరేకం’ అని తర్వాత బహిరంగసభలో అన్నారు. ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా పెరుగుతున్న హింసాత్మక ఘటనలపై ప్రధాని తీవ్రంగా స్పందించారు. ఇలాంటి ఘటనల వల్ల సాధించేదేమీ ఉండదని స్పష్టం చేశారు. ‘నేడు సబర్మతి ఆశ్రమంలో ఉండి ఈ విషయంపై మాట్లాడటం బాధగా ఉంది. చీమలు, వీధికుక్కలు, చేపలకు ఆహారం వేసే గొప్ప సంస్కృతి ఉన్న దేశం మనది. ఈ గడ్డపైనే మహాత్ముడు మనకు అహింసా పాఠాలు నేర్పారు. కానీ ఇప్పుడేమైంది? ఆపరేషన్ విఫలం కావటంతో రోగి చనిపోతే.. బంధువులు ఆసుపత్రిని తగలబెడుతున్నారు. డాక్టర్లను చితగ్గొడుతున్నారు. ప్రమాదాన్ని ప్రమాదంగానే చూడాలి. ప్రమాదంలో ఎవరో చనిపోతేనో గాయపడితేనో కొందరు కలిసి వాహనాలు తగులబెడుతున్నారు’ అని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. చంపే హక్కు ఎవరికీ లేదు! ‘గోరక్ష, గోపూజలో మహాత్మాగాంధీ, ఆయన అనుచరుడు వినోబా భావేను మించినవారు లేరు. గోరక్ష ఎలా చేయాలో వారే మనకు నేర్పించారు. దేశమంతా వీరి మార్గాన్నే అనుసరించింది. భారత రాజ్యాంగం కూడా గోరక్ష గురించి చెబుతోంది. కానీ దీన్ని అడ్డం పెట్టుకుని ఓ వ్యక్తిని చంపే హక్కుందా? ఇదేనా గోభక్తి? ఇదేనా గోరక్ష?’ అని ప్రశ్నించారు. గోభక్తి పేరుతో మనుషులను చంపటం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారాయన. ‘గాంధీ కలలుగన్న భారతాన్ని నిర్మించేందుకు అందరం కలిసి పనిచేద్దాం. మన స్వాతంత్య్ర సమరయోధులు గర్వపడేలా భారతదేశాన్ని మార్చుకుందాం’ అని మోదీ పిలుపునిచ్చారు. గోవుకు సంబంధించి తన జీవితంలో జరిగిన ఓ ఘటనను మోదీ గుర్తుచేశారు. గోరక్ష విషయంలో చనిపోయేందుకైనా చనిపోవాలని వినోబా భావే సూచించారన్నారు. సబర్మతి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆశ్రమం మొత్తం పరిశీలించిన మోదీ.. మహాత్ముడి గొప్పదనాన్ని, అహింసా వాదాన్ని సూచించే పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. తర్వాత రాజ్‌కోట్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో 18,500 మంది దివ్యాంగులకు సహాయక పరికరాలందించారు.